56. (NKP-9). 1991-94 మధ్యన నా జీవన పోరాటం --రాజకీయ పరిణామాలు.

నా మూడవ టర్మ్ నేలకొండపల్లి సహకార గ్రామీణ బ్యాంకు ఎన్నికలు......అనంతర రాజకీయ పరిణామాలు.

1992 జనవరి నెలలో సహకార గ్రామీణ బ్యాంకు  ఎన్నికలోచ్చాయి. 1991 సంవత్సరం డిసెంబర్ నెల 25 వ తేదిన మా తండ్రి గారు మరణించారు. ఆయన మరణించిన నెలరోజులకు మొదటి మాసికం 23rd January నాడే నేలకొండపల్లి గ్రామీణ బ్యాంకు ఎన్నికలు జరిగాయి. మా తండ్రిగారి మరణంతో జరిపించవలసిన సాంప్రదాయ కార్యక్రమాలతోనే, పలుకరించ వచ్చినవారితో మాట్లాడటంతోనే నాకు సమయం సరిపోవటంతో ఎన్నికల నిర్వహణపై ఎక్కువ శ్రద్ధ చూపలేకపోయాను.

ఆయన మరణించటంతోనే నా రాజకీయ జీవితం అంతమొంధించటానికి మా వ్యతిరేకులంతా సమావేశమై వ్యూహం రచించారు.ఈ సమయం దాటితే మళ్ళీ నన్ను ఎదుర్కోవటం సాధ్యం కాదని వారి భావన. నాకు అత్యంత దగ్గరగావున్న వ్యక్తులు శ్రీ వాక కృష్ణ లాంటి వాళ్ళు నన్ను వదలి వెళ్లి పోయారు. వ్యతిరేక పానెల్ లో పోటిచేశారు. మాకులం వాడైన శ్రీ భగవాన్లు లాంటి వాళ్ళు వ్యతిరేకం చేశారు.

అయినా ఎన్నికలలో పోటీచేయటానికి వార్డ్ ల వారీగా పానెల్ తయ్యారు చేసి కదన రంగంలోకి దిగాము. ఎన్నికల రోజు రానే వచ్చింది. ఆ రోజు మా తండ్రి గారి మొదటి మాసికం కావటంతో సాయంకాలం దాకా నాకు ఆ కార్యక్రమమే సరిపోయింది. ఆ రోజు ఎన్నికల పోలింగ్ నిర్వహణను Poling Agents మరియు Contesting Candidates కే అప్పగించి  సాయంకాలం నేను కౌంటింగ్ ప్రదేశానికి వెళ్ళే సమయానికి అక్కడ పోలీస్ మోహరింపు అధికంగా కనిపించింది. ఫలితాలు ప్రకటించే సమయం ఆసన్నం అయింది.

ప్రశాంతంగా వున్న ఆ వాతావరణంలో పోలీసుల హడావిడి అధికంగా కనిపించింది. ఎన్నికల ఫలితాలు బహిర్గతం అయ్యే సమయంలో కనిపించిన జనాన్ని కనిపించినట్లు లాటీ ఛార్జ్ చేయటం మొదలెట్టారు. అలా పది మంది జనాలకు కాళ్ళు, చేతులు విరిగాయి. రక్తం వరదలై పారింది. దాన్ని చుసిన నేను సమీపంలో వున్న కూసుమంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ప్రభాకర్ ను ఇదేమిటని ప్రశ్నించాను. వాళ్ళు మా మీధ రాళ్ళు వేశారని చెప్పారు. అది అవాస్తవం.

ఆ ఎన్నికలు అంతకు ముందు జరిగిన విధానంలా ప్రెసిడెంట్ ఎన్నిక ప్రత్యక్ష పద్హతిలో జరుగక పరోక్ష పద్దతిలో  జరుపుతున్నారు.  మా పానెల్ నుండి 5 గురు డైరెక్టర్స్ గెలిచారు. తెలుగు దేశానికి రెండు, CPM కు రెండు.  CPI కు రెండు డైరెక్టర్స్ వచ్చాయి. నేను ఎన్నికల అధికారి దగ్గరకు వెళ్లి వార్డ్ కు గెలిచినట్లు ధ్రువ పత్రాన్ని తీసుకుని బయటకు వచ్చాను. అంతే. పోలీసులు నన్ను చుట్టు ముట్టి లాటీ ఛార్జ్ చేశారు. అరెస్ట్ చేస్తున్నామని చెప్పి పోలీస్ స్టేషన్ కు రమ్మన్నారు. కారణం అడిగితే చెప్పలేదు.

అక్కడున్న పోలీస్ వాళ్ళు, మరియు జనాలు వందల్లో వెంటరాగా స్టేషన్ కెళ్ళాను. నావెంట వస్తున్న పేరాల గాంధి లాంటి యువకులను వద్దని వారించినా వినలేదు. నా వెన్నంటే స్టేషన్ కు  వచ్చారు.

అప్పటికే ఊరంతా ఈవార్త దావానలంలా వ్యాపించింది. ఆసమయంలో జనాన్ని రెండు కిలోమీటర్స్ దాకా తరిమి కొట్టారు. అందులో పోలీసుల చేతులలో దెబ్బలు తిన్న జనాలందరూ  నేలకొండపల్లిలోని, అనాసాగరం గ్రామము లోని  B.C లు మరియు  S.C లే ఎక్కువగా వున్నారు. శ్రీ దెశబొయిన గడ్డయ్య లాంటి వయసు మళ్ళిన పెద్దలు వున్నారు.

విషయం తెలిసిన పత్రికా విలేఖరులు స్టేషన్ కు వచ్చి నన్ను కలిశారు. పోలీస్ స్టేషన్ లోనే విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి పోలీస్ వాళ్ళ అరాచకాన్ని వివరించాను. మరుసటి రోజు ఉదయం అన్ని దిన పత్రికలలో ఈ వార్త ప్రముఖంగా ప్రచురితము అయినది. ఏమనుకున్నారో ఏమో పోలీస్ అధికారులు  నన్ను, నా సమావేశాన్ని అడ్డగించలేదు. ఆ సమయంలో విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన స్థానిక మండల రెవిన్యూ అధికారి శ్రీ రాములు అక్కడనే వున్న కూసుమంచి C.I. of Police తో చర్చించటం జరిగింది. "ఒక వ్యక్తి కొసము ఇంత హంగామా జరుగుతుందా? ఇంత మంది జనాలు వస్తారా?" అనే C.I ప్రశ్నకు "అవును. వాళ్ళ కుటుంబ చరిత్ర అలాంటిదని"  MRO సమాధానం చెప్పటం జరిగింది. ఆ సమయంలో అక్కడనే వుండి సంఘటనను చూసిన శ్రీ వంగవీటి వెంకట సుబ్బయ్య "వాసుదేవరావు కు రాజకీయం గా మళ్ళీ ప్రాణం పోశారని" వ్యాఖ్యానించాడు.

విషయం తెలుసుకున్న ఖమ్మం పట్టణ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ కౌటూరు దుర్గాప్రసాద్ జోక్యంతో ఆ రోజు నేను స్టేషన్ నుండి బయటకు వచ్చాను. "రేపు ఉదయం ఒకసారి రమ్మని, ఇప్పుడు వెళ్ళండని" పోలీస్న స్టేషన్ హౌస్ ఆఫీసర్  పంపించారు. శ్రీ కౌటూరు దుర్గాప్రసాద్ శ్రీ జలగం ప్రసాదరావు కు కుడి భుజంగా ఉండేవాడు. జిల్లా కేంద్రంలో ఆయన తరఫున కార్యక్రమాలన్నీ ఈయనే చూసేవాడు.

మర్నాడు ఉదయం పోలీస్ అధికారులు చెప్పిన ప్రకారం పోలీస్ స్టేషన్ కు బయలు దేరాను. ఇంట్లోనుండి ఒక్కడినే బయలుదేరాను. నేను పోవటం చూసి బజారులో అరుగుల మీద, షాప్స్ ముందర, షాపు లలో వున్న మరియు ఇంటి ముందర వున్న జనాలందరు నన్నేమి ప్రశ్నించ కిండానే మౌనంగానే నన్ననుసరించారు. పోలీస్ స్టేషన్ entrance ముందర వెనక్కి తిరిగి చూసే సరికి సుమారుగా ఒక వెయ్యి మంది జనాలు నిలబడి వున్నారు. వారంతా క్రమశిక్షణగా ఒకే వరుసలో TRAFFIC కు ఇబ్బంది లేకుండా రోడ్ కు ఆవలి ప్రక్కన నిలబడ్డారు. అందులో అన్ని పార్టీల వారున్నారు. అన్ని కులాల వారున్నారు.

అప్పుడు నేలకొండపల్లి  స్టేషన్ లోనే వున్న ఖమ్మం DSP ఒక పది నిమిషాలలోనే "మిమ్ముల తరువాత పిలుస్తాం వెళ్ల"మని పంపించేశారు.

ఆ తరువాత 30 మంది మీద FIR ISSUE చేశారు, నేను ప్రధమ ముద్దాయిని.  సహకార ఎన్నికల సమయంలో విధులను నిర్వర్తిస్తున్న  KUSUMANCHI C.I OF POLICE ను కొట్టానని, విధులకు ఆటంక పరిచానని నా మీద అభియోగం. క్రింద మున్సిఫ్ కోర్ట్ లో నేను మినహా అందరి మీదా అభియోగాలు రుజువు కాలేదని కేసు ను కొట్టి వేశారు. అప్పీల్ లో అడిషనల్  జిల్లా కోర్ట్ లో నా మీద కేసు ను కొట్టి వేశారు.



ఇగ సహకార గ్రామీణ బ్యాంకు ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే ....
ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన సంస్కరణల ఫలితంగా అధ్యక్ష ఎన్నిక INDIRECT పద్ధతి కి మారటమే కాకుండా ప్రభుత్వం ఇద్దరు స్త్రీలను నామినేట్ చేయటం ప్రవేశ పెట్టింది. దొడ్డిదోవలో అధికారాన్ని హస్తగతం చేసుకోవటం దాని లక్ష్యం.

కాంగ్రెస్ ప్రభుత్వం NOMINATE  చేసిన యిద్దరు లేడీ డైరెక్టర్స్ ను పాలేరు MLA శ్రీ సంభాని చంద్రశేకర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మొహరించిన విపక్షానికి సపోర్ట్ గా యివ్వటం వలన ఆరెగూడెం గ్రామానికి చెందిన శ్రీ గుత్తా వెంకటేశ్వరరావు(TDP) PRESIDENT గా ఎన్నికయ్యాడు. నేను డైరెక్టర్ గా వున్నా ప్రెసిడెంట్ గా ఎన్నిక కాలేక పొయ్యాను. తనను MLA గా గెలిపించిన లోకల్ కాంగ్రెస్ కు శ్రీ సంభాని చంద్రశేఖర్  అలా వెన్ను పోటు పొడిచాడు.

కాల చక్రం గిర్రున మూడు సంవత్సరాలు తిరిగింది. రాజకీయంగా పెను మార్పులు కూడా చాలా జరిగినవి.

శ్రీ జలగం ప్రసాదరావుకు ఎవ్వరిని నమ్మేతత్వం లేనట్లు అనిపించింది. ఆయన వెంటనేవుండి రాజకీయంగా ఆయనకే పనిచేసినా నావ్యతిరేకులకే అధిక ప్రాధాన్యత నిచ్చాడు. సహకార ఎన్నికలలో నాకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళనే దగ్గరకు తీసి నన్ను రాజకీయంగా మైనస్ చేయటానికి ప్రయత్నించాడు. శ్రీ సంభానికి వ్యతిరేకంగా వాడుకోవటానికి మాత్రమే నన్ను ఉపయోగించుకున్నాడు.

ఆ సమయంలోనే ఒకసారి MLA సంభాని చంద్రశేకర్ కు వ్యతిరేకంగా AP CM శ్రీ నేదురుమల్లి జనార్ధనరెడ్డి వద్దకు ప్రజాభిప్రాయాన్ని వినిపించటానికి  శ్రీ జలగం ప్రసాదరావు సలహాతో హైదరాబాద్ వెళ్ళాము. ఖర్చు అంతా శ్రీ కూసుమంచి రంగారావు పెట్టుకున్నట్లుంది. హైదరాబాద్ చేరుకోగానే ప్రసాదరావు గారితో ఆయన వెంట శ్రీ జలగం వెంగళ రావు గారింటికి వెళ్ళాము   అక్కడి నుండి CM Camp office కు వెళ్లాలని ఆలోచన.

జలగం వెంగళ రావు గారు ఎవ్వరిని వ్యక్తిగతంగా కలువటానికి అవకాశము ఇవ్వలేదు. నాపేరు వ్రాసి ప్రత్య్హేకంగా నేను స్లిప్ పంపాను. వెంటనే నాకు  పిలుపు వచ్చింది. ఒక్కడినే వెళ్లాను. హాల్ లో వున్న థ్రెడ్ మిల్ ప్రక్కనే చైర్ లో కుర్చుని వున్నారు. నన్ను చూడగానే సాదరంగా ఆహ్వానించారు. మా తండ్రిగారు చనిపోయిన తరువాత నన్నదే చూడటం కాబట్టి కుటుంబ స్థితి గతుల విచారించారు. "సహకార ఎన్నికలలో చంద్రశేఖర్ కాంగ్రెస్ నామినేటెడ్ సభ్యులను మీకివ్వలేధట కదా?" అని అడిగారు. అవునని చెప్పాను. "అన్ని విపులంగా CM గారికి చెప్పండని నాతో అన్నారు. మీరే నాయకత్వం వహించాలి Representation కు అన్నారు. ఫలానా వారు చెబుతారని నేనంటే "లేదు, లేదు--మీరే నాయకత్వం వహించాలన్నారు. మా కుటుంబం పట్ల ఆయన కున్న అభిమానం అలాంటిది. 1975 సంవత్సరంలో కుడా మా తండ్రి గారితో కలిసి వెంగళరావు గారు AP CM గా వుండగా ఆయనను కలవటానికి వెళ్తే మానాయన గారు స్లిప్ పంపిన 5 నిమిషాలలోనే లోపలకు పిలిచారు. అక్కడ అప్పుడు ఆయన కోసం MINISTERS, MLAS, MPS మరియు స్టేట్ TOP OFFICIALS వేచియున్నారు.

జలగం ప్రసాద రావు గారికి ఆయన తండ్రి వెంగళరావు గారికి మా కుటుంబం పట్ల వున్నవైఖరిలో, గౌరవించడంలో  తేడాకు  నిదర్శనం ఆ సంఘటన.

శ్రీ జలగం ప్రసాదరావు వర్గం నుండి బయటకు వచ్చిన తరువాత గవర్నమెంట్ కాంగ్రెస్ అయి వున్నారాజకీయం గా నాది వంటరి పోరాటమే అయినది. నా వెంట వున్నది అంతా బలహీన వర్గాల వాళ్ళే. రాజకీయ పోరాటం చేయాలంటే జనబలం వుంది కాని,ఆర్ధిక బలం లేదు. ఆర్ధిక బలం లేక, సొంత పార్టీ అధికారంలో వున్నా ప్రభుత్వం అండ కూడాలేక వున్న జనాన్ని రక్షించుకో వటం ఎలానో తెలీక సతమతమై పోయాను.

ఇక్కడ ఒక విషయం ప్రస్తావించవలసి వుంది. నేలకొండపల్లి నూతన బస్ స్టాండ్  ప్రారంభోత్సవానికి స్థానిక MLA శ్రీ సంభాని చంద్రశేఖర్ ముహూర్తం నిర్ణయం చేశాడు. ప్రారంభ ఆహ్వాన పత్రికలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారి పేరు లేదు. మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు వ్రాసివుంది. తనకు రాజకీయ భిక్షను ప్రసాదించిన సత్యనారాయణ రావు గారిని అవమానించటం గానే దాన్ని భావించాము. శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారు అప్పుడు గ్రామ సర్పంచ్ గానే వున్నారు. దాంతో నేను సహకార ఎన్నికలకు ముందరే నేను లోకల్ పాలేరు MLA శ్రీ సంభాని చంద్ర శేఖర్ ఏకపక్ష నిర్ణయాలను విభేదించి ఆయనకు వ్యతిరేకంగా శ్రీ జలగం ప్రసాదరావు దగ్గరకు వెళ్ళటం జరిగింది. దానితో అసంతృప్తి గా వున్న శ్రీ చంద్రశేఖర్ దగ్గరకు అంతకు ముందే అప్పుడే తెలుగు దేశం పార్టీ నుంచి వచ్చిన కొందరు పొరుగు గ్రామాల నాయకులు, వచ్చిన అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొనుటకు పాచికలు విసిరారు. ఫలితమే నేలకొండపల్లి గ్రామంలో ఎన్నడు జరుగని ఈ సంఘటన కు  ఆస్కారం లభించింది.

నాకు వ్యతిరేకంగా చంద్రశేకర్ దగ్గర పాచికలు విసిరిన నాయకులకు నాకు మధ్యన కొంత కాలం క్రితం ఒక సంఘటన జరిగింది.

1984 సంవత్సరంలో నేలకొండపల్లి గ్రామంలోని మెజారిటీ జనాల దగ్గరనుండి అందరము శ్రీ నందమూరి తారక రామారావు నాయకత్వంలోని TDP పార్టీ లోకి వెళ్లాలని వత్తిడి వచ్చింది. దానికి మా తండ్రి గారినుండి వ్యతిరేకత రానందున ఆ ఆలోచన చేశాము. అప్పుడే పైనంపల్లి గ్రామానికి కి చెందిన శ్రీ నాగుబండి లక్ష్మి నారాయణ, ముజ్జిగూడెం గ్రామం నుండి శ్రీ వున్నం వెంకయ్య, అనాసాగారం గ్రామం నుండి శ్రీ జోగుపర్తి వీరభద్రయ్య, పాత కొత్తూరు నుండి శ్రీ రావెల్ల అచ్యుతరావు తదితరులు కుడా నాదగ్గరకు వచ్చి "తాము కుడా మీతో పాటు TDP లో చేరుతామని" నాతో చెప్పారు. శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారి ఆసీస్సులతోనే తాము TDP లోకి వెళుతున్నామని చెభితే తమ పెద్ద వాళ్ళు తమని తప్పు పట్టరని, కోపగించరని వారి ఉద్దేశ్యం. శ్రీ కరణం రామచంద్రరావు రాష్ట్రమంత్రి మరియు జిల్లా INCHARGE MINISTER  ప్రోగ్రాం నేలకొండపల్లిలో తాము ఏర్పాటు చేయాలని అన్ని సవ్యంగా జరుగుతే తామంధరము TDP లో చేరాలని నిర్ణఇంచుకోన్నాము. మంత్రిగారి సమావేశాన్ని జయప్రదం చేయమని  కరపత్రాన్ని CO-OPERATIVE రూరల్ బ్యాంకు ప్రెసిడెంట్ హోదాలో పంచిపెట్టాను.

అప్పటికి ఇంకా శ్రీ తుమ్మల నాగేశ్వరరావు జిల్లా నాయకత్వ హోదాలోకి రాలేదు. శ్రీ కోనేరు నాగేశ్వరరావు (కోత్తగూడెం MLA) జిల్లా నుండి రాష్ట్రమంత్రిగా వున్నారు. శ్రీ పెందుర్తి మధుసూదనరావు మరియు ఖమ్మంకు చెందిన జ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీ రామమోహనరావు ద్వారా శ్రీ కరణం రామచంద్రరావు, రాష్ట్ర మంత్రి గారి ప్రోగ్రాం శ్రీ భక్త రామదాసు మందిరంలో ఏర్పాటు చేశాము. ఆరోజు రానే వచ్చింది. అనాసాగారం నుండి జనం మేళ తాళాలతో వచ్చారు. మిగతా గ్రామాల జనాలు కూడా బాగానే హాజరు అయ్యారు.

నేను TDP అధికార పార్టీ లోకి వస్తే తమ రాజకీయ మనుగడకు ప్రమాదమని భావించిన మా వ్యతిరేకులంతా ఏకమయ్యారు. మంత్రిగారిని మా ప్రోగ్రాముకు  రాకుండా ఉండటానికి పావులు కదిపారు. సమావేశం ఫెయిల్ అవుతే మేం Defame కావాలని, అధికార పార్టీ ప్రవేశాన్ని అడ్డుకోవచ్చని వారి ప్రణాళిక. పోటి సమావేశాన్ని శ్రీ యీగా వెంకటేశ్వరరావు రైస్ మిల్ లో ఏర్పాటు చేసి కోధాడ వైపు నుంచి వస్తున్న మంత్రిగారిని ఆపి వాళ్ళు ఏర్పాటు చేసిన సమావేశానికి తీసుకెళ్ళి మా సమావేశాన్ని కాన్సిల్ చేయటానికి TDP జిల్లా పార్టీ పెద్దలపై వత్తిడి చేశారని తెలిసింది.

ఆసమావేశాన్ని TDP పార్టీ గ్రామ సమావేశమని పేరు పెట్టినా అక్కడ హంగామా అంత CPM మరియు దాని  మిత్ర పక్షాలదే ఎక్కువ హడావిడి గా వుంది. అప్పుడు నేలకొండపల్లి గ్రామ శాఖ శ్రీ P.D.KRISHNARAO సారధ్యంలో వుండేది. CPM తరఫున శ్రీ రాజపుత్ర నవరతన్ సింగ్, శ్రీ నూతక్కి గంగాధరరావుల సారధ్యం లో వుంది.

మంత్రి కరణం రామచంద్రరావు గారి కార్యక్రమం అక్కడ అయిపోయినదని తెలిసి, మా సమావేశానికి వస్తారా లేదాని తెలుసు కోవటానికి శ్రీ నాగుబండి లక్ష్మి నారాయణ , శ్రీ ఉన్నం వెంకయ్యలతో కలసి మిల్లు (మూల్పూరి) సుబ్బారావు గారి ఇంటికి వెళ్ళాను. మంత్రిగారి దర్శనం లభించలేదు. మంత్రి గారి కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీ పెందుర్తి మధుసూదనరావు మరియు శ్రీ జ్యోతి రామమోహనరావులు నిశ్యబ్ధంగా వుండిపోయారు. ఆ సమయంలో మా ప్రక్కనే వున్న సిద్ధిపేట MLA శ్రీ కల్వకుంట్ల చంద్రశేకరరావు మౌన ప్రేక్షకుడిగా ఉండిపోయాడు. ఆయన మంత్రి గారి కాన్వోయ్ లో వున్నాడు. అస్సలు సమావేశం సంగతి మంత్రి గారి దృష్టిలో వున్నదా, లేదా  అని అనుమానం వచ్చింది. నమ్మిన వారు వెన్నుపోటు పొడిచారని స్పష్టమైంది.

అందరం సమావేశ స్థలికి తిరిగి వచ్చాము. సమావేశం రద్దు అయినదని అనౌన్స్ చేయటమే కాకుండా TDP పార్టీ లోకి వెళ్ళే ఆలోచన కుడా విరమించామని వేదికపైననే ప్రకటించాను . ఆలోచన విరమించటం అనే మాటతో నా వెంట వున్న నాయకులు అసంతృప్తి చెందారు. తరువాత శ్రీ నాగుబండి లక్ష్మి నారాయణ నాయకత్వంలో  వాళ్ళు సొంత ప్రయత్నాలతో TDP పార్టీ లో చేరటం, ఫలితంగా వాళ్ల పెద్దలతో ఆయా గ్రామాల్లో విభేదాలు రావటం జరగటంతో నేను వారితో పాటు TDP పార్టీ లోకి  రాకపోవటం వల్లనే  అది జరిగిందని వాళ్ళు నా శత్రు వర్గంగా మారటం జరిగింది. వారే తరువాత శ్రీ సంభాని పంచన చేరి పై గంధరగోళన్ని సృష్టించినట్లు తెలిసింది. దీనితో శ్రీ జలగం ప్రసాదరావు కు విషయం అవగతమై వాళ్ళపై కన్నెర్ర చేయటం, వెంటనే వారు భయపడి జలగం వర్గంలో చేరి పోవటం జరిగాయి.

అలా నియోజక వర్గం లో కాంగ్రెస్ పార్టీ లో పరిణామాలు సంభవించాయి.

నేను రాజకీయాలలోకి వచ్చిన దగ్గరినుండి "నేనెంతో కాలం రాజకీయాలలో ఉండలేను, ఆర్ధిక పరిస్థితి అడ్డం వస్తుందని" నా దగ్గర వాళ్ళతో అంటుండే వాడిని. ఈమాట ప్రతి దశాబ్దం తరువాత వస్తూనే వుండేది. "నువ్వు మొదటి నుండి అదే మాట అంటున్నావు.బయటకు రావాలను కుంటున్న ప్రతీసారి ఏదో కార్యకర్తల సమస్యలతో వారిని విడిచి రాలేక ఆగిపోయ్యే వాడివి" అని ఒక మిత్రుడు T. విజయకుమార్ జ్ఞాపకం చేశాడు ఒకసారి. ఎన్నికలలో ఓట్ల కోసం  ధనం ఖర్చు పెట్టాలిసిన అవుసరం రాకపోవటం, వాళ్లకు నేను సేవ చేసే విషయంలో మా పలుకుబడి, కుటుంబ చరిత్ర ఉపయోగ పడటంతో ఆర్ధిక ఇబ్బందులు అడ్డం రాలేదు.

వాస్తవంగా మా తండ్రి గారు మరణించటానికి (25.12.1991) కొద్ది కాలం ముందుగా(22.11.1990)  నేను అడ్వొకేట్ గా నమోదై ఖమ్మం కోర్ట్ కు ప్రాక్టీసు కై వెళ్ళేవాడిని. నేలకొండపల్లి నుండి రోజు ఖమ్మం నుండి బస్సు లో వెళ్ళే వాడిని. బస్సు స్టాండ్ నుండి RICKSHAW లో కోర్ట్ కు వెళ్ళే వాడిని.  అప్పటికింకా ఖమ్మం రహదారుల పైన ఆటోలు తిరుగం మొదలు కాలేదు. RICKSHAW లో వెళుతుంటే మార్గ మధ్యంలో కొన్ని సార్లు న్యాయవాది శ్రీ పొట్ల మాధవరావు లాంటి వాళ్ళు  RICKSHAW ను ఆపి వాళ్ళ కారులో బలవంతంగా ఎక్కిన్చుకొనే వాళ్ళు.

రాను రాను ఆర్ధిక ఇబ్బందు ఎక్కువై , ఖమ్మం వెళ్ళటానికి బస్సు చార్జెస్ కుడా లేక కోర్ట్ కు వెళ్ళటం బంద్ చేశాను. కొంతమంది అడ్వకేట్ మిత్రులు "అడ్వకేట్ వృత్తి కంటే రాజకీయాలే బాగున్నావా" అని ప్రశ్నించే వారు. నవ్వి వురుకుండే వాడిని. నా ఆర్ధిక స్థితి గురించి చాలా మందికి లోతుగా తెలీదు. ఖమ్మంలో చాలా మంది మిత్రులు, సహా న్యాయవాదులు "పొలాలు కౌలుకు ఇచ్చారా " అని ప్రశ్నించేవారు. సమాధానం ఏమి చెప్పాలో తెలీక సతమత మయ్యేవాడిని. అడ్వకేట్ గా నమోదు కాకముందు కొందఱు మిత్రులు అనేవారు"వాసుదేవరావు ఏమిచేస్తున్నాడని అంటే ఏమిచెప్పాలో తెలియటం లేదనే "వారు. రాజకీయాలు వృత్తి కాదు. మరేమీ చెప్పాలో తెలీదు. తరువాత నేను అందరికి నేను అడ్వకేట్ ను అని చెప్పగలిగే పరిస్థితి వచ్చింది.

పై రాజకీయ సంఘటనల తరువాత తప్పనిసరిగా రాజకీయ ఒంటరి పోరాటమే చేయవలసి వచ్చింది. నన్ను నమ్ముకుని వున్న వ్యక్తులను వీడిపోలేక దశల వారీగా వారికి ధూరం కావాలని నిర్ణ యించాను.

దాని ఫలితమే మళ్ళి శ్రీ సంభాని చంద్రశేఖర్ కు దగ్గరైనట్లు నటించాను. ఫలితంగా ముఖ్య మైన కార్యకర్తలు నాకు దూరము అయ్యారు. సంభానికి నేను దగ్గరైనా అతను నాకు ఇచ్చిన గౌరవ మర్యాద లేమి లేకపోగా అవమానాలు కుడా జరిగాయి. ఎవ్వరి కారణం వల్ల నేను జలగంకు దురంగా జరిగానో వాళ్ళే మళ్ళీ శ్రీ సంభానికి  చేరువ అయినారు. శ్రీ నాగుబండి లక్ష్మినారాయణ & కో..  జలగంను వీడి సంభాని దగ్గరకు వచ్చారు. 1994 సంవత్సరంలో పాలేరు షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసి అదే సంవత్సరం లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ సంభాని చంద్రశేఖర్ కు వ్యతిరేకంగా పనిచేసినాము. నన్ను చూసి నియోజక వర్గంలో ముఖ్యులు చాలామంది అతనికి వ్యతిరేకంగా బహిరంగంగా వచ్చారు. CPM అభ్యర్ధి శ్రీ సండ్ర వెంకటవీరయ్య గెలుపుకు తోడ్పడ్డాము.

ఫలితంగా 1995 సంవత్సరంలో వచ్చిన గ్రామపంచాయత్ ఎన్నికలు మరియు సహకార ఎన్నికలలో ఇండిపెండెంట్ గానే పోటీ చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఇండిపెండెంట్ గా వుండి  పోవలసి వచ్చింది.

          -----పెండ్యాల వాసుదేవరావు.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>




Comments

Popular posts from this blog

82. (SOCIAL.55). ఖమ్మంకు ఆత్మాభిమానం లేదనుకున్నారా?

36.(SOCIAL-36) MUST RETHINK ABOUT VIP SYSTEM IN INDIA.

50. (ఖమ్మం చరిత్ర-2) ఉద్యమాల గుమ్మం విరాట్ రాయాంధ్ర గ్రంధాలయం.