62. (SOCIAL-41) మేధావులు కదలండయ్యా ....ఎన్నికల రంగలో పోగైన కలుపు ను తీసేద్దాం రండయ్యా...


మేధావులు కదలండయ్యా ....ఎన్నికల రంగలో పోగైన  కలుపు ను తీసేద్దాం ..రండయ్యా...

ఒకప్పుడు నాయకుడంటే ప్రజల్లోంచి వచ్చేవాడు, ప్రజల కోసం బ్రతికే వాడు. ప్రజలకోసం ఆస్తులు ధారపోసేవాడు. కుటుంబ జీవితాన్ని లెక్క జేయక ప్రజల కోసం పోరాటం చేసేవాడు. ఇచ్చిన మాటకోసం సమాజ సేవ కోసం నిరంతరం తపన పడేవాడు. ఎన్నికలొస్తే అయ్యా మీరే నిలబడండి మీమంతా మీపక్షమే నని జనాలు నాయకులకు  చెప్పేవారు. నిజాయితీగా నాయకులు పదవులకు ఎన్నిక అయ్యేవారు. 

కానీ నేడో...

తరాలు మారినయ్. ప్రజల మనస్తత్వాలు మారినవి. నాయకులను ఓటుకు నోటును ఓటర్లు అడుగు తున్నారు. నోటు లేనిదే పోలింగుకు రామంటున్నారు. మరికొందరైతే ఆ అభ్యర్ధి  డబ్బులిచ్చాడు మీరెందుకు ఇవ్వరని రహదారులపై ధర్నాలకు దిగుతున్నారు. ఒకప్పుడు నయాపైసా ఆశించకుండా అభ్యర్ధులకు ఓట్లేసిన ప్రజలు కాసులకై  కొట్లాడుతున్నారు. దేశంలోని అన్ని ప్రాంతీయ, జాతీయ రాజకీయ పార్టీలు (వామ పక్షాలకు ఇందులో మినహాయింపు లేదు) డబ్బులు పంచటంలో పూర్తిగా నిమగ్నమై దానితోనే గెలుపు గుర్రాల నేక్కాలని వువ్విళ్ళూరుతున్నారు.

రాజకీయపార్టీలు ఎన్నికల అభ్యర్ధుల నిర్ణయంలో కోట్ల రూపాయలను లంచంగా తీసుకుంటున్నారు. మరి కోట్ల రూపాయలను నీళ్ళలా ఖర్చు చేయగలిగిన వాళ్లనే పార్టీ అభ్యర్ధులుగా నిర్ణయిస్తున్నారు. అభ్యర్ధిగా నిర్ణయం చేయటానికి ఆ పార్టీలో సభ్యత్వం అక్కరలేదు. వేరే రాజకీయ పార్టీకి చెందిన వాడైనా, అప్పటివరకు ఆ రాజకీయ పార్టీకి రాజీనామా చేయక పోయినా అభ్యంతరం లేదు. తప్పు పట్టరు. ఈ పార్టీ టికెట్ పై గెలిచి ఫలితాలు రాగానే అధికార పక్షంలో చేరితే రాజ్యాంగ పదవిలో వున్న వారు ఫిరాయింపు దారులను అనర్హులను  చెయ్యరు. ఆ వ్యక్తిని ఓట్లేసి గెలిపించిన ఓటర్లు ఫిరాయింపుదారులను ప్రశ్నించే పరిస్థితులు లేవు. పాత్యాచ్చ దేశాల మాదిరి రీకాల్ హక్కు జనాలకు లేదు.

ఏమి సాధిస్తారని వీళ్ళకు వేల, లక్షల జీతాలు మరియు పదవీకాలం అయిపోయిన  తరువాత పెన్షన్ సధుపాయాలు. చేసిన హామీలు అమలు లేదు. అసెంబ్లీ మరియు పార్లమెంట్ సభ్యుల్లో అధిక శాతం సమావేశాలకే వెళ్లరు. ఇక వాళ్ళు చేసే ప్రజా సేవ ఏమిటి?

ఎటు పోతోంది ఈ దేశం ? ఏమై పోతోందీ సమాజం?

ఎందుకు ఇలా ? ఎంత కాలమిలా?

ఎన్నికల నిర్వహణకై చట్టాలు చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలను ఏర్పరచారు.  డబ్బు ఖర్చు పెట్టటానికి పరిమితులు పెట్టారు. 

ఎవరు పాటిస్తున్నారండీ ఇవన్నీ? చట్టాన్ని చేస్తున్న వాళ్ళే చట్టాన్ని భక్షిస్తున్నారు. నిబంధనల కు తూట్లు పొడుస్తున్నారు. అధికార దుర్వినియోగము చేస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికలైనా, స్థానిక సంస్థ ఎన్నికలు అయినా ఓటుకు వోటర్ స్లిప్ తో పాటు ఒక వెయ్యి రుపాయయల నోటు  ఇవ్వటం సర్వ సాధారణం అయిపోయింది. తప్పు చెప్పేవారు లేరు. తప్పు చేసే వాడిని చెప్పుతో కొట్టేవారు లేరు. డబ్బులు లేకుండా ఎన్నికల గోదాలో దిగితే పిచ్చి వాడిలా చూస్తున్నారు. భవిష్యత్తుకై పరితపించే నవతరాన్ని, సమాజ సంక్షేమాన్ని కాంక్షించే పెద్దరికాన్ని చూసి నవ్వుకుంటున్నారు. ఇది వరకు నిజాయితీగా పదవులు ఏలి అవినీతికి పాల్పడని వాళ్ళు, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో డబ్బులు పెట్టలేక సమకాలీన రాజకీయాలకు దూరంగా వుంటున్నారు.

ఇటీవల ఒక మిత్రుడు సమకాలీన రాజకీయాలను వర్ణిస్తూ ఒక కధ చెప్పాడు.

అడవిలో ఎన్నికలొచ్చాయి. అన్ని చెట్లకు ఓటు హక్కు కల్పించారు. సెలయేరు గొడ్డలి పోటీ పడ్డాయి. పోలింగ్ జరిగింది. చెట్లకు జీవనాధారమైన నీరు ఇచ్చే సెలయేరు గెలుస్తుందని అందరూ విశ్లేషకులు అనుకున్నారు. నిత్యం వృక్షాలను తెగనరికే గొడ్డలి చిత్తుచిత్తుగా ఓడిపోతుందని సర్వే ఫలితాలు ముందే చెప్పాయి. సెలయేటిపై గొడ్డలి భారీ మెజారిటీతో గెలిచింది. ఆశ్చర్యపోయారు. ఈ విషయమై వివిధ వృక్షజాతుల నాయకులను అడిగారు. “అవును, నిజమే, గొడ్డలి వలనే మా జాతి అంతరిస్తుంది, కానీ ఆ గొడ్డలి వెనుక వున్న కర్ర మా కులానికి చెందినది. అందుకే ఓటేశాం”..అన్నారట.

రంగులు మారుతున్న రాజకీయాల్లో ధనం, కులం, మద్యం మరియు మతం జడలు విప్పి నృత్యం చేస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలలో వార్డ్ మెంబర్ ఐదు లక్షలు, సర్పంచ్ అభ్యర్ధి వోటర్స్ సంఖ్యను బట్టి యాభయ్ లక్షలు/కోటి రూపాయలు,  అసెంబ్లీ అభ్యర్ధి యాభై కోట్లు, లోకసభ అభ్యర్ధి వందకోట్లు, రాజ్యసభ టికెట్ ఎనభై కోట్లు...ఇవీ మన దేశంలో నేడు అభ్యర్ధులు ఖర్చు చేయవలసిన రేట్లు. పెట్టిన డబ్బు తిరిగి ఆశిస్తాడు కదా. వడ్డీ కావాలి కదా. లాభం లేకుంటే ఎట్లా? మళ్లీ ఎన్నికల్లో  ఖర్చులకి పెట్టుబడి తీసుకోకుండా ఆగుతాడా?

ఈ దుర్మార్గాన్ని ఆపే వాళ్ళు ఎవ్వరు?
ప్రజలే బాధ్యతల తీసుకుని నాయకుల గెలిపించే రోజులు మళ్ళీ వస్తాయా?

ప్రజల నుంచి నాయకులు రావాలి. రాజకీయ పార్టీ ఎన్నికల అభ్యర్హులుగా ఆయా రాజకీయ పార్టీకి చెందిన సభ్యులు, కార్యకర్తలె రావాలి. పారిశ్రామిక వేత్తలు, కంట్రాక్టర్ ల వుక్కు పిడికిలి నుండి రాజకీయాలు విముక్తం కావాలి. అప్పుడే ఆ రాజకీయ పార్టీ ప్రజల హృదయాల గెలుచు కుంటుంది. రాజకీయాలలో నిజాయితీ నిలదోక్కుకుంటుంది. ఎన్నికలకు పట్టిన బూజు తొలగిపోతుంది. సమాజం వెలుగొందు తుంది.

ఒకేసారి అసెంబ్లీ, లోకసభా ఎన్నికలలలో మార్పును ఆశించలేము. ఆ మార్పు, ఆ ఉద్యమం గ్రామాల నుంచే రావాలి. యువత నడుం బిగించాలి. మేధావులు నవ సమాజానికి వుక్కు పిడికిలి బిగించాలీ. కదలండి ముందుకు. మీ మీ జన్మ స్థలాలకు కదలండి. నిజాయితీని గెలిపించండి.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>


Comments

Popular posts from this blog

82. (SOCIAL.55). ఖమ్మంకు ఆత్మాభిమానం లేదనుకున్నారా?

36.(SOCIAL-36) MUST RETHINK ABOUT VIP SYSTEM IN INDIA.

50. (ఖమ్మం చరిత్ర-2) ఉద్యమాల గుమ్మం విరాట్ రాయాంధ్ర గ్రంధాలయం.