52. (ఖమ్మం చరిత్ర-4) ఉద్యమాల గుమ్మం మా ఖమ్మం.

ఖమ్మం ఉద్యమాల గుమ్మం అంటారు. నేను పుట్టిన దగ్గరనుండి వింటున్న మాట.
ఏ ఉద్యమాల ఫలితంగా ఖమ్మం ఉద్యమాల గుమ్మం అయినది? ఆ ఉద్యమాలేమిటి?
అవి ఎప్పుడెప్పుడు ఏ విధంగా జరిగాయి? ఏమో!
చాలామంది కాంగ్రెస్ వీరాభిమానులకు, ఎర్ర చొక్కా కామ్రేడ్స్ కు కూడా తెలీదు? ఎందుకు?
చరిత్ర ఎవ్వరు చెప్పలేదు. వ్రాయలేదు. నల్లగొండ చరిత్ర చెబుతారు. ఆ జిల్లా నాయకుల పేర్లు చెబుతారు.
ఖమ్మం యాడికి పొయింది. నల్లగొండకే దగ్గులు చెప్పిన నేల ఖమ్మం నేల.
ఖమ్మం/వరంగల్ చరిత్ర పై కమ్ముకున్న మేఘాలు తొలగుతాయా?
చరిత్రలో దాగిన వాస్తవాలు వెలుగులోకి వస్తాయా?
“బాంచెన్ దొరా కాల్మొక్తా” రోజుల స్థానంలో “ఆ దొర ఏందిరో ...వాడి పీకుదేన్దిరో”...  అని నిలదీయగలిగిన స్థానానికి జనాలెలా మారగలిగారు? రెండు గ్లాసుల ఆచారం మారి "SCHEDULED CASTE" వాళ్ళు కొన్ని ప్రాంతాలలోనైనా జనజీవన స్రవంతిలో ఎలా కలువ గలిగారు?
మంత్ర దండాలేమి ఉద్యమ నాయకుల దగ్గర ఉండవుగా?  ఒక్క రోజులో మార్పు రాదుగా? దాని వెనుక వున్న కృషి ఏమిటి? ఎప్పుడెప్పుడు చేసారు? చేసింది ఎవ్వరు? వాళ్ళు పడ్డ కష్ట నస్టాలేమిటి?
నాదగ్గర అన్ని ప్రశ్నలే? నాకు తెలిసిన వాళ్ళెవరి దగ్గర జవాబులు సమగ్రంగా లేవు..
నాతో కొంధరంటున్నారు “అన్ని ప్రశ్నలేనా? నువ్వేమీ తెలిసిన విషయాలు చెప్పవా?” అని.
నిజమే. చెప్పొచ్చు. కానీ "నాకు తెలిసింది తక్కువేమో, ఎవ్వరైనా పూర్తి సమాచారం చేభుతారేమోనని ఆశ. ఆరోగ్యకర చర్చకు అవకాశం యివ్వాలని తపన".
చరిత్ర తెలియక పోవటం శాపం. చరిత్రను వక్రీకరించటం పాపం.
దురదృష్టవశాత్తు చరిత్ర ను వక్రీకరించే ప్రయత్నమూ జరిగింది.
నాకు తెలిసి ‘గ్రంధాలయోద్యమం‘ మొదట ప్రారంభమై జనాన్ని మేలుకొలుపు చేయటం జరిగింది. తరువాత “ఆంద్ర మహాసభ “ సమావేశాల నిర్వహణ, తరువాత “కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిన ఉద్యమాలు మరియు సాయుధ పోరు" ప్రముఖముగా చెప్పుకోవాలి.
అల్లాగే పాలేరు పట్టి రైతాంగ సమస్యల పరిష్కారం  కోసం 1938 సంవత్సరంలో స్థాపించిన “పాలేరు రైతు ప్రాజెక్ట్” సంస్థ చేసిన సేవలు మరువ లేనివి. ఆ సంస్థ శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారి ఆధ్వర్యంలోనే వుండేది. ఆ రోజుల్లో పాలేరు కాలువ నేలకొండపల్లి వరకే వుండేది. సరిగ్గా నీళ్ళు వచ్చేవి కాదు.కరువు వస్తే శిస్తు మాఫీకై ఆందోళన తప్ప మార్గం లేదు. ఆంధ్రా నుంచి వచ్చిన రైతుల బాధలు అనేక రకాలుగా ఉండేవి. ఆ సమస్యల విముక్తికై  ఆ రైతు ప్రాజెక్ట్ చేసిన ఆందోళనలు రాష్ట్రం దృష్టిని ఆకర్షించాయి.
'చాలాలి ఐలమ్మ". నేడు తెలంగాణా నీలాకాశంలో కనిపిస్తున్న విప్లవ తార.
ఆమె ఒక్కరోజులో బంధూకు తీసుకుని బజారుకు రాలేదండి. ఆమె వెనుక "సంగాపోల్ల" సాముహిక శక్తి వుంది. ఆ సంఘాలను ఏర్పరిచిన జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వముంది. ఆ పార్టీకి రాష్ట్ర నాయకత్వ ఆదేశాలున్నవి. ఖమ్మం మరియు నల్లగొండ జిల్లా నాయకులు, కార్యకర్తల మోహరింపు వుంది. పక్కా ప్రణాళిక వుంది.
తాజ్మహల్ నిర్మాణం గొప్పదే అవుతే ఆ నిర్మాణానికి రాళ్ళు ఎత్తిన కులీలెంత ముఖ్యమో నిర్మించాలనుకొన్న షాజహాన్ కుడా అంతే ముఖ్యము. శాజహానే లేకుంటే కులీలేమి చేస్తారు? నిర్మాణం ఎక్కడి నుంచి వస్తుంది?

1.గ్రంధాలయ ఉద్యమం ----విరాట్రాయాంధ్ర గ్రంధాలయం.
గ్రంధాలయోద్యమం పేరు చేభితే రాష్ట్ర నాయకత్వంలో శ్రీ మాడపాటి హనుమంత రావు, ఆదిరాజు వీరభద్ర రావు, సురవరం ప్రతాప రెడ్డి, కొత్వాలు వెంకట్రామిరెడ్డిల పేరు వినిపిస్తుంది. ఉమ్మడి వరంగల్లు జిల్లాలో నేలకొండపల్లీ, గోకినేపల్లీ, ఎల్లందు,ఖమ్మం, జమలాపురం మరియు హనుమకొండలలో వున్న గ్రంధాలయాలు ప్రముఖమైనవి. 
ఆ గ్రంధాలయాలలో నేలకొండపల్లి లోని శ్రీ విరాట్ రాయాంధ్ర గ్రంధాలయాన్ని ప్రముఖంగా చెప్పుకోవాలి. అక్కడ వెల్లివిరిసిన చైతన్యమే జిల్లా చరిత్రని మార్చివేసింది.
1912 సంవత్సరంలో ప్రారంభమైన ఆ గ్రంధాలయమును  1934 సంవత్సరంలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు దాన్ని పునరుద్ధరించి సామాన్య జనానికి అవుసరమైన సాహిత్యాన్ని అందించి జనాన్ని సమీకరించటం ద్వారా చైతన్యాన్ని తీసుకు వచ్చారు. సర్వశ్రీ పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వర రావు, తరిమెల నాగిరెడ్డి, కొండపల్లి సీతారామయ్యలతోపాటు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, జమలాపురం కేశవరావు, హయగ్రీవాచారి, కొమరగిరి నారాయణ రావు, ప్రజాకవులు దాశరధి, కాళోజి, వట్టికోట  ఆళ్వార్ స్వామి లాంటి వాళ్ళు వచ్చేవారు. ఒకసారి తరిమెల నాగిరెడ్డి నేలకొండపల్లి నుంచి కరీంనగర్ వెళ్ళుతూ మార్గమధ్యంలో అరెస్ట్ కాబడ్డాడు.

అక్కడ శ్రీ విరాట్ రాయాంధ్ర  గ్రంధాలయంలో జరిగిన రహస్య సమావేశాల ఫలితమే 1939 సంవత్సరంలో “నైజాం సంస్థానంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం”. ఇది చాలా కాలం అండర్ గ్రౌండ్ పార్టీ గానే వుండేది. ఒక స్త్రీ గర్భం దాల్చి బిడ్డను ప్రసవించాలంటే తొమ్మిది నేలాలు అనేది ప్రకృతి సహజం. అలాంటిది ఉద్యమాల పార్టీ పుట్టాలంటే ఎంత కాలం ఎంత శ్రమతో గ్రౌండ్ వర్క్ చేసివుండాలి? ఎంత పకడ్బందీ ప్లాన్ వేసివుండాలి. అన్ని నిర్భందాల నడుమ, రవాణా సౌకర్యాలు లేని రోజులలో జిల్లాలోని గ్రామాలన్నిటిని చుట్టి వచ్చి జనాన్ని సమీకరించి--మరొకవేపు బ్రిటిష్ ఇండియా పార్టీ పెద్దల లతో  సంప్రదింపులు చెస్తూ, పోరాటం నిర్మించటం ఎంతో కత్తి మీద సాము లాంటిది.
అప్పటి వరకు హైదరాబాద్ నగరానికి పరిమితమై ముఖ్దుం మొహియుద్దీన్ ఆధ్వర్యంలో “కామ్రేడ్స్ అసోసియేషన్” మాత్రమే వుండేది.
ప్రస్తుతం జనాలు చెబుతున్నట్లు కమ్యూనిస్ట్ పార్టీ “పాత సూర్యాపేట” లో పుట్టలేదు. ఖమ్మం నడిబొడ్డున పుట్టింది. ఖమ్మం నాయకులతోనే రాష్ట్ర పార్టీ ఏర్పాటై ఆ తరువాత విస్తరించింది. నైజాంలో జిల్లా పార్టీ ల ఏర్పాటు కుడా వుమ్మడి వరంగల్ జిల్లాతోనే మొదలయింది. ఖమ్మం ఉద్యమాల గుమ్మం అని అందుకే అన్నారు. ఖమ్మం ఖిల్లా ఉద్యమాల ఖిల్లా అన్నారు. నల్లగొండ ఉద్యమాల కొండ అనలేదు.
నిజాం రాష్ట్ర పార్టీ వ్యవస్థాపక జనరల్ సెక్రటరీగా శ్రీ పెరవల్లి వెంకటరమణయ్య వుండేవారు. మధిరలో SUBINSPECTOR OF POICE  గా వున్నఆయన ఆ పదవికి రాజీనామా చేసి రంగంలోకి వచ్చాడు.ఆయన శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారికి స్వయానా మేనల్లుడు మరియు బావమరిది. సత్యనారాయణ రావు గారి ప్రభావంతో ఆయన చేస్తున్న వుద్యోగం వదలి ఉద్యమంలోకి వచ్చాడు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు కమ్యూనిస్ట్ పార్టీ  వ్యవస్థాపక జనరల్ సెక్రటరీగా శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు వుండేవారు. ఉద్యమం రోజులలో ఖమ్మం తాలుకా కమ్యూనిస్ట్ కార్య కలాపాలకు నేలకొండపల్లి గ్రామమే కేంద్ర స్థానంగా వుండేది. ఖమ్మం తాలుక జెనరల్ సెక్రటరీ శ్రీ K.L.నరసింహరావు నేలకొండపల్లి లోనే వుండేవారు. కమ్యూనిస్ట్ పార్టీ పత్రికకు కుడా శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారు ఎడిటర్ గా  వుండేవారు. శ్రీ సర్వదేవభట్ల రామనాధం ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలు చూసేవాడు. వరంగల్ లో వుంటూ ఆజంజాహి మిల్లు కార్మికుల సంష్కేమం కోసం పాటుపడేవాడు. సింగరేణిలో కార్మికుల యూనియన్ స్థాపన -వారి సంక్షెమం కోసం ద్రుష్టి పెట్టేవారు. ఖమ్మం టౌన్ పార్టీ సెక్రటరీ గా శ్రీ చిర్రావూరి లక్ష్మి నరసయ్య వుండేవారు.
ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ తరఫున జరిగిన రైతు పక్ష ఉద్యమాల్లో 1944 సంవత్సరంలో జరిగిన “బండి పట్టాల ఉద్యమం” చెప్పుకోతగ్గది. అంతవరకు ప్రభుత్వం బండి పట్టాలు, ఇరుసులు కంట్రోల్ ధరలకే సఫరా చేసేవారు. అట్టి సరఫరాను అమాంతం ఆపటంతో ఉద్యమం అనివార్యం అయింది. నిజాం అధికారులు, పోలీసులు వాటిని వర్తకులను బెదిరించి వాటిని  బ్లాక్ లో అమ్మేవారు. ఖమ్మంలో జరిగిన ఆ ఉద్యమంలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారితోబాటు శ్రీ K. L. నరసింహారావు, శ్రీ గంగవరపు శ్రీనివాస రావు, శ్రీ బుగ్గవీటి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఉద్యమకారులపైన ప్రభుత్వం పెట్టిన కేసును వాదించటానికి స్థానిక న్యాయవాదులు ఎవ్వరు ముందుకురాలేదు. హైదరాబాద్ నుండి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ వచ్చి వాదించారు.
2. ఆంద్ర మహాసభ.
ఆంద్ర మహాసభ వేదికగా కాంగ్రెస్ మరియు కమ్యూనిస్ట్ నేతలంతా కలిసే పనిచేసేవారు. ఖమ్మం జిల్లా ఆంద్ర మహాసభ కు జమలాపురం  కేశవరావు గారు ప్రెసిడెంట్ గా, శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారు జెనరల్ సెక్రటరీ గా పనిచేశారు. పాలేరు పట్టి ఆంద్ర మహాసభలన్ని శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారి ఆధ్వర్యంలో జరిగాయి. మొట్ట మొదటి మహాసభ 1938 సంవత్సరంలో నేలకొండపల్లి లోనే జరిగింది. ఆ సమావేశానికి సర్వశ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు, పెరవెల్లి వెంకట రమణయ్య,  రావి నారాయణరెడ్డి, జమలాపురం కేశవరావు, హయగ్రీవాచారి, కాళోజి నారాయణ రావు, కొమరగిరి నారాయణ రావు తదితర నాయకులు  ఎన్ధరో వచ్చారు. ఆంద్ర మహాసభ సమావేశాలన్ని ఎక్కువగా రహస్యంగా UNDER గ్రౌండ్ గానే జరిగేవి.
1943 సంవత్సరంలో రెండవ పాలేరు పట్టి ఆంద్ర మహాసభ చెన్నారం గ్రామంలో జరిగింది. న్యాయవాది పోల్కంపల్లి వెంకటరామా రావు గారు ఆ సభకు అధ్యక్షత వహించారు. పెండ్యాల సత్యనారాయణ రావు గారి ఆధ్వ్యంలో జరిగిన ఆ సమావేశానికి పెరవెల్లి వెంకటరమణయ్య, సర్వదేవభట్ల రామనాథం, వట్టికొండ ఆళ్వార్  స్వామి మొదలైన వారు హాజరు అయినారు.  సభకు రైతు ప్రతినిధులను, ప్రజానీకాన్ని రాకుండా చేయడానికి ప్రభుత్వం ఎన్నో విఫల యత్నాలను చేసింది. రైతులకు ప్రభుత్వానికి మధ్యన ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఆ సమయంలో పాలేరు పట్టి ప్రాంతంలో కరవు వచ్చింది. శిస్తు మాఫీకి నాయకులు జిల్లా కల్లెక్టర్కు అర్జీలు ఇచ్చి వున్నారు. ఆ ఆంధ్ర మహాసభకు రైతులు హాజరు అవుతే శిస్తు మాఫీ చేయమని ప్రభుత్వం బెదిరించింది.అయినా జనం ఆగలేదు.సమావేశాన్ని జయప్రదం చేసారు.ఆ మహాసభ చేసిన డిమాండ్ వల్ల, వారి పోరాటం వల్ల రైతులకు ఆ సంవత్సరం శిస్తు మాఫీ జరిగింది. వరంగల్ జిల్లా కలెక్టర్ వారు రైతులకు సంభందించి ఆ రోజులలో మూడు వేల రూపాయల చిల్లర శిస్తు మాఫీ చేయటం జరిగింది.

ఆ సమావేశం జరుగుతున్న సమయంలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారి రెండవ కుమార్తె సుశీల అనారోగ్యంతో చనిపాయిందని కబురు వచ్చింది. అయినా ఆయన ధైర్యాన్ని కోలుపోకుండా సభను వీడి పోకుండా సభను నిర్వహింఛి జయప్రదం చేశారు. అనేక నిర్భందాల నడుమ జరుగుతున్న సమావేశం అది. ఆ సమయంలో సమావేశాన్ని వీడుతే సభ నిర్వహణ ఫలితం దక్కకుండా పోతుంది. కనుక “అమ్మాయి చనిపోయాక నేను వచ్చి చేసేది లేదు కాబట్టి కుటుంబీకులనే కార్యక్రమం చేయమని” వర్తమానం తెచ్చిన వ్యక్తికి చెప్పటం జరిగింది. తరువాత విషయం తెలిసిన సభికులు  ఆయన కార్య దీక్షతకు అచ్చెరువొందారు.
ఆసమయంలో పెండ్యాల సత్యనారాయణ రావు గారి భార్య శ్రీమతి అన్నపూర్నమ్మ గారు విజయవాడలో డాక్టర్ అచ్చమాంబ గారి ఆత్మరక్షనా శిభిరంలో శిక్షణ కోసమై వున్నారు. ఆ శిబిరంలోనే ఆ అమ్మాయి చనిపాయింది. శ్రీమతి అన్నపూర్ణమ్మ గారే ఆ అమ్మాయిని ఖమ్మం తీసుకుని వెళ్లి భందువుల సాయంతో కార్యక్రమం జరిపారు. బ్రిటిష్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆ శిక్షణా శిబిరం నడుస్తోంది. శ్రీమతి అన్నపూర్ణమ్మ గారితో పాటు చిర్రావూరి నరసయ్య గారి భార్య, సర్వదేవభట్ల రామనాధం గారి భార్య మరియు పెరవెల్లి రమణయ్య గారి భార్య కూడా ఆ శిబిరంలో శిక్షణ లో వున్నారు. చేస్తున్న పనిపై వారి అకుంఠీత కార్య దీక్ష అటువంటిది.
ఆంద్ర మహాసభల నిర్వహణా సమయంలోనే సాంప్రదాయ వ్యతిరేక/విప్లవాత్మక సంస్కరణల కార్యక్రమాల నిర్వహణలు కుడా జరిగినవి. నైజాం ప్రాంతంలో మొట్టమొదటి సారిగా రెండుగ్లాసుల విధానాన్ని నేలకొండపల్లి లో ప్రధమంగా పోయేటట్లు చేసారు. ఆ చర్యల ఫలితంగా శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారి కుటుంబాన్ని ఆయన కులం వెలివేసింది. ఆ ఇంట్లో సాంప్రదాయ కార్యక్రమాలకు ముజ్జిగూడెం, ఖమ్మంల నుంచి బ్రాహ్మిన్స్ వచ్చి కార్యక్రమాలు జరిపేవారు.

ఆ తరువాత 11 వ ఆంధ్రమహాసభలో ఉద్యమ కార్యాచరణ విషయంలో కాంగ్రెస్ మరియు కమ్యూనిస్ట్ పార్టీ వారికి విభేదాలు వచ్చాయి. ఆంద్ర  మహాసభ వేదిల పై వామపక్ష భావజాలాన్ని ఖమ్మం నాయకులే ప్రముఖంగా వినిపించేవారు. శ్రీ రావి  నారాయణరెడ్డి లాంటి వాళ్ళు మొదట మితవాదులుగా వుండి ఆ తరువాత వామపక్ష భావ జాలం వేపు మారారు.1945 సంవత్సరంలో మార్చ్ 25,26,27 తేదీలలో  ప్రధమంగా పూర్తి కమ్యునిస్ట్ ల వేదిక 12 ఆంద్ర మహాసభ ఖమ్మం ప్రక్కనే వున్న ఖానాపురం హవేలిలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో జరిగింది. ఆయన ఆహ్వాన సంఘం జనరల్ సెక్రటరీగా, జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఆ కార్యక్రమ భాద్యతల నిర్వర్తించారు. ఆ సమావేశానికి శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సమావేశానికి ఆ రోజుల్లోనే 40.000 వేల మంది ప్రజలు వచ్చారు. ఆ సమావేశంలో 13 వ ఆంద్ర మహాసభకు శ్రీ బద్దం ఎల్లారెడ్డిని ప్రెసిడెంట్ గా శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారిని వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. కాని అదే చివరి సమావేశము అయినది.ఆ సమావేశం తరువాత ఆంధ్ర మహాసభ కార్యకలాపాలు నిలిచి పోయాయి.
౩. సత్యాగ్రహం.
ఖమ్మం లో 1935 సంవత్సరంలో జరిగిన సత్యాగ్రహం సర్వశ్రీ మాడపాటి రామచంద్ర రావు, పెండ్యాల సత్యనారాయణ రావు,జమలాపురం కేశవరావు, పెరవెల్లి వెంకటరమణయ్య, సర్వదేవభట్ల రామనాధం, పండిట్ రుద్రదేవ్, నేదునూరి జగన్నాధం, పబ్బరాజు రంగారావు  మొదలైనవారు పాల్గొన్నారు.
1947 సంవత్సరంలో శ్రీ జమలాపురం కేశవ రావు గారి ఆధ్వర్యంలో మధిరలో జరిగిన కీలకమైన సత్యాగ్రహం ఉద్యమంలో సర్వశ్రీ హీరాలాల్ మోరియా, కొలిపాక కిషన్రావు, గెల్లా కేశవరావు తదితరులు పాల్గొన్నారు. ఆ సమయంలో జరిగిన లాఠీ చార్జీ లో జమలాపురం కేశవరావు గారు తీవ్రంగా గాయపడినారు. భవిష్యత్తులో అది ఆయన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీసింది. 1953 సంవత్సరంలో 45 సం.వయస్సు లోనే  ఆయన మరణిన్ చారు.
1942 లో వరంగల్ జిల్లా లోని గ్రామాలలో చాలాచోట్ల రాజకీయ పాటశాలలను, రాత్రి పాటశాలలను కమ్యూనిస్ట్ పార్టీ తరఫున శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు ఏర్పాటు చేసి జనాల సమీకరణ చేశారు.
స్థూలంగా ఇదీ మా ఖమ్మం/వరంగల్  జిల్లా చరిత్ర. ఇంకా అనేకం వెలుగు లోకే రాలేదు. అన్నీతెలుసుకొనే యత్నమే ఈ చిన్ని ప్రయత్నం. సమాజం ముందుకు రావటం. విషయాల వివరించటం.

ఈ క్రింది చిత్రం 29.09.1944 సంవత్సరంలో నేలకొండపల్లి గ్రామంలో అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ముందర గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కమ్యూనిస్ట్ నాయకులు మరియు కార్యకర్తలు.
చిత్రంలో సర్వశ్రీ పెరవెల్లి వెంకటరమణయ్య నైజాం రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీ, పెండ్యాల సత్యనారాయణ రావు వరంగల్ జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ మరియు ఆంద్ర మహాసభ జిల్లా జనరల్ సెక్రటరీ , రావి నారాయణ రెడ్డి రాష్ట్ర ఆంద్ర మహాసభ నాయకులు, బద్దం ఎల్లారెడ్డి ఆంద్ర మహాసభ నాయకులు, శ్రీ సర్వదేవభట్ల రామనాధం జిల్లా ట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రటరీ, K.L.నరసింహా రావు ఖమ్మం తాలూకా పార్టీ జనరల్ సెక్రటరీ, రావెళ్ళ జానకిరామయ్య ఆంద్ర మహాసభ ఖమ్మం తాలుకా జనరల్ సెక్రటరీ, చిర్రావూరి లక్ష్మి నరసయ్య ఖమ్మం టౌన్ సెక్రటరీ,  జిల్లా నాయకులు వట్టికొండ ఆళ్వార్ స్వామి, నేదునూరి   జగన్నాధం, మచ్చా వీరయ్య, సామినేని అచ్యుతయ్య, తమ్మినేని సుబ్బయ్య, గానగావరపు శ్రీనివాసరావు మొదలైన వారున్నారు. గ్రామస్తులు సర్వశ్రీ కర్నాటి కోటయ్య, కనమర్లపూడి వాసుదేవ్, మున్నంగి వెంకటేశ్వర్లు, కుమ్మరికుంట్ల నారాయణ, వడ్ల బ్రహ్మానందం, వెలగపూడి కృష్ణ మూర్తి  మొదలైన వారున్నారు. ముందర ఫోటో మధ్యలో నిలుచున్న పాప పెండ్యాల సుగుణ. సత్యనారాయణ రావు గారి పెద్ద కూతురు. కమ్యూనిస్ట్ పతాకాన్ని పట్టుకున్న వారు  కుడి వైపున శ్రీ తోట వెంకటరత్నం, ఎడన వైపున శ్రీ రాజపుత్ర  జాలం సింగ్. నేను గుర్తు పట్టగా మరియు నాకు తెలిసినవారు గుర్తుపట్ట గా  ఇంకా గుర్తుపట్టని ఎందరో ముఖ్యులు వున్నారు.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Comments

Popular posts from this blog

82. (SOCIAL.55). ఖమ్మంకు ఆత్మాభిమానం లేదనుకున్నారా?

78. (social...51). ఎవవరెవరో ఎక్కడినుండో వస్తారు..... ఆలోచించండి ప్రజలారా...

80. (SOCIAL--53) దేశంలో ప్రజా సేవ ఇంత Costly నా? ఎవ్వరికీ బాధ్యతలు లేవా?