Monday, June 10, 2019

ఖమ్మం తాలుకా అధ్యాయం. 1960, 70, 80 దశకాలలో

66. (ఖమ్మం చరిత్ర--10).

ఖమ్మం జిల్లా చరిత్రలో ఖమ్మం తాలుకా అధ్యాయం.


ఖమ్మం జిల్లా చరిత్రలో 1960, 70, 80 దశకాలలో ఖమ్మం తాలుకా అధ్యాయం.

ఖమ్మం ఉద్యమాల పురిటి గడ్డ ఒకనాడు. రాజకీయపు ఎత్తులు జిత్తులతో, రక్తంతో తడిసిన నేల కొన్నినాళ్ళు. ఆనాడు, ఆతరువాతా మధిర, ఖమ్మం, ఎల్లందు తాలూకాలలో జరిగిన రాజకీయ మార్పులు, యుద్ధాలే ఖమ్మం చరిత్రలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి.

ఎల్లందులో సి.పి.ఏం, సి.పి.ఐ  మరియు ఎం.ఎల్ పార్టీల మధ్యన, ఖమ్మం నియోజకవర్గ పరిధి ప్రాంతంలో  సి.పి.యం, సి.పి.ఐ మధ్యన ముఖాముఖి పోరాటం మరియు పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధి ప్రాంతంలో సి.పి.యం మరియు కాంగ్రెసుకు చెందిన జలగం వెంగళరావువర్గం మధ్యన నడిచిన రాజకీయ పోరాటాలు ఖమ్మం రాజకీయ ముఖచిత్రంపై రక్తాన్నిచిమ్మాయి. భయోత్పాతాన్ని కలిగించాయి. మధిర, వేమ్సూర్/సత్తుపల్లి  నియోజకవర్గాలలో ఆదినుండి కొనసాగుతున్న కాంగ్రెసుపార్టీలోని నాయకుల మధ్యన రాజకీయ ఆధిపత్యం కోసం సాగిన అంతర్యుద్ధం జిల్లారాజకీయాలను శాసించాయి.


1964 నుండి 1970 దశకాలలో జరిగిన ఖమ్మం సమితి మరియు ఖమ్మం జిల్లాపరిషత్ ఎన్నికల నేపధ్యం...తాలుకా రాజకీయాలు.

ఖమ్మంతాలుకాలో జరిగినన్ని కాంగ్రెసు అంతర్యుద్ధ పోరాటాల ప్రకంపనలు జిల్లాలో వేరేప్రాంతంలో చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. వామపక్షాల యుద్దాలకు కూడా ఈ తాలుకానే కేంద్ర బిందువు.

ఖమ్మంజిల్లా కాంగ్రెసుపార్టీలో  వెంగళరావు, సిద్దారెడ్డి వర్గాలు ఏర్పడక ముందు 1964 సంవత్సరంలో పాలేరు పంచాయతీసమితి ఖమ్మంసమితిలో విలీనమైనప్పుడు ఖమ్మంసమితి అధ్యక్షుడుగా యువకుడైన  శ్రీ సామినేని ఉపెంద్రయ్యను కాంగ్రెసువారు అందరు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీ కిలారు వెంకయ్యను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. వారు ఇరువురు 1964 నుండి  1970 వరకు పదవిలో వున్నారు. అప్పుడు 1960 నుండి 1965 వరకు జిల్లాకాంగ్రెసు అధ్యక్షునిగా శ్రీ శీలం సిద్దారెడ్డి వున్నారు. శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు ఉపాధ్యక్షునిగా, శ్రీ హీరాలాల్ మోరియా ప్రధాన కార్యదర్శిగా వున్నారు.

1959 నుండి 1964 వరకు ఖమ్మం జిల్లాపరిషత్ చైర్మనుగా వున్న శ్రీ జలగం వెంగళరావు 1962-64 మధ్య కాలంలో రాష్ట్ర పంచాయతీచాంబరు అధ్యక్షుడిగా సేవలను అందించారు. ఆ పదవే శ్రీ జలగం వెంగళరావుకు రాష్ట్రవ్యాప్త పరిచయాలను పెంచుకోవటానికి దోహదపడింది. ఆ సమయంలోనే శ్రీ శీలం సిద్దారెడ్డి రాష్ట్ర కో-ఆపరేటివ్ యునియనుకు సెక్రటరీగా సేవలను అందించారు.

క్రింది చిత్రంలో కుడివేపున కుర్చీలలో కూర్చున్న మొదటివారు శ్రీ జలగం వెంగళరావు, రెండవ వారు శ్రీ దుగ్గినేని వెంకయ్య, మూడవవారు శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు మరియు ప్రక్కన నాలుగవవారు శ్రీ కోట పున్నయ్య. సమావేశంలో మాట్లాడుతున్న వ్యక్తి శ్రీ హీరాలాల్ మోరియా. ముందు వరుసలో కుర్చిపై కూర్చున్న వ్యక్తి శ్రీ సామినేని ఉపెంద్రయ్య. ఈ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఖమ్మం తాలూకా ముదిగొండ గ్రామంలో జరిగింది. యువకుడైన శ్రీ సామినేని ఉపెంధ్రయ్యను ఖమ్మంసమితి అధ్యక్షునిగా చేసే చర్యలలో భాగం ఆ సమావేశం.








1967 సంవత్సరంలో జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ముఖ్యమైన కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలలో ముఖ్యమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకొన్నాయి.

1967 లో రెండవసారి ఎం.ఎల్.ఏ గా గెలిచిన శ్రీ జలగం వెంగళరావుకు కాకుండా ఎం.ఎల్.సి గా వున్న శ్రీ శీలం సిద్దారెడ్డిని రాష్ట్ర కాబినెటుమంత్రిగా ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి తీసుకోవటంతొ రాజకీయంగా తన ఎదుగుదల కోసం ఖమ్మంతాలుకా రాజకీయాలపై శ్రీ సామినేని ఉపెంద్రయ్య కేంద్రంగా ద్రుష్టి సారించాడు. శ్రీ శీలం సిద్దారెడ్డి రాష్ట్రమంత్రిగా బాధ్యతల స్వీకరించాక ఆయనకు రాష్ట్ర స్థాయిలో దొరుకుతున్న ఆదరణకు జిల్లాలో తనస్థానం సొంతంగా నిర్మించుకోవటమే తన ఉన్నతికి తోడ్పడుతుందని శ్రీ జలగం వెంగళరావు భావించాడు. కాంగ్రేసుకు చెందిన శీలంసిద్దారెడ్డి వర్గనాయకులను టార్గెట్ చేయనారంభించాడు. ఈ సమయంలో పాతతరం నాయకుడు శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు అనుయాయులలో ఖమ్మం ఏరియాలో కొద్ది మంది మినహా ఎక్కువశాతం శ్రీ శీలం సిద్దారెడ్డి వర్గంలో విలీనమైనారు. ముఖ్యంగా కరణాలలో అందరు శీలం సిద్దారెడ్డి వర్గంలో కలసిపోయారు. ఖమ్మంలో న్యాయవాద వృత్తిలో వున్న శ్రీ కౌటురి కృష్ణమూర్తి వంటి ఒకరిద్దరే వెంగళరావు వెంట వున్నారు. మధిరలో శ్రీ బొమ్మకంటి అనుయాయులు దాదాపు అందరు వెంగళరావు వర్గంలో కలసిపోయారు.

శ్రీ శీలం సిద్దారెడ్డి తరువాత జిల్లా కాంగ్రెసుపార్టీ పగ్గాలు శ్రీ జలగం వెంగళరావు ప్రాంతానికి చెందిన శ్రీ లక్కినేని నరసయ్యకు లభించాయి. అప్పుడు జిల్లాకాంగ్రెస్ ప్రధానకార్యదర్శిగా సర్వశ్రీ పెండ్యాల సత్యనారాయణరావు, వీరవెల్లి నరసింహారావు, కోశాధికారిగా శ్రీ జలగం కొండలరావు, ఉపాధ్యక్షునిగా శ్రీ కాసా నాగభూషణం వుండేవారు.

శ్రీ జలగం వెంగళరావు ఖమ్మంతాలుకా రాజకీయాలపై ఆధిపత్యం సాధించే యోచనతో శ్రీ సామినేని ఉపెంద్రయ్యకు అత్యంత ప్రాదాన్యమును పెంచే ప్రణాళికను రూపొందించారు. ఆ ప్రణాళికలో భాగంగానే 1967 ప్రాంతంలో శ్రీ సామినేని ఉపెంధ్రయ్యను జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా నియమించటం జరిగింది. ఆ సమయంలో 1964-1970 వరకు శ్రీ జలగం వెంగళరావు సోదరుడు  శ్రీ జలగం కొండలరావు ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మనుగా వున్నారు.

తెలంగాణా సాయుధపోరాట సమయంలో కమ్యునిస్టుపార్టీవల్ల, పోలీసుయాక్షన్ కంటే ముందు తన తండ్రి, యిద్దరు బాబాయిలను నష్టపోయిన నేపధ్యం శ్రీ సామినేని ఉపెంద్రయ్యది. అప్పుడు మేడేపల్లిగ్రామంలో కాంగ్రెస్ సానుభూతిపరులు ఐదుగురిని సాయుధ కమ్యునిస్టుదళంలోని వారు చంపారు. ప్రతీకారంకోసం, అదనుకోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శ్రీ సామినేని ఉపెంద్రయ్యకు శ్రీ వెంగళరావు తాను రాష్ట్రమంత్రి కావటానికి ముందు మరియు ఆ తరువాత యిచ్చిన  చేయూత ఖమ్మంతాలుకా రాజకీయాలలో పెనుతుఫానును రేపింది. రాజకీయ ప్రశాంతతను భగ్నం చేశింది. ఫలితంగా రక్తం ఏరులై పారింది.

1967 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే అభ్యర్థుల ఎంపికలో ముందుచూపుతొ తనకు మంత్రిపదవి స్థానం సంపాదించే ప్రయత్నంలో జిల్లాలోని స్థానాలలో తానుచెప్పిన అభ్యర్థులకే పార్టీ టికెట్స్ రావటానికి శ్రీ జలగం వెంగళరావు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మధిర అసెంబ్లీ టికెట్టును శ్రీ దుగ్గినేని వెంకయ్యకు, పాలేరులో శ్రీ కత్తుల శాంతయ్యకు రాకుండా ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఫలితంగా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గములో కాంగ్రెస్ రెబల్(తిరుగుబాటు) అభ్యర్థిగా చేరువుమాధవరం గ్రామపంచాయతీలో గుమాస్తాగా పనిచేస్తున్న శ్రీ నందిగామ వెంకతరత్నంను శ్రీ జలగం వెంగళరావు ఎన్నికలబరిలో నిలిపాడు. కానీ శ్రీ కత్తుల శాంతయ్యనే విజయం వరించింది.ఆయన సి.పి.యం కు చెందిన శ్రీ సాలె సుందరయ్యపై ఎనిమిదివేల ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు.  శ్రీ సామినేని ఉపెంద్రయ్య కాంగ్రెస్ రెబల్(తిరుగుబాటు)అభ్యర్థికి ఎన్నికలసారధిగా నిలిచారు. ఆ నాటి నుండి తానుమరణించేవరకు కూడా శ్రీ జలగం వెంగళరావు తనవర్గం మనిషికి  ఆ నియోజకవర్గంలో స్థానం సంపాధించలేకపోవటం గమనార్హం. శ్రీ కత్తుల శాంతయ్యకు టికెట్ రాకుండా చేసి తాను రాష్ట్రమంత్రి కావాలనుకున్నాడు శ్రీ జలగం వెంగళరావు. శ్రీ కత్తుల శాంతయ్య గెలవటం వల్లనే శ్రీ శీలం సిద్దారెడ్డి రాష్ట్ర మంత్రి కాగలిగాడు. 1967 అసెంబ్లీ ఎన్నికలలో కోత్తగూడెం నుండి శ్రీ పానుగంటి పిచ్చయ్య, ఎల్లందు నుండి శ్రీ గోగినేని సత్యనారాయణ, బూర్గంపాడు నుండి శ్రీ కొమరం రామయ్య, భద్రాచలం నుండి శ్రీ కారం కన్నయ్య, ఖమ్మం నుండి శ్రీ మొహమ్మద్ రజబలీ గెలిచారు.

1967 లో శ్రీ శీలం సిద్దారెడ్డికి మంత్రి పదవి రాకుండా లాబీయింగ్ చేయటమే కాకుండా పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించటానికి ప్రయత్నించిన దానికి కౌంటరుగా శ్రీ సామినేని ఉపెంద్రయ్యను ఖమ్మం సమితి అధ్యక్షపదవి నుండి దింపే ప్రయత్నం శ్రీ శీలం సిద్దారెడ్డి వర్గం చేసింది. శ్రీ శీలంసిద్దారెడ్డి వర్గం బాధ్య్తలన్నీ అప్పుడు ఖమ్మం పంచాయతీసమితి కో-ఆప్షన్ సభ్యునిగా వున్న  శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు భుజస్కందాలపై పడింది. శ్రీ శీలం సిద్దారెడ్డివర్గం 1968 లో ముజ్జిగుడెం, చింతకాని సర్పంచులపై అవిశ్వాసతీర్మానాన్ని పెట్టి దించేశారు. తమకు అనుకూలమైన వారిని సర్పంచులుగా చేశారు. వెంగళరావు వర్గం నుండి శ్రీ సామినేని ఉపెంద్రయ్య కూడా కొంతమంది సర్పంచులపై (గుబ్బగుర్తి, తనికెళ్ళ మొదలైనవి)  అవిశ్వాసంపెట్టి దించేశారు.


కానీ శ్రీ మొహమ్మద్ రజబ్ ఆలీ నాయకత్వంలోని సి.పి.యం శ్రీ సామినేని ఉపెంద్రయ్యపై అవిశ్వాసం వీగిపోయేటట్లు సహకారాన్నంధించటంతో శ్రీ సామినేని ఉపెంద్రయ్యపై అవిశ్వాసానికి సరిపోయిన మెజారిటీ లభించక తీర్మానం వీగిపోయింది. ఆనాటి నుండి శ్రీ మొహమ్మద్ రజబ్ ఆలీ శ్రీ జలగం వెంగళరావు రాజకీయ అనుచరుడిగా మారిపొయ్యాడు. శ్రీ జలగం వెంగళరావుతో కుదిరిన రాజకీయ అవగాహన మేరకు సి.పి.యం ఖమ్మం పంచాయతీ సమితి అధ్యక్షునిగా శ్రీ సామినేని ఉపెంద్రయ్యపై అవిశ్వాసం నెగ్గకుండా సహాయంచేసింది.  అపుడు ఖమ్మం రెవిన్యూ డివిజనల్ అధికారిగా వున్న శ్రీ దుర్గారెడ్డి అవిశ్వాస తీర్మానం సమావేశాన్ని నిర్వహించారు.


ఖమ్మం తాలుకా రాజకీయాలపై పట్టు సంపాదించేందుకు శ్రీ సామినేని ఉపెంద్రయ్యతొ పాటు శ్రీ మొహమ్మద్ రజబ్ ఆలీని కూడా జతచేసుకున్నాడు శ్రీ జలగం వెంగళరావు. కాంగ్రెసువర్గ ఆధిపత్య పోరాటాల ఫలితంగా ఖమ్మంఅసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రేసులోని రెండువర్గాలు చెరోవామపక్షాన్ని భుజాన వేసుకుని  కాంగ్రెసును ఎన్నికలరంగంలో సమాధి చేశారు. వరుస విజయాలను కమ్యునిస్టులకే ధారాదత్తం చేశారు. 1957లో జరిగిన ఉమ్మడి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో శ్రీమతి లక్ష్మికాంతమ్మ, ఆ తరువాత ఉమ్మడి ఖమ్మం అసెంబ్లీనియోజకవర్గం పాలేరు, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాలుగా విడిపోయాక 1978 లో శ్రీ కీసర అనంతరెడ్డి మాత్రమే ఖమ్మంఅసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెసుఅభ్యర్థులుగా గెలుపొందారు. ఆ రెండుఎన్నికలకు కూడా శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు చీఫ్ ఎలక్షన్ఏజెంటుగా వుండి ఎన్నికలసారధి కావటం గమనార్హం. 1962 నుండి పాలేరు అసెంబ్లీ ఎన్నికల సారధిగా, చీఫ్ ఎలెక్షన్ ఏజంటుగా కూడా ఆయనే వున్నారు. కాంగ్రెస్ వరుస విజయాలను సొంతం చేసుకుంది.

ఖమ్మం తాలుకాలో జరిగిన కాంగ్రెసుపార్టీ  అంతర్యుద్ధాల పోరాటాల ప్రకంపనలలో ఖమ్మం జిల్లా కన్జుమర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ (సూపర్ బజార్)లో జరిగిన కాంగ్రేసు వర్గరాజకీయాల చదరంగాపుటేత్తులు  ఖమ్మం తాలుకా రాజకీయ స్వరూపాన్ని మార్చేశాయి. 1967 నుండి 1973 వరకు రెండు టర్ములు ఖమ్మం జిల్లా కన్జుమర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ (సూపర్ బజార్) కి శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు వ్యవస్థాపక అధ్యక్షులుగా వున్నారు. ఆజిల్లా స్థాయి సహకారసంఘం నుండి శ్రీ పెండ్యాల సత్యనారాయణరావును దించేయత్నానికి శ్రీ సామినేని ఉపెంద్రయ్యను శ్రీ జలగం వెంగళరావు ముందుంచాడు. రాజకీయ చదరంగపు పావులు తీవ్రస్థాయిలో కదిపారు. కానీ వారి యత్నాలు ఫలించలేదు. 1973 ఆఖరులో జరుగవలసిన ఎన్నికలు కోర్టు జోక్యంవల్ల చాలాకాలం వరకు ఆగిపోయాయి. ఆ సమయంలోనే జిల్లా సహకారకేంద్రబ్యాంకు అధ్యక్షులుగా వున్న శ్రీ దుగ్గినేని వెంకయ్యపై కానీ, జిల్లా మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షులుగా వున్న శ్రీ కీసర అనంతరెడ్డిపై కానీ వారు రాజకీయ ద్రుష్టి పెట్టలేదు.

క్రింద వున్న చిత్రం 1967లో జిల్లా కన్జుమర్స్ కో-ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ (సూపర్ బజార్) ను ఆనాటి రాష్ట్ర సహకార శాఖామాత్యులు శ్రీ కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రారంభించినప్పటిది. ముందు వరుసలో వున్నవారు ఎడమవైపున శ్రీ కోట్ల విజయభాస్కరరెడ్డి, మధ్యలో శ్రీ శీలం సిద్దారెడ్డి, కుడిప్రక్కన స్టోర్స్ ప్రెసిడెంట్ శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు, వెనుక వరుసలో కుడివైపున శ్రీ సామినేని ఉపెంద్రయ్య, సిద్దారెడ్డిగారి వెనుక శ్రీ హీరాలాల్ మోరియా, శ్రీ కీసర అనంతరెడ్డి వున్నారు.



అప్పుడే కొత్తగూడెంలో బి.పి.ఆర్.ఓ గా ఉద్యోగబాధ్యతలలో వున్న శ్రీ చేకూరి కాశయ్యను రాజకీయాలలోకి రప్పించి కొత్తగూడెంసమితి అధ్యక్షుడిగా ఎన్నిక చేయించాడు శ్రీ జలగం వెంగళరావు. కో ఆప్షనులో సభ్యుడుగా ఎన్నికైన శ్రీ చేకూరి కాశయ్య సమితిఅధ్యక్షుడు అయినాడు. వివిధకారణాలవల్ల ఎన్నికలలో పోటీచేయని ముఖ్య పార్టీనాయకులను కో-ఆప్ట్ చేసుకునేవారు. రాష్ట పంచాయతీరాజ్ వ్యవస్థ పుట్టినప్పటినుండీ ఈ సాంప్రదాయం వుంది.

ఖమ్మంలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం—శ్రీ జలగం వెంగళరావు.
1968 లో పాల్వంచ ధర్మల్ విద్యుత్కేంద్రంలో ప్రారంభమైన “రక్షణల ఉద్యమం” కేంద్రంగా, అప్పుడు తెలంగాణా ప్రాంతీయమండలి అధ్యక్షునిగా వున్న శ్రీ జువ్వాది చొక్కారావు సహకారంతో శ్రీ జలగం వెంగళరావు ప్రత్యెక తెలంగాణ వుద్యమానికి శ్రీకారం చుట్టారు. కొత్తగూడెం సింగరేణి సంస్థలోని తెలంగాణాకు చెందిన చిరుద్యోగి సర్వీసు అంశం  “రక్షణల ఉద్యమం” నకు ప్రారంభం. అది చిలికి చిలికి గాలివానైంది. అదే తెలంగాణా ప్రాంతంలో ప్రత్యెక తెలంగాణ వుద్యమానికి కారణము అయింది. ఈ ఉద్యమం తరువాత ఖమ్మంపట్టణానికి చేరి శ్రీ అన్నాబత్తుల రవీంద్రనాథ్ ఖమ్మంపట్టణంలోని గాంధీచౌకులోని గాంధీవిగ్రహం దగ్గర ఆమరణదీక్షకు కారణమైంది. అప్పటికి రాష్ట్రస్థాయిలో “తెలంగాణా పీపుల్స్ కన్వెన్షన్” ను శ్రీ మదన్ మోహన్ ప్రారంభించి వున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్ధి కార్యాచరణసమితికి శ్రీ మల్లికార్జున్, బద్రి విశాల్ పిట్టి, ఆమోస్  నాయకులుగా వున్నారు.

యింకోప్రక్కన ఎన్నికలవ్యాజ్యంలో తనకు వ్యతిరేకంగా నమోదైన కేసు(దేవాలయంలో ఎన్నికల సమావేశం నిర్వహణ) లో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎన్నికలలో ఆరుసంవత్సరాల వరకు పోటీకి అనర్హుడైన శ్రీ మర్రి చెన్నారెడ్డి రాజకీయ పునరావాసం కోసం ఎదురు చూస్తున్నాడు.

1969 లో జాతీయస్థాయిలో అఖిలభారతీయ కాంగ్రెసుపార్టీలో చీలికరావటం, ప్రధాని శ్రీమతిఇందిరాగాంధి బ్యాంకులజాతీయకరణ లాంటి అంశాలు చోటుచేసుకున్నాయి. ప్రత్యేక తెలంగాణా అని నినదించే గొంతులు పెరిగాయి. శ్రీ కొండా లక్ష్మన్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు.

పై పరిస్థితులనన్నింటిని జాగ్రత్తగా గమనిస్తున్న రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానంధరేడ్డి తెలంగాణా ఉద్యమానికి ఆజ్యంపోసిన శ్రీ జలగం వెంగళరావును రాష్ట్ర మంత్రిమండలిలో స్థానం కలిపించారు. శ్రీ జలగం వెంగళరావుకు  హోంమంత్రి పదవిని యిచ్చి ఆయన ద్వారానే తెలంగాణా ఉద్యమాన్ని అణచివేసే చర్యల ప్రారంభించారు. ఆ చరిత్ర రాష్ట్రస్థాయిలో ప్రత్యేకతను పొందింది.

నేలకొండపల్లి గ్రామంలో జూనియరుకాలేజీ స్థాపనకోసం జరుగుతున్న ప్రయత్నాలకు కూడా కాంగ్రెస్ వర్గరాజకీయాల సెగతగిలింది. సునాయాసంగా రావలసిన కాలేజీ స్థాపన అనుమతికై తీవ్రపోరాటం చేయవలసిన స్థితి వచ్చింది.

1969 సంవత్సరంలో నేలకొండపల్లి గ్రామంలో జూనియరుకాలేజీ స్థాపనకోసం పేరెంట్స్ కమిటీ శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు అధ్యక్షతన ఏర్పాటైనది. జూనియర్ కాలేజీ స్థాపనకోసం జరుగుతున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలలో భాగంగా శ్రీ జలగం వెంగళరావు అప్పటి ఖమ్మం లోకసభసభ్యురాలు శ్రీమతి తేళ్ల లక్ష్మికాంతమ్మను ముందుంచి జూనియరుకాలేజీను గోకినేపల్లీలో స్థాపించాలని వేరేప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. నేలకొండపల్లిలో జూనియర్ కాలేజీ స్థాపనకోసం జరుగుతున్న  ప్రయత్నాలను తెలియని శ్రీమతి తేళ్ల లక్ష్మికాంతమ్మ తాను గోకినేపల్లీ గ్రామస్తులకు మాటయిచ్చానని చెప్పి నేలకొండపల్లి ప్రయత్నాలకు వ్యతిరేకంగా తన పలుకుబడిని ఉపయోగించింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవిద్యాశాఖ మంత్రిగా శ్రీ పి.వి. నరసింహారావు వుండేవారు. శ్రీమతి తేళ్ల లక్ష్మికాంతమ్మ అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖమంత్రిగా వున్న శ్రీ పి.వి. నరసింహారావును ప్రభావితంచేసే పలుకుబడిని కలిగివున్నారు.

శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు నేలకొండపల్లి జూనియరుకాలేజీ స్థాపనకోసం అనేక తీవ్ర పోరాటాలు చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ప్రత్యేక చొరవవల్ల జూనియరుకాలేజీ స్థాపనకోసం అనుమతి లభించింది. నేలకొండపల్లి జూనియరుకాలేజీ అనుమతి లభించిన పదిహేను రోజులలోనే విద్యామంత్రి శ్రీ పి.వి. నరసింహారావు గోకినేపల్లీ గ్రామంలోకుడా జూనియర్ కాలేజీ స్థాపనకు అనుమతిని మంజురు చేశారు. ఈ వ్యవహారంలో నేలకొండపల్లికి కాకుండా గోకినేపల్లికి జూనియరుకాలేజీ  రావటానికి శ్రీమతి తేళ్ల లక్ష్మికాంతమ్మకు స్థానికంగా  శ్రీ సామినేని ఉపెంద్రయ్య చేయూతను అందించారు. అది గ్రూప్ రాజకీయాల ఫలితమే.

కానీ ఇక్కడ విశేషము ఏమిటి అంటే జూనియర్ కాలేజీకి  అనుమతిని పొందిన 1970 సంవత్సరంలో జరిగిన గోకినేపల్లీ గ్రామపంచాయతీ ఎన్నికలలో  సి.పి.యం పూర్తి ఆధిక్యంతో పాగావేసింది, ఫలితంగా ఆ తరువాతి దశాబ్దాలు ఆగ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ఏజెంటుగా పోలింగ్ బూతులో కూర్చునే అవకాశం కూడా లేని స్థితిని చవిచూసింది. అంతకుముందు సర్వశ్రీ చావా పెంటయ్య, మచ్చా పద్మయ్యలు సర్పంచులుగా సేవలను అందించినప్పుడు గ్రామం కాంగ్రేసు ఆధిక్యంలోనే వుండేది. నేలకొండపల్లి పాలేరు నియోజకవర్గంలోని అనేక గ్రామాల విద్యార్థులకు కేంద్రస్థానమైంది. కొద్దిసంవత్సరాల తరువాత విద్యార్థులు లేక గోకినేపల్లీ నుండి జూనియర్ కాలేజీ ముదిగొండకు మారింది.

ఆనాడు నేలకొండపల్లికి జూనియరుకాలేజీ రాకపోయ్యుంటే నియోజకవర్గములోని గ్రామాలలోని విద్యార్థులు చాలామంది, ముఖ్యంగా ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన తరగతులవారు విద్యకు నోచక జీవనప్రమాణాన్ని మెరుగు పరచుకోనలేక పోయేవారు. దశాబ్దాల వెనుకన వుండేవారు.


1970 సంవత్సరంలో సి.పి.యం పార్టీలోని వర్గరాజకీయాలు ముదిరి 1971 సంవత్సరంలో శ్రీ మొహమ్మద్ రజబ్ ఆలీ సి.పి.యం నుండి బహిష్కరించబడి సి.పి.ఐ లోకి వెళ్ళిపోవటంతొ తాలుకా మరియు జిల్లా రాజకీయ స్వరూపం మారిపోయింది. మొదటినుండీ పరోక్షంగా శ్రీ జలగం వెంగళరావుకు రాజకీయ సహకారాన్నందిస్తున్న శ్రీ మొహమ్మద్ రజబ్ ఆలీ సి.పి.ఐ లోకి వెళ్ళిపోయిన తరువాత సి.పి.ఐ పార్టీనే బహిరంగంగా శ్రీ జలగం వెంగళరావుతో జతకట్టటం ప్రారంభించింది.

1971 జులైలో ఖమ్మంలో జరిగిన సి.పి.యం జిల్లాపార్టీ సమావేశాన్ని బహిష్కరించిన శ్రీ మొహమ్మద్ రజబ్ ఆలీ అదేరోజు రఘునాధపాలెం గ్రామంలో సమాంతరసమావేశాన్ని ఏర్పాటుచేసి తనదే అసలైన సి.పి.యం పార్టీ అని ప్రకటించాడు.

1971ఆగస్ట్ నెలలో శ్రీ మొహమ్మద్ రజబ్ ఆలీ మరియు సమర్ధకులను సి.పి.యం రాష్ట్ర నాయకత్వ సూచనతో జిల్లాకమిటీ బహిష్కరించింది. పార్టీ సిద్దాంతాలకన్నా  వ్యక్తులపై వ్యతిరేకతే శ్రీ మొహమ్మద్ రజబ్ ఆలీ చర్యలకు కారణమని శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య అభిప్రాయపడ్డారు. తన సమర్ధకులు 200 మందితో అమ్మపాలెంలో ఏర్పాటుచేసిన సమావేశంతో సి.పి.యం లో ఆయన రాజకీయప్రస్థానం ముగిసింది. 1972 లో శ్రీ మొహమ్మద్ రజబ్ ఆలీ సి.పి.ఐ పార్టీలో చేరాడు. శ్రీ జలగం వెంగళరావు సి.పి.యం పార్టీలోవున్న శ్రీ మొహమ్మద్ రజబ్ ఆలీని పావుగా ఉపయోగించి ఫాక్షన్ రాజకీయాలను నడుపుతున్నాడని సి.పి.యం పార్టీ బహిరంగంగా ఆరోపించింది.

మారిన రాజకీయపరిస్థితుల నేపధ్యంలో సి.పి.యం పార్టీకి పాలేరు నియోజకవర్గంలోని శ్రీ శీలం సిద్దారెడ్డి వర్గంతొ జతకట్టవలసిన  పరిస్థితి వచ్చింది.

ఆ ఫలితాలు ఖమ్మంసమితి రాజకీయాలను ప్రభావితం చేశాయి. తత్ఫలితంగా 1970 లో జరిగిన ఖమ్మం పంచాయతీసమితి ఎన్నికలలో శ్రీ శీలం సిద్దారెడ్డి వర్గం, సిపియంపార్టీ ఒకవర్గంగా, శ్రీ జలగం వెంగళరావువర్గం, సి.పి.ఐ ఒకవర్గంగా ముఖాముఖీ తలపడ్డాయి. శ్రీ శీలం సిద్దారెడ్డి పక్షాన శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు ఒకవేపు, శ్రీ జలగం వెంగళరావు పక్షాన శ్రీ సామినేని ఉపెంద్రయ్య మరో వేపు మోహరించి ఎన్నికలు జరిగాయి. శ్రీ జలగం వెంగళరావు పక్షాన శ్రీ సామినేని ఉపెంద్రయ్య ఖమ్మం జిల్లాపరిషత్ అధక్షఅభ్యర్థి కావటంతో ఆఎన్నికలు జిల్లా దృష్టిని ఆకర్షించింది. చివరకు శ్రీ శీలం సిద్దారెడ్డి వర్గం సహకారంతో సి.పి.యంకు చెందిన శ్రీ రాయల వీరయ్య ఖమ్మంసమితి అధ్యక్షునిగా, శ్రీ గండ్లురి కిషన్రావు ఉపాధ్యక్షులుగా ఎన్నిక అయినారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఇరువురు  సి.పి.యం కు చెందినవారే కావటం గమనార్హం.

అప్పుడు పాలేరు డివిజన్/తాలుకా సి.పి.యం పార్టీకి జనరల్ సెక్రటరీగా వున్న శ్రీ రావెళ్ళ సత్యంను ఖమ్మం పంచాయతీ సమితి అధ్యక్షుని అభ్యర్థిగా సి.పి.యం పార్టీ నిర్ణయించింది. సి.పి.యం లో అసంతృప్తవర్గం నాయకుడు శ్రీ మొహమ్మద్ రజబ్ ఆలీ కో-ఆప్షన్ మెంబెరుగా సి.పి.యం అధికారిక అభ్యర్థి అయిన శ్రీ రావెళ్ళ సత్యంను ఓడించటం జరిగింది. మొత్తం వున్న కో-ఆప్షన్ మెంబెర్స్ ఆరింటిలో ఐదింటిని గెలుచుకున్నా శ్రీ రావెళ్ళ సత్యం మాత్రమే ఓటమిని చవి చూశాడు.

మొత్తం ముప్పది ఓట్లువున్న సి.పి.యం కు ఇరువైతొమ్మిది ఓట్లు మాత్రమే వచ్చాయి.  ఆ ఆరోసీటులో శ్రీ సామినేని ఉపెంధ్రయ్య వర్గం అభ్యర్థి పెధగోపతికి చెందిన శ్రీ వెలనాటి అప్పయ్య కో-ఆప్షన్ మెంబెరుగా విజయం సాధించాడు. శ్రీ సామినేని ఉపెంద్రయ్య కో-ఆప్షన్ సభ్యునిగా ఓటమిని చెందారు.

శ్రీ రజబ్ ఆలీ మాత్రం తాను పార్టీ అభ్యర్థికి వెన్నుపోటు పొడవలేదని సిద్దారెడ్డి వర్గమే సి.పి.యం ఓటమికి కారణమని  ప్రకటన చేశాడు. కానీ 1971 నవంబరులో జరిగిన ఖమ్మంతాలుకా సమావేశంలో మాత్రం శ్రీ రావెళ్ళ సత్యం ఓటమికి  జరిగిన వెన్నుపోటు సి.పి.యం జిల్లాకమిటీ సభ్యుల వల్లనే జరిగిందని జిల్లా కమిటీ తీర్మానంచేసి అధిష్టానానికి నివేదికను పంపింది. ఆ సమయంలోనే ఏదులాపురం గ్రామంలో జరిగిన ఖమ్మంతాలుకా  వ్యవసాయ కార్మిక సంఘం ఎన్నికలలో అధికారిక కార్యవర్గ సభ్యుల పానెలును శ్రీ రజబ్ ఆలీ వ్యతిరేకించటం జరిగింది. అలాగే ఖమ్మం కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎన్నికలలో డైరెక్టరుగా  శ్రీ సామినేని ఉపెంధ్రయ్య విజయానికి శ్రీ రజబ్ ఆలీ చేయూతను అందించటం జరిగింది.

శ్రీ రాయల వీరయ్యను ఖమ్మం సమితి అద్యక్ష బాధ్యతలనుండి అవిశ్వాసంతో దించి వేయటానికి శ్రీ సామినేని ఉపెంద్రయ్య ఎంతో దూకుడుగా ప్రయత్నాలు తీవ్రతరం చేయటం జరిగింది. 1967 లో శ్రీ సామినేని ఉపెంధ్రయ్యను సమితి అధ్యక్షునిగా దించివేయటానికి శ్రీ శీలం సిద్దారెడ్డి వర్గం అనుసరించిన పద్దతులనే శ్రీ ఉపెంద్రయ్య అనుసరించి శ్రీ ఉపెంద్రయ్య శ్రీ రాయల వీరయ్యను అద్యక్షపదవి నుండీ దించాలని ప్రయత్నాలు చేశారు. ప్రారంభం లోనే ముజ్జిగుడెం సర్పంచుపై అవిశ్వాసం ప్రతిపాదించగా హైకోర్టు స్టే మంజూరు చేయటంతో ఆయన ప్రయత్నాలు వీగిపోయాయి. 1971 లో శ్రీ రాయల వీరయ్య కొన్ని సాంకేతిక కారణాలవల్ల (సమావేశాలు సకాలంలో నిర్వహించలేధనే కారణం) హైకోర్టుఆర్డర్ ఇవ్వటం వల్ల కొంతకాలం అద్యక్షపదవికి ధూరం కావటంతో ఉపాధ్యక్షునిగా వున్న శ్రీ గండ్లురి కిషన్రావు ఆ సమయంలో సమితి అద్యక్ష బాధ్యతల నిర్వహించారు. శ్రీ రావెళ్ళ సత్యంకు వ్యతిరేకంగా ఓటు వేసిన ముత్తారం సర్పంచ్ తన పదవీకాలం పూర్తికాకముందే ఆత్మహత్య చేసుకోవటంవల్ల ఉపాధ్యక్షునిగా వున్న శ్రీ మల్లెల అనంతయ్య(సి.పి.యం) సర్పంచ్ బాధ్యతల నిర్వహించారు.

ఖమ్మం జిలాపరిషత్ ఎన్నికలు.

1970లో సమితి ఎన్నికలు అయిన వెంటనే జరిగిన ఖమ్మం జిల్లాపరిషత్ ఎన్నికలలో చైర్మనుగా కాంగ్రెస్ అభ్యర్థికి (శ్రీ శీలం సిద్దారెడ్డి వర్గం) సి.పి.యం మద్దతుతెలిపి జిల్లాపరిషత్ ఉపాధ్యక్షపదవిని తీసుకున్నది. ఖమ్మం జిల్లాపరిషత్ చైర్మనుగా కాంగ్రెసుకు చెందిన శ్రీ రామసహాయం భువనసుందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా సి.పి.యం కు చెందిన శ్రీ టి.వి.ఆర్. చంద్రం ఎన్నిక అయినారు.  


ఖమ్మం జిల్లాపరిషత్ చైర్మన్ ఎన్నికలలో కూడా కాంగ్రెసులోని వెంగళరావు, సిద్దారెడ్డి వర్గాలు రెండు రాజకీయ చదరంగాన్ని ఆడాయి. ఖమ్మం జిల్లాపరిషత్ చైర్మనుగా శ్రీ లక్కినేని నరసయ్యను అధికారిక అభ్యర్థిగా ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి నిర్ణయించారు. కానీ జిల్లాకాంగ్రెసులోని ఇరువర్గాలు అసంతృప్తికి లోను అయ్యారు. శ్రీ శీలం సిద్దారెడ్డి వర్గం శ్రీ రామసహాయం భువనసుంధర్రెడ్డిని చైర్మన్ గా చేయటానికి పావులు కదిపింది. శ్రీ జలగం వెంగళరావువర్గం శ్రీ సామినేని ఉపెంధ్రయ్యను చైర్మనుగా చేయటానికి పావులు కదిపింది.


జిల్లాకాంగ్రెస్ సారధిగా శ్రీ లక్కినేని నరసయ్య వ్యవహార శైలిని చూసిన శ్రీ శీలం సిద్దారెడ్డి వర్గం ఆయన తమ వర్గరాజకీయాలకు తగడని భావించింది.

జిల్లాపరిషత్ ఎన్నికల పరిశీలకుడుగా వస్తున్న రాష్ట్ర సహకారశాఖామంత్రి శ్రీ కోట్ల విజయభాస్కరరెడ్డిని హైదరాబాద్ నుండి ఖమ్మం వచ్చే మార్గమధ్యంలో జిల్లా సరిహద్దు గ్రామం నాయకంగూడెం వద్దనే ఎన్నికల తతంగం పూర్తి అయ్యేవరకు ఆపాలని వ్యూహం రచించారు. స్థానికులతో మాట్లాడి రహదారిపై పశువులను అడ్డంగావుంచి ప్రయాణానికి ఆటంకం కలిగేలా శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు వ్యూహ రచన చేశారు. ట్రాఫికును స్తంభింప చేశారు.

విజయభాస్కరరెడ్డికి స్వాగతం పలికే నెపంతో అక్కడ శ్రీ శీలం సిద్దారెడ్డి, శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు, శ్రీ భుజంగరెడ్డి తదితర స్థానికులు వున్నారు. నాయకంగూడెం నుండి బయలుదేరిన తరువాత పాలేరు గ్రామంలో “టీ బ్రేక్” కోసం శ్రీ విజయభాస్కరరెడ్డిని మరికొంతసేపు ఆపారు.  ఫలితంగా శ్రీ కోట్ల విజయభాస్కరరెడ్డి సమయానికి జిల్లాపరిషత్ ఎన్నికలకు ఖమ్మం చేరుకోలేకపొయ్యారు. ఆయన చేరుకునేసరికే శ్రీ రామసహాయం భువనసుంధరారెడ్డి జిల్లాపరిషత్ చైర్మనుగా ఎన్నిక కాబడ్డారు.

తన ప్రాంతంలో తాను కాకుండా ఇంకో రాజకీయ కేంద్రం ఏర్పడుతుందని శ్రీ జలగం వెంగళరావు కూడా శ్రీ లక్కినేని నరసయ్య అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించాడు. కాగలకార్యం గంధర్వులే తీర్చినట్లు శ్రీ జలగం వెంగళరావు స్వయంగా భద్రాచలానికి చెందిన న్యాయవాది శ్రీ ఎం.ఆర్.కె. చౌదరిని రంగంలో దింపి లక్కినేని నరసయ్యను కో-ఆప్షన్ మెంబరుగా ఓడించాడు.

శ్రీ శీలం సిద్దారెడ్డివర్గం అనుకున్నది సాధించి శ్రీ ఆర్.భువనసుందర రెడ్డిని జిల్లాపరిషత్  చైర్మనుగా చేయగలిగినా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకాసు బ్రహ్మానందరెడ్డి ఎదుటకు పోవటానికి సాహసించలేక పోయారు. ఆయనకు సమాధానం చెప్పటానికి జంకారు. శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు మంచి వ్యూహకర్త. జిల్లాచరిత్ర లో అనేక చారిత్రక ఘట్టాలలో ఆయన ప్రమేయం కనిపిస్తుంది. చివరకు సిద్దారెడ్డివర్గం తరఫున శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు హైదరాబాదువెళ్లి ముఖ్యమంత్రిని ప్రసన్నంచేసుకుని శాంతింపజేశారు. జరిగిన పరిణామాన్ని ఆయన స్వాగతించేలా చేశారు.

అంతర్యుద్దాల తరువాత హత్యారాజకీయాలు.
కాంగ్రెస్ మరియు వామపక్షాలలో చోటుచేసుకున్న వర్గరాజకీయాలు ముదిరి రాజకీయ ముఖచిత్రాన్ని రక్తంతో తడిపేశాయి. ఆ ప్రాంత రాజకీయాలు హత్యా రాజకీయాలుగా, భౌతికంగా ఒక పార్టీవారు మరో పార్టీవారిని అనునిత్యం వెంటాడే స్థితికి చేరుకున్నవి.  ఎంతోమంది కమ్యునిస్ట్ మరియు కాంగ్రెస్ వ్యక్తులు హత్య గావించ బడ్డారు. 1970-71 మధ్యన ఖమ్మం తాలుకాలోని 18 గ్రామాలలో 47 క్రిమినల్ కేసులు, మధిర తాలూకాలోని 17 గ్రామాలలో 69 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయంటే అప్పటి పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ఇరువైపులా ముప్పది మంది కార్యకర్తలు హత్య కావించబడ్డారు.

ప్రారంభంలో ఖమ్మం తాలుకాలో 1971 లో తెల్దారుపల్లి గ్రామములోఒక రైతుకు, అతని దగ్గర పనిచేసే హరిజన రైతుకూలీకి మధ్యన జరిగిన ఘర్షణ ఫలితంగా రగులుకున్న చిచ్చు గ్రామ సి.పి.యం రెండువర్గాలుగా చీలిపోయి,  రెండు హత్యలు జరగటానికి కారణమైంది. చంద్రయ్య, లక్ష్మయ్య అనేవారు చనిపోయారు. కోర్టులో కేసులు నడుస్తున్నప్పుడే సి.పి.యం లోని రెండువర్గాలు బంధుత్వాలను కలుపుకొని రాజీపడ్డా, హరిజన రైతుకూలీకి చెందిన రిక్షాను తగులబెట్టటంతో గ్రామంలో మైనారిటీగా వున్న తమ బలం సరిపోదని  ఆవర్గం శ్రీసామినేని ఉపెంధ్రయ్యను ఆశ్రయించింది.

ఆ తరువాత జరిగిన  సంఘటనలో రిక్షాలో ఖమ్మం వెళుతున్న తెల్దారుపల్లికి చెందిన శ్రీ తమ్మినేని సుబ్బయ్యపై దాడి జరిగి తలపై దెబ్బపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన శ్రీసామినేని ఉపెంధ్రయ్య తరువాతి జీవితాన్ని ప్రభావితం చేసింది. తెల్దారుపల్లి గ్రామానికి ఒక ప్రత్యేకత వుంది. అది సి.పి.యం కంచుకోట. పంచాయతీరాజ్ వ్యవస్థ పుట్టిన దగ్గరనుండీ 2019 సర్పంచు ఎన్నికల వరకు ఆవూరు జనం ఓటుహక్కును ఉపయోగించుకోనలేదు. అన్నీ ఎకగ్రీవాలే అయినవి. 2019 ఎం.పి.టి.సి ఎన్నికలలో మాత్రమే పోటీజరుగగా సి.పి.యంను కాదని స్వతంత్ర అభ్యర్థిని గెలిపించారు.


శ్రీ జలగం వెంగళరావు రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతల స్వీకరించాక ఆయన అధికారబలంతో శ్రీ సామినేని ఉపెంద్రయ్య తన రాజకీయ ప్రత్యర్ధులు సి.పి.యంపై  ప్రతీకారచర్యలు తీవ్రతరం అయినవి. కాంగ్రెసులోని అంతర్యుద్ధాలు రాజకీయ చదరంగపు ఎత్తులతో, అవిశ్వాసాలతో ముగిశాయి. సి.పి.యంతో జరిగిన ఘర్షణలు హత్యలకు దారితీశాయి.  

కమ్మ్యునిస్టుల  కంచుకోట ప్రాంతంలో వున్న బాణాపురం గ్రామంలో పోలీసులను భారీగామోహరించి చేసిన రాష్ట్ర హోంమంత్రి శ్రీ జలగం వెంగళరావు పర్యటన ప్రభావం ఆ ప్రాంత రాజకీయాలను ప్రభావితం చేసిందని అంటారు. హత్యారాజకీయాలకు నాందివాచనం అక్కడనే జరిగిందంటారు. ఆ పర్యటన జరిగిన వెంటనే పమ్మి గ్రామానికి చెందిన వ్యవసాయకూలీ శ్రీ పెరుమాళ్ళ చంద్రయ్యను పట్టపగలే నడిబజారులో బండరాళ్ళతో మోది చంపారు. అటు తరువాత పోలీసు కాల్పులలో కమ్మ్యునిస్టు కార్యకర్త మందా నారాయణ మరణించాడు.

1970 ఏప్రిల్ మూడవవారంలో ఖమ్మంలో కోర్టు వాయిదాకి వెళ్లి వస్తున్న ముక్కా చిననరసయ్యను చంపారు. 1971 లో జరిగిన లోకసభ మధ్యంతర ఎన్నికల కౌంటింగ్ సమయంలో బొల్లెద్దు రామనాధాన్ని లైసెన్సులేని పిస్టలుతో కాల్చిచంపారు. సి.పి.యం పక్షాన అమ్మపేట సర్పంచుగా ఎన్నికైన వున్న కోయ వెంకట్రావు,  శ్రీ సామినేని ఉపెంద్రయ్య పక్షాన చేరిపోయిన తరువాత 1972 జనవరిలో ఒక “అటెంప్ట్ టు ముర్డర్”  కేసు విషయంలో కోర్టు విధించిన నాలుగు సంవత్సరాల శిక్షను అనుభవించటానికి పోవలసిన రెండురోజుల ముందర అమ్మపేటలో చంపేశారు. 1973 డిసెంబరులో గంధసిరి సర్పంచు గండ్ర వీరభద్రారెడ్డిని, 1976 ఫిబ్రవరి ఏడవ తేదీన కమ్యునిస్ట్ సీనియర్ నాయకుడు శ్రీ గండ్లురి కిషన్ రావును చంపేశారు.  శ్రీ గండ్లురి కిషనురావును హత్యచేసిన అనుమానిత వ్యక్తిపై కేసు నడచినా, సాక్ష్యంలేక కోర్టులో కేసు వీగిపోయింది. కానీ ఆవ్యక్తే వేరే కేసులో జైలునుండి పెరోలుపై బయటకు రావటంతో హత్యకు గురైనాడు. ఆ రోజులలో చాలా గ్రామాలలో పోలీసు క్యాంపులు వున్నా జరిగిన ఏ సంఘటనా ఆగలేదు అని అంటారు.

వామపక్షాల (సి.పి.ఐ, సి.పి.ఏం) మధ్యన ప్రత్యక్ష యుద్ధం.
ఖమ్మం తాలుకాలోని బస్వాపురం సర్పంచు సి.పి. కంచుకోటలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని మొదలైన ఘర్షణ చిలికిచిలికి గాలివానై 1972-79 సంవత్సరాల మధ్యన ఆప్రాంతంలోని వివిధ గ్రామాలలో సి.పి.యం సానుభూతిపరులపై, వారి ఆస్తులపై దాడులు జరిగాయి. పదకొండు మంది చనిపోయారు. 1987 ప్రాంతంలో కూడా ఎనిమిది మంది సి.పి.యం కార్యకర్తలు, నలుగురు సి.పి.ఐ.కార్యకర్తలు చనిపోయారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో వామపక్షాల మధ్యన ఎన్నికల అవగాహన కలిగి కలసి పయనించినా, ఖమ్మం నియోజకవర్గం అడ్డంకిగా వుండేది. యిక్కడ సమన్వయము చేయటం రాష్ట్రపార్టీకి కూడా సాధ్యంకాక  స్నేహపూర్వక పోటీ జరగటం గమనార్హం. 


ఈ సి.పి.ఐ, సి.పి.యం కొట్లాటల్లో ఛాతీకి దెబ్బతగిలి ఖమ్మం డివిజను సి.పి.యం ప్రధాన కార్యదర్శి శ్రీ రావెళ్ళ సత్యంకు గుండెపోటు వచ్చింది. కొద్దికాలంలో మరణించారు. అప్పుడు జరుగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఖమ్మం స్థానానికి సి.పి.యం పార్టీ ఎం.ఎల్.యే అభ్యర్థిగా శ్రీ రావెళ్ళ సత్యంను ప్రకటించివుంది. ఆయన మరణంతో శ్రీ మంచికంటి రామకిషనురావు సి.పి.యం అభ్యర్థిగా పోటీచేసి ఎం.ఎల్.ఎ గా విజయం సాధించారు.

1970 దశకం ఆఖరునాటికి (1978) జిల్లా రాజకీయస్వరూపం మారిపోయింది. శ్రీ జలగం వెంగళరావు, శ్రీ శీలం సిద్దారెడ్డి జిల్లారాజకీయ అవనికపై నుండి తప్పుకున్నారు. రాష్ట్రప్రభుత్వం శ్రీ మర్రి చెన్నారెడ్డి సారధ్యంలో ఏర్పాటుయింది. జిల్లాలో కాబినెటుహోదాలో శ్రీ కీసర అనంతరెడ్డి వున్నారు. ఆత్మీయులు సర్వశ్రీ బొగ్గారపు నారాయణ, కిలారి వెంకయ్య లాంటి వాళ్ళు ఇందిరా కాంగ్రేసులోకి వుండటంతో శ్రీ సామినేని ఉపెంద్రయ్య కూడా ఇందిరాకాంగ్రెసులోకి వచ్చారు. అక్కడవున్న శ్రీ పెండ్యాల సత్యనారాయణరావుకూడా శ్రీ సామినేని ఉపెంద్రయ్యను సాదరంగా ఆహ్వానించారు. శ్రీ పెండ్యాల సత్యనారాయణరావుకు శ్రీ సామినేని ఉపెంద్రయ్య భుజంపై చేయివేసి పలుకరించే చనువు వుండేది. 1957 అసెంబ్లీ ఎన్నికలలో శ్రీ లక్ష్మీకాంతమ్మ పోటీచేసినప్పటి నుండీ ఇద్దరికీ అనుబంధం. కాంగ్రెసు వర్గరాజకీయాల చదరంగం కొంతకాలం నడచినా తిరిగి అంతా సర్దుకుంది.

ఆ కాలంలో జిల్లాలో అభివృద్ధి తనపని తాను చేసుకుపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  నీటిపారుదల శాఖామంత్రిగా వున్న శ్రీ శీలం సిద్దారెడ్డి భారత ప్రభుత్వ కాబినెట్ మంత్రి ప్రముఖ ఇంజనీరు శ్రీ కే.ఎల్.రావు సహకారంతో నాగార్జునసాగరు జలాశయము నుండి ఎడమకాలువ ద్వారా ఖమ్మంజిల్లాకు సాగరుజలాలు రావటానికి శ్రీకారం చుట్టారు. ఖమ్మం ఏటిపైన ఆక్విడెక్టు కట్టేవరకు కాలువ పనులను పూర్తిచేసి మిగతా అసంపూర్తి పనులకు టెండర్లను  శ్రీ శీలం సిద్దారెడ్డి హయాములో పిలిచారు. వెంకటాయపాలెం డీప్ కట్ నుండి  పనుల ప్రారంభాన్ని, మంగాపురం మేజర్ ప్రారంభాన్ని శ్రీ జలగం వెంగళరావు ముఖ్యమంత్రి హోదాలో చేశారు.

1981 పంచాయతీ సమితి ఎన్నికలు వచ్చినప్పుడు అధ్యక్ష ఎన్నికలు ప్రత్యక్ష పద్దతిలో జరిగాయి. నామినేషన్ వేసిన ప్రముఖులలో శ్రీ సామినేని ఉపెంద్రయ్య ఒకరు. పార్టీ అధికారిక అభ్యర్థిగా శ్రీ బొగ్గారపు నారాయణను నిర్ణయించటంతో ఆయన పోటీనుండి విరమించుకున్నారు. వాస్తవంగా 1978 లో జరిగిన ఖమ్మం అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా శ్రీ బొగ్గారపు నారాయణను రాష్ట్రపార్టీ నిర్ణయించింది. కానీ ఆయన పోటీకి సుముఖతను చూపకపోవటంతో శ్రీ కీసర అనంతరెడ్డి రంగంమీదకు వచ్చారు. ఆ కారణంవల్లనే శ్రీ బొగ్గారపు నారాయణను ఖమ్మంసమితి అధ్యక్ష అభ్యర్థిగా నిర్ణయించటం జరిగింది.

అప్పుడు ఎన్.ఎస్.యు,ఐ మరియు యువజన కాంగ్రెసు రాజకీయాలలో చురుకుగా వున్న ఈ వ్యాసకర్త కూడా అద్యక్ష పదవికి నామినేషన్ వేయటం జరిగింది.

శ్రీ సామినేని ఉపెంద్రయ్య పోటీనుండి విరమించుకునే సమయంలో “బాబు! నేను పోటీనుండి విరమించుకుంటున్నా, నువ్వు కూడా విరమించుకో” అని ఈ వ్యాసకర్తతో చెప్పటం నాకింకా గుర్తుంది. మేము తరచు ఖమ్మంలోని “హిల్ బంగ్లా”లో శ్రీ కీసర అనంతరెడ్డి వద్ద కలిశేవారం. కానీ 1981 పంచాయతీసమితి కి జరిగిన ప్రత్యక్షఎన్నికలలో సి.పి.యంకు చెందిన శ్రీ రావెళ్ళ సత్యం సమితిప్రెసిడెంటుగా ఎన్నికఅయినారు. ఖమ్మం పంచాయతీ సమితి ప్రాంతంలో అప్పుడు ఎర్రజెండా రెపరెపలె ఎక్కువ అయినవి. 1981ఎన్నికలలో ప్రప్రధమంగా సి.పి.యం మరియు సి.పి.ఐ లు కలసిపోయి ఉమ్మడి అభ్యర్థులను నిలపటంవల్ల ఎన్నికలలో విజయాన్ని సాధించాయి.

ఈ ధశకంలలోని అసంపూర్తి విశేషాలు నా తదుపరి వ్యాసంలో....

                                                                                  
                                                                                                   ---పెండ్యాల వాసుదేవరావు 

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>


Saturday, April 20, 2019

వస్తుందా మార్పుకు అవకాశం.


       65. (SOCIAL-45) 

                   వస్తుందా మార్పుకు అవకాశం.


                                       ఏమవుతుంది నా దేశం
                                       వస్తుందా          
                                       మార్పుకు కోరుకున్న అవకాశం                
                                       డెబ్బది మూడు సంవత్సరాల వయస్సులో 
                                       నా దేశ ప్రజాస్వామ్యం 
                                       జాగ్రత్త గా 
                                       చూసుకోవాలి పాపం 
                                       అడుగులు తడపడు తున్నవి
                                       చరిత్ర పై మతిమరుపులు వస్తున్నవి
                                       జాగ్రత్త గా 
                                       చుసుకోవలసింది వారి వారసులే 
                                       వారే ఓటర్లు 
                                       మరేమో 
                                       వారే 
                                       మైకంలో వున్నారు 
                                       డబ్బు మత్తులో తూలుతున్నారు
                                       ఓటుకు నోటును అడుగు తున్నారు 
                                       మాటకు విలువ లేదు
                                       మూటకు ఆకర్షితులు అవుతున్నారు
                                       రోగం నయం చేసే డాక్టర్ లేదు 
                                       రోగం మాయం చేసే రాజకీయ పార్టీ లేదు
                                       నవతరానికి దిశా నిర్దేశం లేదు 
                                       ఐ. సి.యు లో ప్రజాస్వామ్యం
                                       ఎన్నికల ఆసుపత్రి లో
                                       లేనేలేదు కావలసిన ఆక్షిజన్
                                       ఆక్షిజన్ అందే దేట్లా?
                                       ప్రజాస్వామ్యం కోలుకొనే దేట్లా?
                                       రోజుకు రెండు రూపాయలకు 
                                       ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెడుతున్నారు
                                       టోటల్ గా ఒక వేయి రూపాయలకే 
                                       బ్రతుకును ఖూనీ చేస్తారా 
                                       ప్రజాస్వామ్య రక్షణ నువ్వు మరుస్తే 
                                       సమాజం  వృద్ధాశ్రమంలోనికి నిన్ను మారుస్తే?... 
                                       నీ జీవితం దుర్భరమే
                                                                                                      -----పెండ్యాల వాసుదేవరావు.
                                                                                                                    29.01.2019.
                                                                                                                       3.45. AM.
<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>


Thursday, March 14, 2019

ప్రశ్నించే గొంతు కావాలి. నిలదీసే దమ్ము ఉండాలి.

            63. (SOCIAL-42) 

                  ప్రశ్నించే గొంతు కావాలి.  

                  నిలదీసే దమ్ము ఉండాలి.

                                       ఎవ్వరు బాధ్యులు?


ఒక రాజకీయపార్టీ టికెట్ పై, ఒక సిద్దాంతం పై  ఎం.ఎల్.ఏ గా పొటీ చేసి గెలిచి, మరో రాజకీయ పార్టీ లోకి వలస వెళుతున్న ఎం.ఎల్.ఏ లను నిలదీసే హక్కు ఎవ్వరికుంది? ఆ నైతిక హక్కు ఎవ్వరికుంది?

తమకోసం అహర్నిశలు పనిచేసే కార్యకర్తల గాలికొదిలేసి కాంట్రాక్టర్లకు, పారిశ్రామికవేత్తలకు డబ్బుకు కక్కుర్తిపడి పార్టీ టికెట్లను అమ్ముకుంటున్న బాధ్యతారహిత  రాజకీయ పార్టీల నేతలది కాదా  తప్పు? ప్రజాప్రతినిధి గా ఎన్నిక కావటానికి “బి” ఫోరం ఇచ్చిన రాజకీయ పార్టీ కుందా?

డిమాండ్ చేసి, ధర్నాలు చేసి మరీ పోటీచేసే అభ్యర్థుల దగ్గర డబ్బులు గుంజుకుంటున్న ఓటర్ల కుందా? సమాజాన్ని ప్రశ్నించే మీడియాకు ఓటర్ల ను ప్రశ్నించే దమ్ముందా? ప్రశ్నించే దమ్ము ఓటు వేసే సామాన్యులకు రావాలంటే ఏమి చేయాలి?

ఈ పరిణామానికి బాధ్యత ఎవ్వరిది?
అవినీతి ప్రపంచంలో ఈదుతున్న రాజకీయ పార్టీలదా? డబ్బు మత్తులో జోగుతున్న ఓటర్లదా?


ప్రజాస్వామ్య దేశంలో వారసత్వ రాజకీయ సంస్కృతికి , నామినేటేడ్  సంస్కృతికి తప్ప కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధాలు లేని రాజకీయ పార్టీ లెన్నో రాజకీయాలను శాసిస్తున్నవి.  పార్టీల్లో అంతర్గత పజాస్వామ్యం అంతరించి దశాబ్దాలు కావస్తోంది. అభ్యర్థులుగా పోటీలో వున్నప్పుడు బండబూతులు తిట్టి ఎం.ఎల్.ఏ గా గెలిచిన తరువాత తన ఓటమికి కష్టపడ్డ అధికార పార్టీ నాయకులు దైవాంశ సంభూతులుగా, దీన జన ఉద్దారకులుగా కనిపించటాన్ని  చరిత్రలో ఎలా లిఖించాలి? ఎవ్వరు ఎలాంటి వాడో తెలుసుకోలేని అమాయకులు  రాజకీయాలకు అర్హులా?

పెళ్ళైన భార్యాభర్తలు విడాకులు తీసుకోకుండా ఇద్దరిలో ఎవ్వరు మరో వివాహం చట్ట సమ్మతం కాదే, మరి ఒక రాజకీయ పార్టీ గుర్తుపై గెలిచి మరో రాజకీయ పార్టీ లోకి గెంతుతున్న ఎం.ఎల్.ఏ లు గెలిచిన పార్టీకి, పదవికి రాజీనామా చేయకపోవటం రాజకీయ వ్యభిచారం క్రిందకు రాదా?

                                    ఇందుకేనా స్వాతంత్రం ?
                            ఇందుకేనా ముందుతరం వాళ్ళు త్యాగాలు చేసింది. 
                                         ఆత్మ బలిదానాలు చేసింది?

ఓటర్లు మత్తులో వున్నంతకాలం సమాజం మారదు. ముందు తరానికి భవిష్యత్ అంధకారమే. రాజకీయ వ్యభిచారానికి అడ్డుకట్ట వేసే చట్టాల అమలుకు నడుం బిగించాలి. ఓటర్లను సంస్కరించే చర్యలను చేపట్టాలి. గొంగట్లో అన్నం పెట్టుకుని ....ఏరుకుంటే ప్రయోజనం లేదు.

                                      ప్రశ్నించే గొంతు కావాలి.  నిలదీసే దమ్ము ఉండాలి.
                          
                                                    ---పెండ్యాల వాసుదేవరావు 

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Sunday, January 6, 2019

మేధావులు కదలండయ్యా ....ఎన్నికల రంగలో పోగైన కలుపు ను తీసేద్దాం రండయ్యా...



62. (SOCIAL-41) 

మేధావులు కదలండయ్యా ....ఎన్నికల రంగలో పోగైన  కలుపు ను తీసేద్దాం ..రండయ్యా...


ఒకప్పుడు నాయకుడంటే ప్రజల్లోంచి వచ్చేవాడు, ప్రజల కోసం బ్రతికే వాడు. ప్రజలకోసం ఆస్తులు ధారపోసేవాడు. కుటుంబ జీవితాన్ని లెక్క జేయక ప్రజల కోసం పోరాటం చేసేవాడు. ఇచ్చిన మాటకోసం సమాజ సేవ కోసం నిరంతరం తపన పడేవాడు. ఎన్నికలొస్తే అయ్యా మీరే నిలబడండి మీమంతా మీపక్షమే నని జనాలు నాయకులకు  చెప్పేవారు. నిజాయితీగా నాయకులు పదవులకు ఎన్నిక అయ్యేవారు. 

కానీ నేడో...


తరాలు మారినయ్. ప్రజల మనస్తత్వాలు మారినవి. నాయకులను ఓటుకు నోటును ఓటర్లు అడుగు తున్నారు. నోటు లేనిదే పోలింగుకు రామంటున్నారు. మరికొందరైతే ఆ అభ్యర్ధి  డబ్బులిచ్చాడు మీరెందుకు ఇవ్వరని రహదారులపై ధర్నాలకు దిగుతున్నారు. ఒకప్పుడు నయాపైసా ఆశించకుండా అభ్యర్ధులకు ఓట్లేసిన ప్రజలు కాసులకై  కొట్లాడుతున్నారు. దేశంలోని అన్ని ప్రాంతీయ, జాతీయ రాజకీయ పార్టీలు (వామ పక్షాలకు ఇందులో మినహాయింపు లేదు) డబ్బులు పంచటంలో పూర్తిగా నిమగ్నమై దానితోనే గెలుపు గుర్రాల నేక్కాలని వువ్విళ్ళూరుతున్నారు.

రాజకీయపార్టీలు ఎన్నికల అభ్యర్ధుల నిర్ణయంలో కోట్ల రూపాయలను లంచంగా తీసుకుంటున్నారు. మరి కోట్ల రూపాయలను నీళ్ళలా ఖర్చు చేయగలిగిన వాళ్లనే పార్టీ అభ్యర్ధులుగా నిర్ణయిస్తున్నారు. అభ్యర్ధిగా నిర్ణయం చేయటానికి ఆ పార్టీలో సభ్యత్వం అక్కరలేదు. వేరే రాజకీయ పార్టీకి చెందిన వాడైనా, అప్పటివరకు ఆ రాజకీయ పార్టీకి రాజీనామా చేయక పోయినా అభ్యంతరం లేదు. తప్పు పట్టరు. ఈ పార్టీ టికెట్ పై గెలిచి ఫలితాలు రాగానే అధికార పక్షంలో చేరితే రాజ్యాంగ పదవిలో వున్న వారు ఫిరాయింపు దారులను అనర్హులను  చెయ్యరు. ఆ వ్యక్తిని ఓట్లేసి గెలిపించిన ఓటర్లు ఫిరాయింపుదారులను ప్రశ్నించే పరిస్థితులు లేవు. పాత్యాచ్చ దేశాల మాదిరి రీకాల్ హక్కు జనాలకు లేదు.

ఏమి సాధిస్తారని వీళ్ళకు వేల, లక్షల జీతాలు మరియు పదవీకాలం అయిపోయిన  తరువాత పెన్షన్ సధుపాయాలు. చేసిన హామీలు అమలు లేదు. అసెంబ్లీ మరియు పార్లమెంట్ సభ్యుల్లో అధిక శాతం సమావేశాలకే వెళ్లరు. ఇక వాళ్ళు చేసే ప్రజా సేవ ఏమిటి?

ఎటు పోతోంది ఈ దేశం ? ఏమై పోతోందీ సమాజం?
ఎందుకు ఇలా ? ఎంత కాలమిలా?


ఎన్నికల నిర్వహణకై చట్టాలు చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలను ఏర్పరచారు.  డబ్బు ఖర్చు పెట్టటానికి పరిమితులు పెట్టారు. 

ఎవరు పాటిస్తున్నారండీ ఇవన్నీ? చట్టాన్ని చేస్తున్న వాళ్ళే చట్టాన్ని భక్షిస్తున్నారు. నిబంధనల కు తూట్లు పొడుస్తున్నారు. అధికార దుర్వినియోగము చేస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికలైనా, స్థానిక సంస్థ ఎన్నికలు అయినా ఓటుకు వోటర్ స్లిప్ తో పాటు ఒక వెయ్యి రుపాయయల నోటు  ఇవ్వటం సర్వ సాధారణం అయిపోయింది. తప్పు చెప్పేవారు లేరు. తప్పు చేసే వాడిని చెప్పుతో కొట్టేవారు లేరు. డబ్బులు లేకుండా ఎన్నికల గోదాలో దిగితే పిచ్చి వాడిలా చూస్తున్నారు. భవిష్యత్తుకై పరితపించే నవతరాన్ని, సమాజ సంక్షేమాన్ని కాంక్షించే పెద్దరికాన్ని చూసి నవ్వుకుంటున్నారు. ఇది వరకు నిజాయితీగా పదవులు ఏలి అవినీతికి పాల్పడని వాళ్ళు, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో డబ్బులు పెట్టలేక సమకాలీన రాజకీయాలకు దూరంగా వుంటున్నారు.

ఇటీవల ఒక మిత్రుడు సమకాలీన రాజకీయాలను వర్ణిస్తూ ఒక కధ చెప్పాడు.

అడవిలో ఎన్నికలొచ్చాయి. అన్ని చెట్లకు ఓటు హక్కు కల్పించారు. సెలయేరు గొడ్డలి పోటీ పడ్డాయి. పోలింగ్ జరిగింది. చెట్లకు జీవనాధారమైన నీరు ఇచ్చే సెలయేరు గెలుస్తుందని అందరూ విశ్లేషకులు అనుకున్నారు. నిత్యం వృక్షాలను తెగనరికే గొడ్డలి చిత్తుచిత్తుగా ఓడిపోతుందని సర్వే ఫలితాలు ముందే చెప్పాయి. సెలయేటిపై గొడ్డలి భారీ మెజారిటీతో గెలిచింది. ఆశ్చర్యపోయారు. ఈ విషయమై వివిధ వృక్షజాతుల నాయకులను అడిగారు. “అవును, నిజమే, గొడ్డలి వలనే మా జాతి అంతరిస్తుంది, కానీ ఆ గొడ్డలి వెనుక వున్న కర్ర మా కులానికి చెందినది. అందుకే ఓటేశాం”..అన్నారట.

రంగులు మారుతున్న రాజకీయాల్లో ధనం, కులం, మద్యం మరియు మతం జడలు విప్పి నృత్యం చేస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలలో వార్డ్ మెంబర్ ఐదు లక్షలు, సర్పంచ్ అభ్యర్ధి వోటర్స్ సంఖ్యను బట్టి యాభయ్ లక్షలు/కోటి రూపాయలు,  అసెంబ్లీ అభ్యర్ధి యాభై కోట్లు, లోకసభ అభ్యర్ధి వందకోట్లు, రాజ్యసభ టికెట్ ఎనభై కోట్లు...ఇవీ మన దేశంలో నేడు అభ్యర్ధులు ఖర్చు చేయవలసిన రేట్లు. పెట్టిన డబ్బు తిరిగి ఆశిస్తాడు కదా. వడ్డీ కావాలి కదా. లాభం లేకుంటే ఎట్లా? మళ్లీ ఎన్నికల్లో  ఖర్చులకి పెట్టుబడి తీసుకోకుండా ఆగుతాడా?

ఈ దుర్మార్గాన్ని ఆపే వాళ్ళు ఎవ్వరు?
ప్రజలే బాధ్యతల తీసుకుని నాయకుల గెలిపించే రోజులు మళ్ళీ వస్తాయా?

ప్రజల నుంచి నాయకులు రావాలి. రాజకీయ పార్టీ ఎన్నికల అభ్యర్హులుగా ఆయా రాజకీయ పార్టీకి చెందిన సభ్యులు, కార్యకర్తలె రావాలి. పారిశ్రామిక వేత్తలు, కంట్రాక్టర్ ల వుక్కు పిడికిలి నుండి రాజకీయాలు విముక్తం కావాలి. అప్పుడే ఆ రాజకీయ పార్టీ ప్రజల హృదయాల గెలుచు కుంటుంది. రాజకీయాలలో నిజాయితీ నిలదోక్కుకుంటుంది. ఎన్నికలకు పట్టిన బూజు తొలగిపోతుంది. సమాజం వెలుగొందు తుంది.

ఒకేసారి అసెంబ్లీ, లోకసభా ఎన్నికలలలో మార్పును ఆశించలేము. ఆ మార్పు, ఆ ఉద్యమం గ్రామాల నుంచే రావాలి. యువత నడుం బిగించాలి. మేధావులు నవ సమాజానికి వుక్కు పిడికిలి బిగించాలీ. కదలండి ముందుకు. మీ మీ జన్మ స్థలాలకు కదలండి. నిజాయితీని గెలిపించండి.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>


Thursday, December 13, 2018

ఆ నాటి మా ఖమ్మం లో మారిన రాజకీయ ముఖ చిత్రం.

61. (ఖమ్మం చరిత్ర-9) 

ఆ నాటి మా ఖమ్మం లో మారిన రాజకీయ ముఖ చిత్రం.

విబేధాలతో  వామపక్షాలు ---
ఆధిపత్య రాజకీయాలతో కాంగ్రెస్ వాదులు .....

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముఖ్య జిల్లా నాయకుల చీలిక మరియు జిల్లా కమ్మ్యునిస్ట్ నాయకులలో కూడా  చీలికల్లో చీలిక రావడం ఖమ్మం జిల్లా రాజకీయ అవనికపై సరికొత్త సమీకరణాలకు దారి చూపాయి.

కాంగ్రెస్ పార్టీ లో జిల్లా నాయకుల చీలికలు. 
1967 అసెంబ్లీ ఎన్నికల వరకు కలిసేవున్నజిల్లా కాంగ్రెస్ నాయకులు ఆధిపత్య పోరాటంలో ఒకరికి ఒకరు ధూరం అయ్య్హారు. ఫలితంగా శ్రీ జలగం వెంగళరావు మరియు శ్రీ శీలం సిద్దారెడ్డి వర్గాలుగా కాంగ్రెస్ శ్రేణులు చీలిపోయినవి. వైవిధ్య రాజకీయ నేపధ్యాలతో అనుహ్యంగా  ఏకమైన వారు ఆధిపత్య పోరాటంలో విడిపోవటంతో జిల్లా రాజకీయ ముఖచిత్రం కొత్త రూపును సంతరించుకొంది. రాజకీయ సమీకరణలు మళ్ళీ మారిపోయాయి.

శ్రీ జలగం వెంగళరావు, శ్రీ శీలం సిద్దారెడ్డి రాజకీయ ప్రారంభంలో ఒకేవేధిక మీదకు వచ్చిన నాడే ఆధిపత్య ధోరణులకు అంకురార్పణ జరిగింది. ఆ విషయం జిల్లా కాంగ్రెస్ ఆఫీసు నూతన భవన నామకరణం దగ్గర బహిర్గతం అయినది. శ్రీ జలగం వెంగళరావు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ  అధ్యక్ష బాధ్యతలు  చేపట్టినప్పుడు  శ్రీ శీలం సిద్దారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. జిల్లా పార్టీ ఆఫీసు భవన నిర్మాణానికి నిధుల సేకరణ మొదలైన కార్యక్రమాల నిర్వహణకై ఒక సన్నాహక కమిటిని ఏర్పరచారు. ఆ కమిటీలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు భవనానికి “లాల్ బహాధూర్ శాస్త్రి“ పేరు పెట్టాలని నిర్ణయం జరిగింది. కానీ అనుహ్యంగా శ్రీ శీలం సిద్దారెడ్డి ఆఫీసు భవనానికి నీలం సంజీవరెడ్డి కి గుర్తుగా “సంజీవరెడ్డి భవనము” అని పేరు పెట్టాలని ప్రతిపాదనను ప్రవేశపెట్టాడు. అప్పుడు శ్రీ శీలం సిద్దారెడ్డి యం.ఎల్.సి. శ్రీ వెంగళరావు యిరకాటంలో పడిపోయాడు. ఇదివరకు అనుకున్న లాల్ బహదూర్ శాస్త్రి పేరుకు  భిన్నంగా  ‘సంజీవరెడ్డి భవనము ” అనే పేరును  శ్రీ వెంగళరావు సమర్ధించక తప్పలేదు. అదే పేరు ఖాయం అయినది. అలాగే శ్రీ సిద్దారెడ్డి స్వగ్రామం బనిగండ్లపాడు గ్రామంలో అంతకుముందు అనుకున్న పేరుకు భిన్నంగా ఆ గ్రామ స్కూల్ కు శ్రీ నీలం సంజీవరెడ్డి పేరును పెట్టక తప్పని పరిస్థితిని శ్రీ వెంగళరావు తీసుకుని వచ్చాడు. ఆ ఇద్దరు నాయకుల మధ్యన ఆధిపత్య ధోరణులు అలా ప్రారంభం అయినవి. 

బ్రహ్మానందరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరించాక రాష్ట్రమంత్రి వర్గంలో శ్రీ శీలం సిద్దారెడ్డికి అవకాశాన్ని ఇవ్వటం జరిగింది. అప్పటికే యం.ఎల్.ఏ.గా వున్న వెంగళరావుకు ఆ విషయం మింగుడు పడలేదు. అప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గందే పైచేయిగ వుంది. పూర్తి స్థాయి ఆధిపత్యం వారిదే అంటే న్యాయంగా వుంటుంది. రాజకీయ సమీకరణాల రీత్యా శ్రీ శీలం సిద్దారెడ్డిని మంత్రివర్గం లోనికి తీసుకొనటంలో ఆశ్చర్యము ఏమీలేదు. ఆ సమయంలో శ్రీ జలగం వెంగళరావు తాను యం.యల్.ఎ గా, తన తమ్ముడు శ్రీ జలగం కొండలరావు జిల్లా పరిషద్ అధ్యక్షుడుగా వున్నారు. అధిష్టానం ఆయన శైలిని గమనిస్తూనే వుంది. ఆ స్వేచ్చని ఆయనకు వదిలేసి రాష్ట్ర స్థాయిలో శ్రీ సిద్దారెడ్డి ఎదుగులకు మార్గం వేశారు.

1952 సార్వత్రికలలో అదికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి పార్టీ అభ్యర్థులు ఓడిపోవటానికి కారణమైనందుకు కాంగ్రెస్ పార్టీ నుండి శ్రీ జలగం వెంగళరావు మరియు శ్రీ శీలం సిద్దారెడ్డి లు ఇద్దరు ఆరు సంవత్సరాలు బహిష్కృతులు అయినారు. శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావుతో వున్న విబేదాలవల్ల ఆయనపై వేమ్సూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పొటీచేసి కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించబడిన నేపధ్యం శ్రీ వెంగళరావు గారిది. శ్రీ కొండా వెంకటరంగారెడ్డి గారి ప్రోద్బలంతో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి శ్రీ మాడపాటి రామచంద్ర రావు గారి ఓటమికి బహిరంగ ప్రచారము చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించ బడిన నేపధ్యం శ్రీ శీలం సిద్దారెడ్డిది. 1952 సార్వత్రిక ఎన్నికల తరువాత శ్రీ వెంగళరావు గారికి శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారితో ఆత్మీయ అనుబంధం ఏర్పడటం, అలాగే ఖమ్మంలో న్యాయవాద వృత్తిలో వుండి లా విద్యాభ్యాసంలో తన క్లాస్ మేట్ అయిన శ్రీ పెండ్యాల కృష్ణమూర్తి ద్వారా శ్రీ శీలం సిద్దారెడ్డి గారు శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు చెంతకు రావటం జరిగింది. అలా ముగ్గురు కలయిక జిల్లాలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమ్ ఏర్పడ్డాక శ్రీ కొండా వెంకట రంగారెడ్డి గారు శ్రీ శీలం సిద్దారెడ్డిని రాజకీయంగా విస్మరించారు. రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త రాజకీయ సమీకరణాలరీత్యా ఖమ్మంజిల్లా రాజకీయాలతో ఆయనకు శ్రీ శీలం సిద్దారెడ్డితో అవుసరంలేక పోయింది. శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారి చాణక్యంతో, శ్రీ కళా వెంకట్రావు గారి మార్గదర్శకత్వంతో శ్రీ నీలం సంజీవరెడ్డి రాజకీయ ప్రవాహంలో కలిసిన శ్రీ జలగం వెంగళరావు మరియు శ్రీ శీలం సిద్దారెడ్డిలు రాజకీయ నిచ్చెన నెక్కి శిఖరాల అధిరోహించారు.  

1967 అసెంబ్లీ ఎన్నికలలో యం.ఎల్.ఏ గా గెలిచియున్నా తనకు కాకుండా శ్రీ సిద్దారెడ్డి ని రాష్ట్ర కేబినెట్ లో కాబినెట్ మంత్రిగా తీసుకోవటం అవమానంగా భావించిన శ్రీ జలగం వెంగళరావు తన రాజకీయ భవిష్యత్తుకు రాజకీయ చదరంగం మొదలెట్టారు. ఆనాటి రాజకీయ అవుసరాలు మారి రాబోయే భవిష్యత్ కు ప్రత్యామ్నాయ పునాదులను వేయవసిన, వేసుకోవలసిన పరిస్థితి తనదని భావించాడు శ్రీ జలగం వెంగళరావు. రాజకీయంగా శ్రీ జలగం వెంగళరావుది ఒంటరికులం కావటంతో తన రాజకీయ సుస్థిరతకు చదరంగపావులు సొంతంగా కదపటం ఆ ప్రయత్నాలకు అంకురార్పణం చేయటం జరిగింది. శ్రీ శీలం సిద్దారెడ్డి రాష్ట్ర మంత్రి కావటంతో తన రాజకీయ ప్రత్యర్ధులు  ఎవ్వరో బేరీజు వేసుకుని వారికి చెక్ పెట్టె కార్యక్రమాలను తీవ్రతరం చేశారు శ్రీ జలగం వెంగళరావు. ఖమ్మం తాలుకా పై ద్రుష్టి పెట్టి ఆ నాయకులెవ్వరు జిల్లాను శాసించే స్థితిలో వుండకూడదు అనే నిర్ణయం తీసున్న ఆయన ఆ మార్గంను నిర్దేశించుకున్నాడు. శ్రీ శీలం సిద్దారెడ్డికి రాష్ట్ర స్థాయిలో దొరుకుతున్న ఆదరణకు జిల్లాలో తన స్థానం సొంతంగా నిర్మించుకోవటమే తన ఉన్నతికి తోడ్పడుతుందని భావించాడు.

ఖమ్మం కమ్యునిస్ట్ పార్టీలో మరియు  నాయకుల్లో చీలికలు.

మొదటి చీలిక.

1964 సంవత్సరంలో అంతర్జాతీయ రాజకీయాలలో వచ్చిన మార్పుల కారణంగా జాతీయ స్థాయిలో భారత కమ్యునిస్ట్ పార్టీ సి.పి.యం మరియు సి.పి.ఐ పార్టీ లుగా విడిపోవటంతో ఆప్రభావం ఖమ్మం జిల్లా కమ్యునిస్ట్ పార్టీ రాజకీయాలపై కూడా ప్రసరించింది. తొంభై శాతం ఖమ్మం జిల్లా కమ్యునిస్ట్ నాయకులు కార్యకర్తలు సి.పి.యం పార్టీ వేపే మొగ్గు చూపారు. సి.పి.ఐ పార్టీ నామ మాత్రంగానే మిగిలినధి. 1964, ఏప్రిల్ 16 & 17 తేదీలలో తనికెళ్ళ గ్రామంలో జరిగిన జిల్లా కమ్యునిస్ట్ సమితి సమావేశంలో అప్పటివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యునిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గా వున్న శ్రీ నల్లమల గిరిప్రసాద్ సి.పి.ఐ. సమర్దన వాదాన్ని వినిపించటాన్ని మెజారిటీ జిల్లా సభ్యులు విబేధించారు. కొక్కిరేణి గ్రామంలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశం లో మోడరేట్ విధానాలను బలపరచటాన్ని టి.బి. విట్టల్ రావు మినహా జిల్లా కమిటీ మొత్తం  వ్యతిరేకించటం వల్ల జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ పదవికి న్యాయం చేయలేనంటు ఆయన తన జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశాడు. డెబ్బది ఐదు మంది జిల్లా కమిటీ సభ్యులలో  అరవై తొమ్మిది మంది సి.పియం వేపు నిలిచారు. పార్టీని చీల్చటం ఇష్టంలేదని ఈ.సి. సభ్యుడిగా కొనసాగుతానని చెప్పారు, ఆ సమావేశం లోనే జిల్లా  సి.పి.యం. పార్టీ పగ్గాలు శ్రీ చిర్రావూరి లక్ష్మి నరసయ్య చేతికి వచ్చాయి.  జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ గా ఎన్నికైనాడు. శ్రీ మొహమ్మద్ రజబలీ కూడా సి.పి.యం పార్టీలోనే వున్నాడు. 1964 ఆగష్టు నెలలో అనుహ్యం గా శ్రీ నల్లమల గిరిప్రసాద్ సి.పి.ఐ. పార్టీ లో చేరాడు. శ్రీ రావెళ్ళ జానకిరామారావు మొదటినుండి శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యని విబేధించిన కారణంగా సి.పి.యం వైపుకు వెళ్లలేదు. 

రెండవ చీలిక.

1967 సంవత్సరంలో ఖమ్మం జిల్లాకు చెందిన సి.పి.యం అనుబంధ సంఘాల యువకులు మరియు విద్యార్థులు కొందరు తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి ప్రారంభించిన మార్శిస్ట్, లెనినిస్ట్ సిద్దాంతాలకు ఆకర్షితులు కావటంతో వారు జిల్లా సి.పి.యం పార్టీ ప్లీనంలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రతిపాదనను ప్రవేశ పెట్టగా రెండు ఓట్ల తేడాతో వీగి పోయింది. ప్రతిపాదన వీగి పాయినా వారు అదే పంధాలో వెళ్ళటంతో పాటు సి.పి.యం వ్యతిరేక ప్రచారం చేస్తుండటం తో  వారిని సి.పి.యం పార్టీ నుండి జిల్లా కమిటీ బహిష్కరించింది. ఇండియా లో ప్రధమంగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే మార్క్సిస్ట్, లెనినిస్ట్ ఉద్యమం ఉద్యమం ప్రారంభ అయింది. ఫలితంగా సి.పి.యం సంస్థాగతంగా చాలా నష్ట పోయింది. ఆ పరిణామం ఖమ్మం జిల్లా సి.పి.యం పై కూడా రాజకీయంగా ప్రతికూల  ప్రభావం చూపింది.

సి.పి.యం నుండి బహిష్కృతులైన వారు 1968, జూన్ 15 వ తేదీన ఖమ్మం లో భారీ బహిరంగ ప్రదర్శన చేసి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. శ్రీ చండ్ర పుల్లారెడ్డి ఆ సమావేశం లో ప్రసంగించారు. తరువాత అదే సంవత్సరం అక్టోబర్ నెలలో ఆరవ తేదీన కొత్తగూడెంలో జరిగిన బహిరంగ సభలో శ్రీ తరిమెల నాగిరెడ్డి ప్రసంగించారు. 

ఖమ్మం సమావేశం తరువాత ఖమ్మం జిల్లా కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు అయింది. మధిర తాలుకా గ్రామాలు మడుపల్లి. ముస్తికుంట్ల, గోవిందాపురం  ఖమ్మం, కొత్తగూడెం. పిండిప్రోలు, గార్ల, ఎల్లందు, సుబ్లవీడు నుండి వచ్చిన నాయకులతో సి.పి.ఐ.(యమ్.యల్) ఆవిర్భవించింది. ప్రారంభంలో పార్టీ చిన్నగానే వున్నా శ్రీకాకుళ గిరిజన పోరాటం ప్రభావంతో కొక్కిరేణి గ్రామంలో జరిగిన జనరల్ బాడీ సమావేశం తరువాత యం.యల్ పార్టీ కొత్త పుంతలు తొక్కి పగిడేరు గ్రామంలో భూస్వామి ఇంటిపై దాడితో ప్రారంభం అయిన ఉద్యమం అనేక మార్పులకు లోనై కొత్త పుంతలు తొక్కింది. ఎల్లందు ఏరియాలో ప్రముఖంగా పునాదులు పదిలం చేసుకుంది. సి.పి.యం పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎల్లందు ఏరియాలో యం.యల్ పార్టీకి వ్యతిరేకంగా  కార్యకలాపాలు చేయవద్దని స్థానిక నాయకత్వానికి ఆదేశం యిచ్చి వుండటంవల్ల కూడా అక్కడ యం.యల్ పార్త్రి పునాదులు ధృడంగా పడినవి.

ఇలా ఖమ్మం జిల్లాలో కామ్రేడులు వరుసగా చీలిపోవటం వల్ల సంస్థాగతంగా బలహీన పడి పార్ల మెంటరీ  ఎన్నికలలో వెనుక పడిపోయారు. ఎవ్వరో గొప్ప నాయకులు కమ్యునిస్ట్ పార్టీ మెడలు వంచి విజేతలు కాలేదు. ఇది అంతా కామ్రేడుల స్వయం క్రుతాపరాధం మాత్రమే. జాతీయ అంతర్ జాతీయ విధానాల పర్యవసానాలే. ఎన్నెన్నో చారిత్రిక తప్పిదాల ఫలితమే. 

పార్టీలో అంతర్గత సంక్షోభం. 
దీనికి తోడు  సి.పి.యం జిల్లా పార్టీ లో అప్పటి జిల్లా పార్టీ సెక్రటరీ శ్రీ చిర్రావూరి లక్ష్మి నరసయ్య నాయకత్వ విషయంలో తలెత్తిన సంక్షోభం తో జిల్లాలో వున్న అధికార కాంగ్రెస్ పార్టీ సి.పి.యం అంతర్గత వ్యవహారాలలో వేలు పెట్టటం ప్రారంభ అయినది. 

తనకు జిల్లా నాయకత్వ బాధ్యతలకోసం పార్టీలో కొట్లాడిన శ్రీ మొహమ్మద్ రజబలీ వ్యక్తిగతం గా శ్రీ చిర్రావూరి లక్ష్మి నరసయ్య నాయకత్వాన్ని వ్యతిరేకించి సి.పి.ఐ లోకి వెళ్లి పోవటంతో కామ్రేడుల తదుపరి రాజకీయాలను కాంగ్రెస్ నాయకులు ప్రభావితం చేశారు.

కామ్రేడుల చీలికలతో శ్రుతిమించిన  సి.పి.ఐ మరియు సి.పి.యం పార్టీ కార్యకర్తల పరస్పర యుద్దాలు ఒకవైపున.......

కాంగ్రెస్ లో మొగ్గ తొడిగిన గ్రూప్ తగాదాలు మరోవేపున ...

ఈ రెండు అనుసంధానమై ఖమ్మం జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేశాయి.

అవి ఏమిటో నా తదుపరి వ్యాసం లో చూద్దాము.

                             .....PENDYALA VASUDEVARAO


<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>


Tuesday, October 2, 2018

ఖమ్మంలో మహాత్మా గాంధి--ప్రజల మదిలో జాతి పిత జ్ఞ్యాపకాలు..

60 . (ఖమ్మం చరిత్ర-8) 

మహాత్మాగాంధీ 

ఖమ్మం వచ్చినప్పటి వేళ 

ఖమ్మం పట్టణ చరిత్రలో మరచిపోలేని చారిత్రక ఘట్టం.

Mahatma Gandhi's meeting was held in my ancestral land in Khammam town near Venkatagiri Railway gate 5 August 1946.— 



1942 సంవత్సరం ఆగస్ట్ నెలలో ప్రారంభమైన క్విట్ఇండియా ఉద్యమం 1945 లో ముగియటంతో వెంటనే గాంధీజీ దక్షిణ భారత హింది భాషా ప్రచార ఉద్యమాన్ని చేపట్టి పర్యటనలు ప్రారంభించారు.  

ఖమ్మం టౌన్ కాంగ్రెస్ ఈసమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలోనే 1946 సంవత్సరంలో నిజాం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పై వున్న నిషేధాన్ని ఎత్తి వేసింది. కమ్యూనిస్ట్ పార్టీ పై నిషేధాన్ని విధించింది. 1946, ఫిబ్రవరి 3, 4 తేదీలలో మద్రాస్ లో నిర్వహించిన  దక్షిణ భారత హింది భాషా ప్రచార కార్యక్రమం నుండి వస్తున్న గాంధీజీ, ఖమ్మం టౌన్ కాంగ్రెస్ కోరిక మేరకు మార్గ  మధ్యమంలో రైల్ ఆగగా ఫిబ్రవరి 5 వ తేదిన మహాత్మాగాంధి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఖమ్మం టౌన్ కాంగ్రెస్ కు అప్పుడు శ్రీ గెల్లా కేశవా రావు ప్రెసిడెంట్ గా వున్నారు.

స్వాతంత్య్ర దినోత్సవమ్ సందర్భము గా స్వాతంత్ర్య సమర యోధులను సత్కరించే కార్యక్రమంలో భాగం గా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా శ్రీ చింతనిప్పు లాలయ్య, కొత్త సీతారాములుతో కలిసి నేను వెళ్లినప్పుడు శ్రీ గెల్లా కేశవా రావు గారు ఆ మరపురాని ఘట్టాన్ని వివరించారు. "బాబు మేము ఏర్పాటు చేసిన సభా వేదిక స్థలం మీదే, ఇప్పుడు మీకు లేదులెండి" అని నాతో చెప్పారు. అలాగే గాంధిజీ ఆసీనులైన సభా వేదికను చెక్క బల్లలతో సుమారు ఇరవై అడుగుల ఎత్తు లో నిర్మించామని చెప్పారు. 15 నిమిషాల పాటు హింది లో సాగిన ఆయన ప్రసంగాన్ని శ్రీ మోటూరు సత్యనారాయణ తెలుగు అనువాదం చేసారని కూడా చెప్పారు. గాంధిజీ వెంట ఆయన కార్యధర్స్యులు ప్యారేలాల్ గాంధీ, మహాదేవ దేశాయ్ వున్నారని చెప్పారు. కమలాదేవి బజాజ్ కూడా వెంట వున్నారు.

అది ఖమ్మం పట్టణ చరిత్రలో మరచిపోలేని చారిత్రక ఘట్టం. మధుర క్షణాలు. అప్పుడు ఖమ్మం నిజాం రాష్ట్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండేది. నిజాం విమోచనం/ఇండియాలో విలీనం అయిన తరువాత హైదరాబాద్ రాష్ట్రంలో 1953 సంవత్సరంలో ప్రత్యేక జిల్లాగా ఏర్పడినది.

1946 సంవత్సరంలో ముస్లిం మెజారిటీ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తిని ఇవ్వాలనే ఆలోచనతో బ్రటిష్ ప్రభుత్వం "బ్రిటిష్ కాబినెట్ మిషన్ " ప్రతిపాదనను తీసుకవచ్చింది. ఇది దేశంలో అలజడికి కారణం అయినది. దేశ విభజనకు అది దోహద పడుతుందనే అనుమానం తో గాంధి దీనిని నిరాకరించాడు. కాని నెహ్రు, పటేల్ లు దేశం ముస్లిం లీగ్ పరం అవుతుందనే భయంతో గాంధి మాటను త్ర్హోసిపుచ్చారు. హిందూ-ముస్లిం కొట్లాటలు తారాస్థాయికి వెళ్లి అయిదు వేల మంది ప్రజలకు పైగా హత్య గావించ బడ్డారు. పర్యావ సానమే కొన్ని శక్తులు గాంధిని హత మార్చ ప్రయత్నిన్చాయి.

మహాత్మా గాంధి మరణం --ప్రజల్లో తీరని విషాదం.


1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా ఆయనను నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. 1944 నుంచి 1948 వరకూ మహాత్మా గాంధీకి ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసిన వెంకిట కల్యాణం ఆయన హత్య జరిగినప్పుడు పక్కనే ఉన్నారు. ఆయన మాటల ప్రకారం"1948 జనవరి 30వ తేదీ సాయంత్రం 5:17 గంటలకు మహాత్మాగాంధీ ఢిల్లీలోని బిర్లాహౌస్లో ప్రార్థనా సమావేశాన్ని ముగించి బయటకు వస్తున్నప్పుడు నాథూరాంగాడ్సే ఆయనకు ఎదురుగా వచ్చారు. అప్పుడు గాంధీ పక్కనే ఉన్న సహచరి అషా ఛటోపాధ్యాయ గాడ్సేను పక్కకు నెట్టివేస్తూ ఆలస్యమైంది పక్కకు జరగండి అంటూ తోస్తూనే ఉంది. కానీ గాడ్సే పాయింట్ 380 ఏసీపీ, 606824 సీరియల్ నెంబర్ కలిగిన బెరెట్టా ఎం 1934 అనే మోడల్ సెమి-ఆటోమెటిక్ పిస్టల్తో గాంధీ ఛాతిలోకి మూడుసార్లు కాల్చారు. దీంతో బాపూజీ అక్కడికక్కడే కుప్పకూలారు. కాల్చిన ఒక బుల్లెట్ గాంధీ ఛాతిలోకి దూసుకొని పోగా మిగిలిన రెండు బుల్లెట్లు పొట్ట నుంచి దూసుకెళ్లాయి. 

అంతే.

జాతి పిత నేల కొరిగాడు. దేశం యావత్తూ విషాదం లో మునిగి పొయింది.

                                                                .......PENDYALA VASUDEVARAO

----Published on Date: 17.04.2018.
Republished on Date: 03.10.2018.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Monday, September 3, 2018

ఆ నాటి మా ఖమ్మం....ఒక కురుక్షేత్రం..

59. (ఖమ్మం చరిత్ర-7) 

ఆనాటి మా ఖమ్మం .... ఒక కురుక్షేత్రం.


ఖమ్మం జిల్లా ఎన్నికల చరిత్ర ప్రముఖం గా ఖమ్మం, వేమ్సూర్ మరియు మధిర అసెంబ్లీ ఎన్నికల చరిత్ర తో ముడిపడి వుంది.

ఖమ్మంజిల్లా చరిత్ర ప్రస్తావనలో ఖమ్మం నాయకుల గురించి చెప్పుకోవలసి వస్తే శ్రీబొమ్మకంటి సత్యనారాయణరావు, పెండ్యాల సత్యనారాయణరావు, శ్రీ జలగం వెంగళరావు మరియు శీలం సిద్దారెడ్డి  పేర్లు ప్రముఖంగా వస్తాయి.

1949 సంవత్సరం నైజాం ప్రాంతంలో కీలకమైనవి. ఈ ప్రాంతంలో ముఖ్యమైన కమ్యునిస్టు పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాల్లో మార్పులు సంభవించాయి. వరంగల్ జిల్లాలో కుడా ఈ రెండు పార్టీల నాయకత్వాలు మారిపోయాయి. ఈ రెండు పార్టీల జిల్లా మరియు రాష్ట్ర పార్టీల నాయకత్వంలో ఖమ్మం నాయకులే వుండటం గమనార్హం. వాటి ఫలితమే 1952 ఎన్నికల నుండి జరిగిన రాజకీయ పునరేకీకరణలు.

విశాలాంధ్ర సిద్ధాంతంను(ఆంధ్ర మరియు తెలంగాణా ప్రాంతాల విలీనం—భాషా ప్రయుక్త రాష్ట్రాలు) వ్యతిరేకించిన వారు కాంగ్రెస్ పార్టీ లో ఒంటరి వారు కావటం, నైజాం సంస్థానం ఇండియాలో విలీనం కావటాన్ని కమ్యునిస్టు పార్టీ వ్యతిరేకించిన కారణంగా ఆ పార్టీ నుండి కొందరు పార్టీ వీడిపోవటంతో ఈ మార్పులు సంభవించాయి. 

హైదరాబాద్ రాష్ట్రం లో 1949 నుండి 1951 ఆఖరు వరకు కమ్యునిస్ట్ లు ఆయుధాలు చేబూని underground కెళ్ళి పోయారు. దాదాపు అది భారత ప్రభుత్వం పై యుద్ధం అనే అనుకోవాలి. 1949 నుండి కాంగ్రెస్ పార్టీ వారు భారత ప్రభుత్వంలో వున్న కాంగ్రెస్ హేమాహేమీలతో సంప్రదింపులతో రాజ్యాధికారం కోసం రాజకీయ చదరంగం మొదలెట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ హేమాహేమీ నాయకులంతా ఢిల్లీ చట్టూ చక్కెర్లు కొట్టారు. కమ్యునిస్ట్ అగ్రనాయకులు కొందఱు పోరాటం ఆపే ప్రయత్నంలో అనుమతికై రష్యా వెళ్లారు. ఎన్నికలసమీపించే తరుణంలో  కమ్యునిస్ట్ సాయుధ పోరాటం పోరాటం ముగిసింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రతింది శ్రీ వెల్లోడి హైదరాబాద్ రాష్ట్ర పాలనా బాధ్యతలలో వున్నారు. POLICE ACTION తరువాత హైదరాబాద్ రాష్ట్రం లో వున్నా మిలిటరీ గవర్నర్ MAJOR GENARAL CHOUDHARY తరువాత శ్రీ వెల్లోడి నియమించబడ్డారు. కాంగ్రెస్ రాజకీయ చదరంగం నిరంతర ప్రక్రియలా కొనసాగింది.

మొదటి నుండి శ్రీ పండిత నెహ్రు విశాలాంధ్రకు వ్యతిరేకంగా వున్నా హైదరాబాద్ రాష్ట్రంలో కన్నడ, మహారాష్ట ప్రాంతాలకు చెందిన  ఔరంగాబాద్ మరియు గుల్బర్గా Divisions  మినహాయిస్తే తెలంగాణా ప్రాంతంలో వున్న వరంగల్ మరియు గుల్శానాబాద్(మెదక్) Division ల కమ్యునిస్ట్ పార్టీ ప్రభావానికి మున్ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఫలితాల పరంగా నష్టపోతుందని సర్దార్  వల్లభాయి పటేల్ తో సహా మిగతా నాయకులందరు ఆయను ఒప్పించటం జరిగింది. 

కమ్మ్యునిస్ట్ ల ప్రభావము అంటే ముందుగా నల్లగొండ  మరియు వరంగల్  జిల్లాలే  వస్తాయి. ప్రధమ సారస్వత ఎన్నికల ముందర ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలు రెండింటిలో కనిపించిన కమ్యునిసస్ట్ ల  హవా అందరిని ఉలిక్కి పడేలా చేసింది. ఎన్నికలు అయిపోయిన తరువాత ఫలితాలు విస్మయ పరిచాయి.

ప్రధమ సారస్వత ఎన్నికల ప్రచారానికి పండిత జవహర్లాల్ నెహ్రు కాంగ్రెస్ పక్షాన ప్రచారానికి వరంగల్ పట్టణానికి వచ్చారు. భారీ ఎత్తున జరిగిన ఆ మీటింగ్ కు ప్రజలు ఇసుక వేస్తె రాలనంతగా వచ్చారు. ఖమ్మం నుండి రైలుబోగీల లోపల నిలవబడటానికి కూడా స్థలం దొరుకక రైలు బోగీల టాప్  మీద కుర్చుని జనాలు సమావేశానికి వెళ్లారు. జనాలైతే సమావేశానికి వేళ్ళారు కాని ఓట్లు మాత్రం కమ్యునిస్ట్ అభ్యర్థులకే వేశారు. వరంగల్, నల్లగొండ మరియు ఖమ్మం లోకసభా నియోజక వర్గాలలో కమ్యునిస్ట్ అభ్యర్థులే విజయం సాధించారు. నల్లగొండ లోకసభా స్థానంలో కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ రావి నారాయణరెడ్డి పండిత జవహర్లాల్ నెహ్రు కు వచ్చిన ఆధిక్యం కంటే ఎక్కువ ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఫలితాలే చివరకు విశాలాంధ్ర వాదానికి సంపూర్ణ మద్దతు లభించటానికి కారణము అయింది. ఆంధ్రా కమ్యునిస్ట్ నాయకులు కూడా విశాల ఆంధ్రాకే మద్దతు ప్రకటించటంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎర్పడింది.

ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చివరకు ముగ్గురు అభ్యర్థులు రంగంలోకి రాగా ఆంధ్రా మరియు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ బెజావాడ గోపాలరెడ్డి మరియు శ్రీ బూర్గుల రామకృష్ణారావు లను ఇద్దరికి నచ్చజెప్పి  ఆ తరువాత గవర్నర్లుగా పంపారు. శ్రీ నీలం సంజీవరెడ్డి తన రాజకీయ చదరంగపు ఎత్తులతో  తన సొంత వర్గ నిర్మాణ ప్రక్రియలో పావులు కదిపారు. ఆ ఫలితం ఖమ్మం జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. రాజకీయ పునరేకీకరణలకు కారణమైనది. 

శ్రీ నీలం సంజీవరెడ్డి 1960 లో AICC PRESIDENT గా ఎన్నికైనందువల్ల ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రెసిడెంట్ గా వున్నందువల్ల ఆయన జిల్లాలో వేసిన రాజకీయ పునాది కదలలేదు.

జిల్లా లోని అసెంబ్లీ నియోజక వర్గాల చరిత్ర.


ఎల్లందు ద్విసభ్య అసెంబ్లీ నియోజక వర్గం.


ఎల్లందు అసెంబ్లీ నియోజకవర్గం మొదటి రెండు ఎన్నికలలో  ద్విసభ్య నియోజక వర్గంగా వుండేది. 1978 లో  పూర్తిగా ST లకు రిజర్వు అయ్యేటంత వరకు 1952,1957, 1962 కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ కే.యల్. నరసింహారావు, 1967 లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గోగినేని సత్యనారాయణ మరియు 1972  లోకాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  శ్రీ వంగా సుబ్బారావు గెలుపొందారు. 1967 మరియు 1972 అసెంబ్లీ ఎన్నికలలో CPI మరియు CPM పార్టీల అభ్యర్థులు ఇద్దరు విడి విడిగా పోటిలో వున్నారు. 1952, 1957 సంవత్సరాలలో రిజర్వేడ్ స్థానంలో వరుసగా శ్రీ ఉకే అబ్బయ్య (సోషలిస్ట్), శ్రీ దొడ్డా నరసయ్య (కాంగ్రెస్) లు గెలుపొందారు.

పాల్వంచ/కొత్తగూడెం  అసెంబ్లీ నియోజక వర్గం.


1957 ఏర్పాటు అయిన పాల్వంచ అసెంబ్లీ నియోజక వర్గంలో మొదటగా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ కే. సుదర్శన్రావు కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ పర్చా సత్యనారాయణ పై గెలుపొందారు. 1962 ఎన్నికలలో కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ పర్చా సత్యనారాయణ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ కే.వెంకటరామారావుపై గెలుపొందారు. 1967 లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ పానుగంటి పిచ్చయ్య కమ్యునిస్ట్ పార్టీ అభ్యర్థి శ్రీ పర్చా సత్యనారాయణ పై గెలుపొందారు. 

1972 లో కొత్తగూడెం అసెంబ్లీ నియోజక వర్గం అవతరించింది. 1972 లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ చేకూరి కాశయ్య CPI అభ్యర్థి యం. కొమరయ్య పై గెలుపొందారు.  1978 లో జనతాపార్టీ అభ్యర్థి శ్రీ చేకూరి కాశయ్య కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ వనమా వెంకటేశ్వరరావు పై గెలుపొందారు.

బూర్గంపాడు అసెంబ్లీ చరిత్ర.


1962 లో ఏర్పడిన బూర్గంపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటగా కమ్యునిస్ట్ పార్టీ అభ్యర్థి శ్రీ కంగల బుచ్చయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ కొమరం రామయ్య పై కేవలం నలభై రెండు ఓట్ల తేడాతో గెలిచాడు. 1967 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ కొమరం రామయ్య కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ కంగల బుచ్చయ్య పై 16,300 ఆధిక్యంతో గెలుపొందారు.1972 లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ కొమరం రామయ్య ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీ జి.సీతయ్య పై 8,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ  చరిత్ర.


1959 లో భద్రాచలం ప్రాంతం ఖమ్మం జిల్లాలో విలీనమైన తరువాత ఆ నియోజకవర్గం జనరల్ సీట్ గా వున్నప్పుడు 1962 ఎన్నికలలో కమ్యునిస్ట్ పార్టీ అభ్యర్థి శ్రీ యం.డి.తహసిల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి వాణిరమణారావు పై 13,500 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 1967 ఎన్నికలలో శ్రీ కారం కన్నయ్య ఉభయ కమ్యునిస్ట్ అభ్యర్థులపై గెలుపొందారు. 1972లో శ్రీయం.రామచంద్రయ్య ఉభయ కమ్యునిస్ట్ అభ్యర్థులపై గెలుపొందారు.

మొదటి ఎన్నికల దశాబ్దంలో మధిర మరియు వేమ్సూర్ అసెంబ్లీ చరిత్ర.


1. శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు.


శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు స్వాతంత్ర్య సమరయోధులు. నింగి కెగసి క్రింద పడ్డ కెరటం. నిజాం వ్యతిరేక పోరాటంలో శ్రీ జమలాపురం కేశవరావు నాయకత్వంలో పనిచేశారు. వరంగల్ జిల్లా వున్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులలో ఒకరు. రజాకార్ ముమెంట్లో బోర్దర్ కాంప్ లో కీలక భూమికను పోషించిన వారు. 1952 సంవత్సరంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సారధిగా శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు వున్నారు. శ్రీ జమలాపురం కేశవరావు తరువాత ఖమ్మం కాంగ్రెస్ లో శ్రీ బొమ్మకంటి కీలక వ్యక్తి అయినారు. 

వరంగల్ జిల్లాలో అంతర్భాగం అయిన ఖమ్మం ప్రాంతం 1950 లో వెల్లోడి ప్రభుత్వంలో అదనపు జిల్లాగా ఆవిర్భవించింది. 1953 లో బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లా ఏర్పడినది. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక డిగ్రీ కాలేజీ ను ఏర్పాటు చేయవలేనని నిర్ణయించింది. హైదరాబాద్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో మొదట ప్రభుత్వ అనుమతితో ప్రైవేటు కమిటీ డిగ్రీ కళాశాలలు ప్రారంభం అయినవి. ఖమ్మం పట్టణంలో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు అధ్యక్షుడుగా, శ్రీ సర్వదేవభ్ట్ల నరసింహ మూర్తి (యెస్.యన్.మూర్తి) ప్రధాన కార్యదర్శిగా ఏర్పడిన పేరెంట్స్ కమిటీ కృషితో జగ్గయ్యపేటకు చెందిన శ్రీ గెంటాల నారాయణ రావు, తన ఇష్ట దైవం పేరుతో తన పేరు కలిపి పెట్టె షరతు మీద  ఖమ్మం లో డిగ్రీ కాలేజీ స్థాపనకు లక్షరూపాయల నిధులను ఇస్తాననే ప్రతిపాదనను శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు పేరెంట్స్ కమిటీలో ఆమోదించిన ఫలితంగా ఖమ్మం లోని S.R & B.G.N.R COLLEGE ఏర్పాటు అయినదని చెబుతారు. అదే జిల్లాలో మొదటి డిగ్రీ కాలేజీ. ఆ సమయంలో శ్రీ గెంటాల వారికి తన స్వగ్రామం గండ్రాయి లోనున్న తన భూమిని కాకిరాయి వ్యాపారంకు లీజ్ కు ఇవ్వటం వల్ల లక్షల రూపాయలు  ఆర్ధికంగా కలసి వచ్చింది.

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం ప్రాంతంలో తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవటానికి తన బందువర్గాన్నే ఎక్కువగా వినియోగించుకున్నారు. నేలకొండపల్లి ప్రాంతంలో తన Classmate అయిన  శ్రీ రావులపాటి జానకిరాంరావు కుటుంబాన్ని వేదికగా  చేసుకున్నారు. ఆ నాటి రావు వర్గం రాష్ట్ర నాయకులతో  బంధుత్వాలు కలిగిన నేలకొండపల్లి వాసి శ్రీ కంకిపాటి జగమోహన్రావు ను రాజకీయంగా కలుపుకున్నారు. రాజ్యాధికారం వేపు వడివడిగా అడుగులు వేసిన ఏకైక వ్యక్తి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు ఒక్కరే. ఆయన అధికారం ఎలా వుండేదంటే మొట్ట మొదటి జిల్లా Collector గా తన పలుకుబడిని వినియోగించి  డిప్యూటి కలెక్టర్ స్థాయి వ్యక్తిని జిల్లా కలెక్టర్ గా నియమించుకొని ఇంట్లో బంట్రోతు గా ఉపయోగించుకున్నట్లు ఆయన పై ఆరోపణ లున్నవి. ఈ మనస్తత్వమే తదుపరి ఆయన రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేసింది.

శ్రీ జమలాపురం కేశవరావు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ లో బలమైన వర్గమైన విశాలాంధ్ర వాదుల వల్ల నాయకత్వంలో కొద్దిగా వెనుకపడ్డ తరువాత ఆ స్థానం కోసం శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు అనేక చదరంగపు పాచికలను విసిరారు. 1954 లో విశాలాంధ్ర వాదం ఆధారంగా హైదరాబాద్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి పోటిచేసి శ్రీ కొండా వెంకటరంగారెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఆనాటి ఎన్నికలు మధిరలోనే పార్టీ పరిశీలకుల సమక్షంలో జరగటం విశేషం. పిదప ముఖ్యమంత్రి పదవికి ఎన్నో పాచికలు విసిరారు. 

శ్రీ నీలం సంజీవరెడ్డికి చివరినిమిషంలో మద్దతు ప్రకటించిన వర్గంలో ప్రముఖుడిగా వున్నా, 1958 లో మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో శ్రీ జలగం వెంగళరావు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష భాధ్యతల స్వీకరించటంతో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవ రెడ్డి కి వ్యతిరేకంగా 1959 లో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఏర్పడిన వర్గంతో చేతులు కలిపారు.

P.V.G.RAJU చైర్మన్ గా విజయవాడ పట్టణం లో 20TH MAY 1959 లో ఏర్పడిన SOCIALISTIC DEMOCRATIC PARTY (SDP) కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినారు. శ్రీ మర్రి చెన్నారెడ్డి అప్పుడు అదే పార్టీ తరఫున LEGISLATURE PAARTY నాయకుడు అయినారు.

ఆంధ్రా నాయకులు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు మరియు శ్రీ కొండావెంకట రంగారెడ్డి వర్గం అండతో ముఖ్యమంత్రి కావచ్చని భావించారు. చివరకు ఆయన ఎక్కిన నిచ్చెన పట్టు తప్పింది. శ్రీ PV.G.RAJU మరియు శ్రీ మర్రి చెన్నారెడ్డిలు 20th MAY 1959 న SDP రద్దు చేస్తున్నట్లు ప్రకటించి  కాంగ్రెస్ పార్టీ లో చేరి శ్రీ దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో శ్రీ బొమ్మకంటి ఎన్నికల రాజకీయ రంగంలో వెనుకపడి పోయారు. SDP యొక్క జీవిత కాలం కేవలం ఏడు నెలలు మాత్రమే. 

శ్రీ జమలాపురం కేశవరావును మధిర ఎన్నికల బరినుండి తప్పిస్తే తాను మధిర అసెంబ్లీ నుండి అసెంబ్లీలో ఆడుగు పెట్టవచ్చని భావించి మధిర అసెంబ్లీకి 1952 సంవత్సరంలో శ్రీ జమలాపురం కేశవరావుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకుండా తన పలుకుబడితో అడ్డుకున్నారని ఆయన పై అభియోగాముంది. శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు ఆత్మీయులు మాత్రం ఆ రాజకీయం శ్రీ మాడపాటి రామచంద్రరావు చేశాడంటారు. ఆ స్థానంలో పార్టీ టికెట్ ను శ్రీ మాడపాటి రామచందర రావు దక్కించుకున్నారు. అప్పుడు శ్రీ మాడపాటి  రామచందర్ రావు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీగాను మరియు శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు వరంగల్ జిల్లా  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగాను వున్నారు.

ఇక శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావుకి వేమ్సూర్ అసెంబ్లీ టికెట్ తప్ప జిల్లాలో వేరే అవకాశం లేదు. చివరకు 1952 సంవత్సరంలో ప్రధమంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వేమ్సూర్ స్థానానికే పార్టీ టికెట్ ను సంపాదించారు. 1957 లో మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుండి, 1962 లో ఎల్లందు అసెంబ్లీ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటి చేసినా 1957 లో మధిరలో మాత్రమే విజయాన్ని సాధించారు. క్రమంగా 1967 ASSEMBLY ఎన్నికల తరువాత ఎన్నికల బరిలోనుండి తప్పుకున్నారు.

మధిర అసెంబ్లీ ఎన్నికల గణంకాలు.


 1957 లో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు (21,149 ఓట్లు రాగా) కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ నండురు ప్రసాదరావు (18,546 ఓట్లు వచాయి) పై 2603 ఓట్ల ఆధిక్యం తో గెలుపొందారు. 

1962 లో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన తోడల్లుడు కమ్యునిస్ట్ పార్టీ అభ్యర్థి అయిన శ్రీ K.L.నరసింహారావు పై ఓటమి చెందారు. అప్పుడు శ్రీ బొమ్మకంటికి 14,914 ఓట్లు రాగా శ్రీ కే.యల్.నరసింహారావుకు 21,557ఓట్లు వచాయి. శ్రీ కే.యల్.నరసింహారావు 6,643 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

1967 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రేస్ పార్టీ టికెట్ పొందలేక పోవటంతో ఇండిపెండెంట్ గా పోటి చేసి ఓటమిని చెందారు. ఆ ఎన్నికలలో శ్రీ దుగ్గినేని వెంకయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ బోడేపూడి వెంకటేశ్వరరావు సి.పి.యం అభ్యర్థిగా పోటి చేయగా శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు ఇండిపెండెంట్ గా పోటి చేశారు. శ్రీ దుగ్గినేని వెంకయ్యకు  26,821 ఓట్లు రాగా శ్రీ బోడేపూడికి 15,672 ఓట్లు మరియు  శ్రీ బొమ్మకంటికి 14,437 ఓట్లు వచ్చాయి. 

1961సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ నియోజక వర్గాల పునర్విభజన లో SC లకు రిజర్వు కావలసిన వేమ్సూర్ అసెంబ్లీ నియోజకవర్గం OCకి కేటాయించి అప్పుడే ఏర్పడిన పాలేరు అసెంబ్లీ నియోజక వర్గాన్ని SC లకు కేటాయించటంలో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు గారి ప్రమేయాన్ని ఆ రోజుల్లో చెప్పుకొనేవారు. ఆ విధంగా చేసిన మార్పు ఆయనకు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగింది. శ్రీ వెంగళరావు ఆ స్థానంలో స్థిరపడి పోయారు.

2.శ్రీ జలగం వెంగళరావు.


శ్రీ జలగం వెంగళరావు పశ్చిమ గోదావరి జిల్లాలోని  నిడదవోలు సమీపంలో గల నందమూరు గ్రామంలో శ్రీ జలగం వెంకట్రావు ఇంట జన్మించారు. శ్రీ జలగం వెంకట్రావు గారు పదిహేను ఎకరాల ఆసామి. ఆయన మీర్జాపురం రాజా వారి సంస్థానంలో కామ్ దార్(ఎస్టేట్ సూపర్ వైసర్) గా పనిచేసేవారు. నూజివీడు దగ్గర వున్న కేసరపల్లి వారి ప్రధాన కేంద్రం. Gannavaram high school లో S.S.C. చదివిన శ్రీ జలగం వెంగళరావు తొట్లవల్లూరు గ్రామపంచాయతి పరిధిలో కారోబార్ (క్లర్క్) ఉదోగంలో చేరి కొంత కాలం పని చేశారు. శ్రీ వెంగళరావు మ్యారేజ్ అయిన తరువాత ఖమ్మం జిల్లాలోని వంగా ముత్యాల బంజరకు వలస వచ్చారు. అడవులలోని చెట్లను కొని కర్ర బట్టిలను పెట్టి బొగ్గు తయ్యారు చేసే వ్యాపారంలో భాగా స్వాములు అయినారు. ఈ వ్యాపారం చేసే క్రమంలో ఆ బంజరకు చుట్టుపట్ల గ్రామాలతో ఆయనకు మంచి పరిచయాలు అయినవి.

ఆ విధంగా వ్యాపారంలో తలమునకలు అయిన శ్రీ వెంగళరావు జీవితాన్ని రాజకీయాలలో ప్రవేశించమని ఆ ప్రాంతంలో కల్లు డిపో వ్యాపారంలో(ఆ రోజులలో సారా డిపోలు లేవు) వున్న ఏలూరు కు చెందిన శాస్త్రి గారు సలహా ఇవ్వటం, శాస్త్రి గారు తనకు తెలిసిన జిల్లా నాయకుడు  శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు ను పరిచయం చేయటం జరిగింది. ఆ విధంగా వెంగళరావు గారు  రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 

కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తిరువూరు బోర్డర్ క్యాంపులో(తిరువూరు ఆయన అత్తగారి ఊరు కూడా) పనిచేసిన శ్రీ వెంగళరావుకు శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావుతో 1952 కు ముందరే మనస్పర్ధలు వచ్చాయి. శ్రీ బొమ్మకంటి MLA గా జిల్లాలో ఎక్కడ నిలబడితే  అక్కడ నిలబడి  ఆయనను ఓడిస్తానని  బహిరంగం గానే  చెప్పారు.


శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు వేమ్సూర్ అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారు కావటంతో శ్రీ జలగం వెంగళరావు ఇండిపెండెంట్ గా ఆయనపై పోటి చేశారు. శ్రీ వెంగళ రావుకు ప్రారంభంలో వ్యాపారరీత్యా ఆ  నియోజకవర్గం అంతా పరిచయం అయివుండటం మరియు  ఆతరువాత పార్టీ కార్యక్రమాల కోసం గ్రామాలన్నీ  తిరగటం వల్ల అక్కడి ప్రజలతో మంచి సంభందాలు వుండేవి.

వేమ్సూర్ అసెంబ్లీ నియోజక వర్గంలో కమ్యునిస్ట్ పార్టీ అభ్యర్థిగా ఎవ్వరిని నిర్ణయం చేయాలానే భాధ్యతని మదిరకే చెందిన కమ్యునిస్ట్ నాయకుడు శ్రీ వాసిరెడ్డి వేంకటపతికి కమ్యునిస్ట్ పార్టీ భాధ్యతల అప్పగించింది. అశ్వారావుపేట జమిందారు కుమారుని రంగంలోకి దించి, వెంగళరావు గారి సహకారంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావును ఓడించ వచ్చని కమ్యునిస్ట్ పార్టీ భావించింది. వారు ఊహించినట్లు  కాకుండా శ్రీ వెంగళ రావు గారే స్వయంగా పోటి చేశారు. ఆ ఎన్నికల తరువాత శ్రీ జలగం వెంగళరావు కు బ్రాహ్య్మణ ద్వేషి అని ముద్ర పడినది. అంతకు ముందు శ్రీ వెంగళరావు ఆ ప్రాంత రైతుల పక్షాన నిలువబడి ఆ నియోజకవర్గం లోని కొన్ని  గ్రామాల  పట్వారిలతో రెవిన్యూ దస్త్రాల నిర్వహణ గురించి యుద్ధం చేసేవారని అదే శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావుతో విబేధాలకు కారణమని చెబుతారు.

1952 లో PDF పేరు మీద పోటి చేసిన కమ్యునిస్ట్ పార్టీ అభ్యర్థే వేమ్సూర్ ఎన్నికలలో (16,092) గెలిచినా ద్వితీయ స్థానంలో శ్రీ జలగం వెంగళరావు గారే (15,543) వున్నారు. కేవలం 549 ఓట్ల ఆధిక్యంతోనే కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ కందిమళ్ళ రామకృష్ణారావు గెలిచారు. శ్రీ బొమ్మకంటికి 4,580 ఓట్లు వచ్చినవి. కందుకూరు గ్రామ ఓట్లతోనే కమ్యునిస్ట్ అభ్యర్ధీ గెలిచాడని చెప్పేవారు.

వేమ్సూర్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు ఓడిపోవటంతో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షా చర్యలలో భాగంగా శ్రీ జలగం వెంగళరావును ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుండి బహిష్కరించింది. తరువాతి పరిణామాలలో శ్రీ వెంగళరావు శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు దగ్గరకు సంప్రదింపులకు వస్తుండేవారు. 

“వరంగల్/ఖమ్మం జిల్లాలో  దశాబ్దంన్నర ఎన్నికల రాజకీయం” ఆర్టికల్ లో 1957 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంభందించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల టికెట్స్ నిర్ధారణకు సంభందించిన వివరాలు దానిలో శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు పాత్ర గురించిన వివరణ ఉన్నది.

1957 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయ సమీకరణాలలో మార్పుల ఫలితంగా జిల్లా కాంగ్రెస్ పార్టీలో నూతన యువ నాయకత్వం ఆవిర్భవించింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వ భాధ్యతలను శ్రీ వెంగళరావుకు అప్పగించే యోచనలో వేమ్సూర్ అసెంబ్లీ టికెట్ ను  ఆయన తమ్ముడు శ్రీ జలగం కొండలరావు కు ఇవ్వటం జరిగింది. శ్రీ వెంగళరావు పై కాంగ్రెస్ పార్టీ విధించిన నిషేధకాలం పుర్తికానందున ఆయనకు టికెట్ ఇవ్వటం సాధ్యపడలేదు. శ్రీ జలగం కొండలరావు తన అన్నగారికి లక్ష్మనుడు వంటి వారు. శ్రీ వెంగళరావు తన తదుపరి రాజకీయ జీవితంలో కూడా తదుపరి జరిగిన జిల్లా పరిషద్ ఎన్నికలలోను, లోకసభ ఎన్నికలలోను  శ్రీ కొండలరావు కు పదవులను అప్పగించి అధికారాన్ని గుప్పెట పట్టారు. 

శ్రీ వెంగళరావు గారితో బాటు మదిరకు చెందిన శ్రీ శీలం సిద్దారెడ్డి కూడా సంజీవరెడ్డి గారి ఆశీర్వాదంతో అప్పుడే రాజకీయ తెరపైకి వచ్చారు. శ్రీ శీలం సిద్దారెడ్డి కూడా 1952 మధిర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశాడనే అభియోగంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను ఆరు సంవత్సరాలు భాహిష్కరించింది. 

1957 లో వేమ్సూర్ అసెంబ్లీ ఎన్నికలలో శ్రీ జలగం కొండలరావు (24,680) PDF అభ్యర్థి శ్రీ వట్టికొండ నాగేశ్వరరావు (16,943) పై 7,737 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా వున్న శ్రీ నీలం సంజీవరెడ్డి ఇచ్చిన సంపూర్ణ రాజకీయ సహకారంలతో 1958 లో పార్టీ విధించిన నిషేధ కాలం పూర్తి కాగానే శ్రీ జలగం వెంగళరావు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు. 1959 లో ఖమ్మం జిల్లా పరిషద్ అధ్యక్షుడయ్యారు. 1962 లో వేమ్సూర్ MLA అయినారు.  జిల్లాలో ఇవి చక చకా జరిగిన పరిణామాలు. ఆ రోజులలో పంచాయత్ రాజ్ వ్యవస్థ లోని సంస్థలకు పదవీ కాలం ముడు సంవత్సరాలు మాత్రమే వుండేది. శ్రీ జలగం వెంగళరావు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా వున్నప్పుడు శ్రీ శీలం సిద్దారెడ్డి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వున్నారు. వెంగళరావు గారు జిల్లా పరిషద్ అధ్యక్షుడు కాగానే శ్రీ శీలం సిద్దారెడ్డి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినారు. 

శ్రీ జలగం వెంగళరావు ప్రప్రధమంగా 1962 లో వేమ్సూర్ అసెంబ్లీ ఎన్నికలలో కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ వట్టికొండ నాగేశ్వరరావు పై 16,583 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందటం ద్వారా అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆప్పుడు శ్రీ వెంగళరావుకు 34,436 ఓట్లు రాగా శ్రీ వట్టికొండ నాగేశ్వరరావుకు  17,853 ఓట్లు వచ్చాయి.

తిరిగి 1967 లో వేమ్సూర్ అసెంబ్లీ ఎన్నికలలో శ్రీ జలగం వెంగళరావు (37,595) INDIPENDENT అభ్యర్థి శ్రీ మోరంపూడి వెంకయ్య (13,220) పై 24,375 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆ తరువాత ఎన్నికలలో వేమ్సూర్ అసెంబ్లీ నియోజక వర్గం అదృశ్యం అయి సత్తుపల్లి నియోజక వర్గం గా ఆవిర్భవించింది.

శ్రీ జలగం వెంగళరావు రాజకీయాలలోకి వచ్చిన దగ్గర నుండి ఫుల్ టైం వర్కర్ గా వుండటం ఆయనను జిల్లా రాజకీయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించటానికి కారణమైంది. క్రమశిక్షణ గల జీవితం ఆయన సొంతం. టైం కు నిద్ర ఆహారం తప్పనిసరి. రాత్రి పది గంటలు అవుతే ఎట్టి పరిస్థితులలో అయినా నిద్రకు ఉపక్రమించ వలసిందే. 

మొదటి అసెంబ్లీ ఎన్నికల తరువాత హైదరాబాదుతో సహా ఎక్కడకు వెళ్ళినా శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారితో ఆయన జీప్(JEEP) లోనే వెళ్ళే వారు. డ్రైవింగ్ ఎప్పుడు శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారే చేసేవారు. జీప్ లో ప్రయానించేటప్పుడు ఏ మాత్రం స్పీడ్ అనిపించినా భయపడే వారు. స్పీడ్ తగ్గించమని గొడవ చేసేవారు.

1957 అసెంబ్లీ ఎన్నికలు అయిన తరువాత జిల్లా కాంగ్రెస్ లో ఒక టీం ఏర్పాటు అయింది. ఎక్కడడకు వెళ్ళినా వారు అందరు కలిసే వెళ్ళేవారు. వారిలో పెండ్యాల సత్యనారాయణరావు గారు, జలగం వెంగళరావు గారు, శీలం సిద్దారెడ్డి గారు, కోట పున్నయ్య గారు మరియు హీరాలాల్ మోరియా గారు వుండేవారు. 


వారంతా హైదరాబాద్ వెళ్ళితే రవీంద్ర భారతి ఎదురుగా వున్న గోపి హోటల్లో దిగేవారు. శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు లాంటి జిల్లాకాంగ్రెస్ నాయకులు అబిడ్స్ జనరల్ పోస్ట్ ఆఫీసు ప్రక్కనున్న వసంత విహార్ లో దిగేవారు. జిల్లాపరిషత్ చైర్మన్ అయ్యేవరకు ఖమ్మం వస్తే శ్రీ శీలం సిద్దారెడ్డి గారితో కలిసి ఖమ్మంలో ఖాళీగా వున్న శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారి Quarter లోనే బస చేసేవారు. వారికి ఖమ్మం పట్టణంలో సొంత ఇల్లు లేకపోవటం, Hotels లో బస చేయటం ఆరోజుల్లో అలవాటు లేకపోవటం కారణం. 

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో మొదటితరం కాంగ్రెస్ పార్టీ నాయకులలో శ్రీ జమలాపురం కేశవరావు మినహా మాస్ లీడర్స్ ఎవ్వరులేరు. అందరు త్యాగధనులే అయినా మాస్ లీడర్స్ కాకపోవటం వల్ల ఎన్నికల రణరంగంలో తిరుగులేని విజేతలుగా నిలువ లేక పోయారు. కమ్యునిస్ట్ పార్టీలో నాయకులు ఎక్కువ మంది మాస్ లీడర్స్ యే. 

వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేశుకున్న శ్రీ జలగం వెంగళరావు రాష్ట్ర స్థాయికి పోయే వరకు తాను నమ్ముకున్న ఆత్మీయుల సలహాలను మరియు రాష్ట్ర స్థాయి పదవులు వచ్చిన తరువాత సంభందిత IAS ఆఫీసర్స్ సలహాలను పాటించేవారు. ఆ విధంగా జిల్లా రాజకీయాలపై పట్టును సాధించారు. ఫీల్డ్ వర్కేర్ గా పనిచేసినందు వల్ల కార్యకర్తలను పేర్లతో సహా గుర్తు పెట్టుకునే వారు. తనకు రాజకీయ శత్రువులు అనుకుంటే ఎవ్వరైనా ఖమ్మం గాని, హైదరాబాద్ గాని వస్తే వాళ్ళు ఎందు వచ్చారో తెలుసికుని మరీ వారి పని చెడగొట్టే వారని ప్రతీతి. అలాగే ఆయన Highly Ambitious person అని ఆయన విమర్శకులు ఒకరు తన అభిప్రాయం వేల్లడిన్చారు. 

ఖమ్మం అసెంబ్లీ ద్విసభ్య నియోజక వర్గం.


ఖమ్మం అసెంబ్లీ  నియోజక వర్గం విషయానికి వస్తే సంజీవరెడ్డి వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా 1957 సంవత్సరంలో పెండ్యాల సత్యనారాయణ రావు గారికి ఆహ్వానం అందింది, కాని ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. 1952 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆయన తటస్థంగానే వున్నారు. ఆయన శివారు గ్రామానికే చెందిన శ్రీ కర్నాటి కృష్ణయ్య కమ్యూనిస్ట్ అభ్యర్ధి గా పోటి చేసి గెలుపొందారు.


మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో ఖమ్మం జిల్లా వర్గ రాజకీయాలలో 1957 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు వర్గానికి ఖమ్మం మరియు మధిర అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. శ్రీ బొమ్మకంటి సూచన మేరకు  ఖమ్మం తాలుకా గోకినేపల్లీ గ్రామానికి చెందిన శ్రీ చావా వెంకటకోటయ్యకు కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అసెంబ్లీ టికెట్ ను యిచ్చింది. హయగ్రీవాచారి గారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా వున్నప్పుడు వెంకటకోటయ్యగారు జిల్లా కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీగా వున్నారు. శ్రీ చావా వెంకటకోటయ్యకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీచేయటానికి కొన్ని ప్రతిబంధకాలు ఎదురైనవి. ఆ సమయంలో ఆయనకు సాయంసంధ్య వేళ పాము కరచినందువల్ల ఎన్నికలకు అది శుభసూచికం కాదని ... తాను పోటి చేయలేనని ఎన్నికలబరిలో నుండి తప్పుకున్నారు.

ఆ రోజులలో కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని జీప్, సైకిల్  లేదా ఎడ్ల బండలకు కట్టుకుని ఖమ్మం తాలుకా గ్రామాలలో  ఎన్నికల సమయంలోనైనా  స్వేచ్చగా తిరిగే పరిస్థితులు లేవు. చాలా కాలం వరకు కొన్ని గ్రామాలలో కాంగ్రెస్ అభిమానులు సైలెంట్ గా వచ్చి పోలింగ్ బూత్ లలో ఓట్లేసి వెళ్ళీ వారు. పోలింగ్ ఏజెంట్స్  లేని గ్రామాలు కూడా వుండేవి.

ఖమ్మం జిల్లా స్థానికులను  ఎవ్వరిని పెట్టినా ఆయా గ్రామాలలో నెలకొన్న రాజకీయ  వత్తిడుల వల్ల ఎన్నికల బరిలో నిలువ బడ్డ వాళ్ళు ఎప్పుడు జారుకుంటారో తెలీని పరిస్థితి. ఖమ్మం అసెంబ్లీ కి అభ్యర్థిగా ప్రకటించబడిన శ్రీ చావా వెంకట కోటయ్య నామినేషన్ వేయకుండా బరిలోనుంది తప్పుకోవటమే అందుకు నిదర్శనం. అంతకు ముందు కాంగ్రెస్ అభ్యర్థి గా 1952 ఖమ్మం అసెంబ్లీకి  పోటి చేసి ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు  శ్రీ కొలిపాక కిషన్ రావు ఈ సారి  1957 సంవత్సరం జరుగు లోకసభ అభ్యర్థి గా పోటిలో వున్నారు. 

ఆ విధంగా జిల్లాకు సంభందము లేని, జిల్లా ఉద్యమాలతో సంబంధం లేని బయటి వ్యక్తులు జిల్లా ఎన్నికల బరి లోకి వచ్చారు.  తరువాత జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో బయటి వ్యక్తులే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటి చేయటం సాంప్రదాయంగా మారింది.

చావా వెంకటకోటయ్య గారు ఎన్నికలబరి నుండి తప్పుకోవటంతో అభ్యర్థికై మళ్ళీ వేట మొదలయింది. స్థానికేతరులే బయటినుండి రావాలిసిన పరిస్థితి. ఖమ్మం ద్విసభ్య నియోజక వర్గం కావటంతో ఇద్దరు అసెంబ్లీ అభ్యర్థులు కావలసి వచ్చారు. ఒకరు OC అభ్యర్థి, ఇంకొకరు SC అభ్యర్థి.

1.తేళ్ళ లక్ష్మికాంతమ్మ.


మహబూబ్ నగర్ జిల్లాలో గల ఆలంపురం గ్రామానికి చెందిన శ్రీమతి తేళ్ల లక్ష్మికాంతమ్మ తన భర్త శ్రీ సుబ్బారావు హైదరాబాద్ లో రాష్ట్ర ఫారెస్ట్ ఆఫీసర్ కావటం తో హైదరాబాద్ లో వుండేవారు. శ్రీ నీలం సంజీవ రెడ్డి కుమార్తె అత్తవారిల్లు ఆలంపురం దగ్గరనే. అలాగ సంజీవరెడ్డి గారికి ఆలంపురంతో అనుభంధం. శ్రీమతి లక్ష్మికాంతమ్మ పుట్టింటి వారికి సంజీవరెడ్డి వియ్యంకులకు పరిచయాలు మరియు వైరాలు వున్నవి. సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే తాను అసెంబ్లీ లో అడుగు పెట్టాలనే కోరిక కలిగిన శ్రీమతి లక్ష్మికాంతమ్మ తన ప్రయత్నాలు మొదలెట్టారు. ఇదే సమయంలో శ్రీ చెన్నారెడ్డి గారి దృష్టిలో పడ్డ శ్రీ లక్ష్మికాంతమ్మ AP PCC టికెట్ ఆస్పిరంట్ లిస్ట్ లోకి ఎక్కారు. ఆ పేరును శ్రీ నీలం సంజీవరెడ్డి గారి దగ్గరకు తీసుకు వచ్చారు. అనేక తర్జన భర్జనల తరువాత ఖమ్మం టికెట్ ను ఆశిస్తున్న అభ్యర్థులలో శ్రీమతి లక్ష్మికాంతమ్మ ఒకరైనారు.

శ్రీ నీలం సంజీవరెడ్డి వర్గం రాష్ట్ర నాయకుల నుండి తిరిగి శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు పై ఖమ్మం అసెంబ్లీని గెలిపించే గురుతర బాధ్యత అప్పగించ బడింది. మొదట ఏ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయం జరిగిందో శ్రీమతి తెళ్ళ లక్ష్మికాంతమ్మ అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటంతో అధిష్టానం  సూచించిన  శ్రీమతి లక్ష్మి కాంతమ్మ పేరును సత్యనారాయణరావు గారు కూడా ఆమోదించటం జరిగింది. ఈ సామాజిక వర్గం లో అప్పటి వరకు కాంగ్రెస్ లో ఎవ్వరు ప్రసిద్దులు కాదు. ఆ సామాజిక వర్గంలో అసెంబ్లీ స్థాయి ఎన్నికలలో నిలువబడే అభ్యర్థులు కాంగ్రెస్ లో  ఎవ్వరు లేరనే చెప్పవచ్చు.  

శ్రీమతి లక్ష్మికాంతమ్మ గొప్ప మేధావి. చెన్నారెడ్డి వర్గం తరఫున వెలుగులోకి వచ్చినా సంజీవరెడ్డి వర్గానికి ఏనాడు ధూరం కాలేదు. పైగా వారితోనే రాజకీయంగా మెలిగారు. తానుగా జిల్లాలో సొంత రాజకీయాలు చేయక పోవటం ఆమెకు ప్లుస్ పాయింట్. జిల్లా రాజకీయాలో తాను తన ముద్ర వేయాలని ప్రయత్నించక పోవటం తో శ్రీమతి ఇందిరాగాంధీతో విబేధాలు వచ్చే వరకు జిల్లాలో దీర్ఘ కాలం వున్నారు. 1969 తెలంగాణా ఉద్యమం చెన్నారెడ్డి నాయకత్వాన ఉవ్వెత్తున ఎగసిపడినా ఆమె అటు తొంగి చూడలేదు. ఎక్కువ మంది జిల్లా కాంగ్రెస్ నాయకులు  ప్రత్యేక తెలంగాణాకు అనుకూలం కాకపోవటంతో  1969 లో కుడా ఆమే MP గా విజయం సాధించింది. అప్పుడు తెలంగాణా మొత్తం మీద గెలిచిన కాంగ్రెస్ సీట్ ఇది ఒక్కటే.

శ్రీమతి రేణుకాచౌదరి ఖమ్మం జిల్లాలో తన రాజకీయ జీవిత ప్రారంభంలో శ్రీ కోట్ల విజయభాస్కరరెడ్డి, శ్రీ శీలం సిద్దారెడ్డి ద్వారానే ఖమ్మం ఆడపడుచుగా, ఖమ్మం లోకసభ అభ్యర్థిగా అడుగు పెట్టినా ఆ తరువాత జిల్లా రాజకీయాలలో తల దూర్చటం, సొంత ముద్ర వేయాలనే తపన వల్ల శ్రీమతి లక్ష్మికాంతమ్మ లాగా స్థానం సంపాదించలేక పోయారు. స్థానికంగా రాజకీయంగా నష్టపోయారు. శ్రీమతి లక్ష్మి కాంతమ్మ రాజకీయ జీవితం ఖమ్మం జిల్లాలో  ప్రశాంతం గా రెండు దశాబ్దాలు సాగింది.

2. శ్రీ కోట పున్నయ్య.


విజయవాడ లో చదువు కొనే రోజులలో కాలేజీ ప్రెసిడెంట్ గా వెలుగు లోకి వచ్చి సికింద్రాబాద్ లో రైల్వేలో Commercial clerk గా ఉద్యోగ విధులలో ఉంటూ "All India depressed class League" రాష్ట్ర శాఖలో చురుకుగావున్న  శ్రీ కోట పున్నయ్య కూడా ఖమ్మం జిల్లా బయటి వ్యక్తి అయినా కూడా ఖమ్మం ASSEMBLY లో SC స్థానానికి అభ్యర్థిగా అయినాడు. ఆ రోజులలో దళితుల కోసం జగ్జీవన్రాం ఆధ్వర్యంలోని పై సంస్థతో పాటు శ్రీ బి.ఆర్. అంబేద్కర్ ఆధ్వర్యంలోని రిపబ్లికన్ పార్టీ మాత్రమే దేశం మొత్తంలో ఉండేవి. గంపలగూడెం రాజా శ్రీ కోటగిరి గోపాలరావు సంరక్షణలో పెరిగి పెద్దవాడైన శ్రీ కోట పున్నయ్య విజయవాడలో చదివే రోజులలో విద్యార్థి నాయకుడు. శ్రీ కోటగిరి గోపాలరావు ఆంద్ర ప్రాంత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష స్థానంలో వుండటం శ్రీ పున్నయ్య  రాజకీయాలలో అడుగు పెట్టాతానికి దోహదం చేసింది.

1957 ఖమ్మం అసెంబ్లీ ఎన్నికలలో శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా వుండి ఎన్నికల రథ సారధి తానే అయినారు. వారి స్వంత జీప్ నే ప్రచార రథం గా ఉపయోగించారు.

ఒకసారి వారి జీప్ ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులను తీసుకుని  బాణాపురం, కమలాపురం రహదారి పై సాయంకాల సమయంలో వెళ్ళు చుండగా అక్కడి కమ్యూనిస్ట్ కార్యక్తలు జీప్ ను వెళ్ళనీయమని  జీప్ కు అడ్డం తగిలి రోడ్ మీద పడుకున్నారు. పెండ్యాల సత్యనారాయణరావు గారు జీప్ స్టీరింగ్  వదలి జీప్ దిగి వాళ్ళ ఎదురుగా నిలుచుని "ఏమిరా మమ్మల్ని వేల్లానీయరా" అని బిగ్గరగా అనగానే "అయ్యా! మీరా?, మీరైతే వెళ్ళండి” అని ఆ కార్యకర్తలు దారి ఇచ్చిన సంఘటన మరువలేనిది. ఇంతకు ముందు వాళ్ళు అందరు ఆయన నాయకత్వం క్రింద వున్న వారే. ఆ గౌరవం వారికుంది. ఇలా నియోజక వర్గం లో చాలా చోట్ల జరిగాయి. ఆయన వ్యక్తిత్వమే, నాయకత్వ పటిమే  శ్రీమతి తేళ్ళ లక్ష్మి కాంతమ్మ విజయానికి చేరువ చేసింది. 

ఆనాటి నియోజక వర్గ పరిస్థితులను వివరిస్తూ శ్రీ కోట గురుమూర్తి తన అనుభవాలను ఏ వ్యాసకర్తతో పంచుకున్నారు. తాను అప్పుడు పదో తరగతి చదువు తున్నానని, పున్నయ్య గారికి ప్రచారంలో భాగం గా తను తన తోటి విద్యార్థులో కలసి సైకిల్ ర్యాలీతో గ్రామాలకు వెళ్లానని కొన్ని చోట్ల తమ వైరి వర్గం నుంచి ప్రతిఘటనలు వచ్చాయని, ఒకచోట తీసు కెళ్ళిన సైకిళ్ళ ను వదలి పారిపోయామని చెప్పారు. 

ఖమ్మం అసెంబ్లీలో సాంకేతికంగా శ్ర్తిమతి తేళ్ళ లక్ష్మికాంతమ్మ నే MLA గా గెలుపొందినా శ్రీమతి లక్ష్మికాంతమ్మ రాజకీయాలకు, అందునా ఖమ్మం జిల్లాకు కొత్త కావటంతొ నియోజక వర్గం రాజకీయం, అభివృద్ది కార్యక్రమాలు అన్ని పెండ్యాల సత్యనారాయణరావు గారే పర్య వేక్షించేవారు. 

ఖమ్మం/పాలేరు  అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ అభ్యర్ధుల విజయాల గణాంకాలు..


1952 లో జరిగిన ఎన్నికలలో ఖమ్మం అసెంబ్లీలో ఓ.సి. స్థానంలో శ్రీ కర్నాటి కృష్ణయ్య, ఎస్.సి. స్థానంలో శ్రీ రెంటాల బాల గురుమూర్తి గెలుపొందారు. 

1957 అసెంబ్లీ ఎన్నికలలో ఓ.సి. స్థానంలో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి లక్ష్మికాంతమ్మ గెలుపొందారు. ఎస్. సి స్థానంలో కమ్యునిస్ట్ అభ్యర్థి శ్రీ నామవరపు పెద్దన్న గెలుపొందారు.

1962 లో నియోజక వర్గ పునర్విభజనలో భాగంగా ఖమ్మం అసెంబ్లీ నియోజకవరగాన్ని పాలేరు మరియు ఖమ్మం గా విభాజించటంతో పాలేరు SC Reserved seat గా రూపాంతరం జరిగింది. ఖమ్మం అసెంబ్లీ స్థానం O.C. లకు కేటాయించ బడినది.

పాలేరులో 1962-1972 సంవత్సరం వరకు జరిగిన ముడు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ కత్తుల శాంతయ్య వరుస విజయాలను సొంతం చేసుకున్నారు.

1962 లో ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గంలో శ్రీ నల్ల మల గిరిప్రసాద్ (28,394) Congress అభ్యర్థి శ్రీ పర్చా శ్రీనివాసరావు (16,732) పై గెలుపొందారు. 

1967 లో సి.పి.యం. పార్టీ కి చెందిన శ్రీ మొహమ్మద్ రజబలి (30,344) కాంగ్రెస్ పార్టీ కి చెందిన శ్రీ శాకమురి సూర్య ప్రకాశరావు (20,820)  పై గెలుపొందారు. 

1972 లో సి.పి.ఐ కు చెందిన శ్రీ మొహమ్మద్ రజబలి (27,046) కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ కమాల్ ఖాన్ (25,299), సి.పి.యం కు చెందిన బోజేడ్ల వెంకట నారాయణ (11,364) ల పై గెలుపొందారు.

3. శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు.

ఖమ్మం జిల్లాలో రాజకీయ పునరేకీకరణల సమరం శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు V/S శ్రీ పెండ్యాల సత్యనారాయణరావుగా జరిగింది. 

ఆ విభేదాలు ఎలా వుండేవంటే ఒకటే ఉదాహరణ. నేలకొండపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది. అందులో జిల్లా నాయకులంతా వచ్చారు. అప్పటి పాలేరు సమితి అధ్యక్షులు సమావేశానికి అధ్యక్షత వహించారు. శ్రీ పెండ్యాల సత్యనారాయణరావుకు ఆహ్వానం లేదు. ఆ సమావేశానికి అప్పటి రాష్ట్ర హోం శాఖా మంత్రి శ్రీ మందుముల నరసింహారావు వచ్చారు. 

సమావేశం ప్రారంభించే ముందు సమావేశానికి వచ్చిన పరిసర గ్రామాల ప్రజలలో కొందరు పెండ్యాల సత్యనారాయణరావు గారు సమావేశానికి రాకుంటే మేము ఈ సమావేశం జరుగనీయమని గొడవ చేశారు. ఈ రోజుల్లో అవుతే ఆక్కడున్న హోం మంత్రి SP ని పిలిచి వాళ్ళందరిని అర్రేస్ట్ చేసి సమావేశం జరుపుకొనే వారు. కానీ అలా జరుగలేదు. విషయం అర్ధమైన రాష్ట్ర హోం మినిస్టర్ శ్రీ మందుముల నరసింహారావు స్వీయంగా శ్రీ పెండ్యాల ఇంటికి వెళ్లి శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు ను సమావేశానికి తీసుకుని వెళ్లారు. నైజాం పై జరిగిన ఉద్యమాల రోజులలో  శ్రీ మందుముల నరసింగరావు ఆంద్ర మహాసభలో రాష్ట్ర నాయకులు. నిజామాబాద్ లోని ఇందుర్తిలో జరిగిన 6 వ ఆంద్ర మహాసభ కు అధ్యక్షులు.  శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు ఉద్యమాల చరిత్ర ఆయనకు తెలుసు. ఎవ్వరిని ఎలా గౌరవించాలో తెలుసు.

ఖమ్మం జిల్లా ఏర్పడిన తరువాత రహదారుల నిర్మాణం, డొంకల సర్దుబాటు కార్యక్రమాల నేపధ్యంలో నేలకొండపల్లి నుండి తిరుమలాపురం ద్వారా బోడులబండ కు అటునుండి కూసుమంచికి ప్రభుత్వం తరఫున వచ్చిన రహదారి నిర్మాణ ప్రతిపాదించిన మార్గాన్ని ప్రజలు వ్యతిరేకించారు. బోడులబండ పట్వారి గారి  సూచన మేరకు  శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు  ఆ ప్రతిపాదనను ప్రభుత్వ ప్రతిపాదనలలో చేర్చారు.

ఆ ప్రతిపాదనను మార్చమని ప్రజల విజ్ఞప్తులను ప్రభుత్వం పెడచెవిన పెట్టటంతో అక్కడి  ప్రజల కోరిక మేరకు ఖమ్మం మరియు నేలకొండపల్లి విద్యార్థుల శ్రమదానంతో, సమీప గ్రామ యువకుల సహకారంతో  శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు రహదారి నిర్మాణం గావించారు. ఆ శ్రమదానం కార్యక్రమం 30  రోజులపాటు జరిగింది. ఆ రోజులలో శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు కు  ప్రభుత్వ వర్గాలలో పలుకుబడి తిరుగు లేనిదీ.

జిల్లాలో రాజకీయ పునరేకీకరణల ఘట్టం 1956 లో శ్రీ నీలం సంజీవరెడ్డి దూతగా శ్రీ కళా వెంకట్రావు రంగ ప్రవేశం మరియు ప్రమేయంతో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపిక ముందుకు కదిలి, 1958 FEB లో జరిగిన జిల్లా పంచాయత్ రాజ్ కాన్ఫరెన్స్ తో ఒక స్వరూపాన్ని సంతరించుకుంది. 1957 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖమ్మం మరియు మధిర లలో జరిగిన ఎన్నికల సభలలో శ్రీ నీలం సంజీవరెడ్డి పాల్గొని జిల్లా నాయకులతో ప్రత్యక్ష సంబంధాల ఏర్పరచుకొన్నారు.

1958 లో పాలేరు బ్లాక్ Development committee vice president గా వున్న శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు అదే సంవత్సరంలో జిల్లా సర్పంచ్ ల సంఘాన్ని స్థాపించి దానికి అధ్యక్షులు గా ఎన్నికయ్యారు. జిల్లా సర్పంచ్ ల సంఘం ఆధ్వర్యంలో జిల్లా పంచయత్ రాజ్ కాన్ఫరెన్స్ ను ఖమ్మంలోని వర్తక సంఘభవనంలో 1958, FEBRUARY 8 న  నిర్వహించారు. ఆ సమావేశం లో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర పంచాయత్ రాజ శాఖా మాత్యులు శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర PCC PRESIDENT శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు, శ్రీ జలగం వెంగళరావు, శ్రీ శీలం సిద్దారెడ్డి పాల్గొన్నారు. 

శ్రీ జలగం వెంగళరావు అప్పుడే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినారు. స్థానిక సంస్థల నియోజక వర్గం నుండి MLC గా శ్రీ శీలం సిద్దారెడ్డిని నిర్ణయం చేశారు. ఆయన MLC గా విజయం సాధించారు. ముందు జరుగబోయే ఖమ్మం జిల్లా పరిషద్ ఎన్నికలకు ఒక ప్రణాళికను అప్పుడే సిద్దం చేశారు. ఆ ప్రణాళికను అనుసరించే శ్రీ జలగం వెంగళరావు జిల్లాలో ప్రప్రధమ జిల్లా జిల్లా పరిషద్ అధ్యక్షుడు అయినారు.


పాలేరు పంచాయత్ సమితి ఎన్నికలు.


1959 సంవత్సరం ఖమ్మం జిల్లాలో కీలక మైనది. అప్పుడే జిల్లాలో పంచాయత్ సమితి, జిల్లా పరిషద్ ఎన్నికల నగారా మ్రోగింది. కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావుగారి వర్గం కమ్యునిస్ట్ పార్టీ తో కలిసి పోయింది. అధికార కాంగ్రెస్ పార్టీ పాలేరు లో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారి సారధ్యంలో ఒంటరిగా సమరం సాగించింది.

పాలేరు పంచాయత్ సమితి ఎన్నికలలో తన పిన్నిగారి కుమారుడైన శ్రీ రావులపాటి సత్యనారాయణరావు ను  శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు రంగంలోకి దింపారు. శ్రీ రావులపాటి తన స్వగ్రామంలో గ్రామ పంచాయత్ సర్పంచ్ గా కమ్యునిస్ట్ పార్టీ కి చెందిన శ్రీ యనమద్ది వెంకయ్య విజయానికి సాయం చేసి యున్నారు. ఆ రుణాన్ని శ్రీ యనమద్ది వెంకయ్య సమితి ఎన్నికలలో శ్రీ రావులపాటి సత్యనారాయరావుకు సహకారాన్ని అందించటం వల్ల తీర్చుకున్నారు. 

ఆ నాటి పాలేరు సమితి ఎన్నికలలో భందుత్వాలు పనిచేయలేదు. కాంగ్రెస్ తరపున సమితి ప్రెసిడెంట్ పదవికి పోటిచేసిన శ్రీ ఎల్లంపల్లి రామచంద్రయ్య శ్రీ యనమద్ది వెంకయ్యకు మామ అయినా శ్రీ యనమద్ది వెంకయ్య ఆయనకు ఓటు వెయ్యలేదు. శ్రీ రావులపాటి సత్యనారాయణరావుకు వల్లభి సర్పంచ్ శ్రీ ఐతరాజు రామారావు బంధువు అయినా శ్రీ రావులపాటి సత్యనారాయణరావుకు ఆయన ఓటు వేయలేదు. శ్రీ ఎల్లంపల్లి రామచంద్రయ్య, శ్రీ దండా పుల్లయ్యలు మాజీ కమ్యునిస్ట్ లు. శ్రీ పెండ్యాల సత్యనారాయణరావుతో పాటు కమ్యునిస్ట్ పార్టీలో పనిచేశారు. 

ఈ ఎన్నికలలో ప్రత్యేకత ఏమిటంటే సమితి ప్రెసిడెంట్ గా ఎన్నికైన శ్రీ రావులపాటి సత్యనారాయణరావు (ముదిగొండ) మరియు వైస్ ప్రేసిడెంట్ గా ఎన్నికైన శ్రీ కర్నాటి కృష్ణయ్య (కొత్త కొత్తూరు) గాని సర్పంచ్ లు కాదు. కో-ఆప్షన్ మెంబెర్స్. బొమ్మకంటి వర్గం మరియు కమ్యునిస్ట్ లు కలసి పోటిచేసిన ఆ వర్గం కేవలం ఒక్క ఓటు తేడాతోనే  గెలిచారు.

ఖమ్మం పంచాయత్ సమితి ఎన్నికలు.


పాలేరు సమితి లాగానే బొమ్మకంటి వర్గం మరియు కమ్యునిస్ట్ పార్టీ వారు ఖమ్మం సమితిలో కుడా కలిసే పోటి చేశారు. అక్కడ కమ్యునిస్ట్ పార్టీకి సమితి అధ్యక్ష పదవి మరియు ఉపాధ్యక్ష పదవి బొమ్మకంటి వర్గానికి ఇచ్చారు. సమితి ప్రెసిడెంట్ గా కమ్యునిస్ట్ పార్టీకి చెందిన శ్రీ బోజేడ్ల వెంకట నారాయణ(రామన్నపేట)  మరియు వైస్ ప్రెసిడెంట్ గా శ్రీ పోట్ల వెంకటయ్య(కొక్కిరేణి) అయినారు. ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన అభ్యర్థు లిద్దరూ సొంత బావ బావ మరుదులు కావటం విశేషం.

ప్రప్రధమ ఖమ్మం జిల్లా పరిషద్ ఎన్నికలు.


1959 లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వున్న రెండు వర్గాలు జిల్లా పరిషద్ పీటం దక్కించు కోవటానికి తమ శక్తి యుక్తుల నన్నిటిని ధారపోసినవి. పాలేరు మరియు ఖమ్మం పంచాయతి సమితుల ఎన్నికలు జిల్లాలోని వర్గ రాజకీయ ముఖ చిత్రాన్ని ప్రతిబింబిస్తాయి. ఇదే తరహా రాజకీయాన్ని జిల్లా పరిషద్ ఎన్నికలలో ప్రయోగించారు. ఆ సమయంలో ప్రక్కనున్న నల్గొండ జిల్లాలో కమ్మ్యునిస్ట్ పార్టీ ఆ జిల్లా పరిషద్ ను చేజిక్కించు కొంది.

ఖమ్మం జిల్లా పరిషద్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా జరిగింది. బొమ్మకంటి వర్గం మరియు కమ్యునిస్ట్లు కలిసి  ఏ సూత్రం ప్రకారం CO-OPTION MEMBERS ఎన్నికతో పాలేరు పంచాయత్ సమితిని సాధించుకొన్నారో  ఆ సూత్రాన్నే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అనుసరించింది. పొరుగు జిల్లాలకు చెందిన M.P మరియు MLA లు ఆరుగురిని  ఖమ్మం జిల్లా పరిషద్ లో ఓటు హక్కును కలిపించి సభ్యులుగా చేశారు. ఆ మెంబెర్స్ ఓటు హక్కుతో శ్రీ జలగం వెంగళరావు ను CO-OPTION MEMBER గా గెలిపించి  చైర్మన్ గా ఎన్నిక చేశారు. ఆ నాటి నుండి జిల్లా రాజకీయ ముఖ చిత్రం సంపూర్ణంగా మారిపోయింది.

వేమ్సూర్ నుంచి శ్రీ జలగం వెంగళరావు, మధిర నుండి శ్రీ శీలం సిద్దారెడ్డి, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుండి శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు, శ్రీమతి తేల్ల లక్ష్మికాంతమ్మ, కోట పున్నయ్య, హీరాలాల్ మోరియా, ఒక ట్రూప్ గా జిల్లా కాంగ్రెస్ పార్టీ నిర్వహణా కార్యకలాపాల కోసం, జిల్లా అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికా అమలుకోసం రాష్ట్ర స్థాయి అధికార, అనధికారుల కలిసేందుకు  అందరు కలసి చాలా కాలం తిరిగేవారు. ఒకే మాట, ఒకే బాట గా వుండేవారు.

1958 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఖమ్మం వర్తక సంఘ భవనంలో జరిగిన జిల్లా పంచయత్రాజ్ కాన్ఫరెన్స్ ఫోటో ఇది. ఈ సమావేశానికి రాష్ట్ర పంచాయత్ రాజ్ మంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి వచ్చారు. చిత్రంలో మాట్లాడుతున్న వారు ఖమ్మం జిల్లా సర్పంచ్ ల సంఘం ప్రెసిడెంట్ శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు. ముందు వరుసలో ఎడమ నుండి కుడికి వరుసగా ఖమ్మం మునిసిపల్ చైర్మన్ శ్రీ చిర్రావురి లక్ష్మినరసయ్య, శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్  శ్రీ జలగం వెంగళరావు, మధిర MLA శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావు జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీశ్రీ శీలం సిద్దారెడ్డి వున్నారు. వెనుక వరుసలో కుడి నుండి ఎడమకు  వరుసగా ఖమ్మం MLA శ్రీమతి లక్ష్మి కాంతమ్మ, శ్రీ కోట పున్నయ్య, ఖమ్మం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్  శ్రీ గెల్లా కేశవరావు వున్నారు.


శ్రీ జలగం వెంగళరావు, శ్రీ శీలం సిద్దారెడ్డి తరువాత ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు శ్రీ లక్కినేని నరసయ్య చేతికి వచ్చాయి.

ఇంతలో కాలంలో మార్పులు. మనస్తత్వాల్లో మార్పులు.  చల్లగా సాగుతున్న కాంగ్రెస్ ఉమ్మడి కుటుంబంలోకి ఎవ్వరో ప్రవేశించారు.  ఏవో—ఏవేవో—విబేధాలు.  నాయకుల మధ్యన దూరం పెరిగింది.  

ఫలితాలేమిటో.. తదుపరి వ్యాసంలో.

                                                                       .....PENDYALA VASUDEVARAO.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

హైకోర్టులో తెలుగులో వాదించవచ్చా? జిల్లా కోర్టులో పరిస్థితి ఏమిటి?

109. GEOPOLITICAL హైకోర్టులో తెలుగులో వాదించవచ్చా? జిల్లా కోర్టులో పరిస్థితి ఏమిటి? హైకోర్టులో మాతృభాషలో వాదించడం,  లిఖితపూర్వక వాదనలు,  జిల...