66. (ఖమ్మం చరిత్ర--10).1960, 70, 80 దశకాలలో ఖమ్మం తాలుకా అధ్యాయం.
ఖమ్మం జిల్లా చరిత్రలో 1960, 70, 80 దశకాలలో ఖమ్మం తాలుకా అధ్యాయం.
ఖమ్మం ఉద్యమాల పురిటి గడ్డ ఒకనాడు. రాజకీయపు ఎత్తులు జిత్తులతో, రక్తంతో తడిసిన నేల కొన్నినాళ్ళు. ఆనాడు, ఆతరువాతా మధిర, ఖమ్మం, ఎల్లందు తాలూకాలలో జరిగిన రాజకీయ మార్పులు, యుద్ధాలే ఖమ్మం చరిత్రలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి.
ఎల్లందులో సి.పి.ఏం,
సి.పి.ఐ మరియు ఎం.ఎల్ పార్టీల మధ్యన,
ఖమ్మం నియోజకవర్గ పరిధి ప్రాంతంలో
సి.పి.యం, సి.పి.ఐ మధ్యన ముఖాముఖి పోరాటం మరియు పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ
పరిధి ప్రాంతంలో సి.పి.యం మరియు కాంగ్రెసుకు చెందిన జలగం వెంగళరావువర్గం మధ్యన
నడిచిన రాజకీయ పోరాటాలు ఖమ్మం రాజకీయ ముఖచిత్రంపై రక్తాన్నిచిమ్మాయి. భయోత్పాతాన్ని కలిగించాయి.
మధిర, వేమ్సూర్/సత్తుపల్లి నియోజకవర్గాలలో
ఆదినుండి కొనసాగుతున్న కాంగ్రెసుపార్టీలోని నాయకుల మధ్యన రాజకీయ ఆధిపత్యం కోసం
సాగిన అంతర్యుద్ధం జిల్లారాజకీయాలను శాసించాయి.
1964 నుండి 1970 దశకాలలో జరిగిన ఖమ్మం సమితి మరియు ఖమ్మం జిల్లాపరిషత్
ఎన్నికల నేపధ్యం...తాలుకా రాజకీయాలు.
ఖమ్మంతాలుకాలో జరిగినన్ని
కాంగ్రెసు అంతర్యుద్ధ పోరాటాల ప్రకంపనలు జిల్లాలో వేరేప్రాంతంలో చెప్పుకోదగ్గ
స్థాయిలో లేవు. వామపక్షాల యుద్దాలకు కూడా ఈ తాలుకానే కేంద్ర బిందువు.
ఖమ్మంజిల్లా కాంగ్రెసుపార్టీలో వెంగళరావు, సిద్దారెడ్డి వర్గాలు ఏర్పడక ముందు 1964 సంవత్సరంలో పాలేరు పంచాయతీసమితి ఖమ్మంసమితిలో
విలీనమైనప్పుడు ఖమ్మంసమితి అధ్యక్షుడుగా యువకుడైన శ్రీ సామినేని ఉపెంద్రయ్యను కాంగ్రెసువారు అందరు
కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీ కిలారు వెంకయ్యను ఉపాధ్యక్షుడిగా
ఎన్నుకున్నారు. వారు ఇరువురు 1964 నుండి 1970 వరకు పదవిలో వున్నారు. అప్పుడు 1960 నుండి 1965 వరకు జిల్లాకాంగ్రెసు అధ్యక్షునిగా శ్రీ శీలం సిద్దారెడ్డి
వున్నారు. శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు ఉపాధ్యక్షునిగా, శ్రీ హీరాలాల్ మోరియా
ప్రధాన కార్యదర్శిగా వున్నారు.
1959 నుండి 1964 వరకు ఖమ్మం జిల్లాపరిషత్ చైర్మనుగా వున్న శ్రీ జలగం
వెంగళరావు 1962-64 మధ్య కాలంలో రాష్ట్ర పంచాయతీచాంబరు అధ్యక్షుడిగా సేవలను
అందించారు. ఆ పదవే శ్రీ జలగం వెంగళరావుకు రాష్ట్రవ్యాప్త పరిచయాలను పెంచుకోవటానికి
దోహదపడింది. ఆ సమయంలోనే శ్రీ శీలం సిద్దారెడ్డి రాష్ట్ర కో-ఆపరేటివ్ యునియనుకు
సెక్రటరీగా సేవలను అందించారు.
క్రింది చిత్రంలో కుడివేపున కుర్చీలలో
కూర్చున్న మొదటివారు శ్రీ జలగం వెంగళరావు, రెండవ వారు శ్రీ దుగ్గినేని
వెంకయ్య, మూడవవారు శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు మరియు ప్రక్కన నాలుగవవారు శ్రీ
కోట పున్నయ్య. సమావేశంలో మాట్లాడుతున్న వ్యక్తి శ్రీ హీరాలాల్ మోరియా. ముందు
వరుసలో కుర్చిపై కూర్చున్న వ్యక్తి శ్రీ సామినేని ఉపెంద్రయ్య. ఈ కాంగ్రెస్ కార్యకర్తల
సమావేశం ఖమ్మం తాలూకా ముదిగొండ గ్రామంలో జరిగింది. యువకుడైన శ్రీ సామినేని
ఉపెంధ్రయ్యను ఖమ్మంసమితి అధ్యక్షునిగా చేసే చర్యలలో భాగం ఆ సమావేశం.
1967 సంవత్సరంలో జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ
స్థాయిలో ముఖ్యమైన కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలలో ముఖ్యమైన రాజకీయ పరిణామాలు
చోటు చేసుకొన్నాయి.
1967 లో రెండవసారి ఎం.ఎల్.ఏ గా గెలిచిన శ్రీ జలగం వెంగళరావుకు
కాకుండా ఎం.ఎల్.సి గా వున్న శ్రీ శీలం సిద్దారెడ్డిని రాష్ట్ర కాబినెటుమంత్రిగా
ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి తీసుకోవటంతొ రాజకీయంగా తన ఎదుగుదల కోసం
ఖమ్మంతాలుకా రాజకీయాలపై శ్రీ సామినేని ఉపెంద్రయ్య కేంద్రంగా ద్రుష్టి సారించాడు. శ్రీ
శీలం సిద్దారెడ్డి రాష్ట్రమంత్రిగా బాధ్యతల స్వీకరించాక ఆయనకు రాష్ట్ర స్థాయిలో
దొరుకుతున్న ఆదరణకు జిల్లాలో తనస్థానం సొంతంగా నిర్మించుకోవటమే తన ఉన్నతికి
తోడ్పడుతుందని శ్రీ జలగం వెంగళరావు భావించాడు. కాంగ్రేసుకు చెందిన శీలంసిద్దారెడ్డి వర్గనాయకులను టార్గెట్
చేయనారంభించాడు. ఈ సమయంలో పాతతరం నాయకుడు శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు
అనుయాయులలో ఖమ్మం ఏరియాలో కొద్ది మంది మినహా ఎక్కువశాతం శ్రీ శీలం సిద్దారెడ్డి
వర్గంలో విలీనమైనారు. ముఖ్యంగా కరణాలలో అందరు శీలం సిద్దారెడ్డి వర్గంలో కలసిపోయారు.
ఖమ్మంలో న్యాయవాద వృత్తిలో వున్న శ్రీ కౌటురి కృష్ణమూర్తి వంటి ఒకరిద్దరే
వెంగళరావు వెంట వున్నారు. మధిరలో శ్రీ బొమ్మకంటి అనుయాయులు దాదాపు అందరు వెంగళరావు
వర్గంలో కలసిపోయారు.
శ్రీ శీలం సిద్దారెడ్డి
తరువాత జిల్లా కాంగ్రెసుపార్టీ పగ్గాలు శ్రీ జలగం వెంగళరావు ప్రాంతానికి చెందిన
శ్రీ లక్కినేని నరసయ్యకు లభించాయి. అప్పుడు జిల్లాకాంగ్రెస్ ప్రధానకార్యదర్శిగా
సర్వశ్రీ పెండ్యాల సత్యనారాయణరావు, వీరవెల్లి నరసింహారావు, కోశాధికారిగా శ్రీ జలగం
కొండలరావు, ఉపాధ్యక్షునిగా శ్రీ కాసా నాగభూషణం వుండేవారు.
శ్రీ జలగం వెంగళరావు ఖమ్మంతాలుకా
రాజకీయాలపై ఆధిపత్యం సాధించే యోచనతో శ్రీ సామినేని ఉపెంద్రయ్యకు అత్యంత
ప్రాదాన్యమును పెంచే ప్రణాళికను రూపొందించారు. ఆ ప్రణాళికలో భాగంగానే 1967 ప్రాంతంలో శ్రీ సామినేని ఉపెంధ్రయ్యను జిల్లా కాంగ్రెస్
కార్యదర్శిగా నియమించటం జరిగింది. ఆ సమయంలో 1964-1970 వరకు శ్రీ జలగం వెంగళరావు సోదరుడు శ్రీ జలగం కొండలరావు ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మనుగా
వున్నారు.
తెలంగాణా సాయుధపోరాట సమయంలో
కమ్యునిస్టుపార్టీవల్ల, పోలీసుయాక్షన్ కంటే ముందు తన తండ్రి, యిద్దరు బాబాయిలను నష్టపోయిన
నేపధ్యం శ్రీ సామినేని ఉపెంద్రయ్యది. అప్పుడు మేడేపల్లిగ్రామంలో కాంగ్రెస్ సానుభూతిపరులు
ఐదుగురిని సాయుధ కమ్యునిస్టుదళంలోని వారు చంపారు. ప్రతీకారంకోసం, అదనుకోసం
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శ్రీ సామినేని ఉపెంద్రయ్యకు శ్రీ వెంగళరావు తాను రాష్ట్రమంత్రి
కావటానికి ముందు మరియు ఆ తరువాత యిచ్చిన చేయూత ఖమ్మంతాలుకా రాజకీయాలలో పెనుతుఫానును
రేపింది. రాజకీయ ప్రశాంతతను భగ్నం చేశింది. ఫలితంగా రక్తం ఏరులై పారింది.
1967 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే
అభ్యర్థుల ఎంపికలో ముందుచూపుతొ తనకు మంత్రిపదవి స్థానం సంపాదించే ప్రయత్నంలో జిల్లాలోని
స్థానాలలో తానుచెప్పిన అభ్యర్థులకే పార్టీ టికెట్స్ రావటానికి శ్రీ జలగం
వెంగళరావు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మధిర అసెంబ్లీ టికెట్టును శ్రీ దుగ్గినేని
వెంకయ్యకు, పాలేరులో శ్రీ కత్తుల శాంతయ్యకు రాకుండా ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు.
ఫలితంగా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గములో కాంగ్రెస్ రెబల్(తిరుగుబాటు) అభ్యర్థిగా చేరువుమాధవరం
గ్రామపంచాయతీలో గుమాస్తాగా పనిచేస్తున్న శ్రీ నందిగామ వెంకతరత్నంను శ్రీ జలగం
వెంగళరావు ఎన్నికలబరిలో నిలిపాడు. కానీ శ్రీ కత్తుల శాంతయ్యనే విజయం వరించింది.ఆయన
సి.పి.యం కు చెందిన శ్రీ సాలె సుందరయ్యపై ఎనిమిదివేల ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు. శ్రీ సామినేని ఉపెంద్రయ్య కాంగ్రెస్
రెబల్(తిరుగుబాటు)అభ్యర్థికి ఎన్నికలసారధిగా నిలిచారు. ఆ నాటి నుండి తానుమరణించేవరకు కూడా శ్రీ జలగం వెంగళరావు తనవర్గం మనిషికి ఆ నియోజకవర్గంలో స్థానం సంపాధించలేకపోవటం
గమనార్హం. శ్రీ కత్తుల శాంతయ్యకు టికెట్ రాకుండా చేసి తాను రాష్ట్రమంత్రి
కావాలనుకున్నాడు శ్రీ జలగం వెంగళరావు. శ్రీ కత్తుల శాంతయ్య గెలవటం వల్లనే శ్రీ
శీలం సిద్దారెడ్డి రాష్ట్ర మంత్రి కాగలిగాడు. 1967 అసెంబ్లీ ఎన్నికలలో కోత్తగూడెం నుండి శ్రీ పానుగంటి
పిచ్చయ్య, ఎల్లందు నుండి శ్రీ గోగినేని సత్యనారాయణ, బూర్గంపాడు నుండి శ్రీ కొమరం
రామయ్య, భద్రాచలం నుండి శ్రీ కారం కన్నయ్య, ఖమ్మం నుండి శ్రీ మొహమ్మద్ రజబలీ
గెలిచారు.
1967 లో శ్రీ శీలం సిద్దారెడ్డికి
మంత్రి పదవి రాకుండా లాబీయింగ్ చేయటమే కాకుండా పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్
అభ్యర్థిని ఓడించటానికి ప్రయత్నించిన దానికి కౌంటరుగా శ్రీ సామినేని ఉపెంద్రయ్యను ఖమ్మం
సమితి అధ్యక్షపదవి నుండి దింపే ప్రయత్నం శ్రీ శీలం సిద్దారెడ్డి వర్గం చేసింది.
శ్రీ శీలంసిద్దారెడ్డి వర్గం బాధ్య్తలన్నీ అప్పుడు ఖమ్మం పంచాయతీసమితి కో-ఆప్షన్
సభ్యునిగా వున్న శ్రీ పెండ్యాల
సత్యనారాయణరావు భుజస్కందాలపై పడింది. శ్రీ శీలం సిద్దారెడ్డివర్గం 1968 లో ముజ్జిగుడెం, చింతకాని సర్పంచులపై అవిశ్వాసతీర్మానాన్ని పెట్టి దించేశారు. తమకు అనుకూలమైన వారిని సర్పంచులుగా చేశారు. వెంగళరావు
వర్గం నుండి శ్రీ సామినేని ఉపెంద్రయ్య కూడా కొంతమంది సర్పంచులపై (గుబ్బగుర్తి,
తనికెళ్ళ మొదలైనవి) అవిశ్వాసంపెట్టి
దించేశారు.
కానీ శ్రీ మొహమ్మద్ రజబ్
ఆలీ నాయకత్వంలోని సి.పి.యం శ్రీ సామినేని ఉపెంద్రయ్యపై అవిశ్వాసం వీగిపోయేటట్లు సహకారాన్నంధించటంతో
శ్రీ సామినేని ఉపెంద్రయ్యపై అవిశ్వాసానికి సరిపోయిన మెజారిటీ లభించక తీర్మానం
వీగిపోయింది. ఆనాటి నుండి శ్రీ మొహమ్మద్ రజబ్ ఆలీ శ్రీ జలగం వెంగళరావు రాజకీయ
అనుచరుడిగా మారిపొయ్యాడు. శ్రీ జలగం వెంగళరావుతో కుదిరిన రాజకీయ అవగాహన మేరకు
సి.పి.యం ఖమ్మం పంచాయతీ సమితి అధ్యక్షునిగా శ్రీ సామినేని ఉపెంద్రయ్యపై అవిశ్వాసం నెగ్గకుండా
సహాయంచేసింది. అపుడు ఖమ్మం రెవిన్యూ
డివిజనల్ అధికారిగా వున్న శ్రీ దుర్గారెడ్డి అవిశ్వాస తీర్మానం సమావేశాన్ని
నిర్వహించారు.
ఖమ్మం తాలుకా రాజకీయాలపై
పట్టు సంపాదించేందుకు శ్రీ సామినేని ఉపెంద్రయ్యతొ పాటు శ్రీ మొహమ్మద్ రజబ్ ఆలీని
కూడా జతచేసుకున్నాడు శ్రీ జలగం వెంగళరావు. కాంగ్రెసువర్గ ఆధిపత్య పోరాటాల ఫలితంగా
ఖమ్మంఅసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రేసులోని రెండువర్గాలు చెరోవామపక్షాన్ని భుజాన
వేసుకుని కాంగ్రెసును ఎన్నికలరంగంలో సమాధి
చేశారు. వరుస విజయాలను కమ్యునిస్టులకే ధారాదత్తం చేశారు. 1957లో జరిగిన ఉమ్మడి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో శ్రీమతి
లక్ష్మికాంతమ్మ, ఆ తరువాత ఉమ్మడి ఖమ్మం అసెంబ్లీనియోజకవర్గం పాలేరు, ఖమ్మం
అసెంబ్లీ నియోజకవర్గాలుగా విడిపోయాక 1978 లో శ్రీ కీసర అనంతరెడ్డి మాత్రమే ఖమ్మంఅసెంబ్లీ
నియోజకవర్గం కాంగ్రెసుఅభ్యర్థులుగా గెలుపొందారు. ఆ రెండుఎన్నికలకు కూడా శ్రీ
పెండ్యాల సత్యనారాయణరావు చీఫ్ ఎలక్షన్ఏజెంటుగా వుండి ఎన్నికలసారధి కావటం గమనార్హం.
1962 నుండి పాలేరు అసెంబ్లీ
ఎన్నికల సారధిగా, చీఫ్ ఎలెక్షన్ ఏజంటుగా కూడా ఆయనే వున్నారు. కాంగ్రెస్ వరుస
విజయాలను సొంతం చేసుకుంది.
ఖమ్మం తాలుకాలో జరిగిన
కాంగ్రెసుపార్టీ అంతర్యుద్ధాల పోరాటాల
ప్రకంపనలలో ఖమ్మం జిల్లా కన్జుమర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ (సూపర్ బజార్)లో జరిగిన కాంగ్రేసు వర్గరాజకీయాల
చదరంగాపుటేత్తులు ఖమ్మం తాలుకా రాజకీయ
స్వరూపాన్ని మార్చేశాయి. 1967 నుండి 1973 వరకు రెండు టర్ములు ఖమ్మం జిల్లా కన్జుమర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ (సూపర్ బజార్) కి
శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు వ్యవస్థాపక అధ్యక్షులుగా వున్నారు. ఆజిల్లా స్థాయి
సహకారసంఘం నుండి శ్రీ పెండ్యాల సత్యనారాయణరావును దించేయత్నానికి శ్రీ సామినేని
ఉపెంద్రయ్యను శ్రీ జలగం వెంగళరావు ముందుంచాడు. రాజకీయ చదరంగపు పావులు
తీవ్రస్థాయిలో కదిపారు. కానీ వారి యత్నాలు ఫలించలేదు. 1973 ఆఖరులో జరుగవలసిన ఎన్నికలు కోర్టు జోక్యంవల్ల చాలాకాలం
వరకు ఆగిపోయాయి. ఆ సమయంలోనే జిల్లా సహకారకేంద్రబ్యాంకు అధ్యక్షులుగా వున్న శ్రీ
దుగ్గినేని వెంకయ్యపై కానీ, జిల్లా మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షులుగా వున్న శ్రీ
కీసర అనంతరెడ్డిపై కానీ వారు రాజకీయ ద్రుష్టి పెట్టలేదు.
క్రింద వున్న చిత్రం 1967లో జిల్లా కన్జుమర్స్ కో-ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్
(సూపర్ బజార్) ను ఆనాటి రాష్ట్ర సహకార శాఖామాత్యులు శ్రీ కోట్ల విజయభాస్కరరెడ్డి
ప్రారంభించినప్పటిది. ముందు వరుసలో వున్నవారు ఎడమవైపున శ్రీ కోట్ల
విజయభాస్కరరెడ్డి, మధ్యలో శ్రీ శీలం సిద్దారెడ్డి, కుడిప్రక్కన స్టోర్స్
ప్రెసిడెంట్ శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు, వెనుక వరుసలో కుడివైపున శ్రీ సామినేని
ఉపెంద్రయ్య, సిద్దారెడ్డిగారి వెనుక శ్రీ హీరాలాల్ మోరియా, శ్రీ కీసర అనంతరెడ్డి
వున్నారు.
అప్పుడే కొత్తగూడెంలో
బి.పి.ఆర్.ఓ గా ఉద్యోగబాధ్యతలలో వున్న శ్రీ చేకూరి కాశయ్యను రాజకీయాలలోకి రప్పించి
కొత్తగూడెంసమితి అధ్యక్షుడిగా ఎన్నిక చేయించాడు శ్రీ జలగం వెంగళరావు. కో ఆప్షనులో సభ్యుడుగా ఎన్నికైన శ్రీ
చేకూరి కాశయ్య సమితిఅధ్యక్షుడు అయినాడు. వివిధకారణాలవల్ల ఎన్నికలలో పోటీచేయని ముఖ్య పార్టీనాయకులను కో-ఆప్ట్ చేసుకునేవారు.
రాష్ట పంచాయతీరాజ్ వ్యవస్థ పుట్టినప్పటినుండీ ఈ సాంప్రదాయం వుంది.
ఖమ్మంలో ప్రత్యేక తెలంగాణా
ఉద్యమం—శ్రీ జలగం వెంగళరావు.
1968 లో పాల్వంచ ధర్మల్ విద్యుత్కేంద్రంలో ప్రారంభమైన “రక్షణల
ఉద్యమం” కేంద్రంగా, అప్పుడు తెలంగాణా ప్రాంతీయమండలి అధ్యక్షునిగా వున్న శ్రీ
జువ్వాది చొక్కారావు సహకారంతో శ్రీ జలగం వెంగళరావు ప్రత్యెక తెలంగాణ వుద్యమానికి
శ్రీకారం చుట్టారు. కొత్తగూడెం సింగరేణి సంస్థలోని తెలంగాణాకు చెందిన చిరుద్యోగి
సర్వీసు అంశం “రక్షణల ఉద్యమం” నకు
ప్రారంభం. అది చిలికి చిలికి గాలివానైంది. అదే తెలంగాణా ప్రాంతంలో ప్రత్యెక తెలంగాణ
వుద్యమానికి కారణము అయింది. ఈ ఉద్యమం తరువాత ఖమ్మంపట్టణానికి చేరి శ్రీ
అన్నాబత్తుల రవీంద్రనాథ్ ఖమ్మంపట్టణంలోని గాంధీచౌకులోని గాంధీవిగ్రహం దగ్గర ఆమరణదీక్షకు
కారణమైంది. అప్పటికి రాష్ట్రస్థాయిలో “తెలంగాణా పీపుల్స్ కన్వెన్షన్” ను శ్రీ మదన్
మోహన్ ప్రారంభించి వున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్ధి కార్యాచరణసమితికి
శ్రీ మల్లికార్జున్, బద్రి విశాల్ పిట్టి, ఆమోస్
నాయకులుగా వున్నారు.
యింకోప్రక్కన ఎన్నికలవ్యాజ్యంలో తనకు వ్యతిరేకంగా నమోదైన
కేసు(దేవాలయంలో ఎన్నికల సమావేశం నిర్వహణ) లో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎన్నికలలో
ఆరుసంవత్సరాల వరకు పోటీకి అనర్హుడైన శ్రీ మర్రి చెన్నారెడ్డి రాజకీయ పునరావాసం
కోసం ఎదురు చూస్తున్నాడు.
1969 లో జాతీయస్థాయిలో అఖిలభారతీయ కాంగ్రెసుపార్టీలో చీలికరావటం,
ప్రధాని శ్రీమతిఇందిరాగాంధి బ్యాంకులజాతీయకరణ లాంటి అంశాలు చోటుచేసుకున్నాయి.
ప్రత్యేక తెలంగాణా అని నినదించే గొంతులు పెరిగాయి. శ్రీ కొండా లక్ష్మన్ బాపూజీ తన
మంత్రి పదవికి రాజీనామా చేశాడు.
పై పరిస్థితులనన్నింటిని జాగ్రత్తగా గమనిస్తున్న రాష్ట్రముఖ్యమంత్రి
శ్రీ కాసు బ్రహ్మానంధరేడ్డి తెలంగాణా ఉద్యమానికి ఆజ్యంపోసిన శ్రీ జలగం వెంగళరావును
రాష్ట్ర మంత్రిమండలిలో స్థానం కలిపించారు. శ్రీ జలగం వెంగళరావుకు హోంమంత్రి పదవిని యిచ్చి ఆయన ద్వారానే తెలంగాణా
ఉద్యమాన్ని అణచివేసే చర్యల ప్రారంభించారు. ఆ చరిత్ర రాష్ట్రస్థాయిలో ప్రత్యేకతను
పొందింది.
నేలకొండపల్లి గ్రామంలో జూనియరుకాలేజీ
స్థాపనకోసం జరుగుతున్న ప్రయత్నాలకు కూడా కాంగ్రెస్ వర్గరాజకీయాల సెగతగిలింది.
సునాయాసంగా రావలసిన కాలేజీ స్థాపన అనుమతికై తీవ్రపోరాటం చేయవలసిన స్థితి వచ్చింది.
1969 సంవత్సరంలో నేలకొండపల్లి
గ్రామంలో జూనియరుకాలేజీ స్థాపనకోసం పేరెంట్స్ కమిటీ శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు
అధ్యక్షతన ఏర్పాటైనది. జూనియర్ కాలేజీ స్థాపనకోసం జరుగుతున్న ప్రయత్నాలకు
అడ్డుకట్ట వేసే ప్రయత్నాలలో భాగంగా శ్రీ జలగం వెంగళరావు అప్పటి ఖమ్మం లోకసభసభ్యురాలు
శ్రీమతి తేళ్ల లక్ష్మికాంతమ్మను ముందుంచి జూనియరుకాలేజీను గోకినేపల్లీలో
స్థాపించాలని వేరేప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. నేలకొండపల్లిలో జూనియర్ కాలేజీ
స్థాపనకోసం జరుగుతున్న ప్రయత్నాలను
తెలియని శ్రీమతి తేళ్ల లక్ష్మికాంతమ్మ తాను గోకినేపల్లీ గ్రామస్తులకు మాటయిచ్చానని
చెప్పి నేలకొండపల్లి ప్రయత్నాలకు వ్యతిరేకంగా తన పలుకుబడిని ఉపయోగించింది. అప్పుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవిద్యాశాఖ మంత్రిగా శ్రీ పి.వి. నరసింహారావు వుండేవారు.
శ్రీమతి తేళ్ల లక్ష్మికాంతమ్మ అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖమంత్రిగా
వున్న శ్రీ పి.వి. నరసింహారావును ప్రభావితంచేసే పలుకుబడిని కలిగివున్నారు.
శ్రీ పెండ్యాల
సత్యనారాయణరావు నేలకొండపల్లి జూనియరుకాలేజీ స్థాపనకోసం అనేక తీవ్ర పోరాటాలు చేసిన
తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి
శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ప్రత్యేక చొరవవల్ల జూనియరుకాలేజీ స్థాపనకోసం అనుమతి
లభించింది. నేలకొండపల్లి జూనియరుకాలేజీ అనుమతి లభించిన పదిహేను రోజులలోనే
విద్యామంత్రి శ్రీ పి.వి. నరసింహారావు గోకినేపల్లీ గ్రామంలోకుడా జూనియర్ కాలేజీ
స్థాపనకు అనుమతిని మంజురు చేశారు. ఈ వ్యవహారంలో నేలకొండపల్లికి కాకుండా
గోకినేపల్లికి జూనియరుకాలేజీ రావటానికి శ్రీమతి
తేళ్ల లక్ష్మికాంతమ్మకు స్థానికంగా శ్రీ
సామినేని ఉపెంద్రయ్య చేయూతను అందించారు. అది గ్రూప్ రాజకీయాల ఫలితమే.
కానీ ఇక్కడ విశేషము ఏమిటి
అంటే జూనియర్ కాలేజీకి అనుమతిని పొందిన 1970 సంవత్సరంలో జరిగిన గోకినేపల్లీ గ్రామపంచాయతీ ఎన్నికలలో సి.పి.యం పూర్తి ఆధిక్యంతో పాగావేసింది, ఫలితంగా
ఆ తరువాతి దశాబ్దాలు ఆగ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ఏజెంటుగా పోలింగ్
బూతులో కూర్చునే అవకాశం కూడా లేని స్థితిని చవిచూసింది. అంతకుముందు సర్వశ్రీ చావా
పెంటయ్య, మచ్చా పద్మయ్యలు సర్పంచులుగా సేవలను అందించినప్పుడు గ్రామం కాంగ్రేసు ఆధిక్యంలోనే వుండేది. నేలకొండపల్లి పాలేరు నియోజకవర్గంలోని అనేక గ్రామాల
విద్యార్థులకు కేంద్రస్థానమైంది. కొద్దిసంవత్సరాల తరువాత విద్యార్థులు లేక
గోకినేపల్లీ నుండి జూనియర్ కాలేజీ ముదిగొండకు మారింది.
ఆనాడు నేలకొండపల్లికి జూనియరుకాలేజీ
రాకపోయ్యుంటే నియోజకవర్గములోని గ్రామాలలోని విద్యార్థులు చాలామంది, ముఖ్యంగా
ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన తరగతులవారు విద్యకు నోచక జీవనప్రమాణాన్ని మెరుగు
పరచుకోనలేక పోయేవారు. దశాబ్దాల వెనుకన వుండేవారు.
1970 సంవత్సరంలో సి.పి.యం
పార్టీలోని వర్గరాజకీయాలు ముదిరి 1971 సంవత్సరంలో శ్రీ మొహమ్మద్ రజబ్ ఆలీ సి.పి.యం నుండి బహిష్కరించబడి
సి.పి.ఐ లోకి వెళ్ళిపోవటంతొ తాలుకా మరియు జిల్లా రాజకీయ స్వరూపం మారిపోయింది. మొదటినుండీ
పరోక్షంగా శ్రీ జలగం వెంగళరావుకు రాజకీయ సహకారాన్నందిస్తున్న శ్రీ మొహమ్మద్ రజబ్
ఆలీ సి.పి.ఐ లోకి వెళ్ళిపోయిన తరువాత సి.పి.ఐ పార్టీనే బహిరంగంగా శ్రీ జలగం
వెంగళరావుతో జతకట్టటం ప్రారంభించింది.
1971 జులైలో ఖమ్మంలో జరిగిన
సి.పి.యం జిల్లాపార్టీ సమావేశాన్ని బహిష్కరించిన శ్రీ మొహమ్మద్ రజబ్ ఆలీ అదేరోజు
రఘునాధపాలెం గ్రామంలో సమాంతరసమావేశాన్ని ఏర్పాటుచేసి తనదే అసలైన సి.పి.యం పార్టీ
అని ప్రకటించాడు.
1971ఆగస్ట్ నెలలో శ్రీ మొహమ్మద్
రజబ్ ఆలీ మరియు సమర్ధకులను సి.పి.యం రాష్ట్ర నాయకత్వ సూచనతో జిల్లాకమిటీ బహిష్కరించింది.
పార్టీ సిద్దాంతాలకన్నా వ్యక్తులపై
వ్యతిరేకతే శ్రీ మొహమ్మద్ రజబ్ ఆలీ చర్యలకు కారణమని శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య
అభిప్రాయపడ్డారు. తన సమర్ధకులు 200 మందితో అమ్మపాలెంలో ఏర్పాటుచేసిన సమావేశంతో సి.పి.యం లో
ఆయన రాజకీయప్రస్థానం ముగిసింది. 1972 లో శ్రీ మొహమ్మద్ రజబ్ ఆలీ సి.పి.ఐ పార్టీలో చేరాడు. శ్రీ
జలగం వెంగళరావు సి.పి.యం పార్టీలోవున్న శ్రీ మొహమ్మద్ రజబ్ ఆలీని పావుగా ఉపయోగించి
ఫాక్షన్ రాజకీయాలను నడుపుతున్నాడని సి.పి.యం పార్టీ బహిరంగంగా ఆరోపించింది.
మారిన రాజకీయపరిస్థితుల
నేపధ్యంలో సి.పి.యం పార్టీకి పాలేరు నియోజకవర్గంలోని శ్రీ శీలం సిద్దారెడ్డి
వర్గంతొ జతకట్టవలసిన పరిస్థితి వచ్చింది.
ఆ ఫలితాలు ఖమ్మంసమితి
రాజకీయాలను ప్రభావితం చేశాయి. తత్ఫలితంగా 1970 లో జరిగిన ఖమ్మం పంచాయతీసమితి ఎన్నికలలో శ్రీ శీలం
సిద్దారెడ్డి వర్గం, సిపియంపార్టీ ఒకవర్గంగా, శ్రీ జలగం వెంగళరావువర్గం, సి.పి.ఐ
ఒకవర్గంగా ముఖాముఖీ తలపడ్డాయి. శ్రీ శీలం సిద్దారెడ్డి పక్షాన శ్రీ పెండ్యాల
సత్యనారాయణరావు ఒకవేపు, శ్రీ జలగం వెంగళరావు పక్షాన శ్రీ సామినేని ఉపెంద్రయ్య మరో
వేపు మోహరించి ఎన్నికలు జరిగాయి. శ్రీ జలగం వెంగళరావు పక్షాన శ్రీ సామినేని ఉపెంద్రయ్య
ఖమ్మం జిల్లాపరిషత్ అధక్షఅభ్యర్థి కావటంతో ఆఎన్నికలు జిల్లా దృష్టిని
ఆకర్షించింది. చివరకు శ్రీ శీలం సిద్దారెడ్డి వర్గం సహకారంతో సి.పి.యంకు చెందిన
శ్రీ రాయల వీరయ్య ఖమ్మంసమితి అధ్యక్షునిగా, శ్రీ గండ్లురి కిషన్రావు
ఉపాధ్యక్షులుగా ఎన్నిక అయినారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఇరువురు సి.పి.యం కు చెందినవారే కావటం గమనార్హం.
అప్పుడు పాలేరు డివిజన్/తాలుకా
సి.పి.యం పార్టీకి జనరల్ సెక్రటరీగా వున్న శ్రీ రావెళ్ళ సత్యంను ఖమ్మం పంచాయతీ
సమితి అధ్యక్షుని అభ్యర్థిగా సి.పి.యం పార్టీ నిర్ణయించింది. సి.పి.యం లో అసంతృప్తవర్గం
నాయకుడు శ్రీ మొహమ్మద్ రజబ్ ఆలీ కో-ఆప్షన్ మెంబెరుగా సి.పి.యం అధికారిక అభ్యర్థి
అయిన శ్రీ రావెళ్ళ సత్యంను ఓడించటం జరిగింది. మొత్తం వున్న కో-ఆప్షన్ మెంబెర్స్
ఆరింటిలో ఐదింటిని గెలుచుకున్నా శ్రీ రావెళ్ళ సత్యం మాత్రమే ఓటమిని చవి చూశాడు.
మొత్తం ముప్పది ఓట్లువున్న సి.పి.యం
కు ఇరువైతొమ్మిది ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ ఆరోసీటులో శ్రీ సామినేని ఉపెంధ్రయ్య వర్గం
అభ్యర్థి పెధగోపతికి చెందిన శ్రీ వెలనాటి అప్పయ్య కో-ఆప్షన్ మెంబెరుగా విజయం
సాధించాడు. శ్రీ సామినేని ఉపెంద్రయ్య కో-ఆప్షన్ సభ్యునిగా ఓటమిని చెందారు.
శ్రీ రజబ్ ఆలీ మాత్రం తాను పార్టీ
అభ్యర్థికి వెన్నుపోటు పొడవలేదని సిద్దారెడ్డి వర్గమే సి.పి.యం ఓటమికి
కారణమని ప్రకటన చేశాడు. కానీ 1971 నవంబరులో జరిగిన ఖమ్మంతాలుకా సమావేశంలో మాత్రం శ్రీ
రావెళ్ళ సత్యం ఓటమికి జరిగిన వెన్నుపోటు
సి.పి.యం జిల్లాకమిటీ సభ్యుల వల్లనే జరిగిందని జిల్లా కమిటీ తీర్మానంచేసి
అధిష్టానానికి నివేదికను పంపింది. ఆ సమయంలోనే ఏదులాపురం గ్రామంలో జరిగిన ఖమ్మంతాలుకా వ్యవసాయ కార్మిక సంఘం ఎన్నికలలో అధికారిక
కార్యవర్గ సభ్యుల పానెలును శ్రీ రజబ్ ఆలీ వ్యతిరేకించటం జరిగింది. అలాగే ఖమ్మం
కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎన్నికలలో డైరెక్టరుగా శ్రీ సామినేని ఉపెంధ్రయ్య విజయానికి శ్రీ రజబ్
ఆలీ చేయూతను అందించటం జరిగింది.
శ్రీ రాయల వీరయ్యను ఖమ్మం
సమితి అద్యక్ష బాధ్యతలనుండి అవిశ్వాసంతో దించి వేయటానికి శ్రీ సామినేని ఉపెంద్రయ్య
ఎంతో దూకుడుగా ప్రయత్నాలు తీవ్రతరం చేయటం జరిగింది. 1967 లో శ్రీ సామినేని ఉపెంధ్రయ్యను సమితి అధ్యక్షునిగా
దించివేయటానికి శ్రీ శీలం సిద్దారెడ్డి వర్గం అనుసరించిన పద్దతులనే శ్రీ
ఉపెంద్రయ్య అనుసరించి శ్రీ ఉపెంద్రయ్య శ్రీ రాయల వీరయ్యను అద్యక్షపదవి నుండీ
దించాలని ప్రయత్నాలు చేశారు. ప్రారంభం లోనే ముజ్జిగుడెం సర్పంచుపై అవిశ్వాసం
ప్రతిపాదించగా హైకోర్టు స్టే మంజూరు చేయటంతో ఆయన ప్రయత్నాలు వీగిపోయాయి. 1971 లో శ్రీ రాయల వీరయ్య కొన్ని సాంకేతిక కారణాలవల్ల (సమావేశాలు
సకాలంలో నిర్వహించలేధనే కారణం) హైకోర్టుఆర్డర్ ఇవ్వటం వల్ల కొంతకాలం అద్యక్షపదవికి
ధూరం కావటంతో ఉపాధ్యక్షునిగా వున్న శ్రీ గండ్లురి కిషన్రావు ఆ సమయంలో సమితి
అద్యక్ష బాధ్యతల నిర్వహించారు. శ్రీ రావెళ్ళ సత్యంకు వ్యతిరేకంగా ఓటు వేసిన
ముత్తారం సర్పంచ్ తన పదవీకాలం పూర్తికాకముందే ఆత్మహత్య చేసుకోవటంవల్ల
ఉపాధ్యక్షునిగా వున్న శ్రీ మల్లెల అనంతయ్య(సి.పి.యం) సర్పంచ్ బాధ్యతల
నిర్వహించారు.
ఖమ్మం జిలాపరిషత్ ఎన్నికలు.
1970లో సమితి ఎన్నికలు అయిన
వెంటనే జరిగిన ఖమ్మం జిల్లాపరిషత్ ఎన్నికలలో చైర్మనుగా కాంగ్రెస్ అభ్యర్థికి (శ్రీ శీలం సిద్దారెడ్డి
వర్గం) సి.పి.యం మద్దతుతెలిపి జిల్లాపరిషత్ ఉపాధ్యక్షపదవిని తీసుకున్నది. ఖమ్మం జిల్లాపరిషత్
చైర్మనుగా కాంగ్రెసుకు చెందిన శ్రీ రామసహాయం భువనసుందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా
సి.పి.యం కు చెందిన శ్రీ టి.వి.ఆర్. చంద్రం ఎన్నిక అయినారు.
ఖమ్మం జిల్లాపరిషత్ చైర్మన్
ఎన్నికలలో కూడా కాంగ్రెసులోని వెంగళరావు, సిద్దారెడ్డి వర్గాలు రెండు రాజకీయ
చదరంగాన్ని ఆడాయి. ఖమ్మం జిల్లాపరిషత్ చైర్మనుగా శ్రీ లక్కినేని నరసయ్యను అధికారిక
అభ్యర్థిగా ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి నిర్ణయించారు.
కానీ జిల్లాకాంగ్రెసులోని ఇరువర్గాలు అసంతృప్తికి లోను అయ్యారు. శ్రీ శీలం
సిద్దారెడ్డి వర్గం శ్రీ రామసహాయం భువనసుంధర్రెడ్డిని చైర్మన్ గా చేయటానికి పావులు
కదిపింది. శ్రీ జలగం వెంగళరావువర్గం శ్రీ సామినేని ఉపెంధ్రయ్యను చైర్మనుగా
చేయటానికి పావులు కదిపింది.
జిల్లాకాంగ్రెస్ సారధిగా
శ్రీ లక్కినేని నరసయ్య వ్యవహార శైలిని చూసిన శ్రీ శీలం సిద్దారెడ్డి వర్గం ఆయన తమ వర్గరాజకీయాలకు
తగడని భావించింది.
జిల్లాపరిషత్ ఎన్నికల
పరిశీలకుడుగా వస్తున్న రాష్ట్ర సహకారశాఖామంత్రి శ్రీ కోట్ల విజయభాస్కరరెడ్డిని
హైదరాబాద్ నుండి ఖమ్మం వచ్చే మార్గమధ్యంలో జిల్లా సరిహద్దు గ్రామం నాయకంగూడెం వద్దనే
ఎన్నికల తతంగం పూర్తి అయ్యేవరకు ఆపాలని వ్యూహం రచించారు. స్థానికులతో మాట్లాడి
రహదారిపై పశువులను అడ్డంగావుంచి ప్రయాణానికి ఆటంకం కలిగేలా శ్రీ పెండ్యాల
సత్యనారాయణరావు వ్యూహ రచన చేశారు. ట్రాఫికును స్తంభింప చేశారు.
విజయభాస్కరరెడ్డికి స్వాగతం
పలికే నెపంతో అక్కడ శ్రీ శీలం సిద్దారెడ్డి, శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు, శ్రీ
భుజంగరెడ్డి తదితర స్థానికులు వున్నారు. నాయకంగూడెం నుండి బయలుదేరిన తరువాత పాలేరు
గ్రామంలో “టీ బ్రేక్” కోసం శ్రీ విజయభాస్కరరెడ్డిని మరికొంతసేపు ఆపారు. ఫలితంగా శ్రీ కోట్ల విజయభాస్కరరెడ్డి సమయానికి
జిల్లాపరిషత్ ఎన్నికలకు ఖమ్మం చేరుకోలేకపొయ్యారు. ఆయన చేరుకునేసరికే శ్రీ
రామసహాయం భువనసుంధరారెడ్డి జిల్లాపరిషత్ చైర్మనుగా ఎన్నిక కాబడ్డారు.
తన ప్రాంతంలో తాను కాకుండా
ఇంకో రాజకీయ కేంద్రం ఏర్పడుతుందని శ్రీ జలగం వెంగళరావు కూడా శ్రీ లక్కినేని నరసయ్య
అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించాడు. కాగలకార్యం గంధర్వులే తీర్చినట్లు శ్రీ జలగం
వెంగళరావు స్వయంగా భద్రాచలానికి చెందిన న్యాయవాది శ్రీ ఎం.ఆర్.కె. చౌదరిని రంగంలో
దింపి లక్కినేని నరసయ్యను కో-ఆప్షన్ మెంబరుగా ఓడించాడు.
శ్రీ శీలం సిద్దారెడ్డివర్గం
అనుకున్నది సాధించి శ్రీ ఆర్.భువనసుందర రెడ్డిని జిల్లాపరిషత్ చైర్మనుగా చేయగలిగినా రాష్ట్ర ముఖ్యమంత్రి
శ్రీకాసు బ్రహ్మానందరెడ్డి ఎదుటకు పోవటానికి సాహసించలేక పోయారు. ఆయనకు సమాధానం
చెప్పటానికి జంకారు. శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు మంచి వ్యూహకర్త. జిల్లాచరిత్ర లో
అనేక చారిత్రక ఘట్టాలలో ఆయన ప్రమేయం కనిపిస్తుంది. చివరకు సిద్దారెడ్డివర్గం తరఫున
శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు హైదరాబాదువెళ్లి ముఖ్యమంత్రిని ప్రసన్నంచేసుకుని
శాంతింపజేశారు. జరిగిన పరిణామాన్ని ఆయన స్వాగతించేలా చేశారు.
అంతర్యుద్దాల తరువాత
హత్యారాజకీయాలు.
కాంగ్రెస్ మరియు
వామపక్షాలలో చోటుచేసుకున్న వర్గరాజకీయాలు ముదిరి రాజకీయ ముఖచిత్రాన్ని రక్తంతో
తడిపేశాయి. ఆ ప్రాంత రాజకీయాలు హత్యా రాజకీయాలుగా, భౌతికంగా
ఒక పార్టీవారు మరో పార్టీవారిని అనునిత్యం వెంటాడే స్థితికి చేరుకున్నవి. ఎంతోమంది కమ్యునిస్ట్ మరియు కాంగ్రెస్
వ్యక్తులు హత్య గావించ బడ్డారు. 1970-71 మధ్యన ఖమ్మం తాలుకాలోని 18 గ్రామాలలో 47 క్రిమినల్ కేసులు, మధిర తాలూకాలోని 17 గ్రామాలలో 69 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయంటే అప్పటి పరిస్థితి
తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ఇరువైపులా ముప్పది మంది కార్యకర్తలు హత్య కావించబడ్డారు.
ప్రారంభంలో ఖమ్మం తాలుకాలో 1971 లో తెల్దారుపల్లి గ్రామములోఒక రైతుకు, అతని దగ్గర పనిచేసే
హరిజన రైతుకూలీకి మధ్యన జరిగిన ఘర్షణ ఫలితంగా రగులుకున్న చిచ్చు గ్రామ సి.పి.యం
రెండువర్గాలుగా చీలిపోయి, రెండు హత్యలు జరగటానికి
కారణమైంది. చంద్రయ్య, లక్ష్మయ్య అనేవారు చనిపోయారు. కోర్టులో కేసులు
నడుస్తున్నప్పుడే సి.పి.యం లోని రెండువర్గాలు బంధుత్వాలను కలుపుకొని రాజీపడ్డా,
హరిజన రైతుకూలీకి చెందిన రిక్షాను తగులబెట్టటంతో గ్రామంలో మైనారిటీగా వున్న తమ బలం
సరిపోదని ఆవర్గం శ్రీసామినేని
ఉపెంధ్రయ్యను ఆశ్రయించింది.
ఆ తరువాత జరిగిన సంఘటనలో రిక్షాలో ఖమ్మం వెళుతున్న తెల్దారుపల్లికి
చెందిన శ్రీ తమ్మినేని సుబ్బయ్యపై దాడి జరిగి తలపై దెబ్బపడటంతో తీవ్రంగా
గాయపడ్డాడు. ఈ సంఘటన శ్రీసామినేని ఉపెంధ్రయ్య తరువాతి జీవితాన్ని ప్రభావితం
చేసింది. తెల్దారుపల్లి గ్రామానికి ఒక ప్రత్యేకత వుంది. అది సి.పి.యం కంచుకోట.
పంచాయతీరాజ్ వ్యవస్థ పుట్టిన దగ్గరనుండీ 2019 సర్పంచు ఎన్నికల వరకు ఆవూరు జనం ఓటుహక్కును
ఉపయోగించుకోనలేదు. అన్నీ ఎకగ్రీవాలే అయినవి. 2019 ఎం.పి.టి.సి ఎన్నికలలో మాత్రమే పోటీజరుగగా సి.పి.యంను
కాదని స్వతంత్ర అభ్యర్థిని గెలిపించారు.
శ్రీ జలగం వెంగళరావు
రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతల స్వీకరించాక ఆయన అధికారబలంతో శ్రీ సామినేని
ఉపెంద్రయ్య తన రాజకీయ ప్రత్యర్ధులు సి.పి.యంపై
ప్రతీకారచర్యలు తీవ్రతరం అయినవి. కాంగ్రెసులోని అంతర్యుద్ధాలు రాజకీయ
చదరంగపు ఎత్తులతో, అవిశ్వాసాలతో ముగిశాయి. సి.పి.యంతో జరిగిన ఘర్షణలు హత్యలకు
దారితీశాయి.
కమ్మ్యునిస్టుల కంచుకోట ప్రాంతంలో వున్న బాణాపురం గ్రామంలో
పోలీసులను భారీగామోహరించి చేసిన రాష్ట్ర హోంమంత్రి శ్రీ జలగం వెంగళరావు పర్యటన
ప్రభావం ఆ ప్రాంత రాజకీయాలను ప్రభావితం చేసిందని అంటారు. హత్యారాజకీయాలకు
నాందివాచనం అక్కడనే జరిగిందంటారు. ఆ పర్యటన జరిగిన వెంటనే పమ్మి గ్రామానికి చెందిన
వ్యవసాయకూలీ శ్రీ పెరుమాళ్ళ చంద్రయ్యను పట్టపగలే నడిబజారులో బండరాళ్ళతో మోది
చంపారు. అటు తరువాత పోలీసు కాల్పులలో కమ్మ్యునిస్టు కార్యకర్త మందా నారాయణ
మరణించాడు.
1970 ఏప్రిల్ మూడవవారంలో ఖమ్మంలో
కోర్టు వాయిదాకి వెళ్లి వస్తున్న ముక్కా చిననరసయ్యను చంపారు. 1971 లో జరిగిన లోకసభ మధ్యంతర ఎన్నికల కౌంటింగ్ సమయంలో బొల్లెద్దు
రామనాధాన్ని లైసెన్సులేని పిస్టలుతో కాల్చిచంపారు. సి.పి.యం పక్షాన అమ్మపేట సర్పంచుగా
ఎన్నికైన వున్న కోయ వెంకట్రావు, శ్రీ
సామినేని ఉపెంద్రయ్య పక్షాన చేరిపోయిన తరువాత 1972 జనవరిలో ఒక “అటెంప్ట్ టు ముర్డర్” కేసు విషయంలో కోర్టు విధించిన నాలుగు సంవత్సరాల
శిక్షను అనుభవించటానికి పోవలసిన రెండురోజుల ముందర అమ్మపేటలో చంపేశారు. 1973 డిసెంబరులో గంధసిరి సర్పంచు గండ్ర వీరభద్రారెడ్డిని, 1976 ఫిబ్రవరి ఏడవ తేదీన కమ్యునిస్ట్ సీనియర్ నాయకుడు శ్రీ
గండ్లురి కిషన్ రావును చంపేశారు. శ్రీ గండ్లురి కిషనురావును హత్యచేసిన అనుమానిత వ్యక్తిపై కేసు నడచినా, సాక్ష్యంలేక
కోర్టులో కేసు వీగిపోయింది. కానీ ఆవ్యక్తే వేరే కేసులో జైలునుండి పెరోలుపై బయటకు
రావటంతో హత్యకు గురైనాడు. ఆ రోజులలో చాలా గ్రామాలలో పోలీసు క్యాంపులు వున్నా
జరిగిన ఏ సంఘటనా ఆగలేదు అని అంటారు.
వామపక్షాల (సి.పి.ఐ, సి.పి.ఏం) మధ్యన ప్రత్యక్ష యుద్ధం.
ఖమ్మం తాలుకాలోని బస్వాపురం సర్పంచు సి.పి.ఐ కంచుకోటలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని మొదలైన ఘర్షణ చిలికిచిలికి గాలివానై 1972-79 సంవత్సరాల మధ్యన ఆప్రాంతంలోని వివిధ గ్రామాలలో సి.పి.యం సానుభూతిపరులపై, వారి ఆస్తులపై దాడులు జరిగాయి. పదకొండు మంది చనిపోయారు. 1987 ప్రాంతంలో కూడా ఎనిమిది మంది సి.పి.యం కార్యకర్తలు,
నలుగురు సి.పి.ఐ.కార్యకర్తలు చనిపోయారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో వామపక్షాల మధ్యన ఎన్నికల అవగాహన కలిగి కలసి పయనించినా, ఖమ్మం నియోజకవర్గం అడ్డంకిగా వుండేది. యిక్కడ సమన్వయము చేయటం రాష్ట్రపార్టీకి కూడా సాధ్యంకాక స్నేహపూర్వక పోటీ జరగటం గమనార్హం.
ఈ సి.పి.ఐ, సి.పి.యం
కొట్లాటల్లో ఛాతీకి దెబ్బతగిలి ఖమ్మం డివిజను సి.పి.యం ప్రధాన కార్యదర్శి శ్రీ
రావెళ్ళ సత్యంకు గుండెపోటు వచ్చింది. కొద్దికాలంలో మరణించారు. అప్పుడు జరుగబోయే
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఖమ్మం స్థానానికి సి.పి.యం పార్టీ ఎం.ఎల్.యే
అభ్యర్థిగా శ్రీ రావెళ్ళ సత్యంను ప్రకటించివుంది. ఆయన మరణంతో శ్రీ మంచికంటి
రామకిషనురావు సి.పి.యం అభ్యర్థిగా పోటీచేసి ఎం.ఎల్.ఎ గా విజయం సాధించారు.
1970 దశకం ఆఖరునాటికి (1978) జిల్లా రాజకీయస్వరూపం మారిపోయింది. శ్రీ జలగం వెంగళరావు,
శ్రీ శీలం సిద్దారెడ్డి జిల్లారాజకీయ అవనికపై నుండి తప్పుకున్నారు. రాష్ట్రప్రభుత్వం
శ్రీ మర్రి చెన్నారెడ్డి సారధ్యంలో ఏర్పాటుయింది. జిల్లాలో కాబినెటుహోదాలో శ్రీ
కీసర అనంతరెడ్డి వున్నారు. ఆత్మీయులు సర్వశ్రీ బొగ్గారపు నారాయణ, కిలారి వెంకయ్య
లాంటి వాళ్ళు ఇందిరా కాంగ్రేసులోకి వుండటంతో శ్రీ సామినేని ఉపెంద్రయ్య కూడా ఇందిరాకాంగ్రెసులోకి
వచ్చారు. అక్కడవున్న శ్రీ పెండ్యాల సత్యనారాయణరావుకూడా శ్రీ సామినేని ఉపెంద్రయ్యను
సాదరంగా ఆహ్వానించారు. శ్రీ పెండ్యాల సత్యనారాయణరావుకు శ్రీ సామినేని ఉపెంద్రయ్య
భుజంపై చేయివేసి పలుకరించే చనువు వుండేది. 1957 అసెంబ్లీ ఎన్నికలలో శ్రీ లక్ష్మీకాంతమ్మ పోటీచేసినప్పటి
నుండీ ఇద్దరికీ అనుబంధం. కాంగ్రెసు వర్గరాజకీయాల చదరంగం కొంతకాలం నడచినా తిరిగి
అంతా సర్దుకుంది.
ఆ కాలంలో జిల్లాలో
అభివృద్ధి తనపని తాను చేసుకుపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రిగా వున్న శ్రీ శీలం
సిద్దారెడ్డి భారత ప్రభుత్వ కాబినెట్ మంత్రి ప్రముఖ ఇంజనీరు శ్రీ కే.ఎల్.రావు
సహకారంతో నాగార్జునసాగరు జలాశయము నుండి ఎడమకాలువ ద్వారా ఖమ్మంజిల్లాకు సాగరుజలాలు
రావటానికి శ్రీకారం చుట్టారు. ఖమ్మం ఏటిపైన ఆక్విడెక్టు కట్టేవరకు కాలువ పనులను పూర్తిచేసి
మిగతా అసంపూర్తి పనులకు టెండర్లను శ్రీ
శీలం సిద్దారెడ్డి హయాములో పిలిచారు. వెంకటాయపాలెం డీప్ కట్ నుండి పనుల ప్రారంభాన్ని, మంగాపురం మేజర్ ప్రారంభాన్ని
శ్రీ జలగం వెంగళరావు ముఖ్యమంత్రి హోదాలో చేశారు.
1981 పంచాయతీ సమితి ఎన్నికలు
వచ్చినప్పుడు అధ్యక్ష ఎన్నికలు ప్రత్యక్ష పద్దతిలో జరిగాయి. నామినేషన్ వేసిన
ప్రముఖులలో శ్రీ సామినేని ఉపెంద్రయ్య ఒకరు. పార్టీ అధికారిక అభ్యర్థిగా శ్రీ
బొగ్గారపు నారాయణను నిర్ణయించటంతో ఆయన పోటీనుండి విరమించుకున్నారు. వాస్తవంగా 1978 లో జరిగిన ఖమ్మం అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా శ్రీ
బొగ్గారపు నారాయణను రాష్ట్రపార్టీ నిర్ణయించింది. కానీ ఆయన పోటీకి సుముఖతను చూపకపోవటంతో
శ్రీ కీసర అనంతరెడ్డి రంగంమీదకు వచ్చారు. ఆ కారణంవల్లనే శ్రీ బొగ్గారపు నారాయణను
ఖమ్మంసమితి అధ్యక్ష అభ్యర్థిగా నిర్ణయించటం జరిగింది.
అప్పుడు ఎన్.ఎస్.యు,ఐ మరియు
యువజన కాంగ్రెసు రాజకీయాలలో చురుకుగా వున్న ఈ వ్యాసకర్త కూడా అద్యక్ష పదవికి
నామినేషన్ వేయటం జరిగింది.
శ్రీ సామినేని ఉపెంద్రయ్య
పోటీనుండి విరమించుకునే సమయంలో “బాబు! నేను పోటీనుండి విరమించుకుంటున్నా, నువ్వు
కూడా విరమించుకో” అని ఈ వ్యాసకర్తతో చెప్పటం నాకింకా గుర్తుంది. మేము తరచు
ఖమ్మంలోని “హిల్ బంగ్లా”లో శ్రీ కీసర అనంతరెడ్డి వద్ద కలిశేవారం. కానీ 1981 పంచాయతీసమితి కి జరిగిన ప్రత్యక్షఎన్నికలలో సి.పి.యంకు
చెందిన శ్రీ రావెళ్ళ సత్యం సమితిప్రెసిడెంటుగా ఎన్నికఅయినారు. ఖమ్మం పంచాయతీ సమితి
ప్రాంతంలో అప్పుడు ఎర్రజెండా రెపరెపలె ఎక్కువ అయినవి. 1981ఎన్నికలలో ప్రప్రధమంగా సి.పి.యం మరియు సి.పి.ఐ లు కలసిపోయి
ఉమ్మడి అభ్యర్థులను నిలపటంవల్ల ఎన్నికలలో విజయాన్ని సాధించాయి.
ఈ ధశకంలలోని అసంపూర్తి
విశేషాలు నా తదుపరి వ్యాసంలో....
---పెండ్యాల వాసుదేవరావు
<!-- Google tag (gtag.js) -->
<script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script>
<script>
window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());
gtag('config', 'G-1M93C8YK91');
</script>
Comments