75. (social 48). పాలేరు అసెంబ్లీ నియోజక వర్గం...నియోజకవర్గాల పునర్విభజన...రాజకీయాలు.
పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం... నియోజకవర్గాల పునర్విభజన... రాజకీయాలు.
ప్రధమంగా జరిగిన నియోజకవర్గాల పునర్విభజన 1962.
1962 సం. లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుండి విడదీసిన ప్రాంతాన్ని పాలేరు అసెంబ్లీ నియోజక వర్గంగా ఏర్పాటు చేశారు. అప్పుడు ఖమ్మం జిల్లా కాంగ్రెసు వర్గరాజకీయాల ఫలితంగా నిబంధనలకు భిన్నంగా వేంసూరు అసెంబ్లీ నియోజక వర్గానికి బదులుగా వాళ్ళ స్వలాభం కోసం పాలేరును ఎస్. సీ నియోజకవర్గంగా మార్చారు. అప్పటికింకా సర్వశ్రీ జలగం వెంగళరావు మరియు శీలం సిద్దారెడ్డిలు ఇరువురు జిల్లా నాయకత్వ హోదాలో లేరు.
అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ "రావు మరియు రెడ్డి "వర్గాలుగా చీలిపోయి వుంది. జిల్లాలో రావు వర్గముదే పైచేయిగా వుండేది. ఖమ్మం జిల్లాకు పార్టీలో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు ప్రాబల్యం ఎక్కువ.
వేంసూరు అసెంబ్లీ సీటు అప్పటి జిల్లా కాంగ్రెసు ముఖ్య నాయకుడు బొమ్మకంటి సత్యనారాయణ రావుకు అవుసరం. ఖమ్మం అసెంబ్లీ రాజకీయాలలో పట్టువున్న వ్యక్తి శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు. నియోజకవర్గ రాజకీయాలలో శ్రీ పెండ్యాల సత్యనారాయణరావును తప్పించి జిల్లాలో ఆయన ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయటం లక్ష్యంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు ఉపయోగించుకున్నారు. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని "ఎస్. సీ" కి కేటాయించటంలో తన పలుకుబడిని ఉపయోగించారు.
ఆ సమయంలో, పంచాయతీ సమితులు ఏర్పడనప్పుడు, పాలేరు బ్లాక్ కు బీ. డీ. ఓ (బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్) అధ్యక్షునిగా, శ్రీ పెండ్యాల ఉపాధ్యక్షుడుగా సేవలను అందించారు. పాలేరు ప్రాంత అభివృద్దిలో పెండ్యాల సత్యనారాయణరావు పాత్ర మారువలేనిది.
1957 సం.లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా శ్రీమతి తే ళ్ళ లక్ష్మీకాంతమ్మ గారిని అభ్యర్ధిగా నిర్ణయించటంలో గానీ, గెలిపించటంలో గానీ శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు ప్రతిభకు ఉలిక్కిపడిన అప్పటి కాంగ్రెసు జిల్లా నాయకత్వం ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుండి కొంత ప్రాంతాన్ని విడగొట్టి పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం అని నామకరణం చేసి షెడ్యూల్ కులాల (ఎస్. సీ) నియోజకవర్గంగా మార్చేశారు. ఆ సమయంలోనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కావటం వారికి వరంగా మారింది.
ఈ రాజకీయచర్యల పర్యవసానమే జిల్లా రాజకీయ పునరేకీకరణకై శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు శ్రీకారం చుట్టారు. ఫలితంగా కొత్తతరం రాజకీయ అరంగ్రేటం సర్వశ్రీ జలగం వెంగళరావు, శీలం సిద్దారెడ్డి రూపంలో అవతరించటానికి కారణం అయింది. నైజాంపోరాట సమయంలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు వరంగల్లు జిల్లా నాయకత్వంలో కీలక భూమికను పోషించటం, తద్వారా ఏర్పడిన పరిచయాలు ఈ రాజకీయ పునరేకీకరణలో విజయం సాధించటానికి దోహదపడింది.
ద్వితీయ నియోజక వర్గాల పునర్విభజన. 2004.
శ్రీమతి రేణుకా చౌదరి ఖమ్మం లోకసభా అభ్యర్ధిగా రంగప్రవేశం చేశాక శ్రీ వనమా వేంకటేశ్వరరావు ప్రెసిడెంటుగా ఏర్పడ్డ ఖమ్మం జిల్లా కాంగ్రెసు కమిటీకి నేను దశాబ్దం పైగా కార్యదర్శి బాధ్యతలు నిర్వహించటం జరిగింది. ఆ సమయంలోనే అసెంబ్లీ, లోకసభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం అయింది. ఎలెక్షన్ కమీషను ప్రతిపాదనల ప్రకారం ఖమ్మం లోకసభ, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాలు షెడ్యూల్ తెగలకు (ఎస్. టీ) రిజర్వు చేయటంతో రాష్ట్ర కాంగ్రెసు పార్టీ జిల్లా డీలిమిటేషన్ కమిటీని ఏర్పాటు చేసినది. ఖమ్మం జిల్లా డీలిమిటేషన్ కమిటీకి చైర్మనుగా నన్ను నియమించారు. అందులో సర్వశ్రీ అయితం సత్యం, చింతనిప్పు లాలయ్య, కోట గురుమూర్తి, కొత్తా సీతారాములు సభ్యులుగా నియమించబడ్డారు. జిల్లాలోని పది అసెంబ్లీ, లోకసభా నియోజకవర్గాల పునర్విభజనా ప్రతిపాదనల తయారీ బాధ్యత నా భుజస్కందయాలపై పడింది. ఈ కమిటీకి రాష్ట్ర స్థాయిలో కాంగ్రెసు సీనియర్ నాయకులు శ్రీ గాదె వెంకటరెడ్డి చైర్మనుగా వుండేవారు. జిల్లాలోని అన్నీవర్గాలతో, రాజకీయపార్టీలతో సుధీర్గ సంప్రదింపుల తరువాత, మూడు సంవత్సరాల నిరంతర కృషితో మూడు ప్రతిపాదనలను తయారు చేశాను. జాతీయ స్థాయిలో డీలిమిటేషన్ కమిటీ అధికారిక చైర్మనుగా వున్న రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జీ శ్రీ కులధీప్ సింగ్ గారితో డిల్లీలో రెండు సార్లు సమావేశమై నా ప్రపోజల్స్ ను వివరించి పరిశీలించేలా చేయగలిగాను. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో (అసెంబ్లీ మరియు లోకసభ) నేను చేసిన ప్రతిపాదనలే చివరకు ఆమోదించబడ్డాయి.
పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం పేరును నేలకొండపల్లి అసెంబ్లీ నియోజకవర్గంగా చేసిన మార్పు ప్రతిపాదన మాత్రం కొందరి అభ్యంతరంతో సఫలం కాలేదు. ఈ ప్రయత్నంలో నా విజయం ఏమిటంటే పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని జనరలు (ఓ. సీ) సీటుగా మార్చే ప్రక్రియలో సఫలీకృతుడిని అయ్యాను. గతంలో 1962 లో నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన తప్పును దశాబ్దాల తరువాత సరిదిద్దే అవకాశం నాకు దక్కింది.
జిల్లా కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా వున్న వనమా వేంకటేశ్వరరావు డీలిమిటేషన్ ప్రక్రియ అయిపోయేటంత వరకు ఆయన నన్ను నిద్ర పోనివ్వకుండా, డిల్లీ వెళ్ళినా నన్ను తన వెంటనే తీసుకు వెళ్ళేవారు. అక్కడ తరచుగా డీలిమిటేషన్ కమిటీ అధికారిక సభ్యులైన సర్వశ్రీ గాదె వెంకటరెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరియు మండలి బుద్దప్రసాదులతో సమావేశం అయ్యేవాళ్ళం. ఒకసారి గాదె వెంకటరెడ్డి గారు వనమా గారితో "వనమా! వాసుదేవరావు గారు లేకుంటే నువ్వు దిల్లీకి రావా? అని అడిగారు. శ్రీ వనమాకు కంగారు ఎక్కువ. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం తిరిగి ఓ.సీ కాకపోతే ఆయన తట్టుకోవటం కష్టమని భయపడ్డాము. దాంతో నేను ప్రొఫెషన్ కు ఎక్కువ డుమ్మా కొట్టవలసి వచ్చింది. ఎక్కువ సమయం ఈ వ్యవహారానికే వెచ్చించ వలసి వచ్చింది.
జిల్లాలో డీలిమిటేషన్ సమయంలో, సత్తుపల్లి అసెంబ్లీనియోజకవర్గం జనరలు స్థానంగా వుంచటమే ధ్యేయంగా సత్తుపల్లి సిట్టింగ్ ఏం. ఎల్. ఏ, శ్రీ జలగం వెంకటరావు కూడా డీలిమిటేషన్ ఫలితం అనుకూలంగా సాధించటానికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో నాయకుల కలుస్తూ చురుకుగా వ్యవహరించారు. డీలిమిటేషన్ ప్రక్రియ పర్యవసానంగా జిల్లాలో ముఖ్యనాయకుల రాజకీయ భవితవ్యం కొత్త పుంతలు తొక్కింది. స్థానచలనాలు జరిగి వారి రాజకీయజీవితాలపై ప్రభావాన్ని చూపాయి.
క్రింది చిత్రాలలో మొదటిది ఖమ్మం లో.. నెహ్రూ యువక కేంద్రంలో యువజన దినోత్సవ సమావేశములో శ్రీమతి రేణుకా చౌదరి గారితో. చిత్రంలో నెహ్రూ యువక కేంద్రం కో .. ఆర్డీనేటరు శ్రీ పీ. వైద్యనాధం మరియు ఆఫీసు సిబ్బందిని చూడవచ్చు.
రెండవ చిత్రం శ్రీమతి రేణుకాచౌదరి, వనమా వేంకటేశ్వరరావు, చింతనిప్పు లాలయ్య తదితరులతో నేలకొండపల్లిలో ... శ్రీ భక్త రామదాసు మందిరములో.
----పెండ్యాల వాసుదేవరావు.
<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>
<
Comments