61. (ఖమ్మం చరిత్ర-9) ఆ నాటి మా ఖమ్మం లో మారిన రాజకీయ ముఖ చిత్రం.

ఆ నాటి మా ఖమ్మం లో మారిన రాజకీయ ముఖ చిత్రం.
విబేధాలతో  వామపక్షాలు ---
ఆధిపత్య రాజకీయాలతో కాంగ్రెస్ వాదులు .....

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముఖ్య జిల్లా నాయకుల చీలిక మరియు జిల్లా కమ్మ్యునిస్ట్ నాయకులలో కూడా  చీలికల్లో చీలిక రావడం ఖమ్మం జిల్లా రాజకీయ అవనికపై సరికొత్త సమీకరణాలకు దారి చూపాయి.

కాంగ్రెస్ పార్టీ లో జిల్లా నాయకుల చీలికలు. 
1967 అసెంబ్లీ ఎన్నికల వరకు కలిసేవున్నజిల్లా కాంగ్రెస్ నాయకులు ఆధిపత్య పోరాటంలో ఒకరికి ఒకరు ధూరం అయ్య్హారు. ఫలితంగా శ్రీ జలగం వెంగళరావు మరియు శ్రీ శీలం సిద్దారెడ్డి వర్గాలుగా కాంగ్రెస్ శ్రేణులు చీలిపోయినవి. వైవిధ్య రాజకీయ నేపధ్యాలతో అనుహ్యంగా  ఏకమైన వారు ఆధిపత్య పోరాటంలో విడిపోవటంతో జిల్లా రాజకీయ ముఖచిత్రం కొత్త రూపును సంతరించుకొంది. రాజకీయ సమీకరణలు మళ్ళీ మారిపోయాయి.

శ్రీ జలగం వెంగళరావు, శ్రీ శీలం సిద్దారెడ్డి రాజకీయ ప్రారంభంలో ఒకేవేధిక మీదకు వచ్చిన నాడే ఆధిపత్య ధోరణులకు అంకురార్పణ జరిగింది. ఆ విషయం జిల్లా కాంగ్రెస్ ఆఫీసు నూతన భవన నామకరణం దగ్గర బహిర్గతం అయినది. శ్రీ జలగం వెంగళరావు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ  అధ్యక్ష బాధ్యతలు  చేపట్టినప్పుడు  శ్రీ శీలం సిద్దారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. జిల్లా పార్టీ ఆఫీసు భవన నిర్మాణానికి నిధుల సేకరణ మొదలైన కార్యక్రమాల నిర్వహణకై ఒక సన్నాహక కమిటిని ఏర్పరచారు. ఆ కమిటీలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు భవనానికి “లాల్ బహాధూర్ శాస్త్రి“ పేరు పెట్టాలని నిర్ణయం జరిగింది. కానీ అనుహ్యంగా శ్రీ శీలం సిద్దారెడ్డి ఆఫీసు భవనానికి నీలం సంజీవరెడ్డి కి గుర్తుగా “సంజీవరెడ్డి భవనము” అని పేరు పెట్టాలని ప్రతిపాదనను ప్రవేశపెట్టాడు. అప్పుడు శ్రీ శీలం సిద్దారెడ్డి యం.ఎల్.సి. శ్రీ వెంగళరావు యిరకాటంలో పడిపోయాడు. ఇదివరకు అనుకున్న లాల్ బహదూర్ శాస్త్రి పేరుకు  భిన్నంగా  ‘సంజీవరెడ్డి భవనము ” అనే పేరును  శ్రీ వెంగళరావు సమర్ధించక తప్పలేదు. అదే పేరు ఖాయం అయినది. అలాగే శ్రీ సిద్దారెడ్డి స్వగ్రామం బనిగండ్లపాడు గ్రామంలో అంతకుముందు అనుకున్న పేరుకు భిన్నంగా ఆ గ్రామ స్కూల్ కు శ్రీ నీలం సంజీవరెడ్డి పేరును పెట్టక తప్పని పరిస్థితిని శ్రీ వెంగళరావు తీసుకుని వచ్చాడు. ఆ ఇద్దరు నాయకుల మధ్యన ఆధిపత్య ధోరణులు అలా ప్రారంభం అయినవి. 

బ్రహ్మానందరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరించాక రాష్ట్రమంత్రి వర్గంలో శ్రీ శీలం సిద్దారెడ్డికి అవకాశాన్ని ఇవ్వటం జరిగింది. అప్పటికే యం.ఎల్.ఏ.గా వున్న వెంగళరావుకు ఆ విషయం మింగుడు పడలేదు. అప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గందే పైచేయిగ వుంది. పూర్తి స్థాయి ఆధిపత్యం వారిదే అంటే న్యాయంగా వుంటుంది. రాజకీయ సమీకరణాల రీత్యా శ్రీ శీలం సిద్దారెడ్డిని మంత్రివర్గం లోనికి తీసుకొనటంలో ఆశ్చర్యము ఏమీలేదు. ఆ సమయంలో శ్రీ జలగం వెంగళరావు తాను యం.యల్.ఎ గా, తన తమ్ముడు శ్రీ జలగం కొండలరావు జిల్లా పరిషద్ అధ్యక్షుడుగా వున్నారు. అధిష్టానం ఆయన శైలిని గమనిస్తూనే వుంది. ఆ స్వేచ్చని ఆయనకు వదిలేసి రాష్ట్ర స్థాయిలో శ్రీ సిద్దారెడ్డి ఎదుగులకు మార్గం వేశారు.

1952 సార్వత్రికలలో అదికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి పార్టీ అభ్యర్థులు ఓడిపోవటానికి కారణమైనందుకు కాంగ్రెస్ పార్టీ నుండి శ్రీ జలగం వెంగళరావు మరియు శ్రీ శీలం సిద్దారెడ్డి లు ఇద్దరు ఆరు సంవత్సరాలు బహిష్కృతులు అయినారు. శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావుతో వున్న విబేదాలవల్ల ఆయనపై వేమ్సూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పొటీచేసి కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించబడిన నేపధ్యం శ్రీ వెంగళరావు గారిది. శ్రీ కొండా వెంకటరంగారెడ్డి గారి ప్రోద్బలంతో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి శ్రీ మాడపాటి రామచంద్ర రావు గారి ఓటమికి బహిరంగ ప్రచారము చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించ బడిన నేపధ్యం శ్రీ శీలం సిద్దారెడ్డిది. 1952 సార్వత్రిక ఎన్నికల తరువాత శ్రీ వెంగళరావు గారికి శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారితో ఆత్మీయ అనుబంధం ఏర్పడటం, అలాగే ఖమ్మంలో న్యాయవాద వృత్తిలో వుండి లా విద్యాభ్యాసంలో తన క్లాస్ మేట్ అయిన శ్రీ పెండ్యాల కృష్ణమూర్తి ద్వారా శ్రీ శీలం సిద్దారెడ్డి గారు శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు చెంతకు రావటం జరిగింది. అలా ముగ్గురు కలయిక జిల్లాలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమ్ ఏర్పడ్డాక శ్రీ కొండా వెంకట రంగారెడ్డి గారు శ్రీ శీలం సిద్దారెడ్డిని రాజకీయంగా విస్మరించారు. రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త రాజకీయ సమీకరణాలరీత్యా ఖమ్మంజిల్లా రాజకీయాలతో ఆయనకు శ్రీ శీలం సిద్దారెడ్డితో అవుసరంలేక పోయింది. శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారి చాణక్యంతో, శ్రీ కళా వెంకట్రావు గారి మార్గదర్శకత్వంతో శ్రీ నీలం సంజీవరెడ్డి రాజకీయ ప్రవాహంలో కలిసిన శ్రీ జలగం వెంగళరావు మరియు శ్రీ శీలం సిద్దారెడ్డిలు రాజకీయ నిచ్చెన నెక్కి శిఖరాల అధిరోహించారు.  

1967 అసెంబ్లీ ఎన్నికలలో యం.ఎల్.ఏ గా గెలిచియున్నా తనకు కాకుండా శ్రీ సిద్దారెడ్డి ని రాష్ట్ర కేబినెట్ లో కాబినెట్ మంత్రిగా తీసుకోవటం అవమానంగా భావించిన శ్రీ జలగం వెంగళరావు తన రాజకీయ భవిష్యత్తుకు రాజకీయ చదరంగం మొదలెట్టారు. ఆనాటి రాజకీయ అవుసరాలు మారి రాబోయే భవిష్యత్ కు ప్రత్యామ్నాయ పునాదులను వేయవసిన, వేసుకోవలసిన పరిస్థితి తనదని భావించాడు శ్రీ జలగం వెంగళరావు. రాజకీయంగా శ్రీ జలగం వెంగళరావుది ఒంటరికులం కావటంతో తన రాజకీయ సుస్థిరతకు చదరంగపావులు సొంతంగా కదపటం ఆ ప్రయత్నాలకు అంకురార్పణం చేయటం జరిగింది. శ్రీ శీలం సిద్దారెడ్డి రాష్ట్ర మంత్రి కావటంతో తన రాజకీయ ప్రత్యర్ధులు  ఎవ్వరో బేరీజు వేసుకుని వారికి చెక్ పెట్టె కార్యక్రమాలను తీవ్రతరం చేశారు శ్రీ జలగం వెంగళరావు. ఖమ్మం తాలుకా పై ద్రుష్టి పెట్టి ఆ నాయకులెవ్వరు జిల్లాను శాసించే స్థితిలో వుండకూడదు అనే నిర్ణయం తీసున్న ఆయన ఆ మార్గంను నిర్దేశించుకున్నాడు. శ్రీ శీలం సిద్దారెడ్డికి రాష్ట్ర స్థాయిలో దొరుకుతున్న ఆదరణకు జిల్లాలో తన స్థానం సొంతంగా నిర్మించుకోవటమే తన ఉన్నతికి తోడ్పడుతుందని భావించాడు.

ఖమ్మం కమ్యునిస్ట్ పార్టీలో మరియు  నాయకుల్లో చీలికలు.
మొదటి చీలిక.
1964 సంవత్సరంలో అంతర్జాతీయ రాజకీయాలలో వచ్చిన మార్పుల కారణంగా జాతీయ స్థాయిలో భారత కమ్యునిస్ట్ పార్టీ సి.పి.యం మరియు సి.పి.ఐ పార్టీ లుగా విడిపోవటంతో ఆప్రభావం ఖమ్మం జిల్లా కమ్యునిస్ట్ పార్టీ రాజకీయాలపై కూడా ప్రసరించింది. తొంభై శాతం ఖమ్మం జిల్లా కమ్యునిస్ట్ నాయకులు కార్యకర్తలు సి.పి.యం పార్టీ వేపే మొగ్గు చూపారు. సి.పి.ఐ పార్టీ నామ మాత్రంగానే మిగిలినధి. 1964, ఏప్రిల్ 16 & 17 తేదీలలో తనికెళ్ళ గ్రామంలో జరిగిన జిల్లా కమ్యునిస్ట్ సమితి సమావేశంలో అప్పటివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యునిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గా వున్న శ్రీ నల్లమల గిరిప్రసాద్ సి.పి.ఐ. సమర్దన వాదాన్ని వినిపించటాన్ని మెజారిటీ జిల్లా సభ్యులు విబేధించారు. కొక్కిరేణి గ్రామంలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశం లో మోడరేట్ విధానాలను బలపరచటాన్ని టి.బి. విట్టల్ రావు మినహా జిల్లా కమిటీ మొత్తం  వ్యతిరేకించటం వల్ల జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ పదవికి న్యాయం చేయలేనంటు ఆయన తన జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశాడు. డెబ్బది ఐదు మంది జిల్లా కమిటీ సభ్యులలో  అరవై తొమ్మిది మంది సి.పియం వేపు నిలిచారు. పార్టీని చీల్చటం ఇష్టంలేదని ఈ.సి. సభ్యుడిగా కొనసాగుతానని చెప్పారు, ఆ సమావేశం లోనే జిల్లా  సి.పి.యం. పార్టీ పగ్గాలు శ్రీ చిర్రావూరి లక్ష్మి నరసయ్య చేతికి వచ్చాయి.  జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ గా ఎన్నికైనాడు. శ్రీ మొహమ్మద్ రజబలీ కూడా సి.పి.యం పార్టీలోనే వున్నాడు. 1964 ఆగష్టు నెలలో అనుహ్యం గా శ్రీ నల్లమల గిరిప్రసాద్ సి.పి.ఐ. పార్టీ లో చేరాడు. శ్రీ రావెళ్ళ జానకిరామారావు మొదటినుండి శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యని విబేధించిన కారణంగా సి.పి.యం వైపుకు వెళ్లలేదు. 

రెండవ చీలిక.
1967 సంవత్సరంలో ఖమ్మం జిల్లాకు చెందిన సి.పి.యం అనుబంధ సంఘాల యువకులు మరియు విద్యార్థులు కొందరు తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి ప్రారంభించిన మార్శిస్ట్, లెనినిస్ట్ సిద్దాంతాలకు ఆకర్షితులు కావటంతో వారు జిల్లా సి.పి.యం పార్టీ ప్లీనంలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రతిపాదనను ప్రవేశ పెట్టగా రెండు ఓట్ల తేడాతో వీగి పోయింది. ప్రతిపాదన వీగి పాయినా వారు అదే పంధాలో వెళ్ళటంతో పాటు సి.పి.యం వ్యతిరేక ప్రచారం చేస్తుండటం తో  వారిని సి.పి.యం పార్టీ నుండి జిల్లా కమిటీ బహిష్కరించింది. ఇండియా లో ప్రధమంగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే మార్క్సిస్ట్, లెనినిస్ట్ ఉద్యమం ఉద్యమం ప్రారంభ అయింది. ఫలితంగా సి.పి.యం సంస్థాగతంగా చాలా నష్ట పోయింది. ఆ పరిణామం ఖమ్మం జిల్లా సి.పి.యం పై కూడా రాజకీయంగా ప్రతికూల  ప్రభావం చూపింది.

సి.పి.యం నుండి బహిష్కృతులైన వారు 1968, జూన్ 15 వ తేదీన ఖమ్మం లో భారీ బహిరంగ ప్రదర్శన చేసి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. శ్రీ చండ్ర పుల్లారెడ్డి ఆ సమావేశం లో ప్రసంగించారు. తరువాత అదే సంవత్సరం అక్టోబర్ నెలలో ఆరవ తేదీన కొత్తగూడెంలో జరిగిన బహిరంగ సభలో శ్రీ తరిమెల నాగిరెడ్డి ప్రసంగించారు. 

ఖమ్మం సమావేశం తరువాత ఖమ్మం జిల్లా కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు అయింది. మధిర తాలుకా గ్రామాలు మడుపల్లి. ముస్తికుంట్ల, గోవిందాపురం  ఖమ్మం, కొత్తగూడెం. పిండిప్రోలు, గార్ల, ఎల్లందు, సుబ్లవీడు నుండి వచ్చిన నాయకులతో సి.పి.ఐ.(యమ్.యల్) ఆవిర్భవించింది. ప్రారంభంలో పార్టీ చిన్నగానే వున్నా శ్రీకాకుళ గిరిజన పోరాటం ప్రభావంతో కొక్కిరేణి గ్రామంలో జరిగిన జనరల్ బాడీ సమావేశం తరువాత యం.యల్ పార్టీ కొత్త పుంతలు తొక్కి పగిడేరు గ్రామంలో భూస్వామి ఇంటిపై దాడితో ప్రారంభం అయిన ఉద్యమం అనేక మార్పులకు లోనై కొత్త పుంతలు తొక్కింది. ఎల్లందు ఏరియాలో ప్రముఖంగా పునాదులు పదిలం చేసుకుంది. సి.పి.యం పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎల్లందు ఏరియాలో యం.యల్ పార్టీకి వ్యతిరేకంగా  కార్యకలాపాలు చేయవద్దని స్థానిక నాయకత్వానికి ఆదేశం యిచ్చి వుండటంవల్ల కూడా అక్కడ యం.యల్ పార్త్రి పునాదులు ధృడంగా పడినవి.

ఇలా ఖమ్మం జిల్లాలో కామ్రేడులు వరుసగా చీలిపోవటం వల్ల సంస్థాగతంగా బలహీన పడి పార్ల మెంటరీ  ఎన్నికలలో వెనుక పడిపోయారు. ఎవ్వరో గొప్ప నాయకులు కమ్యునిస్ట్ పార్టీ మెడలు వంచి విజేతలు కాలేదు. ఇది అంతా కామ్రేడుల స్వయం క్రుతాపరాధం మాత్రమే. జాతీయ అంతర్ జాతీయ విధానాల పర్యవసానాలే. ఎన్నెన్నో చారిత్రిక తప్పిదాల ఫలితమే. 

పార్టీలో అంతర్గత సంక్షోభం. 
దీనికి తోడు  సి.పి.యం జిల్లా పార్టీ లో అప్పటి జిల్లా పార్టీ సెక్రటరీ శ్రీ చిర్రావూరి లక్ష్మి నరసయ్య నాయకత్వ విషయంలో తలెత్తిన సంక్షోభం తో జిల్లాలో వున్న అధికార కాంగ్రెస్ పార్టీ సి.పి.యం అంతర్గత వ్యవహారాలలో వేలు పెట్టటం ప్రారంభ అయినది. 

తనకు జిల్లా నాయకత్వ బాధ్యతలకోసం పార్టీలో కొట్లాడిన శ్రీ మొహమ్మద్ రజబలీ వ్యక్తిగతం గా శ్రీ చిర్రావూరి లక్ష్మి నరసయ్య నాయకత్వాన్ని వ్యతిరేకించి సి.పి.ఐ లోకి వెళ్లి పోవటంతో కామ్రేడుల తదుపరి రాజకీయాలను కాంగ్రెస్ నాయకులు ప్రభావితం చేశారు.

కామ్రేడుల చీలికలతో శ్రుతిమించిన  సి.పి.ఐ మరియు సి.పి.యం పార్టీ కార్యకర్తల పరస్పర యుద్దాలు ఒకవైపున.......
కాంగ్రెస్ లో మొగ్గ తొడిగిన గ్రూప్ తగాదాలు మరోవేపున ...
ఈ రెండు అనుసంధానమై ఖమ్మం జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేశాయి.

అవి ఏమిటో నా తదుపరి వ్యాసం లో చూద్దాము.

                             .....PENDYALA VASUDEVARAO


<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>


Comments

Popular posts from this blog

82. (SOCIAL.55). ఖమ్మంకు ఆత్మాభిమానం లేదనుకున్నారా?

78. (social...51). ఎవవరెవరో ఎక్కడినుండో వస్తారు..... ఆలోచించండి ప్రజలారా...

80. (SOCIAL--53) దేశంలో ప్రజా సేవ ఇంత Costly నా? ఎవ్వరికీ బాధ్యతలు లేవా?