72. (NKP..15). ). నా సాహిత్య జ్ఞాపకాలు.
సాహిత్య జ్ఞాపకాలు.
ఏవేవో జ్ఞాపకాలు.
అవన్నీ నా సాహిత్య ప్రపంచానికి సంబంధించినవి.
ఎప్పుడు భావావేశం వస్తే అప్పుడే...
ఎక్కడవుంటే అక్కడే ...వెంటనే వచన కవితలు వ్రాసే వాడిని. వ్రాసిన తేదీ, సమయం కూడా అందులో వ్రాసేవాడిని.
అప్పుడు నా వయస్సు 17 సంవత్సరాలు.
అది 1972 వ సంవత్సరం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో "సిటీ కాలేజీ"లో బి.కాం చదువుతున్న రోజులు. ఒకరోజు ఏదో పనిబడి ప్రిన్సిపాల్ గారిని కలవటానికి వెళ్లి ఆయన రూమ్ ముందర ఉన్న బెంచీపై కూర్చున్నా. ఇంతలో ఒక భావావేశం వెన్ను తట్టింది. వెంటనే నా జేబులో ఉన్న పెన్ను వడివడిగా చేతులో ఉన్న నోట్ బుక్ లో ఉన్న తెల్ల కాగితం పైకి దూసుకెళ్లింది. భావం అక్షర రూపం దాల్చింది. దాని ఫలితమే.."నేను ఆశావాదిని...." అనే నా వచన కవిత.
కోటి ఆశలతో, రంగుల భవిష్యత్తు కలలతో వందల మైళ్ళ దూరంలో ఉన్న హైద్రాబాద్ మహానగరంలో అడుగిడిన ఆనంద క్షణాలు అవి. ఇంతలో ఒక విద్యార్థి వచ్చి నా ప్రక్కనే కూర్చుని నేను వ్రాసిన కవితను చదివి.." ఏమిటండీ మీ ఆనందం అంత ఉరక లేస్తోంది...ఈ సమాజాన్ని, ఈ పరిస్థితులను చూస్తుంటే మీకంత ఆశాజనకంగా కనిపిస్తోందా" అని చర్చ లేవదీశాడు. ఏవేవో చర్చించాము.
అతని పేరు శ్రీ ఎస్. వి. సత్యనారాయణ. మొన్నా మధ్య "తెలుగు విశ్వవిద్యాలం వైస్ ఛాన్సిలర్" గా వున్నాడు.
ఈ సంవత్సరం College మాగజైన్ కు కవిత ఎందుకు పంపకూడదు, పంపించండి అన్నాడు. పంపాను. సెలెక్ట్ అయింది.
ఆ కవిత వ్రాయటమూ ఓ అందమైన జ్ఞాపకం.
అది B. Com (తెలుగు) ఫస్ట్ ఇయర్ Econamics క్లాస్ రూమ్.మా లెక్చరర్ శ్రీ జయశంకర్(అటుతరువాత "ప్రొఫెసర్ జయశంకర్ సారు" గా సూపరిచితులు) ఒక ప్రక్క పాఠం చెబుతుండగానే నా చేతిలో ఉన్న పెన్ను ఎదురుగా బల్లపై వున్న నోటు పుస్తకములోని తెల్లకాగితంలో అక్షర ప్రవాహాన్ని పారించింది. ఒక ప్రక్కన జయశంకర్ గారిని గమనిస్తూ వచ్చిన భావావేశాన్ని అక్షరబద్దం చేయటంలో నిమగ్నమై ఉన్న నన్ను నా ప్రక్కనే ఉన్న నా సహవిద్యార్థి ఇంద్రారెడ్డి(అటు తరువాత "ఉమ్మడి AP హోమ్ మంత్రి" గా సుపరిచుతులు) మధ్య మధ్యలో మోచేత్తో నన్ను ఎలర్ట్ చేసేవాడు. అప్పుడు వ్రాసిన కవితే " బాపూ మరోసారి రావూ". ఇదే college మాగజైన్ కు పంపా. ఆ కవిత వ్రాయటానికి ఆ పీరియడ్ టైం పట్టింది. ఆ కవితను మాగజైన్ వ్యవహారాలు చూసే మా తెలుగు లెక్చరర్ శ్రీ రెడ్డి గారికి ఇచ్చాను. ఏమిటీ ఇది ఇంత పెద్దగా ఉంది. దీన్ని నువ్వే వ్రాశావా అని అడిగారు. "అమృతం కురిసిన రాత్రి" లో శ్రీ తిలక్ వ్రాసినంత పొడవుంది.
తరువాత మళ్లీ కలసిన శ్రీ ఎస్.వీ.ఎస్ సలహా మేరకు OU కాంపస్ లోని ఆర్ట్స్ కాలేజ్ లో యూనివర్సిటీ లెవల్లో జరిగే సెమినార్ కు మా "సిటీ కాలేజ్" ప్రతినిధిగా హాజరు ఐనాను. అదే నాజీవితాన్ని మలుపు తిప్పింది. ఎందరో పరిచయమయ్యారు. సర్వశ్రీ దువ్వూరి చక్రపాణి (IAS), CH. పాండురంగ మూర్తి(రిటైర్డ్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్, కపిల రామ్మోహన్ తదితరులు). వారి పరిచయం వల్లనే YMCA వక్తృత్వ సాహిత్య కళా సమితి కార్య క్రమాలలో చురుకుగా పాల్గొన్నాను.
Dr నాగినేని భాస్కర్ రావు పరిచయంతో "యువ భారతి" సాహిత్య కార్యక్రమాలలో లీనమయ్యే వాడిని. విశ్వనాథం గారితో పరిచయం ఎన్నో విషయాలను తెలుసుకోవటానికి దోహద పడింది.
"నేను ఆశావాదిని..."కవితను శ్రీ దాశరధి రంగాచార్యకు (ఆయన ఇంట్లో )చూపించాను. "సంతోష స్థంభాలు" అని నేను కవితలో వ్రాసిన పదం పై భాషా ప్రాతిపదికన అభ్యంతరం చెప్పారు. ఆశతో ఉండటం అవుసరమే..."అగ్గిలా" ఉండాలన్నారు.
అప్పటికప్పుడే..
"నేను అగ్గిని..
మండుతాను.. మండిస్తాను..
మండే మంటలతో వెలుగులు పండిస్తాను"...అని వ్రాశా..
<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>
Comments