41. (NKP-3). శ్రీ భక్త రామదాసు జన్మ స్థలంలో ఆయన స్మారక మందిరం విశేషాలు.

శ్రీ భక్త రామదాసు స్మారక మందిరం (ప్రస్తుత ద్యానమందిరం) విశేషాలు.
నేలకొండపల్లి గ్రామం ఖమ్మం నుండి 23 కిలోమీటర్ల దూరంలో, కొదాడు నుండి 15 కిలోమీటర్ల దూరంలోవుంది. శ్రీ భక్త రామదాసు గారి అసలు పేరు కంచర్ల గోపన్న. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలోక్రి.శ. 1632 సం.ప్రాంతం లో శ్రీకంచర్ల లింగన్న,శ్రీమతి కామమ్మ దంపతులకు ఆయన జన్మించారు. ఆయన భార్య పేరు శ్రీమతి కమలమ్మ. 
               
శ్రీ భక్త రామదాసు ప్రముఖ వాగ్గేయ కారుడు. భక్త జయదేవుడు, త్యాగయ్య, అన్నమయ్య, పురందరదాసు, నారాయణ తీర్ధులు, శ్యామ శాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్, క్షేత్రయ్య ..ఇలా ఎందరో  కర్నాటక సంగీత జ్యోతిని వెలిగించిన వాగ్గేయకారుల సరసన రామదాసుకు సముచిత స్థానముంది. సాహిత్య పరిశోదనల్లో వెలుగు చుసిన ఆయన 206 కీర్తనలను కాలగర్భంలో కలసిపోకుండా రక్షించుకుంటూ ఆ కీర్తనలకు దేశవ్యాప్త ప్రచారం చేయవలసి వుంది. తిరువయ్యారులో ప్రతి ఏటా జరిగే త్యాగయ్య ఆరాధన ఉత్సవాలలాగా రామదాసు సంస్మరణ ఉత్సవాలలాగ  జరగాలనేది నేలకొండపల్లి వాసుల చిరకాల వాంచ. 

కంచర్ల గోపన్న తన రామదాసుగా మారటం వెనుక ఆయన స్వగ్రామంలో ఆయన కుటుంబం నిర్వహించిన సంతర్పణ సమయంలో ఆయన కుమారుని మరణం ప్రభావితం చేసిందంటారు. భద్రాచలం తహసిల్దారుగా బాధ్యతల స్వీకరించిన తరువాత భద్రాచలం కొండ పైన జీర్ణావస్థలో నున్న రామాలయాన్ని చూసి చలించిన శ్రీ గోపన్న, తనకు శిక్ష పడుతుందని తెలిసి శ్రీ రాముని పై నున్న భక్తితో ప్రభుత్వ నిధులను వెచ్చించి ఆ ఆలయ నిర్మాణాన్ని చేసారు. ఫలితంగా ఆగ్రహించిన తానీషా ప్రభువు 12 సం.లు శిక్ష వేసి చెరసాలకు పంపారు. సాక్షాతు శ్రీ రామచంద్రుడే వచ్చి ఆరు లక్షల వరహాలు తానీషాకు చెల్లించి రామదాసుని విడుదల చేయించాడని ప్రతీతి.

రామాలయ నిర్మాణానికి ఎంత ఖర్చు అయినదో ‘ఇక్ష్వాకుల తిలకా ఇకనైనా బలుకవు రామచంద్రా” అనే రామదాసు కీర్తనలో కనబడుతుంది. ప్రాకారాలకు పది వేల వరహాలు, భరతునికి చేయించిన పచ్చల పతకానికి పది వేల వరహాలు, శత్రజ్ఞ్యుడికి  చేయించిన బంగారు మొలత్రాడుకు పదివేల మొహరీలు, లక్ష్మనుడికి చేయించిన పతకానికి పది వేల వరహాలు, సీతమ్మకు చేయించిన చింతాకు పతకానికి పది వేల వరహాలు...ఇలా ఎన్నెన్నో ఆభరణాలకు ఎంతెంత ఖర్చు అయినదోఆయన ఏకరువు పెట్టాడు. రామదాసు కీర్తనలన్నీ బందిఖానాలోనే ప్రాణం పోసుకున్నాయి.

శ్రీ భక్త రామదాసు జన్మస్థల నిర్ధారణ.
సుమారు 1687 సం.లో చనిపోయే ముందర శ్రీ కంచర్ల గోపన్న@శ్రీభక్త రామదాసుగారు తన జన్మ స్థల మైన నేలకొండపల్లి లోని తన నివాస గృహాన్ని తనకు ఆప్తుడైన శ్రీ జోన్నాభట్ల సీతారామయ్య కు దాన పత్రాన్ని వ్రాసి నేలకొండపల్లి గ్రామ పెద్దలకు ఇచ్చారు. దానిని బట్టి అందులో పేర్కొన్న సరిహద్దుల ఆధారంగా ఆయన వినియోగించిన భావిని, జన్మస్థలాన్ని లోగానే  నిర్నయించి వున్నారు. ఆ దాన పత్రంలో ఉత్తర సరిహద్దుగా మహామ్మాయి దేవాలయం అని పేర్కొన్నారు. 


శ్రీ భక్త రామదాసు స్మారక భవన నిర్మాణానికి వెనుక చరిత్ర: 
1946 సం.లో నైజాం వ్యతిరేక పోరాటం రోజుల్లో నేలకొండపల్లి కి చెందిన స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు ఆంధ్ర మహాసభ మరియు కమ్యూనిస్ట్ పార్టీల తరఫున నిజాం సంస్థానం ప్రతినిధిగా అఖిల భారత సంస్థానాల సమావేశానికి ఢిల్లీ కి వెళ్ళటం జరిగింది. సమావేశం తరువాత మరునాడు ఉదయం ఢిల్లీ పురవీధిలో వున్న ఒక తోపుడు బండి దగ్గరకు టీ తాగేందుకు వెళ్ళటం,అక్కడ అతనితో పిచ్చాపాటి సంభాషణ సమయంలో తన స్వగ్రామం నిజాం సంస్థానం లోని నేలకొండపల్లి గ్రామమని చెప్పటం జరిగింది. వెంటనే ఆ తోపుడు బండి యజమాని సత్యనారాయణ రావు గారికి పాదాభివందనం చేసాడు. ఆశ్చర్యం చెందిన సత్యనారాయణ గారు కారణం అడుగగా సాక్షాత్తు శ్రీ రామ చంద్రుని దర్శన భాగ్యం తో పునీతమైన పరమ భక్తాగ్రేస్వరుడైన శ్రీ రామదాసు జన్మస్తలిలో జన్మించిన మీరు ధన్యజీవులు. మీ పాదాలు స్పృశిస్తే సమస్త పాపాలు పోతవని తన జన్మ పావనమైనదని చెప్పి సంతోష పడటం జరిగినది.అప్పటి వరకు శ్రీ సత్యనారాయణ రావు గారికి రామదాసు గారి గురించి అంతగాతెలియదు. ఆయన అన్న వైద్యనాధంగారు న్యాయవాద వృత్తిలో మానుకోట పట్టణంలో మకాం ఉండుటవల్ల చిన్న వయసులోనే చదువు కోసం అక్కడికి వెళ్ళటం, మెట్రిక్ చదువుచుండగానే ఉద్యమంలో అడుపెట్టి కార్యక్రమాలు చేయటం వల్ల, అప్పటి వరకు రామదాసు గారి కార్యక్రమాలేమి గ్రామంలోగాని, జిల్లాలో గాని  జరగక పోవటం వల్ల రామదాసు గారిపై అవగాహన లేదు. పై సంఘటన అయన మనో ఫలకంపై చెరుగని ముద్ర వేసింది. యావత్ దేశ ఖ్యాతిని పొందిన శ్రీ రామదాసు గారి స్మారకంగా గ్రామం లో ఏదైనా చిరస్మరణీయమైన కార్యక్రమం మొదలెట్టాలని ఆలోచన మొగ్గ తొడిగింది. ఉద్యమ విరమణ తరువాత స్వగ్రాం చేరుకున్నాక ఆ కార్య క్రమానికి శ్రీకారం చుట్టారు. 

శ్రీ భక్త రామదాసు గారి జన్మ స్థల సేకరణ. 
శ్రీ భక్త రామదాసు గారి రామదాసు గారి జన్మస్థలం గా భావిస్తున్న స్థలాన్ని 1954 సం.లో ఆరుగురు ప్రైవేటువ్యక్తులనుండి1.హరివిశ్వనాథం(232.00చ.గ.లు),2.చిలుకూరివిశాలాక్షమ్మ(132.00 చ.గ.లు),3. చిలుకూరి సీతారామయ్య(332.00 చ.గ.లు), 4. రంగావజ్జుల రామయ్య (384.00 చ.గ.లు), 5. పెండ్యాల వరలక్ష్మమ్మ(110.00 చ.గ.లు), 6. ప్రయాగ లక్ష్మినరసయ్య(160.00 చ.గ.లు) మరియు ప్రక్కనే ఆ ప్లాట్స్ కోసం ఉన్న Govt సందు ----30.00 చ.గ.లు తో కలిపివారి ఆధీనం లో నున్న  మొత్తం చ.గ.లు.1380.00 స్థలాన్ని శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు సేకరించి వారికి ప్రత్యామ్న స్థలాన్ని వారి అంగీకారం మేరకు తన సొంత భూమిలో వేరే చోట ఇచ్చారు.

స్మారక భవన శంకు స్థాపన-చరిత్ర.
               
25 th December 1955 తేదీన శ్రీ జహీర్ అహ్మద్ IAS, Development Commissioner, Board of Revenue  Hyderabad state వారు శంకుస్థాపన చేసారు. 

1961 సం.లో నిర్మాణం పూర్తి అయినద  క్రింది చిత్రంలో నిర్మాణ పనులను పర్యవేస్తిస్తున్న శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు కనిపిస్తున్నారు. ఎదురుగా కనిపిస్తున్న ఇల్లు ఆయనదే. రామదాసు స్మారక మందిరం ఎదురుగానే వుంటుంది. ఆ ఇంటి నిర్మాణం జరిగి ఇప్పటికి ఒక వంద డెబ్బది అయిదు సం.ల వయస్సు వుంటుంది. Old model Duplex House అది.
           

కుడి నుండి ఎడమ వైపున నిలుచున్న నాలుగోవ్యక్తి శ్రీ పెండ్యాల. భవన నిర్మాణానికి సంబంధించిన తెల్లరాయిని మనం చూడవచ్చు. నిర్మాణం లో కొన్ని ఎదురైన ఆటంకాలతో ఆర్ధిక సమస్యలను అధిగమించటానికి ఆయన తన ఇంట్లో భార్య మెడలోని చంద్రహారాన్ని అమ్మ వలసి వచ్చింది. అయినా ఆయన వెనకడుగు వేయలేదు.

1961 సం.లో నిర్మాణం పూర్తి అయిన తరువాత మానవ సేవే మాధవ సేవ అనే స్పూర్తితో కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆ భవనాన్ని సామాజిక అవుసరాలకు వినియోగించాలిసి వచ్చింది. కొంతకాలం ప్రైమరీ హెల్త్ సెంటర్ గాను, కొంతకాలం స్థానిక గ్రామ పంచాయత్ ఆఫీస్ గాను మరియు శ్రీ భక్త రామదాసు స్మారక లైబ్రరీ గాను వినియోగించారు. మానవ సేవే మాధవ సేవ అనే పద్ధతిలో సామాజిక సేవా కార్యక్రమాలకు అక్కడ స్థానమ లభించింది. ఆంధ్రప్రదేశ్ అప్పటి గవర్నర్ శ్రీ ఖందుబాయ్ దేశాయ్ ఆ భవనానికి మెదటి ముఖ్య అతిధిగా వచ్చారు. తరువాత స్వాతంత్ర సమరయోధులు శ్రీ కళా వెంకట్ రావు (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధమ రెవిన్యూ & ఆర్ధిక శాఖామాత్యులు),ఆ తరువాత హైదరాబాద్ రాష్ట్ర హోంశాఖామాత్యులు స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ మండుమల నరసింహా రావు సందర్శించారు.

శ్రీ భక్త రామదాసు చిత్ర పట ఆవిష్కరణ 
శ్రీ భక్త రామదాసు స్మారక మందిరం లో ఏర్పాటైన లైబ్రరీ ప్రారంభ సమయంలో మొట్టమొదటి సారిగా  శ్రీ భక్త రామదాసు  చిత్రపటాన్ని స్వాతంత్ర సమరయోధులు శ్రీ హయగ్రీవాచారి ఆవిష్కరించారు. ప్రస్తుతం సీతారామూల విగ్రహాలున్న ప్రదేశంలోనే ఆ చిత్ర పటాన్నుంచారు. 

           
ప్రాచిన గ్రంధాలలోని చిత్రాల ఆధారంగా రూపొందించిన శ్రీ భక్త రామదాసు చిత్రపటానిని శ్రీ హయగ్రీవాచారి  మాజీ మంత్రి, స్వాతంత్ర సమరయోదులు ప్రప్రధమంగా 1972 సం. లో ఆవిష్కరించారు.  

     చిత్రపటాన్ని ఆవిష్కరించిన ఫోటోలో స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ హయగ్రీవాచారి, గ్రంధాలయం  చైర్మన్ శ్రీ  పెండ్యాల సత్యనారాయణ రావు, పాలేరు MLA శ్రీ కత్తుల శాంతయ్య, పాలేరు సమితి మాజీ అధ్యక్షులు శ్రీ రావులపాటి సత్యనారాయణ రావు తదితరులు వున్నారు. ఫోటోలో కుడి వైపున వున్నా మొదటి వ్యక్తి శ్రీ పెండ్యాల. చిత్రపటానికి పూలమాల వేస్తున్న శ్రీ హయగ్రీవాచారి. ప్రక్కన శ్రీ రావులపాటి సత్యనారాయణ రావు మరియు లోకల్ MLA శ్రీ కత్తుల శాంతయ్య.



                వివిధ సమయాలలో శ్రీ భక్త రామదాసు స్మారక మందిరం లో భక్తుల వితరణలు.
1993 సం.లో శ్రీమతి పెండ్యాల అన్నపూర్ణమ్మ గారు ఇత్తడి మకరతోరణం చేయించారు. సీతారాముల  లక్ష్మణుల విగ్రహాల పైన కనిపించేది అదే.2005 సం.ములో ఉత్శవ విగ్రహాలను శ్రీ వాకా రామచంద్ర రావు చేయించారు. వాటికి కావలసిన వస్తు సామాగ్రిని డాక్టర్ పెండ్యాల వెంకటేశ్వర రావు, డాక్టర్ యాచవరపు హైమవతి మరియు పెండ్యాల వాసుదేవ రావు సమకూర్చారు. శ్రీ భక్త రామదాసు స్మారక మందిరమునకు తూరుపు దిక్కున ఆగ్నేయం మూల నుండి రాతి స్థభం వరకు శ్రీ భక్త రామదాసు స్మారక కమిటీ అధ్యక్షులు శ్రీ పెండ్యాల వాసుదేవ రావు సొంత సొమ్ములతో కాంపౌండ్ నిర్మాణం చేస్తున్న సమయం లో అక్కడికి అనుకోకుండా వచ్చిన స్థానిక మాజీ MLA , అప్పటి భద్రాచల సీతారామ చంద్ర స్వామి దేవస్థానం చైర్మన్ శ్రీ కత్తుల శాంతయ్య నిర్మాణ వివరాలు తెలుసుకొని ఇప్పటివరకు మీ కుటుంబం పెట్టింది చాలు నేను భాద్రాచల దేవస్థానం నుంచి కొంత ఇస్తానని చెప్పి Rs 25,000/-ఇచ్చారు. వెంటనే అప్పటి MLA శ్రీ సంద్ర వెంకట వీరయ్య తన నిధులనుంచి Rs 25,000/-ఇచ్చారు. ఈ విధంగా రామదాసు మందిరం చుట్టూ తూరుపు, దక్షిణ మరియు పడమర దిక్కులలో కాంపౌండ్ నిర్మాణం జరిగింది. ఈశాన్యం వేపు గేట్ ను మరియు compound ను శ్రీ రావులపాటి రంగారావు నిర్మించారు. అంతకు ముందు స్థానిక కస్తుబా మహిళా సంఘం పేరిట స్మారక మందిరం నైరుతి     మూల బెంగుళూరు పెంకు పైకప్పుగా రెండు రూమ్స్ నిర్మాణం జరిగింది. 1960 దశకం చివరలో శ్రీ భక్త రామదాసు రిక్రియేషన్ తరఫున సిమెంట్ స్లాబ్ తో ఆగ్నేయం మూలన ఒక రూమ్ నిర్మాణం చేసారు.దాని ముందర తూర్పు దిక్కుగా ఓపెన్ ఎయిర్  ధియేటర్ ను లిబర్టీ యూత్ క్లబ్ వారు 1978 సం.ములో నిర్మించారు. శ్రీ భక్త రామదాసు స్మారకోత్షవాలు అన్నిటికీ అదే వేదికైంది. వెనుక వున్న రూమ్ కార్యక్రమాలకు గ్రీన్ రూమ్ గా ఉపయోగపడింది. 2006 సం.ములో RS 1,50.000/-ఖర్చుతో రెండు సోలార్ లైట్సను రామదాసు స్మారక  మందిరం ఆవరణలో ఉత్తర మరియు పడమర దిక్కులలో శ్రీ పెండ్యాల వాసుదేవ రావు శ్రీ భక్త రామదాసు మెమోరియల్ కమిటి సౌజన్యంతో పెట్టించారు. స్థానిక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో  సోలార్ దీపాలు పెట్టటం ఇదే మొదటిసారి. 2009 సం.ములో శ్రీ భక్త రామదాసు విద్వత్ కలాపీఠం వారు పడమర నైరుతి దిక్కున మరో స్టేజి నిర్మాణం చేసారు.

2011 సం.ములో శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం వారు శ్రీ భక్త రామదాసు స్మారక మందిరం ఈశాన్యం మూలన వున్న రూమ్ ను కూలగొట్టి పడమర దిక్కున వరండాను మరియు వాయవ్యం మూలన ఒక రూమ్ ను కట్టించారు. శ్రీ భక్త రామదాసు ప్రాజెక్ట్ వారు రామదాసు భవన పునరుద్దరణ  సమయములో మెమోరియల్ హాల్ కు నైరుతి దిక్కున వున్న రూమ్ ఫ్లూరింగ్ పూర్తి చేయకుండా వదిలేసిన దానిని మరియు భద్రాచల దేవస్థానం వారు అసంపూర్తిగా వదిలేసిన  వాయవ్య రూమ్ & ఉత్తర వరండా అసంపూర్తి నిర్మాణమును శ్రీ కుంచకర్ర రాధాకృష్ణ  2013 సం.ములో పూర్తి చేసారు.

శ్రీ భక్త రామదాసు మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన సోలార్ లైట్స్ సంవత్సరాల  తరబడి వెలుగకున్న ఎవ్వరు ఈనాటికి కూడా పట్టించుకోలేదు. వాటిని వెలిగించవలసి వుంది. పలైర్ అసెంబ్లీ పరిధి మొత్తంలో వున్న సోలార్ లైట్స్ అవి మాత్రమే. ఆశించిన అభివృధి జరుగక పొగా మందిరం రూపురేఖలను ఎవ్వరి ఇష్టం వచ్చినట్లు వారు మార్చటం గురించి, మందిరం మీద నియంత్రణ లేకపోవటం గురించి ఆందోళనతో లోగడ ఇచ్చిన లేఖలను చర్యలకై సంభందిత అధికారులకు సంర్పించానైనది. అలాగే ఆలయం కాని స్థలంలో ఆగమ శాస్త్ర విరుద్ధ కార్యక్రమాలను కట్టడి చేయవలసి వుంది. జన్మ స్థల ప్రాంగణం మధ్యలో నున్న భావి దోష నివారణకు తూర్పు, పడమరలుగా భావికి ఉత్తర భాగంలో గోడను బేస్ మట్టం లెవెల్ వరకైనా నిర్మించ వలసి వుంది.
పిశాచ స్థలంలో కొత్తగా నిర్మించిన స్టేజిపై దైవిక కార్యక్రమాలు నిర్వహించటం ఆగమ శాస్త్ర విరుద్ధం. భద్రాచల దేవస్థానం అధీనంలో వున్న స్థలంలో అనుమతిలేని నిర్మాణాలు, మార్పులు మందిరం అభివృద్ధికి  అవరోధాలు అవుతున్నవి. ఎవ్వరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నిర్మాణాలు చేస్తున్నారు. కాలం  చెల్లిన దర్వాజాలు, కిటికీలు మార్చవలసి వుంది.

శ్రీ భక్త రామదాసు ఆరాధనోత్సవాలు మరియు జయంతి కార్యక్రమాలు తెలంగాణా రాష్ట్ర సాంస్కృతిక శాఖ చేపట్ట టానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర రావు గారు సంమతించటం హర్షణీయం. ఇప్పటికైనా ఈ ప్రాంత వాసుల చిరకాల వంచ నెరవేరుతున్నంధుకు సంతోషం.

తెలంగాణా రాష్ట్ర దృష్టికి వచ్చిన తరువాత ఇప్పటికైనా మందిరం లో కొన్ని మరమ్మతులు చేసి మందిరానికి కలర్స్ వేయిస్తే బాగుండేదనే ప్రజల అభిప్రాయాన్ని స్థానిక దిన్న పత్రిక వెలిబుచ్చినది. క్రింద వున్నది ఆ క్లిప్పింగ్ యే. సంబంధీకులు గమనించగలరని మనవి. ఆ మందిరానికి రంగులు పదిహేడు సంవత్సరాల క్రిందవేసినవి.



              -----పెండ్యాల వాసుదేవరావు. 
<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

                     

             .

    

Comments

Popular posts from this blog

82. (SOCIAL.55). ఖమ్మంకు ఆత్మాభిమానం లేదనుకున్నారా?

78. (social...51). ఎవవరెవరో ఎక్కడినుండో వస్తారు..... ఆలోచించండి ప్రజలారా...

80. (SOCIAL--53) దేశంలో ప్రజా సేవ ఇంత Costly నా? ఎవ్వరికీ బాధ్యతలు లేవా?