59. (ఖమ్మం చరిత్ర-7) ఆ నాటి మా ఖమ్మం....ఒక కురుక్షేత్రం..
ఆనాటి మా ఖమ్మం .... ఒక కురుక్షేత్రం.
జిల్లా లోని అసెంబ్లీ నియోజక వర్గాల చరిత్ర.
ఎల్లందు ద్విసభ్య అసెంబ్లీ నియోజక వర్గం.
ఎల్లందు అసెంబ్లీ నియోజకవర్గం మొదటి రెండు ఎన్నికలలో ద్విసభ్య నియోజక వర్గంగా వుండేది. 1978 లో పూర్తిగా ST లకు రిజర్వు అయ్యేటంత వరకు 1952,1957, 1962 కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ కే.యల్. నరసింహారావు, 1967 లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గోగినేని సత్యనారాయణ మరియు 1972 లోకాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ వంగా సుబ్బారావు గెలుపొందారు. 1967 మరియు 1972 అసెంబ్లీ ఎన్నికలలో CPI మరియు CPM పార్టీల అభ్యర్థులు ఇద్దరు విడి విడిగా పోటిలో వున్నారు. 1952, 1957 సంవత్సరాలలో రిజర్వేడ్ స్థానంలో వరుసగా శ్రీ ఉకే అబ్బయ్య (సోషలిస్ట్), శ్రీ దొడ్డా నరసయ్య (కాంగ్రెస్) లు గెలుపొందారు.
పాల్వంచ/కొత్తగూడెం అసెంబ్లీ నియోజక వర్గం.
మొదటి ఎన్నికల దశాబ్దంలో మధిర మరియు వేమ్సూర్ అసెంబ్లీ చరిత్ర.
1. శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు.
మధిర అసెంబ్లీ ఎన్నికల గణంకాలు.
1.తేళ్ళ లక్ష్మికాంతమ్మ.
2. శ్రీ కోట పున్నయ్య.
ఖమ్మం/పాలేరు అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ అభ్యర్ధుల విజయాల గణాంకాలు..
3. శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు.
పాలేరు పంచాయత్ సమితి ఎన్నికలు.
ఖమ్మం పంచాయత్ సమితి ఎన్నికలు.
ప్రప్రధమ ఖమ్మం జిల్లా పరిషద్ ఎన్నికలు.
ఖమ్మం జిల్లా ఎన్నికల చరిత్ర ప్రముఖం గా ఖమ్మం, వేమ్సూర్ మరియు మధిర అసెంబ్లీ ఎన్నికల చరిత్ర తో ముడిపడి వుంది.
ఖమ్మంజిల్లా చరిత్ర ప్రస్తావనలో ఖమ్మం నాయకుల గురించి చెప్పుకోవలసి వస్తే శ్రీబొమ్మకంటి సత్యనారాయణరావు, పెండ్యాల సత్యనారాయణరావు, శ్రీ జలగం వెంగళరావు మరియు శీలం సిద్దారెడ్డి పేర్లు ప్రముఖంగా వస్తాయి.
1949 సంవత్సరం నైజాం ప్రాంతంలో కీలకమైనవి. ఈ ప్రాంతంలో ముఖ్యమైన కమ్యునిస్టు పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాల్లో మార్పులు సంభవించాయి. వరంగల్ జిల్లాలో కుడా ఈ రెండు పార్టీల నాయకత్వాలు మారిపోయాయి. ఈ రెండు పార్టీల జిల్లా మరియు రాష్ట్ర పార్టీల నాయకత్వంలో ఖమ్మం నాయకులే వుండటం గమనార్హం. వాటి ఫలితమే 1952 ఎన్నికల నుండి జరిగిన రాజకీయ పునరేకీకరణలు.
విశాలాంధ్ర సిద్ధాంతంను(ఆంధ్ర మరియు తెలంగాణా ప్రాంతాల విలీనం—భాషా ప్రయుక్త రాష్ట్రాలు) వ్యతిరేకించిన వారు కాంగ్రెస్ పార్టీ లో ఒంటరి వారు కావటం, నైజాం సంస్థానం ఇండియాలో విలీనం కావటాన్ని కమ్యునిస్టు పార్టీ వ్యతిరేకించిన కారణంగా ఆ పార్టీ నుండి కొందరు పార్టీ వీడిపోవటంతో ఈ మార్పులు సంభవించాయి.
హైదరాబాద్ రాష్ట్రం లో 1949 నుండి 1951 ఆఖరు వరకు కమ్యునిస్ట్ లు ఆయుధాలు చేబూని underground కెళ్ళి పోయారు. దాదాపు అది భారత ప్రభుత్వం పై యుద్ధం అనే అనుకోవాలి. 1949 నుండి కాంగ్రెస్ పార్టీ వారు భారత ప్రభుత్వంలో వున్న కాంగ్రెస్ హేమాహేమీలతో సంప్రదింపులతో రాజ్యాధికారం కోసం రాజకీయ చదరంగం మొదలెట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ హేమాహేమీ నాయకులంతా ఢిల్లీ చట్టూ చక్కెర్లు కొట్టారు. కమ్యునిస్ట్ అగ్రనాయకులు కొందఱు పోరాటం ఆపే ప్రయత్నంలో అనుమతికై రష్యా వెళ్లారు. ఎన్నికలసమీపించే తరుణంలో కమ్యునిస్ట్ సాయుధ పోరాటం పోరాటం ముగిసింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రతింది శ్రీ వెల్లోడి హైదరాబాద్ రాష్ట్ర పాలనా బాధ్యతలలో వున్నారు. POLICE ACTION తరువాత హైదరాబాద్ రాష్ట్రం లో వున్నా మిలిటరీ గవర్నర్ MAJOR GENARAL CHOUDHARY తరువాత శ్రీ వెల్లోడి నియమించబడ్డారు. కాంగ్రెస్ రాజకీయ చదరంగం నిరంతర ప్రక్రియలా కొనసాగింది.
మొదటి నుండి శ్రీ పండిత నెహ్రు విశాలాంధ్రకు వ్యతిరేకంగా వున్నా హైదరాబాద్ రాష్ట్రంలో కన్నడ, మహారాష్ట ప్రాంతాలకు చెందిన ఔరంగాబాద్ మరియు గుల్బర్గా Divisions మినహాయిస్తే తెలంగాణా ప్రాంతంలో వున్న వరంగల్ మరియు గుల్శానాబాద్(మెదక్) Division ల కమ్యునిస్ట్ పార్టీ ప్రభావానికి మున్ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఫలితాల పరంగా నష్టపోతుందని సర్దార్ వల్లభాయి పటేల్ తో సహా మిగతా నాయకులందరు ఆయను ఒప్పించటం జరిగింది.
కమ్మ్యునిస్ట్ ల ప్రభావము అంటే ముందుగా నల్లగొండ మరియు వరంగల్ జిల్లాలే వస్తాయి. ప్రధమ సారస్వత ఎన్నికల ముందర ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలు రెండింటిలో కనిపించిన కమ్యునిసస్ట్ ల హవా అందరిని ఉలిక్కి పడేలా చేసింది. ఎన్నికలు అయిపోయిన తరువాత ఫలితాలు విస్మయ పరిచాయి.
ప్రధమ సారస్వత ఎన్నికల ప్రచారానికి పండిత జవహర్లాల్ నెహ్రు కాంగ్రెస్ పక్షాన ప్రచారానికి వరంగల్ పట్టణానికి వచ్చారు. భారీ ఎత్తున జరిగిన ఆ మీటింగ్ కు ప్రజలు ఇసుక వేస్తె రాలనంతగా వచ్చారు. ఖమ్మం నుండి రైలుబోగీల లోపల నిలవబడటానికి కూడా స్థలం దొరుకక రైలు బోగీల టాప్ మీద కుర్చుని జనాలు సమావేశానికి వెళ్లారు. జనాలైతే సమావేశానికి వేళ్ళారు కాని ఓట్లు మాత్రం కమ్యునిస్ట్ అభ్యర్థులకే వేశారు. వరంగల్, నల్లగొండ మరియు ఖమ్మం లోకసభా నియోజక వర్గాలలో కమ్యునిస్ట్ అభ్యర్థులే విజయం సాధించారు. నల్లగొండ లోకసభా స్థానంలో కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ రావి నారాయణరెడ్డి పండిత జవహర్లాల్ నెహ్రు కు వచ్చిన ఆధిక్యం కంటే ఎక్కువ ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఫలితాలే చివరకు విశాలాంధ్ర వాదానికి సంపూర్ణ మద్దతు లభించటానికి కారణము అయింది. ఆంధ్రా కమ్యునిస్ట్ నాయకులు కూడా విశాల ఆంధ్రాకే మద్దతు ప్రకటించటంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎర్పడింది.
ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చివరకు ముగ్గురు అభ్యర్థులు రంగంలోకి రాగా ఆంధ్రా మరియు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ బెజావాడ గోపాలరెడ్డి మరియు శ్రీ బూర్గుల రామకృష్ణారావు లను ఇద్దరికి నచ్చజెప్పి ఆ తరువాత గవర్నర్లుగా పంపారు. శ్రీ నీలం సంజీవరెడ్డి తన రాజకీయ చదరంగపు ఎత్తులతో తన సొంత వర్గ నిర్మాణ ప్రక్రియలో పావులు కదిపారు. ఆ ఫలితం ఖమ్మం జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. రాజకీయ పునరేకీకరణలకు కారణమైనది.
శ్రీ నీలం సంజీవరెడ్డి 1960 లో AICC PRESIDENT గా ఎన్నికైనందువల్ల ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రెసిడెంట్ గా వున్నందువల్ల ఆయన జిల్లాలో వేసిన రాజకీయ పునాది కదలలేదు.
ఎల్లందు ద్విసభ్య అసెంబ్లీ నియోజక వర్గం.
ఎల్లందు అసెంబ్లీ నియోజకవర్గం మొదటి రెండు ఎన్నికలలో ద్విసభ్య నియోజక వర్గంగా వుండేది. 1978 లో పూర్తిగా ST లకు రిజర్వు అయ్యేటంత వరకు 1952,1957, 1962 కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ కే.యల్. నరసింహారావు, 1967 లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గోగినేని సత్యనారాయణ మరియు 1972 లోకాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ వంగా సుబ్బారావు గెలుపొందారు. 1967 మరియు 1972 అసెంబ్లీ ఎన్నికలలో CPI మరియు CPM పార్టీల అభ్యర్థులు ఇద్దరు విడి విడిగా పోటిలో వున్నారు. 1952, 1957 సంవత్సరాలలో రిజర్వేడ్ స్థానంలో వరుసగా శ్రీ ఉకే అబ్బయ్య (సోషలిస్ట్), శ్రీ దొడ్డా నరసయ్య (కాంగ్రెస్) లు గెలుపొందారు.
పాల్వంచ/కొత్తగూడెం అసెంబ్లీ నియోజక వర్గం.
1957 ఏర్పాటు అయిన పాల్వంచ అసెంబ్లీ నియోజక వర్గంలో మొదటగా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ కే. సుదర్శన్రావు కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ పర్చా సత్యనారాయణ పై గెలుపొందారు. 1962 ఎన్నికలలో కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ పర్చా సత్యనారాయణ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ కే.వెంకటరామారావుపై గెలుపొందారు. 1967 లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ పానుగంటి పిచ్చయ్య కమ్యునిస్ట్ పార్టీ అభ్యర్థి శ్రీ పర్చా సత్యనారాయణ పై గెలుపొందారు.
1972 లో కొత్తగూడెం అసెంబ్లీ నియోజక వర్గం అవతరించింది. 1972 లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ చేకూరి కాశయ్య CPI అభ్యర్థి యం. కొమరయ్య పై గెలుపొందారు. 1978 లో జనతాపార్టీ అభ్యర్థి శ్రీ చేకూరి కాశయ్య కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ వనమా వెంకటేశ్వరరావు పై గెలుపొందారు.
బూర్గంపాడు అసెంబ్లీ చరిత్ర.
1962 లో ఏర్పడిన బూర్గంపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటగా కమ్యునిస్ట్ పార్టీ అభ్యర్థి శ్రీ కంగల బుచ్చయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ కొమరం రామయ్య పై కేవలం నలభై రెండు ఓట్ల తేడాతో గెలిచాడు. 1967 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ కొమరం రామయ్య కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ కంగల బుచ్చయ్య పై 16,300 ఆధిక్యంతో గెలుపొందారు.1972 లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ కొమరం రామయ్య ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీ జి.సీతయ్య పై 8,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ చరిత్ర.
1959 లో భద్రాచలం ప్రాంతం ఖమ్మం జిల్లాలో విలీనమైన తరువాత ఆ నియోజకవర్గం జనరల్ సీట్ గా వున్నప్పుడు 1962 ఎన్నికలలో కమ్యునిస్ట్ పార్టీ అభ్యర్థి శ్రీ యం.డి.తహసిల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి వాణిరమణారావు పై 13,500 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 1967 ఎన్నికలలో శ్రీ కారం కన్నయ్య ఉభయ కమ్యునిస్ట్ అభ్యర్థులపై గెలుపొందారు. 1972లో శ్రీయం.రామచంద్రయ్య ఉభయ కమ్యునిస్ట్ అభ్యర్థులపై గెలుపొందారు.
1. శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు.
శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు స్వాతంత్ర్య సమరయోధులు. నింగి కెగసి క్రింద పడ్డ కెరటం. నిజాం వ్యతిరేక పోరాటంలో శ్రీ జమలాపురం కేశవరావు నాయకత్వంలో పనిచేశారు. వరంగల్ జిల్లా వున్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులలో ఒకరు. రజాకార్ ముమెంట్లో బోర్దర్ కాంప్ లో కీలక భూమికను పోషించిన వారు. 1952 సంవత్సరంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సారధిగా శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు వున్నారు. శ్రీ జమలాపురం కేశవరావు తరువాత ఖమ్మం కాంగ్రెస్ లో శ్రీ బొమ్మకంటి కీలక వ్యక్తి అయినారు.
వరంగల్ జిల్లాలో అంతర్భాగం అయిన ఖమ్మం ప్రాంతం 1950 లో వెల్లోడి ప్రభుత్వంలో అదనపు జిల్లాగా ఆవిర్భవించింది. 1953 లో బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లా ఏర్పడినది. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక డిగ్రీ కాలేజీ ను ఏర్పాటు చేయవలేనని నిర్ణయించింది. హైదరాబాద్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో మొదట ప్రభుత్వ అనుమతితో ప్రైవేటు కమిటీ డిగ్రీ కళాశాలలు ప్రారంభం అయినవి. ఖమ్మం పట్టణంలో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు అధ్యక్షుడుగా, శ్రీ సర్వదేవభ్ట్ల నరసింహ మూర్తి (యెస్.యన్.మూర్తి) ప్రధాన కార్యదర్శిగా ఏర్పడిన పేరెంట్స్ కమిటీ కృషితో జగ్గయ్యపేటకు చెందిన శ్రీ గెంటాల నారాయణ రావు, తన ఇష్ట దైవం పేరుతో తన పేరు కలిపి పెట్టె షరతు మీద ఖమ్మం లో డిగ్రీ కాలేజీ స్థాపనకు లక్షరూపాయల నిధులను ఇస్తాననే ప్రతిపాదనను శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు పేరెంట్స్ కమిటీలో ఆమోదించిన ఫలితంగా ఖమ్మం లోని S.R & B.G.N.R COLLEGE ఏర్పాటు అయినదని చెబుతారు. అదే జిల్లాలో మొదటి డిగ్రీ కాలేజీ. ఆ సమయంలో శ్రీ గెంటాల వారికి తన స్వగ్రామం గండ్రాయి లోనున్న తన భూమిని కాకిరాయి వ్యాపారంకు లీజ్ కు ఇవ్వటం వల్ల లక్షల రూపాయలు ఆర్ధికంగా కలసి వచ్చింది.
ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం ప్రాంతంలో తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవటానికి తన బందువర్గాన్నే ఎక్కువగా వినియోగించుకున్నారు. నేలకొండపల్లి ప్రాంతంలో తన Classmate అయిన శ్రీ రావులపాటి జానకిరాంరావు కుటుంబాన్ని వేదికగా చేసుకున్నారు. ఆ నాటి రావు వర్గం రాష్ట్ర నాయకులతో బంధుత్వాలు కలిగిన నేలకొండపల్లి వాసి శ్రీ కంకిపాటి జగమోహన్రావు ను రాజకీయంగా కలుపుకున్నారు. రాజ్యాధికారం వేపు వడివడిగా అడుగులు వేసిన ఏకైక వ్యక్తి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు ఒక్కరే. ఆయన అధికారం ఎలా వుండేదంటే మొట్ట మొదటి జిల్లా Collector గా తన పలుకుబడిని వినియోగించి డిప్యూటి కలెక్టర్ స్థాయి వ్యక్తిని జిల్లా కలెక్టర్ గా నియమించుకొని ఇంట్లో బంట్రోతు గా ఉపయోగించుకున్నట్లు ఆయన పై ఆరోపణ లున్నవి. ఈ మనస్తత్వమే తదుపరి ఆయన రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేసింది.
శ్రీ జమలాపురం కేశవరావు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ లో బలమైన వర్గమైన విశాలాంధ్ర వాదుల వల్ల నాయకత్వంలో కొద్దిగా వెనుకపడ్డ తరువాత ఆ స్థానం కోసం శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు అనేక చదరంగపు పాచికలను విసిరారు. 1954 లో విశాలాంధ్ర వాదం ఆధారంగా హైదరాబాద్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి పోటిచేసి శ్రీ కొండా వెంకటరంగారెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఆనాటి ఎన్నికలు మధిరలోనే పార్టీ పరిశీలకుల సమక్షంలో జరగటం విశేషం. పిదప ముఖ్యమంత్రి పదవికి ఎన్నో పాచికలు విసిరారు.
శ్రీ నీలం సంజీవరెడ్డికి చివరినిమిషంలో మద్దతు ప్రకటించిన వర్గంలో ప్రముఖుడిగా వున్నా, 1958 లో మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో శ్రీ జలగం వెంగళరావు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష భాధ్యతల స్వీకరించటంతో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవ రెడ్డి కి వ్యతిరేకంగా 1959 లో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఏర్పడిన వర్గంతో చేతులు కలిపారు.
P.V.G.RAJU చైర్మన్ గా విజయవాడ పట్టణం లో 20TH MAY 1959 లో ఏర్పడిన SOCIALISTIC DEMOCRATIC PARTY (SDP) కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినారు. శ్రీ మర్రి చెన్నారెడ్డి అప్పుడు అదే పార్టీ తరఫున LEGISLATURE PAARTY నాయకుడు అయినారు.
ఆంధ్రా నాయకులు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు మరియు శ్రీ కొండావెంకట రంగారెడ్డి వర్గం అండతో ముఖ్యమంత్రి కావచ్చని భావించారు. చివరకు ఆయన ఎక్కిన నిచ్చెన పట్టు తప్పింది. శ్రీ PV.G.RAJU మరియు శ్రీ మర్రి చెన్నారెడ్డిలు 20th MAY 1959 న SDP రద్దు చేస్తున్నట్లు ప్రకటించి కాంగ్రెస్ పార్టీ లో చేరి శ్రీ దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో శ్రీ బొమ్మకంటి ఎన్నికల రాజకీయ రంగంలో వెనుకపడి పోయారు. SDP యొక్క జీవిత కాలం కేవలం ఏడు నెలలు మాత్రమే.
శ్రీ జమలాపురం కేశవరావును మధిర ఎన్నికల బరినుండి తప్పిస్తే తాను మధిర అసెంబ్లీ నుండి అసెంబ్లీలో ఆడుగు పెట్టవచ్చని భావించి మధిర అసెంబ్లీకి 1952 సంవత్సరంలో శ్రీ జమలాపురం కేశవరావుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకుండా తన పలుకుబడితో అడ్డుకున్నారని ఆయన పై అభియోగాముంది. శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు ఆత్మీయులు మాత్రం ఆ రాజకీయం శ్రీ మాడపాటి రామచంద్రరావు చేశాడంటారు. ఆ స్థానంలో పార్టీ టికెట్ ను శ్రీ మాడపాటి రామచందర రావు దక్కించుకున్నారు. అప్పుడు శ్రీ మాడపాటి రామచందర్ రావు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీగాను మరియు శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగాను వున్నారు.
ఇక శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావుకి వేమ్సూర్ అసెంబ్లీ టికెట్ తప్ప జిల్లాలో వేరే అవకాశం లేదు. చివరకు 1952 సంవత్సరంలో ప్రధమంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వేమ్సూర్ స్థానానికే పార్టీ టికెట్ ను సంపాదించారు. 1957 లో మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుండి, 1962 లో ఎల్లందు అసెంబ్లీ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటి చేసినా 1957 లో మధిరలో మాత్రమే విజయాన్ని సాధించారు. క్రమంగా 1967 ASSEMBLY ఎన్నికల తరువాత ఎన్నికల బరిలోనుండి తప్పుకున్నారు.
1957 లో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు (21,149 ఓట్లు రాగా) కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ నండురు ప్రసాదరావు (18,546 ఓట్లు వచాయి) పై 2603 ఓట్ల ఆధిక్యం తో గెలుపొందారు.
1962 లో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన తోడల్లుడు కమ్యునిస్ట్ పార్టీ అభ్యర్థి అయిన శ్రీ K.L.నరసింహారావు పై ఓటమి చెందారు. అప్పుడు శ్రీ బొమ్మకంటికి 14,914 ఓట్లు రాగా శ్రీ కే.యల్.నరసింహారావుకు 21,557ఓట్లు వచాయి. శ్రీ కే.యల్.నరసింహారావు 6,643 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
1967 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రేస్ పార్టీ టికెట్ పొందలేక పోవటంతో ఇండిపెండెంట్ గా పోటి చేసి ఓటమిని చెందారు. ఆ ఎన్నికలలో శ్రీ దుగ్గినేని వెంకయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ బోడేపూడి వెంకటేశ్వరరావు సి.పి.యం అభ్యర్థిగా పోటి చేయగా శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు ఇండిపెండెంట్ గా పోటి చేశారు. శ్రీ దుగ్గినేని వెంకయ్యకు 26,821 ఓట్లు రాగా శ్రీ బోడేపూడికి 15,672 ఓట్లు మరియు శ్రీ బొమ్మకంటికి 14,437 ఓట్లు వచ్చాయి.
1961సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ నియోజక వర్గాల పునర్విభజన లో SC లకు రిజర్వు కావలసిన వేమ్సూర్ అసెంబ్లీ నియోజకవర్గం OCకి కేటాయించి అప్పుడే ఏర్పడిన పాలేరు అసెంబ్లీ నియోజక వర్గాన్ని SC లకు కేటాయించటంలో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు గారి ప్రమేయాన్ని ఆ రోజుల్లో చెప్పుకొనేవారు. ఆ విధంగా చేసిన మార్పు ఆయనకు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగింది. శ్రీ వెంగళరావు ఆ స్థానంలో స్థిరపడి పోయారు.
2.శ్రీ జలగం వెంగళరావు.
శ్రీ జలగం వెంగళరావు పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు సమీపంలో గల నందమూరు గ్రామంలో శ్రీ జలగం వెంకట్రావు ఇంట జన్మించారు. శ్రీ జలగం వెంకట్రావు గారు పదిహేను ఎకరాల ఆసామి. ఆయన మీర్జాపురం రాజా వారి సంస్థానంలో కామ్ దార్(ఎస్టేట్ సూపర్ వైసర్) గా పనిచేసేవారు. నూజివీడు దగ్గర వున్న కేసరపల్లి వారి ప్రధాన కేంద్రం. Gannavaram high school లో S.S.C. చదివిన శ్రీ జలగం వెంగళరావు తొట్లవల్లూరు గ్రామపంచాయతి పరిధిలో కారోబార్ (క్లర్క్) ఉదోగంలో చేరి కొంత కాలం పని చేశారు. శ్రీ వెంగళరావు మ్యారేజ్ అయిన తరువాత ఖమ్మం జిల్లాలోని వంగా ముత్యాల బంజరకు వలస వచ్చారు. అడవులలోని చెట్లను కొని కర్ర బట్టిలను పెట్టి బొగ్గు తయ్యారు చేసే వ్యాపారంలో భాగా స్వాములు అయినారు. ఈ వ్యాపారం చేసే క్రమంలో ఆ బంజరకు చుట్టుపట్ల గ్రామాలతో ఆయనకు మంచి పరిచయాలు అయినవి.
ఆ విధంగా వ్యాపారంలో తలమునకలు అయిన శ్రీ వెంగళరావు జీవితాన్ని రాజకీయాలలో ప్రవేశించమని ఆ ప్రాంతంలో కల్లు డిపో వ్యాపారంలో(ఆ రోజులలో సారా డిపోలు లేవు) వున్న ఏలూరు కు చెందిన శాస్త్రి గారు సలహా ఇవ్వటం, శాస్త్రి గారు తనకు తెలిసిన జిల్లా నాయకుడు శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు ను పరిచయం చేయటం జరిగింది. ఆ విధంగా వెంగళరావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తిరువూరు బోర్డర్ క్యాంపులో(తిరువూరు ఆయన అత్తగారి ఊరు కూడా) పనిచేసిన శ్రీ వెంగళరావుకు శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావుతో 1952 కు ముందరే మనస్పర్ధలు వచ్చాయి. శ్రీ బొమ్మకంటి MLA గా జిల్లాలో ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడి ఆయనను ఓడిస్తానని బహిరంగం గానే చెప్పారు.
శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు వేమ్సూర్ అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారు కావటంతో శ్రీ జలగం వెంగళరావు ఇండిపెండెంట్ గా ఆయనపై పోటి చేశారు. శ్రీ వెంగళ రావుకు ప్రారంభంలో వ్యాపారరీత్యా ఆ నియోజకవర్గం అంతా పరిచయం అయివుండటం మరియు ఆతరువాత పార్టీ కార్యక్రమాల కోసం గ్రామాలన్నీ తిరగటం వల్ల అక్కడి ప్రజలతో మంచి సంభందాలు వుండేవి.
వేమ్సూర్ అసెంబ్లీ నియోజక వర్గంలో కమ్యునిస్ట్ పార్టీ అభ్యర్థిగా ఎవ్వరిని నిర్ణయం చేయాలానే భాధ్యతని మదిరకే చెందిన కమ్యునిస్ట్ నాయకుడు శ్రీ వాసిరెడ్డి వేంకటపతికి కమ్యునిస్ట్ పార్టీ భాధ్యతల అప్పగించింది. అశ్వారావుపేట జమిందారు కుమారుని రంగంలోకి దించి, వెంగళరావు గారి సహకారంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావును ఓడించ వచ్చని కమ్యునిస్ట్ పార్టీ భావించింది. వారు ఊహించినట్లు కాకుండా శ్రీ వెంగళ రావు గారే స్వయంగా పోటి చేశారు. ఆ ఎన్నికల తరువాత శ్రీ జలగం వెంగళరావు కు బ్రాహ్య్మణ ద్వేషి అని ముద్ర పడినది. అంతకు ముందు శ్రీ వెంగళరావు ఆ ప్రాంత రైతుల పక్షాన నిలువబడి ఆ నియోజకవర్గం లోని కొన్ని గ్రామాల పట్వారిలతో రెవిన్యూ దస్త్రాల నిర్వహణ గురించి యుద్ధం చేసేవారని అదే శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావుతో విబేధాలకు కారణమని చెబుతారు.
1952 లో PDF పేరు మీద పోటి చేసిన కమ్యునిస్ట్ పార్టీ అభ్యర్థే వేమ్సూర్ ఎన్నికలలో (16,092) గెలిచినా ద్వితీయ స్థానంలో శ్రీ జలగం వెంగళరావు గారే (15,543) వున్నారు. కేవలం 549 ఓట్ల ఆధిక్యంతోనే కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ కందిమళ్ళ రామకృష్ణారావు గెలిచారు. శ్రీ బొమ్మకంటికి 4,580 ఓట్లు వచ్చినవి. కందుకూరు గ్రామ ఓట్లతోనే కమ్యునిస్ట్ అభ్యర్ధీ గెలిచాడని చెప్పేవారు.
వేమ్సూర్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు ఓడిపోవటంతో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షా చర్యలలో భాగంగా శ్రీ జలగం వెంగళరావును ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుండి బహిష్కరించింది. తరువాతి పరిణామాలలో శ్రీ వెంగళరావు శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు దగ్గరకు సంప్రదింపులకు వస్తుండేవారు.
“వరంగల్/ఖమ్మం జిల్లాలో దశాబ్దంన్నర ఎన్నికల రాజకీయం” ఆర్టికల్ లో 1957 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంభందించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల టికెట్స్ నిర్ధారణకు సంభందించిన వివరాలు దానిలో శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు పాత్ర గురించిన వివరణ ఉన్నది.
1957 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయ సమీకరణాలలో మార్పుల ఫలితంగా జిల్లా కాంగ్రెస్ పార్టీలో నూతన యువ నాయకత్వం ఆవిర్భవించింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వ భాధ్యతలను శ్రీ వెంగళరావుకు అప్పగించే యోచనలో వేమ్సూర్ అసెంబ్లీ టికెట్ ను ఆయన తమ్ముడు శ్రీ జలగం కొండలరావు కు ఇవ్వటం జరిగింది. శ్రీ వెంగళరావు పై కాంగ్రెస్ పార్టీ విధించిన నిషేధకాలం పుర్తికానందున ఆయనకు టికెట్ ఇవ్వటం సాధ్యపడలేదు. శ్రీ జలగం కొండలరావు తన అన్నగారికి లక్ష్మనుడు వంటి వారు. శ్రీ వెంగళరావు తన తదుపరి రాజకీయ జీవితంలో కూడా తదుపరి జరిగిన జిల్లా పరిషద్ ఎన్నికలలోను, లోకసభ ఎన్నికలలోను శ్రీ కొండలరావు కు పదవులను అప్పగించి అధికారాన్ని గుప్పెట పట్టారు.
శ్రీ వెంగళరావు గారితో బాటు మదిరకు చెందిన శ్రీ శీలం సిద్దారెడ్డి కూడా సంజీవరెడ్డి గారి ఆశీర్వాదంతో అప్పుడే రాజకీయ తెరపైకి వచ్చారు. శ్రీ శీలం సిద్దారెడ్డి కూడా 1952 మధిర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశాడనే అభియోగంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను ఆరు సంవత్సరాలు భాహిష్కరించింది.
1957 లో వేమ్సూర్ అసెంబ్లీ ఎన్నికలలో శ్రీ జలగం కొండలరావు (24,680) PDF అభ్యర్థి శ్రీ వట్టికొండ నాగేశ్వరరావు (16,943) పై 7,737 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా వున్న శ్రీ నీలం సంజీవరెడ్డి ఇచ్చిన సంపూర్ణ రాజకీయ సహకారంలతో 1958 లో పార్టీ విధించిన నిషేధ కాలం పూర్తి కాగానే శ్రీ జలగం వెంగళరావు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు. 1959 లో ఖమ్మం జిల్లా పరిషద్ అధ్యక్షుడయ్యారు. 1962 లో వేమ్సూర్ MLA అయినారు. జిల్లాలో ఇవి చక చకా జరిగిన పరిణామాలు. ఆ రోజులలో పంచాయత్ రాజ్ వ్యవస్థ లోని సంస్థలకు పదవీ కాలం ముడు సంవత్సరాలు మాత్రమే వుండేది. శ్రీ జలగం వెంగళరావు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా వున్నప్పుడు శ్రీ శీలం సిద్దారెడ్డి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వున్నారు. వెంగళరావు గారు జిల్లా పరిషద్ అధ్యక్షుడు కాగానే శ్రీ శీలం సిద్దారెడ్డి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినారు.
శ్రీ జలగం వెంగళరావు ప్రప్రధమంగా 1962 లో వేమ్సూర్ అసెంబ్లీ ఎన్నికలలో కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ వట్టికొండ నాగేశ్వరరావు పై 16,583 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందటం ద్వారా అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆప్పుడు శ్రీ వెంగళరావుకు 34,436 ఓట్లు రాగా శ్రీ వట్టికొండ నాగేశ్వరరావుకు 17,853 ఓట్లు వచ్చాయి.
తిరిగి 1967 లో వేమ్సూర్ అసెంబ్లీ ఎన్నికలలో శ్రీ జలగం వెంగళరావు (37,595) INDIPENDENT అభ్యర్థి శ్రీ మోరంపూడి వెంకయ్య (13,220) పై 24,375 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆ తరువాత ఎన్నికలలో వేమ్సూర్ అసెంబ్లీ నియోజక వర్గం అదృశ్యం అయి సత్తుపల్లి నియోజక వర్గం గా ఆవిర్భవించింది.
శ్రీ జలగం వెంగళరావు రాజకీయాలలోకి వచ్చిన దగ్గర నుండి ఫుల్ టైం వర్కర్ గా వుండటం ఆయనను జిల్లా రాజకీయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించటానికి కారణమైంది. క్రమశిక్షణ గల జీవితం ఆయన సొంతం. టైం కు నిద్ర ఆహారం తప్పనిసరి. రాత్రి పది గంటలు అవుతే ఎట్టి పరిస్థితులలో అయినా నిద్రకు ఉపక్రమించ వలసిందే.
మొదటి అసెంబ్లీ ఎన్నికల తరువాత హైదరాబాదుతో సహా ఎక్కడకు వెళ్ళినా శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారితో ఆయన జీప్(JEEP) లోనే వెళ్ళే వారు. డ్రైవింగ్ ఎప్పుడు శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారే చేసేవారు. జీప్ లో ప్రయానించేటప్పుడు ఏ మాత్రం స్పీడ్ అనిపించినా భయపడే వారు. స్పీడ్ తగ్గించమని గొడవ చేసేవారు.
1957 అసెంబ్లీ ఎన్నికలు అయిన తరువాత జిల్లా కాంగ్రెస్ లో ఒక టీం ఏర్పాటు అయింది. ఎక్కడడకు వెళ్ళినా వారు అందరు కలిసే వెళ్ళేవారు. వారిలో పెండ్యాల సత్యనారాయణరావు గారు, జలగం వెంగళరావు గారు, శీలం సిద్దారెడ్డి గారు, కోట పున్నయ్య గారు మరియు హీరాలాల్ మోరియా గారు వుండేవారు.
వారంతా హైదరాబాద్ వెళ్ళితే రవీంద్ర భారతి ఎదురుగా వున్న గోపి హోటల్లో దిగేవారు. శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు లాంటి జిల్లాకాంగ్రెస్ నాయకులు అబిడ్స్ జనరల్ పోస్ట్ ఆఫీసు ప్రక్కనున్న వసంత విహార్ లో దిగేవారు. జిల్లాపరిషత్ చైర్మన్ అయ్యేవరకు ఖమ్మం వస్తే శ్రీ శీలం సిద్దారెడ్డి గారితో కలిసి ఖమ్మంలో ఖాళీగా వున్న శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారి Quarter లోనే బస చేసేవారు. వారికి ఖమ్మం పట్టణంలో సొంత ఇల్లు లేకపోవటం, Hotels లో బస చేయటం ఆరోజుల్లో అలవాటు లేకపోవటం కారణం.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో మొదటితరం కాంగ్రెస్ పార్టీ నాయకులలో శ్రీ జమలాపురం కేశవరావు మినహా మాస్ లీడర్స్ ఎవ్వరులేరు. అందరు త్యాగధనులే అయినా మాస్ లీడర్స్ కాకపోవటం వల్ల ఎన్నికల రణరంగంలో తిరుగులేని విజేతలుగా నిలువ లేక పోయారు. కమ్యునిస్ట్ పార్టీలో నాయకులు ఎక్కువ మంది మాస్ లీడర్స్ యే.
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేశుకున్న శ్రీ జలగం వెంగళరావు రాష్ట్ర స్థాయికి పోయే వరకు తాను నమ్ముకున్న ఆత్మీయుల సలహాలను మరియు రాష్ట్ర స్థాయి పదవులు వచ్చిన తరువాత సంభందిత IAS ఆఫీసర్స్ సలహాలను పాటించేవారు. ఆ విధంగా జిల్లా రాజకీయాలపై పట్టును సాధించారు. ఫీల్డ్ వర్కేర్ గా పనిచేసినందు వల్ల కార్యకర్తలను పేర్లతో సహా గుర్తు పెట్టుకునే వారు. తనకు రాజకీయ శత్రువులు అనుకుంటే ఎవ్వరైనా ఖమ్మం గాని, హైదరాబాద్ గాని వస్తే వాళ్ళు ఎందు వచ్చారో తెలుసికుని మరీ వారి పని చెడగొట్టే వారని ప్రతీతి. అలాగే ఆయన Highly Ambitious person అని ఆయన విమర్శకులు ఒకరు తన అభిప్రాయం వేల్లడిన్చారు.
ఖమ్మం అసెంబ్లీ ద్విసభ్య నియోజక వర్గం.
ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గం విషయానికి వస్తే సంజీవరెడ్డి వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా 1957 సంవత్సరంలో పెండ్యాల సత్యనారాయణ రావు గారికి ఆహ్వానం అందింది, కాని ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. 1952 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆయన తటస్థంగానే వున్నారు. ఆయన శివారు గ్రామానికే చెందిన శ్రీ కర్నాటి కృష్ణయ్య కమ్యూనిస్ట్ అభ్యర్ధి గా పోటి చేసి గెలుపొందారు.
మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో ఖమ్మం జిల్లా వర్గ రాజకీయాలలో 1957 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు వర్గానికి ఖమ్మం మరియు మధిర అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. శ్రీ బొమ్మకంటి సూచన మేరకు ఖమ్మం తాలుకా గోకినేపల్లీ గ్రామానికి చెందిన శ్రీ చావా వెంకటకోటయ్యకు కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అసెంబ్లీ టికెట్ ను యిచ్చింది. హయగ్రీవాచారి గారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా వున్నప్పుడు వెంకటకోటయ్యగారు జిల్లా కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీగా వున్నారు. శ్రీ చావా వెంకటకోటయ్యకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీచేయటానికి కొన్ని ప్రతిబంధకాలు ఎదురైనవి. ఆ సమయంలో ఆయనకు సాయంసంధ్య వేళ పాము కరచినందువల్ల ఎన్నికలకు అది శుభసూచికం కాదని ... తాను పోటి చేయలేనని ఎన్నికలబరిలో నుండి తప్పుకున్నారు.
ఆ రోజులలో కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని జీప్, సైకిల్ లేదా ఎడ్ల బండలకు కట్టుకుని ఖమ్మం తాలుకా గ్రామాలలో ఎన్నికల సమయంలోనైనా స్వేచ్చగా తిరిగే పరిస్థితులు లేవు. చాలా కాలం వరకు కొన్ని గ్రామాలలో కాంగ్రెస్ అభిమానులు సైలెంట్ గా వచ్చి పోలింగ్ బూత్ లలో ఓట్లేసి వెళ్ళీ వారు. పోలింగ్ ఏజెంట్స్ లేని గ్రామాలు కూడా వుండేవి.
ఖమ్మం జిల్లా స్థానికులను ఎవ్వరిని పెట్టినా ఆయా గ్రామాలలో నెలకొన్న రాజకీయ వత్తిడుల వల్ల ఎన్నికల బరిలో నిలువ బడ్డ వాళ్ళు ఎప్పుడు జారుకుంటారో తెలీని పరిస్థితి. ఖమ్మం అసెంబ్లీ కి అభ్యర్థిగా ప్రకటించబడిన శ్రీ చావా వెంకట కోటయ్య నామినేషన్ వేయకుండా బరిలోనుంది తప్పుకోవటమే అందుకు నిదర్శనం. అంతకు ముందు కాంగ్రెస్ అభ్యర్థి గా 1952 ఖమ్మం అసెంబ్లీకి పోటి చేసి ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శ్రీ కొలిపాక కిషన్ రావు ఈ సారి 1957 సంవత్సరం జరుగు లోకసభ అభ్యర్థి గా పోటిలో వున్నారు.
ఆ విధంగా జిల్లాకు సంభందము లేని, జిల్లా ఉద్యమాలతో సంబంధం లేని బయటి వ్యక్తులు జిల్లా ఎన్నికల బరి లోకి వచ్చారు. తరువాత జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో బయటి వ్యక్తులే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటి చేయటం సాంప్రదాయంగా మారింది.
చావా వెంకటకోటయ్య గారు ఎన్నికలబరి నుండి తప్పుకోవటంతో అభ్యర్థికై మళ్ళీ వేట మొదలయింది. స్థానికేతరులే బయటినుండి రావాలిసిన పరిస్థితి. ఖమ్మం ద్విసభ్య నియోజక వర్గం కావటంతో ఇద్దరు అసెంబ్లీ అభ్యర్థులు కావలసి వచ్చారు. ఒకరు OC అభ్యర్థి, ఇంకొకరు SC అభ్యర్థి.
మహబూబ్ నగర్ జిల్లాలో గల ఆలంపురం గ్రామానికి చెందిన శ్రీమతి తేళ్ల లక్ష్మికాంతమ్మ తన భర్త శ్రీ సుబ్బారావు హైదరాబాద్ లో రాష్ట్ర ఫారెస్ట్ ఆఫీసర్ కావటం తో హైదరాబాద్ లో వుండేవారు. శ్రీ నీలం సంజీవ రెడ్డి కుమార్తె అత్తవారిల్లు ఆలంపురం దగ్గరనే. అలాగ సంజీవరెడ్డి గారికి ఆలంపురంతో అనుభంధం. శ్రీమతి లక్ష్మికాంతమ్మ పుట్టింటి వారికి సంజీవరెడ్డి వియ్యంకులకు పరిచయాలు మరియు వైరాలు వున్నవి. సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే తాను అసెంబ్లీ లో అడుగు పెట్టాలనే కోరిక కలిగిన శ్రీమతి లక్ష్మికాంతమ్మ తన ప్రయత్నాలు మొదలెట్టారు. ఇదే సమయంలో శ్రీ చెన్నారెడ్డి గారి దృష్టిలో పడ్డ శ్రీ లక్ష్మికాంతమ్మ AP PCC టికెట్ ఆస్పిరంట్ లిస్ట్ లోకి ఎక్కారు. ఆ పేరును శ్రీ నీలం సంజీవరెడ్డి గారి దగ్గరకు తీసుకు వచ్చారు. అనేక తర్జన భర్జనల తరువాత ఖమ్మం టికెట్ ను ఆశిస్తున్న అభ్యర్థులలో శ్రీమతి లక్ష్మికాంతమ్మ ఒకరైనారు.
శ్రీ నీలం సంజీవరెడ్డి వర్గం రాష్ట్ర నాయకుల నుండి తిరిగి శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు పై ఖమ్మం అసెంబ్లీని గెలిపించే గురుతర బాధ్యత అప్పగించ బడింది. మొదట ఏ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయం జరిగిందో శ్రీమతి తెళ్ళ లక్ష్మికాంతమ్మ అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటంతో అధిష్టానం సూచించిన శ్రీమతి లక్ష్మి కాంతమ్మ పేరును సత్యనారాయణరావు గారు కూడా ఆమోదించటం జరిగింది. ఈ సామాజిక వర్గం లో అప్పటి వరకు కాంగ్రెస్ లో ఎవ్వరు ప్రసిద్దులు కాదు. ఆ సామాజిక వర్గంలో అసెంబ్లీ స్థాయి ఎన్నికలలో నిలువబడే అభ్యర్థులు కాంగ్రెస్ లో ఎవ్వరు లేరనే చెప్పవచ్చు.
శ్రీమతి లక్ష్మికాంతమ్మ గొప్ప మేధావి. చెన్నారెడ్డి వర్గం తరఫున వెలుగులోకి వచ్చినా సంజీవరెడ్డి వర్గానికి ఏనాడు ధూరం కాలేదు. పైగా వారితోనే రాజకీయంగా మెలిగారు. తానుగా జిల్లాలో సొంత రాజకీయాలు చేయక పోవటం ఆమెకు ప్లుస్ పాయింట్. జిల్లా రాజకీయాలో తాను తన ముద్ర వేయాలని ప్రయత్నించక పోవటం తో శ్రీమతి ఇందిరాగాంధీతో విబేధాలు వచ్చే వరకు జిల్లాలో దీర్ఘ కాలం వున్నారు. 1969 తెలంగాణా ఉద్యమం చెన్నారెడ్డి నాయకత్వాన ఉవ్వెత్తున ఎగసిపడినా ఆమె అటు తొంగి చూడలేదు. ఎక్కువ మంది జిల్లా కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక తెలంగాణాకు అనుకూలం కాకపోవటంతో 1969 లో కుడా ఆమే MP గా విజయం సాధించింది. అప్పుడు తెలంగాణా మొత్తం మీద గెలిచిన కాంగ్రెస్ సీట్ ఇది ఒక్కటే.
శ్రీమతి రేణుకాచౌదరి ఖమ్మం జిల్లాలో తన రాజకీయ జీవిత ప్రారంభంలో శ్రీ కోట్ల విజయభాస్కరరెడ్డి, శ్రీ శీలం సిద్దారెడ్డి ద్వారానే ఖమ్మం ఆడపడుచుగా, ఖమ్మం లోకసభ అభ్యర్థిగా అడుగు పెట్టినా ఆ తరువాత జిల్లా రాజకీయాలలో తల దూర్చటం, సొంత ముద్ర వేయాలనే తపన వల్ల శ్రీమతి లక్ష్మికాంతమ్మ లాగా స్థానం సంపాదించలేక పోయారు. స్థానికంగా రాజకీయంగా నష్టపోయారు. శ్రీమతి లక్ష్మి కాంతమ్మ రాజకీయ జీవితం ఖమ్మం జిల్లాలో ప్రశాంతం గా రెండు దశాబ్దాలు సాగింది.
విజయవాడ లో చదువు కొనే రోజులలో కాలేజీ ప్రెసిడెంట్ గా వెలుగు లోకి వచ్చి సికింద్రాబాద్ లో రైల్వేలో Commercial clerk గా ఉద్యోగ విధులలో ఉంటూ "All India depressed class League" రాష్ట్ర శాఖలో చురుకుగావున్న శ్రీ కోట పున్నయ్య కూడా ఖమ్మం జిల్లా బయటి వ్యక్తి అయినా కూడా ఖమ్మం ASSEMBLY లో SC స్థానానికి అభ్యర్థిగా అయినాడు. ఆ రోజులలో దళితుల కోసం జగ్జీవన్రాం ఆధ్వర్యంలోని పై సంస్థతో పాటు శ్రీ బి.ఆర్. అంబేద్కర్ ఆధ్వర్యంలోని రిపబ్లికన్ పార్టీ మాత్రమే దేశం మొత్తంలో ఉండేవి. గంపలగూడెం రాజా శ్రీ కోటగిరి గోపాలరావు సంరక్షణలో పెరిగి పెద్దవాడైన శ్రీ కోట పున్నయ్య విజయవాడలో చదివే రోజులలో విద్యార్థి నాయకుడు. శ్రీ కోటగిరి గోపాలరావు ఆంద్ర ప్రాంత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష స్థానంలో వుండటం శ్రీ పున్నయ్య రాజకీయాలలో అడుగు పెట్టాతానికి దోహదం చేసింది.
1957 ఖమ్మం అసెంబ్లీ ఎన్నికలలో శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా వుండి ఎన్నికల రథ సారధి తానే అయినారు. వారి స్వంత జీప్ నే ప్రచార రథం గా ఉపయోగించారు.
ఒకసారి వారి జీప్ ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులను తీసుకుని బాణాపురం, కమలాపురం రహదారి పై సాయంకాల సమయంలో వెళ్ళు చుండగా అక్కడి కమ్యూనిస్ట్ కార్యక్తలు జీప్ ను వెళ్ళనీయమని జీప్ కు అడ్డం తగిలి రోడ్ మీద పడుకున్నారు. పెండ్యాల సత్యనారాయణరావు గారు జీప్ స్టీరింగ్ వదలి జీప్ దిగి వాళ్ళ ఎదురుగా నిలుచుని "ఏమిరా మమ్మల్ని వేల్లానీయరా" అని బిగ్గరగా అనగానే "అయ్యా! మీరా?, మీరైతే వెళ్ళండి” అని ఆ కార్యకర్తలు దారి ఇచ్చిన సంఘటన మరువలేనిది. ఇంతకు ముందు వాళ్ళు అందరు ఆయన నాయకత్వం క్రింద వున్న వారే. ఆ గౌరవం వారికుంది. ఇలా నియోజక వర్గం లో చాలా చోట్ల జరిగాయి. ఆయన వ్యక్తిత్వమే, నాయకత్వ పటిమే శ్రీమతి తేళ్ళ లక్ష్మి కాంతమ్మ విజయానికి చేరువ చేసింది.
ఆనాటి నియోజక వర్గ పరిస్థితులను వివరిస్తూ శ్రీ కోట గురుమూర్తి తన అనుభవాలను ఏ వ్యాసకర్తతో పంచుకున్నారు. తాను అప్పుడు పదో తరగతి చదువు తున్నానని, పున్నయ్య గారికి ప్రచారంలో భాగం గా తను తన తోటి విద్యార్థులో కలసి సైకిల్ ర్యాలీతో గ్రామాలకు వెళ్లానని కొన్ని చోట్ల తమ వైరి వర్గం నుంచి ప్రతిఘటనలు వచ్చాయని, ఒకచోట తీసు కెళ్ళిన సైకిళ్ళ ను వదలి పారిపోయామని చెప్పారు.
ఖమ్మం అసెంబ్లీలో సాంకేతికంగా శ్ర్తిమతి తేళ్ళ లక్ష్మికాంతమ్మ నే MLA గా గెలుపొందినా శ్రీమతి లక్ష్మికాంతమ్మ రాజకీయాలకు, అందునా ఖమ్మం జిల్లాకు కొత్త కావటంతొ నియోజక వర్గం రాజకీయం, అభివృద్ది కార్యక్రమాలు అన్ని పెండ్యాల సత్యనారాయణరావు గారే పర్య వేక్షించేవారు.
1952 లో జరిగిన ఎన్నికలలో ఖమ్మం అసెంబ్లీలో ఓ.సి. స్థానంలో శ్రీ కర్నాటి కృష్ణయ్య, ఎస్.సి. స్థానంలో శ్రీ రెంటాల బాల గురుమూర్తి గెలుపొందారు.
1957 అసెంబ్లీ ఎన్నికలలో ఓ.సి. స్థానంలో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి లక్ష్మికాంతమ్మ గెలుపొందారు. ఎస్. సి స్థానంలో కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ నామవరపు పెద్దన్న గెలుపొందారు.
1962 లో నియోజక వర్గ పునర్విభజనలో భాగంగా ఖమ్మం అసెంబ్లీ నియోజకవరగాన్ని పాలేరు మరియు ఖమ్మం గా విభాజించటంతో పాలేరు SC Reserved seat గా రూపాంతరం జరిగింది. ఖమ్మం అసెంబ్లీ స్థానం O.C. లకు కేటాయించ బడినది.
పాలేరులో 1962-1972 సంవత్సరం వరకు జరిగిన ముడు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ కత్తుల శాంతయ్య వరుస విజయాలను సొంతం చేసుకున్నారు.
1962 లో ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గంలో శ్రీ నల్ల మల గిరిప్రసాద్ (28,394) Congress అభ్యర్థి శ్రీ పర్చా శ్రీనివాసరావు (16,732) పై గెలుపొందారు.
1967 లో సి.పి.యం. పార్టీ కి చెందిన శ్రీ మొహమ్మద్ రజబలి (30,344) కాంగ్రెస్ పార్టీ కి చెందిన శ్రీ శాకమురి సూర్య ప్రకాశరావు (20,820) పై గెలుపొందారు.
1972 లో సి.పి.ఐ కు చెందిన శ్రీ మొహమ్మద్ రజబలి (27,046) కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ కమాల్ ఖాన్ (25,299), సి.పి.యం కు చెందిన బోజేడ్ల వెంకట నారాయణ (11,364) ల పై గెలుపొందారు.
ఖమ్మం జిల్లాలో రాజకీయ పునరేకీకరణల సమరం శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు V/S శ్రీ పెండ్యాల సత్యనారాయణరావుగా జరిగింది.
ఆ విభేదాలు ఎలా వుండేవంటే ఒకటే ఉదాహరణ. నేలకొండపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది. అందులో జిల్లా నాయకులంతా వచ్చారు. అప్పటి పాలేరు సమితి అధ్యక్షులు సమావేశానికి అధ్యక్షత వహించారు. శ్రీ పెండ్యాల సత్యనారాయణరావుకు ఆహ్వానం లేదు. ఆ సమావేశానికి అప్పటి రాష్ట్ర హోం శాఖా మంత్రి శ్రీ మందుముల నరసింహారావు వచ్చారు.
సమావేశం ప్రారంభించే ముందు సమావేశానికి వచ్చిన పరిసర గ్రామాల ప్రజలలో కొందరు పెండ్యాల సత్యనారాయణరావు గారు సమావేశానికి రాకుంటే మేము ఈ సమావేశం జరుగనీయమని గొడవ చేశారు. ఈ రోజుల్లో అవుతే ఆక్కడున్న హోం మంత్రి SP ని పిలిచి వాళ్ళందరిని అర్రేస్ట్ చేసి సమావేశం జరుపుకొనే వారు. కానీ అలా జరుగలేదు. విషయం అర్ధమైన రాష్ట్ర హోం మినిస్టర్ శ్రీ మందుముల నరసింహారావు స్వీయంగా శ్రీ పెండ్యాల ఇంటికి వెళ్లి శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు ను సమావేశానికి తీసుకుని వెళ్లారు. నైజాం పై జరిగిన ఉద్యమాల రోజులలో శ్రీ మందుముల నరసింగరావు ఆంద్ర మహాసభలో రాష్ట్ర నాయకులు. నిజామాబాద్ లోని ఇందుర్తిలో జరిగిన 6 వ ఆంద్ర మహాసభ కు అధ్యక్షులు. శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు ఉద్యమాల చరిత్ర ఆయనకు తెలుసు. ఎవ్వరిని ఎలా గౌరవించాలో తెలుసు.
ఖమ్మం జిల్లా ఏర్పడిన తరువాత రహదారుల నిర్మాణం, డొంకల సర్దుబాటు కార్యక్రమాల నేపధ్యంలో నేలకొండపల్లి నుండి తిరుమలాపురం ద్వారా బోడులబండ కు అటునుండి కూసుమంచికి ప్రభుత్వం తరఫున వచ్చిన రహదారి నిర్మాణ ప్రతిపాదించిన మార్గాన్ని ప్రజలు వ్యతిరేకించారు. బోడులబండ పట్వారి గారి సూచన మేరకు శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు ఆ ప్రతిపాదనను ప్రభుత్వ ప్రతిపాదనలలో చేర్చారు.
ఆ ప్రతిపాదనను మార్చమని ప్రజల విజ్ఞప్తులను ప్రభుత్వం పెడచెవిన పెట్టటంతో అక్కడి ప్రజల కోరిక మేరకు ఖమ్మం మరియు నేలకొండపల్లి విద్యార్థుల శ్రమదానంతో, సమీప గ్రామ యువకుల సహకారంతో శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు రహదారి నిర్మాణం గావించారు. ఆ శ్రమదానం కార్యక్రమం 30 రోజులపాటు జరిగింది. ఆ రోజులలో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు కు ప్రభుత్వ వర్గాలలో పలుకుబడి తిరుగు లేనిదీ.
జిల్లాలో రాజకీయ పునరేకీకరణల ఘట్టం 1956 లో శ్రీ నీలం సంజీవరెడ్డి దూతగా శ్రీ కళా వెంకట్రావు రంగ ప్రవేశం మరియు ప్రమేయంతో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపిక ముందుకు కదిలి, 1958 FEB లో జరిగిన జిల్లా పంచాయత్ రాజ్ కాన్ఫరెన్స్ తో ఒక స్వరూపాన్ని సంతరించుకుంది. 1957 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖమ్మం మరియు మధిర లలో జరిగిన ఎన్నికల సభలలో శ్రీ నీలం సంజీవరెడ్డి పాల్గొని జిల్లా నాయకులతో ప్రత్యక్ష సంబంధాల ఏర్పరచుకొన్నారు.
1958 లో పాలేరు బ్లాక్ Development committee vice president గా వున్న శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు అదే సంవత్సరంలో జిల్లా సర్పంచ్ ల సంఘాన్ని స్థాపించి దానికి అధ్యక్షులు గా ఎన్నికయ్యారు. జిల్లా సర్పంచ్ ల సంఘం ఆధ్వర్యంలో జిల్లా పంచయత్ రాజ్ కాన్ఫరెన్స్ ను ఖమ్మంలోని వర్తక సంఘభవనంలో 1958, FEBRUARY 8 న నిర్వహించారు. ఆ సమావేశం లో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర పంచాయత్ రాజ శాఖా మాత్యులు శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర PCC PRESIDENT శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు, శ్రీ జలగం వెంగళరావు, శ్రీ శీలం సిద్దారెడ్డి పాల్గొన్నారు.
శ్రీ జలగం వెంగళరావు అప్పుడే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినారు. స్థానిక సంస్థల నియోజక వర్గం నుండి MLC గా శ్రీ శీలం సిద్దారెడ్డిని నిర్ణయం చేశారు. ఆయన MLC గా విజయం సాధించారు. ముందు జరుగబోయే ఖమ్మం జిల్లా పరిషద్ ఎన్నికలకు ఒక ప్రణాళికను అప్పుడే సిద్దం చేశారు. ఆ ప్రణాళికను అనుసరించే శ్రీ జలగం వెంగళరావు జిల్లాలో ప్రప్రధమ జిల్లా జిల్లా పరిషద్ అధ్యక్షుడు అయినారు.
పాలేరు పంచాయత్ సమితి ఎన్నికలు.
1959 సంవత్సరం ఖమ్మం జిల్లాలో కీలక మైనది. అప్పుడే జిల్లాలో పంచాయత్ సమితి, జిల్లా పరిషద్ ఎన్నికల నగారా మ్రోగింది. కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావుగారి వర్గం కమ్యునిస్ట్ పార్టీ తో కలిసి పోయింది. అధికార కాంగ్రెస్ పార్టీ పాలేరు లో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారి సారధ్యంలో ఒంటరిగా సమరం సాగించింది.
పాలేరు పంచాయత్ సమితి ఎన్నికలలో తన పిన్నిగారి కుమారుడైన శ్రీ రావులపాటి సత్యనారాయణరావు ను శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు రంగంలోకి దింపారు. శ్రీ రావులపాటి తన స్వగ్రామంలో గ్రామ పంచాయత్ సర్పంచ్ గా కమ్యునిస్ట్ పార్టీ కి చెందిన శ్రీ యనమద్ది వెంకయ్య విజయానికి సాయం చేసి యున్నారు. ఆ రుణాన్ని శ్రీ యనమద్ది వెంకయ్య సమితి ఎన్నికలలో శ్రీ రావులపాటి సత్యనారాయరావుకు సహకారాన్ని అందించటం వల్ల తీర్చుకున్నారు.
ఆ నాటి పాలేరు సమితి ఎన్నికలలో భందుత్వాలు పనిచేయలేదు. కాంగ్రెస్ తరపున సమితి ప్రెసిడెంట్ పదవికి పోటిచేసిన శ్రీ ఎల్లంపల్లి రామచంద్రయ్య శ్రీ యనమద్ది వెంకయ్యకు మామ అయినా శ్రీ యనమద్ది వెంకయ్య ఆయనకు ఓటు వెయ్యలేదు. శ్రీ రావులపాటి సత్యనారాయణరావుకు వల్లభి సర్పంచ్ శ్రీ ఐతరాజు రామారావు బంధువు అయినా శ్రీ రావులపాటి సత్యనారాయణరావుకు ఆయన ఓటు వేయలేదు. శ్రీ ఎల్లంపల్లి రామచంద్రయ్య, శ్రీ దండా పుల్లయ్యలు మాజీ కమ్యునిస్ట్ లు. శ్రీ పెండ్యాల సత్యనారాయణరావుతో పాటు కమ్యునిస్ట్ పార్టీలో పనిచేశారు.
ఈ ఎన్నికలలో ప్రత్యేకత ఏమిటంటే సమితి ప్రెసిడెంట్ గా ఎన్నికైన శ్రీ రావులపాటి సత్యనారాయణరావు (ముదిగొండ) మరియు వైస్ ప్రేసిడెంట్ గా ఎన్నికైన శ్రీ కర్నాటి కృష్ణయ్య (కొత్త కొత్తూరు) గాని సర్పంచ్ లు కాదు. కో-ఆప్షన్ మెంబెర్స్. బొమ్మకంటి వర్గం మరియు కమ్యునిస్ట్ లు కలసి పోటిచేసిన ఆ వర్గం కేవలం ఒక్క ఓటు తేడాతోనే గెలిచారు.
పాలేరు సమితి లాగానే బొమ్మకంటి వర్గం మరియు కమ్యునిస్ట్ పార్టీ వారు ఖమ్మం సమితిలో కుడా కలిసే పోటి చేశారు. అక్కడ కమ్యునిస్ట్ పార్టీకి సమితి అధ్యక్ష పదవి మరియు ఉపాధ్యక్ష పదవి బొమ్మకంటి వర్గానికి ఇచ్చారు. సమితి ప్రెసిడెంట్ గా కమ్యునిస్ట్ పార్టీకి చెందిన శ్రీ బోజేడ్ల వెంకట నారాయణ(రామన్నపేట) మరియు వైస్ ప్రెసిడెంట్ గా శ్రీ పోట్ల వెంకటయ్య(కొక్కిరేణి) అయినారు. ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన అభ్యర్థు లిద్దరూ సొంత బావ బావ మరుదులు కావటం విశేషం.
ప్రప్రధమ ఖమ్మం జిల్లా పరిషద్ ఎన్నికలు.
1959 లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వున్న రెండు వర్గాలు జిల్లా పరిషద్ పీటం దక్కించు కోవటానికి తమ శక్తి యుక్తుల నన్నిటిని ధారపోసినవి. పాలేరు మరియు ఖమ్మం పంచాయతి సమితుల ఎన్నికలు జిల్లాలోని వర్గ రాజకీయ ముఖ చిత్రాన్ని ప్రతిబింబిస్తాయి. ఇదే తరహా రాజకీయాన్ని జిల్లా పరిషద్ ఎన్నికలలో ప్రయోగించారు. ఆ సమయంలో ప్రక్కనున్న నల్గొండ జిల్లాలో కమ్మ్యునిస్ట్ పార్టీ ఆ జిల్లా పరిషద్ ను చేజిక్కించు కొంది.
ఖమ్మం జిల్లా పరిషద్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా జరిగింది. బొమ్మకంటి వర్గం మరియు కమ్యునిస్ట్లు కలిసి ఏ సూత్రం ప్రకారం CO-OPTION MEMBERS ఎన్నికతో పాలేరు పంచాయత్ సమితిని సాధించుకొన్నారో ఆ సూత్రాన్నే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అనుసరించింది. పొరుగు జిల్లాలకు చెందిన M.P మరియు MLA లు ఆరుగురిని ఖమ్మం జిల్లా పరిషద్ లో ఓటు హక్కును కలిపించి సభ్యులుగా చేశారు. ఆ మెంబెర్స్ ఓటు హక్కుతో శ్రీ జలగం వెంగళరావు ను CO-OPTION MEMBER గా గెలిపించి చైర్మన్ గా ఎన్నిక చేశారు. ఆ నాటి నుండి జిల్లా రాజకీయ ముఖ చిత్రం సంపూర్ణంగా మారిపోయింది.
వేమ్సూర్ నుంచి శ్రీ జలగం వెంగళరావు, మధిర నుండి శ్రీ శీలం సిద్దారెడ్డి, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుండి శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు, శ్రీమతి తేల్ల లక్ష్మికాంతమ్మ, కోట పున్నయ్య, హీరాలాల్ మోరియా, ఒక ట్రూప్ గా జిల్లా కాంగ్రెస్ పార్టీ నిర్వహణా కార్యకలాపాల కోసం, జిల్లా అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికా అమలుకోసం రాష్ట్ర స్థాయి అధికార, అనధికారుల కలిసేందుకు అందరు కలసి చాలా కాలం తిరిగేవారు. ఒకే మాట, ఒకే బాట గా వుండేవారు.
1958 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఖమ్మం వర్తక సంఘ భవనంలో జరిగిన జిల్లా పంచయత్రాజ్ కాన్ఫరెన్స్ ఫోటో ఇది. ఈ సమావేశానికి రాష్ట్ర పంచాయత్ రాజ్ మంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి వచ్చారు. చిత్రంలో మాట్లాడుతున్న వారు ఖమ్మం జిల్లా సర్పంచ్ ల సంఘం ప్రెసిడెంట్ శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు. ముందు వరుసలో ఎడమ నుండి కుడికి వరుసగా ఖమ్మం మునిసిపల్ చైర్మన్ శ్రీ చిర్రావురి లక్ష్మినరసయ్య, శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ జలగం వెంగళరావు, మధిర MLA శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీశ్రీ శీలం సిద్దారెడ్డి వున్నారు. వెనుక వరుసలో కుడి నుండి ఎడమకు వరుసగా ఖమ్మం MLA శ్రీమతి లక్ష్మి కాంతమ్మ, శ్రీ కోట పున్నయ్య, ఖమ్మం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ గెల్లా కేశవరావు వున్నారు.
శ్రీ జలగం వెంగళరావు, శ్రీ శీలం సిద్దారెడ్డి తరువాత ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు శ్రీ లక్కినేని నరసయ్య చేతికి వచ్చాయి.
ఇంతలో కాలంలో మార్పులు. మనస్తత్వాల్లో మార్పులు. చల్లగా సాగుతున్న కాంగ్రెస్ ఉమ్మడి కుటుంబంలోకి ఎవ్వరో ప్రవేశించారు. ఏవో—ఏవేవో—విబేధాలు. నాయకుల మధ్యన దూరం పెరిగింది.
ఫలితాలేమిటో.. తదుపరి వ్యాసంలో.
.....PENDYALA VASUDEVARAO.
<!-- Google tag (gtag.js) -->
<script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script>
<script>
window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());
gtag('config', 'G-1M93C8YK91');
</script>
Comments